తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 31 August 2014

ఇవే 'మన' పద్యములు .

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వేమనపద్యములు .... వర్ణన. 


కందము:
వేమన వెలదిని వదలెను
వేమన తా నాటవెలది వినుమని వ్రాసెన్
వేమన పద్యము లనగ ని
వే 'మన' పద్యములనట్లు వేడుక గలుగున్.

కందము:
వ్రాసెను వేమన ముందట
పోసెను ఘన పద్య రాశి, పుణ్యము మనదే
వాసిగ తెనుగున, చదువగ
జేసిన పిల్లలకు శుభము చేకురు గదరా !

Saturday, 30 August 2014

చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ.


ఉత్పలమాల:
భూచర ఖేచరంబులను భూజ, జలంబుల దిర్గు జీవులన్
వీచెడు గాలి యాకసము వీలుగ నగ్నిని నీట భూమి దృ
గ్గోచరమైన చోటులను కోరక జీవము నిల్చునట్లుగా
చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ.Friday, 29 August 2014

శ్రీ గణాధిపాయ నమః

వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

శ్రీ గణాధిపాయ నమః
 


కందము:
అన్నగజా ప్రియ తనయుడ
పన్నగధర ప్రథమ పుత్ర ప్రమధాధీశా !  

న్న స్కందునకైతివి
సన్నుతి నినుజేతుమయ్య సన్మతినిమ్మా !    

ఇరువదియొక్క పత్రి పేర్లతో వ్రాసిన పద్యము

ఓం శ్రీ గణేశాయనమః  
 
ఏకవింశతి నామపూజ ప్రకారము ఇరువదియొక్క పత్రి పేర్లతో వ్రాసిన పద్యమిది
సీసము:
  సిద్ధి దాయక నిన్ను శ్రద్ధగా బూజింతు
                    నిరువదొకటి పత్రి నిటులదెచ్చి 
  దానిమ్మ, మరువక, తలచి విష్ణుక్రాంత,
                    ఉమ్మెత్త, మద్దియు, నుత్తరేణి, 
  గరికయు, మారేడు, గన్నేరు, జిల్లేడు,
                    దేవదారుయు,  రేగు, రావి, జాజి 
 మామిడి, గండకీ, మాచి, వావిలి, జమ్మి
                   తులసి, నేలమునగ, తుష్టి తోడ

తేటగీతి: 
 ధూపదీపమ్ము హారతి తోడుగాను
 కుడుములుండ్రాళ్ళు భక్తితో 
నిడెద నేడు  
 భాద్రపద శుధ్ధ చవితిని  పట్ట పగలు  
 విఘ్నబాధలు దొలగుచు  విజయమంద.   

Thursday, 28 August 2014

ఆత్మ హత్య పుణ్యమగును భువిని.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఆత్మ హత్య పుణ్యమగును భువిని.


ఆటవెలది:
పిల్ల వాని జూడ ప్రేతాత్మయే పట్టి
బాధ వెట్టుచుండ బాగు సేయ
మంత్రగాని జేరి మాన్ప బాధలనట్టి
'యాత్మ' హత్య పుణ్యమగును భువిని.

Wednesday, 27 August 2014

రామా రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే.

 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - రామా  రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే. 

శార్దూలము:
రా ! మాలీ! వనితా సుమమ్ము నిలిచెన్ రంజిల్ల నీ చేతిలో
రా ! మాయింటికి రార కృష్ణ! వినవా రాధా ప్రియా సుందరా!
రా! మా మానసమందు నిల్వమనినారా గోపికల్ - మాను, మా
రామా ! రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే. 

Tuesday, 26 August 2014

ఇల్లు - ఇల్లాలు ... వర్ణన

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఇల్లు - ఇల్లాలు ... వర్ణన


కందము:
గోడలు చక్కగ నుండిన
మేడను తా కప్పు నిలచి మేలును గూర్చున్
కోడలు చక్కగ నుండిన
వేడుక తా కప్పు నింట వెతలను దీర్చున్.


Monday, 25 August 2014

దాన శీలము ... వర్ణన

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య -  దాన శీలము ... వర్ణన


కందము:
దానము చేయగ పెరుగు ని
ధానము నీశు పద సన్నిధానము గలుగున్
దానము చేయని చోటది
పానమునకు పనికి రాని పాకుడు కొలనౌ.

Sunday, 24 August 2014

తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ


తేటగీతి:
తినక యేమియు నుపవాస దీక్ష తోడ
నమ్మకమ్మును మదినిల్పి నమక చమక
మంత్ర రాజమ్ముల జదివి మహి సతీప
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ.

