తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 27 June 2016

దున్ననెక్కెడు వానికే దొరక బోరు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - దున్ననెక్కెడు వానికే దొరక బోరు.  











తేటగీతి: 
ఎద్దునెక్కెడు వానినే యెరుక తోడ
వదలబోనని భీష్మించి పట్టుకొనిన 
దున్ననెక్కెడు వానికే దొరక బోరు 
సాక్ష్య మిద్దియె చూడరా సరిగ నరుడ! 

Sunday 26 June 2016

దీపము పెట్టెనింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - దీపము పెట్టెనింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్




ఉత్పలమాల: 
ఆపరమేశు సన్నిధిని యర్చన జేయగ మ్రుగ్గు వేసియున్ 
దాపుననున్న పూవులను తానుగ కొన్నిటి గోసి దెచ్చి, నా
పాపములన్ని ద్రెంచుమని భక్తిగబూజను  జేయబూనుచున్ 
దీపము పెట్టెనింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్.

Saturday 25 June 2016

చావువార్త తెచ్చె సంబరమ్ము

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - చావువార్త తెచ్చె సంబరమ్ము




ఆటవెలది: 
ప్రతిన బూని భీము డతిభీకరమ్మున
రొమ్ము జీలిచి రుధిరమ్ము ద్రాగి
దుస్ససేసు జంప, ద్రుపదుని సుతకు నా
చావువార్త తెచ్చె సంబరమ్ము

Thursday 23 June 2016

నారాయణునకు నతులనె నాస్తికుఁ డెలమిన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నారాయణునకు నతులనె నాస్తికుఁ డెలమిన్.


కందము: 
"నారాయణు డెవ్వడురా!
తీరుగ నాముందు నిలిచి తెలుపగ, నేనే 
మారుదు, నప్పుడె పెడుదును
నారాయణునకు నతు" లనె నాస్తికుఁ డెలమిన్.

Wednesday 22 June 2016

కావడిలో కన్న వారు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కావడిలో కన్న వారు. 







కందము: 
కన్నులు లేవని దిట్టక  
కన్నులు తలిదండ్రు లనుచుఁ గన్నులు తానై 
కన్నట్టి వారిఁ గావడిఁ
గన్నారా శ్రవణు డిటుల ఘనముగ మోసెన్.

Tuesday 21 June 2016

అరిసెలు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - అరిసెలు 








కందము: 
బెల్లపు పాకంబైనను
తెల్లని శర్కరను గూడ తెలియుచు జేయన్
మెల్లగ నోటన్ కరుగుచు
నుల్లము రంజిల్ల నరిసె లూరించు గదా !

Monday 20 June 2016

గాన సుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - గాన సుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే.



కందము: 
వీనుల వినికిడి తగ్గగ
తానే యొక మూలికొకటి దంచుచు కలిపెన్ 
తేనెను, రోగము తగ్గును
గాన, సుధా ! రసముఁ గ్రోలెఁ గద బధిరుండే.

Sunday 19 June 2016

న్యస్తాక్షరి - అంశం- గాలిపటము,

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  16 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



న్యస్తాక్షరి - అంశం- గాలిపటము, ఛందస్సు- ఉత్పలమాల
మొదటిపాదం మొదటి అక్షరం ‘గా’
రెండవపాదం ఐదవ అక్షరం ‘లి’
మూడవపాదం పదకొండవ అక్షరం ‘ప’
నాల్గవపాదం పదునాఱవ అక్షరం ‘టం’



ఉత్పలమాల: 
గాలిపటమ్ము జేయుటకు కాగితమెంతయు కత్తిరించియున్
వాలుగ తేలియాడగను వాలము కొంతను జేర్చి దారమున్
చాలిననుండ దూర్చి నొక చాపము వోలెను రెండున్ పుల్లలన్
వీలుగవంచి కట్టవలె పేనిన సూత్రమటంచు మధ్యనన్.

Saturday 18 June 2016

రామపాదమ్ము రమణిని రాయి జేసె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రామపాదమ్ము రమణిని రాయి జేసె. 



తేటగీతి: 
రామ నామము మరియును రామ భక్తి
తనకు నున్నట్టి సిరిసంపదనెడు తలపు 
తృణము జేసెను ధనమును, తెలియ మణియె 
రామపాదమ్ముర, మణిని రాయి జేసె.

Friday 17 June 2016

ఘనుఁడు తిక్కన యష్టదిగ్గజములందు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - ఘనుఁడు తిక్కన యష్టదిగ్గజములందు.



తేటగీతి: 
ముక్కు మీదను పద్యమ్ము ముద్దుగాను
నంది తిమ్మన పలికెను నాడటంచు 
చెప్ప నిట్టుల జరిగెను చిన్న తప్పు
ఘనుఁడు " తిక్కన " యష్టదిగ్గజములందు.

Thursday 16 June 2016

చిలుక "పలుకులు"

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - చిలుక "పలుకులు" 












తేటగీతి:                                                  
పంచవన్నెల రాచిల్క నెంచి చూడ 
చిలుక పలుకులు మధురము లొలుకు వినగ 
పంచదారల కీరము త్రుంచి చూడ 
చిలుక "పలుకులు" మధురము లొలుకు తినగ.                                                                                                         

Wednesday 15 June 2016

తెలవాఱఁగఁ దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తెలవాఱఁగఁ దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్.



కందము: 
తెలవారు లోపు హుద్ హుద్ 
మెలిద్రిప్పి విశాఖముంచి మీదన్ బడగా 
విలయమున కొన్ని బ్రతుకులు 
తెలవాఱఁగఁ దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్.

