తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 11 November 2018

కప్పను గని పాము కలఁతఁ జెందె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-11-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - కప్పను గని పాము కలఁతఁ జెందె. 


ఆటవెలది: 
చొప్పగడ్డి వేయ చూడగానెద్దుకు
తుప్పలందు తాను తోడు "టార్చి" 
చేతకర్రబట్టి చీకటి నడచు వెం 
కప్పను గని పాము కలఁతఁ జెందె.

Saturday, 10 November 2018

లయమె శాంతిఁ గూర్చు నయముగాను

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-11-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


మస్య - లయమె శాంతిఁ గూర్చు నయముగాను


ఆటవెలది.  
భయముజెందవలదు భవరోగమంటిన 
కలతలేల యేల కలవరమ్ము
మనసునందు నిల్ప మాహేశ్వరుని యాని  
లయమె శాంతిఁ గూర్చు నయముగాను

Thursday, 8 November 2018

భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 8-11-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్.


కందము: 
సరి మీరు వచ్చువరకును 
నిరతము సింహాసనమ్ము నివియేయుంతున్
సరెయనుమని తా మ్రొక్కగ 
భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్.

Wednesday, 7 November 2018

బాబాలగుట్టులే పరికించి "డేరాల"

మీకు మీకుటుంబసభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

సీసము:
ధరను దాటి ధరలు తారలందున జేరె 
చేరి దించుమ నీవు "తారజువ్వ"! 
రెచ్చగొట్టి కులపు చిచ్చురేపెడివారి
ముచ్చెలు గాల్చుమా "చిచ్చుబుడ్డి"!
భూములనేమ్రింగు భూబకాసురులను
భూచక్రమా! కొట్టి పూడ్చుమమ్మ 
బాబాలగుట్టులే పరికించి "డేరాల" 
బ్రద్దలజేయుమా "బాంబు"! నీవె

తేటగీతి: 
వెలుగు పూవులనింటింట వేడ్కమీర
రాల్చు "కాకరపూవొత్తి"! రయముగాను 
మీరలందరు గలియగ మేలుగాను
పూర్తి "దీపాలపండుగ" పుడమి మీద.

Tuesday, 6 November 2018

నరక హంత కుండు గరళ గళుఁడు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 6-11-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - నరక హంత కుండు గరళ గళుఁడు.


ఆటవెలది: 
భేదమేమివలదు ప్రియముగా నిద్దర
గొలువుడయ్య మీదు కోర్కెదీర 
మిత్రులిరువురెపుడు, మెచ్చగాలోకాలు
నరక హంత కుండు, గరళ గళుఁడు

Monday, 5 November 2018

కన్ను-ముక్కు-చెవి-నోరు....భారతార్థంలో.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-04-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది: కన్ను-ముక్కు-చెవి-నోరు....భారతార్థంలో.


మయసభ చూచిన తర్వాత దుర్యోధనుని స్వగతం 


కందము: 
మాకన్ను కుట్టుచున్నది
చీ! కౌంతేయుల సిరులకు, చెవిలో బడెగా
యాకృష్ణ నోరు నవ్వగ
నాకసియే ముక్కుటించె నలుపగ వారిన్.