Saturday, 23 August 2014

తిరునాళ్ళు వర్ణన...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తిరునాళ్ళు వర్ణన... 


కందము:
తిరుగుచు నుందురు మనుజులు
తిరుగలిలా రేయి బవలు దిన భత్యముకై
తిరు నామము గల వానికి
తిరునాడులు వెట్ట, దలచు తీరుగ నాడే.

Friday, 22 August 2014

పతిని దలదాల్చు స్వామికి వందనములు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పతిని దలదాల్చు స్వామికి వందనములు

తేటగీతి:
చిన్ని గణపతి శంభుని జేరి " తండ్రి
చందమామయె నాచేతి కందవలయు "
ననగ నెత్తుచు శశిబింబ మంద విఘ్న
పతిని దలదాల్చు స్వామికి వందనములు

Thursday, 21 August 2014

ఏకం సత్...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - ఏకం సత్...


కందము:
ఒకటే యున్నది సత్యం
బొకటే మరి లేకనిన్ని యొనగూరుటెటో
ఒకటే మిగులును చివరకు
నొకటన్నిట జూడ పరమ యోగుండతడే.

Wednesday, 20 August 2014

కలఁడు కలం డనెడుమాట కల్లయె సుమ్మీ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కలఁడు కలం డనెడుమాట కల్లయె సుమ్మీ.


కందము:
నలువయె వ్రాయును వ్రాతలు
తలపైనను నెవరికైన ధర బడునపుడే
ఇలనది దాటగ నెవ్వడొ
కలఁడు కలం డనెడుమాట కల్లయె సుమ్మీ.

Tuesday, 19 August 2014

పోతన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పోతన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్


కందము:
పోతన వలె సహజ కవియె
రీతిగ తా కృషిని జేసె రేబవళులు లో
ప్రీతిన్ హరినే దలచెను
పో, తన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్

Monday, 18 August 2014

నగర జీవనము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - నగర జీవనముకందము:
నగరపు జీవన మిది తెలి
యగ మరి నాజూకు గాజు టద్దపు మేడై
పగలైన పగల మధ్యన
పగతుర మతి భ్రమణమందు పగులునొ యేమో !

Sunday, 17 August 2014

ఆవకాయఁ దినిన నమరుఁ డగును.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఆవకాయఁ దినిన నమరుఁ డగును.


ఆటవెలది:
ఆంధ్ర ఋషులు దీని నావిష్కరించిరి
తాళ పత్ర గ్రంధ తతిని జదివి
అమృతసమము నేతినన్నంబుతో గలిపి
ఆవకాయఁ దినిన నమరుఁ డగును.

Saturday, 16 August 2014

సూర్యపుత్రుండు భీముండు శౌర్యధనుఁడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సూర్యపుత్రుండు భీముండు శౌర్యధనుఁడు.


తేటగీతి:
పాత్రధారు డొకండె తా  బాగ జేసె.
చిత్రమందున  పాత్రలు  శ్రీహరియును
ఇంద్ర పుత్రుండు చూడగా నివియు గూడ
సూర్యపుత్రుండు, భీముండు, శౌర్యధనుఁడు.


Friday, 15 August 2014

సీతా రాముని యెడఁదను జీల్చితివి గదా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సీతా  రాముని యెడఁదను జీల్చితివి గదా

కందము:
వాతాత్మజా యొక సభను
నా తను వణువణువునందు నాతడె యనుచున్
ప్రీతిగ జనులకు జూపగ
సీతారాముని, యెడఁదను జీల్చితివి గదా !Thursday, 14 August 2014

పాపములను జేయువాని పార్వతి మెచ్చున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పాపములను జేయువాని పార్వతి మెచ్చున్.

కందము:
ఆపరమేశ్వరి దిక్కని
రేపులు మాపులును పూజ - రిత్తగనవగా
నాపదలును మసిజేయగ
పాపములను - జేయువాని పార్వతి మెచ్చున్. 

Wednesday, 13 August 2014

చదువులలో సార మెఱిఁగి చక్రిన్ దిట్టెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - చదువులలో సార మెఱిఁగి చక్రిన్ దిట్టెన్.


కందము:
చదివితి ననె ప్రహ్లాదుడు
చదువులలో సారమంత చక్కగ జెప్పెన్
వదరకు మని సుతుడెఱిఁగిన
చదువులలో సార మెఱిఁగి చక్రిన్ దిట్టెన్.

Tuesday, 12 August 2014

రంగులు చిలుకు చిలుక

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం: రంగులు చిలుకు చిలుక 


 కందము:
చిలుకవు నీవేనా విరి
చిలుకగ నాతేనె గ్రోలి చిలికెద వందాల్
చిలికెడు రంగులతో వ
చ్చిలు కదలక నుండరాదె సీతా కోకా !