Tuesday 14 June 2016

పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య -  పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్



కందము: 
మితి మీరిన గర్వముతో 
నతలాకుతలమ్ము జేయ నన్నిజగములన్ 
పతితుండు మహిషుడు రాక్షస 
పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్


కందము: 
మితిమీరి త్రాగి రాతిరి
మతిమాలుచు సుతను బట్టి మానము జెరచన్
గతి దప్పి మహిషు మించిన 
పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్. 

Monday 13 June 2016

కలము - చలము - తలము - బలము...భారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  31 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది: కలము - చలము - తలము - బలము...భారతార్థంలో


దుర్యోధనుని స్వగతం....

కందము: 
బలమున్నది నాకే, భూ
తలమింతయు పాండవులకు దక్కగ నీయన్ 
కలకలము రేగి వార ల
చలముల వనముల దిరుగుచు చావగ వలెగా!

Sunday 12 June 2016

న్యస్తాక్షరి: అంశం- బమ్మెర పోతన.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


న్యస్తాక్షరి:  అంశం- బమ్మెర పోతన. ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదం మొదటి అక్షరం ‘భా’
రెండవ పాదం ఆఱవ అక్షరం ‘భా’
మూడవ పాదం పదవ అక్షరం ‘భా’
నాల్గవ పాదం పదునాఱవ అక్షరం ‘భా

ఉత్పలమాల: 
భారము నీదటంచు తన పల్కులమూలము నీవటంచు తా 
మీరిన భక్తి భావమున మేలుగ దల్చుచు రామచంద్రునే
పారగ పాతకమ్ము విన భాగవతమ్మును వ్రాసినాడుగా 
కోరక రాజభోగములు గొప్పగ పోతన " భాగ్యవంతుడే ". 

Friday 10 June 2016

పా (బా)లుడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - పా (బా)లుడు  









కందము: 
నీయమ్మ పాల నిచ్చెను 
నాయమ్మయె నాకునీయ నాపాలాయెన్ 
మాయమ్మ రొట్టెనిచ్చెను 
నీయాకలి దీర్చనిత్తు నీ పాలిదిగో ! 

Thursday 9 June 2016

బుల్లి సామి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - బుల్లి సామి 









కందము: 
అల్లరి వయసున పాపా !
నల్లని దుస్తులను దాల్చి నావుగ దీక్షన్ 
నల్లని తెల్లని దేవుల 
చల్లని సుతుడేమొ నిన్ను చక్కగ జూచున్.

Wednesday 8 June 2016

ఏసు - చర్చి - సిలువ - మేరీ...మతసామరస్యం గురించి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



దత్తపది :: ఏసు - చర్చి - సిలువ - మేరీ...మతసామరస్యం గురించి   



తేటగీతి: 
ఎన్ని మారులు చర్చించ నేమి, దేవు
ననెద మేరీతి జూచిన నాతడొకడె 
నరుడు గాసిలు వసుధను నమ్మకున్న 
చూడ నమ్మిన వారికే సుఖము గలుగు.

Tuesday 7 June 2016

గురువు-లఘువు-గణము-యతి...రామాయణార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



దత్తపది -  గురువు-లఘువు-గణము-యతి...రామాయణార్థంలో



తేటగీతి: 
గురువు పలుకుల మీదను గురిని కుదిరి
నియతి తోడను తన మాట నిలుపు వాడు
దేవగణములు గొలిచెడు తేజుడతడు
లఘువు కాడులె రాముడా లచ్చి మగడు. 

Monday 6 June 2016

' సాయం ' సంధ్య

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - ' సాయం ' సంధ్య 







కందము: 
సాయం సంధ్యకు తానే 
సాయంగా వచ్చెనేమొ శాంకరి, కనులన్ 
మూయక కొంచెము తెరచిన 
మాయగ రవిచంద్రులిచట మనకిటు తోచెన్.

Sunday 5 June 2016

మగని దూల నాడి మాన్య యయ్యె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మగని దూల నాడి మాన్య యయ్యె. 



ఆటవెలది: 
మగడు వనములందు మసలుచుండును, వాని 
వదల నిన్నుజేతు పట్టమహిషి 
రావె యనెడు మూర్ఖ రావణు, రాము భా 
మ, గని దూల నాడి మాన్య యయ్యె. 

Saturday 4 June 2016

బీర - బెండ - కాకర - దొండ... భారతార్థంలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



దత్తపది: బీర - బెండ - కాకర - దొండ... భారతార్థంలో



భీముడు దుశ్శాసనునితో..

ఎందుకాకరములు సభ నీడ్చె సతిని
నిన్ను దొండ మాదిరి చంపి నేను రేపు
భండనమ్మునను హృదయం బెండగడుదు
బీరములివని తలపకు బీరు బోవు.

Thursday 2 June 2016

విష్ణుశర్మ జెప్పె బిచ్చికతలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - విష్ణుశర్మ జెప్పె బిచ్చికతలు



ఆటవెలది: 
లోతుదెలియకుండ లోకాననొక్కడు 
కథల సాగరాన గట్టునుండి 
పెదవి విరిచి జెప్పె పెడ బుద్ధి తలకెక్కి 
" విష్ణుశర్మ జెప్పె బిచ్చికతలు "

Wednesday 1 June 2016

అమ్మ (క) ప్రేమ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - అమ్మ (క) ప్రేమ










తేటగీతి: 
అచట బిడ్డను సరుకుల నరను మధ్య
నమ్మవదలెన నెవరికో నమ్మబోగ
నమ్మకంబున గలుగునా యమ్మకమ్ము 
కన్నప్రేమను మించు ' నా కొన్న' ప్రేమ. 
( కన్నప్రేమను మించునా కొన్న ప్రేమ ? )