Monday, 11 August 2014

కవితలల్లువాడు కాపురుషుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కవితలల్లువాడు కాపురుషుడు


లల్లు అనేవాడిని ప్రేమించిన కవితతో....

ఆటవెలది:
ప్రేమికుండనుచును పెద్దగా తలపకు
బుట్టలోన బడకు,  బుద్ఢిగలిగి
దూరమందు నిలుపు,   దుర్బుద్ధి కనవమ్మ
కవిత ! ' లల్లు ' - వాడు కాపురుషుడు

Saturday, 9 August 2014

మొక్కజొన్నపొత్తు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - మొక్కజొన్నపొత్తు


 

ఆటవెలది:
మొక్కజొన్నపొత్తు ముత్యాల వలె నుండు
కాల్చి తినగ మిగుల కమ్మగుండు
ప్రీతి గలుగు దీని పేలాలు గా తిన
పుష్టి నిచ్చు ప్రకృతి పొట్ల మిదియె.

Friday, 8 August 2014

పార్థసారథి కౌరవ పక్షపాతి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పార్థసారథి కౌరవ పక్షపాతి


తేటగీతి:
శాప వశుడేను కర్ణుడు,  సరిగ జూడ
నిదియు నొక్కటి మనమంచి కిపుడు గూడె
పార్థ ! సారథి కౌరవ పక్షపాతి
కాడు, శల్యుడు మేలును కలుగ జేయు

Thursday, 7 August 2014

చరక - వ్యాధులకు చురక

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - చరక - వ్యాధులకు చురక

 కందము:
ప్రకృతిన్ మూలికలను గొని
వికృతపు రోగముల మాంపు  వేదము జెప్పెన్
సుకృతము పొందెను చరకుడు
ప్రకృతిని వాడుట తెలిసిన ఫలితము మెండౌ.

Wednesday, 6 August 2014

శంకరుఁ డోర్చె రాముని నిశాత శిలీముఖ చండ పాతమున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య  - శంకరుఁ డోర్చె రాముని నిశాత శిలీముఖ చండ పాతమున్.


ఉత్పలమాల:
వంకయె లేదు రావణుడు శంకర భక్తుడె, కావరమ్ముతో
జంకకదెచ్చె లంకకును జానకి నప్పుడు,  యుధ్ధమందునన్
పంకజ నాభునంశుడటు భక్తుని పైనను విల్లునెత్తినన్
శంకరుఁ డోర్చె, రాముని నిశాత శిలీముఖ చండ పాతమున్.Tuesday, 5 August 2014

నలువ రాణి వాణి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - నలువ రాణి వాణి


 ఆటవెలది:
నాల్గు తలల వాని నాలుకపై నున్న
నలువరాణి వాణి నతులు నీకు
నీవు లేని ముఖము నిర్జీవమైయుండు
నున్న తలయె పొందు నున్నతులను.


Monday, 4 August 2014

దాశరథి యనంగ ధర్మరాజు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దాశరథి యనంగ ధర్మరాజు. 

ఆటవెలది:
ధర్మరాజు పాత్ర తా బాగ పోషింఛి
ప్రజల మెప్పు బొందె పెద్దగాను
పాత్ర పేర బిలువ  పాత్రుడై వెలుగొందు
దాశరథి యనంగ ధర్మరాజు.

Sunday, 3 August 2014

గంపలో వధువు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - గంపలో వధువు


 కందము:
అమ్మకు పూజలు సల్పిన
అమ్మాయిని గంపనుంచి యానందముతో
అమ్మమ్మ తనయులప్పుడు
నిమ్మళముగ మోయుచుండె నిజ వరు కడకున్.

కందము:
కెంపులు పూసెను వధువుకు
చెంపలపై, మామలేమొ చేతుల నెత్తెన్
గంపను, కుదురుగ కూర్చొనె
సొంపుగ వరు జేర, మిగుల సోయగ మొప్పన్.


Saturday, 2 August 2014

పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమే కదా.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమే కదా.


ఉత్పలమాల:
పండితులైనవారు జనుబాటను బోదురు లోకులెప్పుడున్
మెండుగ బోధ జేసె
ద మెచ్చగ గీతను దేవదేవుడే
కొండొక చోటనైన మది కోరక నైనను వేడుకందునన్
పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమే ? కదా !

Friday, 1 August 2014

నేత (న్న) లు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - నేత (న్న) లు

 
కందము:
నేతన్నల తల వ్రాతల
నే తప్పక మారుతుమనునే ప్రతి విడతన్
నేతలు పోటీ గెలువగ
నే తలచాటుగను దాచు నిది న్యాయమ్మా?