తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 31 August 2011

శంకరాభ(పూ)రణం - దత్తపది - విల్, పిల్, కిల్, మిల్ ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

     దత్తపది -  విల్, పిల్, కిల్, మిల్  ( శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వర్ణన)

కం:   విల్లును విరిచెను, చూడగ
         పిల్లాడా! కాదు? వీడు పిడుగే యన,యిం
         కిల్లాలు జానకని, ప్రణ
         మిల్లిరి సీతా ధవునకు మిథిలా వాసుల్!

Tuesday 30 August 2011

శంకరాభ(పూ)రణం - పిండి తక్కువైనను దోసె పెద్దదయ్యె ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

              
             సమస్య :   పిండి తక్కువైనను దోసె పెద్దదయ్యె


తే.గీ:  చూడ పిల్లల జేర్చగ స్కూల్సు కొన్ని
          దృష్టి పెట్టెను డబ్బును  తినుట యందు
          మూర చదువుకు ప్రకటన బారెడయ్యె
          పిండి తక్కువైనను దోసె పెద్దదయ్యె! 

Monday 29 August 2011

శంకరాభ(పూ)రణం - చిన్నిల్లున్ననె గలుగు నశేష సుఖంబుల్ ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

            
          సమస్య : చిన్నిల్లున్ననె గలుగు నశేష సుఖంబుల్


కం:  కన్నా! ముగ్గురు,నలుగురు
       ఉన్నచొ సంతాన మద్ది ఒప్పదు నీకున్!
       కన్నచొ ఒకరిద్దరితో
       చిన్నిల్లున్ననె!గలుగు నశేష సుఖంబుల్! 

Sunday 28 August 2011

శంకరాభ(పూ)రణం - పరుని పైన సాధ్వి మరులు గొనెను ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                   సమస్య :  పరుని పైన సాధ్వి మరులు గొనెను

ఆ.వె :  కంటనీరు బెట్ట కలుములు గలుగవు,
           మహిళ లన్న మహిని మాతృ సములు;
           అన్న భావనున్న ఆత్మనాధు, దయా
           పరుని పైన;సాధ్వి మరులు గొనెను. 

Saturday 27 August 2011

శంకరాభ(పూ)రణం - అంధు దానందమున మెచ్చె నతివ ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08- 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
           

        సమస్య :  అంధు డానందమున మెచ్చె నతివ సొగసు


తే.గీ:  అరటి పండ్లను కొనబోగ నతివ యొకతె
          అచట చూచెను తుంటరి,ఆకతాయి
          కామ భావన గప్పిన కళ్ళు తెరచి;
          అంధు
డానందమున మెచ్చె నతివ సొగసు.  

Thursday 25 August 2011

శంకరాభ(పూ)రణం - నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07- 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                
                 సమస్య :  నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు

తే.గీ:  సమయ పాలన, తగినంత శ్రమయు,శాంతి,
         ఆత్మ, పరమాత్మ విశ్వాస మాది గలుగ!
         విడగ కోపమసూయలు,వీడ నతిగ
         నిద్ర బద్ధకము, లొసంగు నీకు సిరులు! 

Wednesday 24 August 2011

శంకరాభ(పూ)రణం - ఖరమొసగును సుఖము శాంతి ఘనముగ ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06- 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                సమస్య :  ఖరమొసగును సుఖము శాంతి ఘనముగ చూడన్

కం:  వరదలు, కరవులు, చేటులు
       'ఖరమున' కలుగును యనుచును కలవర మేలా?
       సరి! యనుకూలము నెంచుము!
       ఖరమొసగును సుఖము శాంతి ఘనముగ చూడన్!  

Tuesday 23 August 2011

శంకరాభ(పూ)రణం - ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05- 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                       సమస్య : ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె.

ఆ.వె:  చిట్టి బుడతడు తా చిరంజీవి యయ్యె,
          సత్యవంతుడు జూడగ చచ్చి లేచె,
          శివుడు, శ్రీమాత, భక్తుల చెంత నుండ
          ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె.  

Monday 22 August 2011

శంకరాభ(పూ)రణం - ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్ ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04- 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

             సమస్య :  ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్

కం:  ఖర నామ వత్సరంబిది!
       పరికించగ దీని రూపు ప్రతిమను జేయన్
       ఖరమే! యనగా గాడిద!
       ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్! 

Sunday 21 August 2011

శంకరాభ(పూ)రణం - కారము గన్నులంబడిన గల్గును మోదము ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03- 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                   సమస్య : కారము గన్నులంబడిన గల్గును మోదము మానవాళికిన్


ఉ:   శ్రీ రమ సీతగాగ మరి శ్రీ పతి తానిక రాఘవుండెగా!
       కోరిన శిష్ట మానవుల కోర్కెల దీర్చును! భద్ర శైలమం
       దారయ రామ! రామ! యన; ఆలయమందలి దివ్య మోహనా
       కారము గన్నులంబడిన, గల్గును మోదము మానవాళికిన్! 

Friday 19 August 2011

అన్నా ! హా ! జారె గుండె లవినీతికి .....

                  అవినీతి పై పోరాటం చేస్తున్న   అన్నా హజారే గారికి అభినందనలతో...

కం:  అన్నాహజారె! దేఖో!
        అన్నా ! హా ! జారె గుండె లవినీతికిలే !
        విన్నా ! హజారు లాఖోం
        కన్నా మించిన జనంబు కదలిరి వెంటన్  !











Tuesday 16 August 2011

శంకరాభ(పూ)రణం - పిల్లలు గలిగిరి సుమతికి పెళ్ళికి ముందే ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03- 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                సమస్య :  పిల్లలు గలిగిరి సుమతికి పెళ్ళికి ముందే

కం :  చెల్లికి పెళ్ళగు నీనెల
        మెల్లగ తన నెలలు నిండె, మేనక డాక్టర్,
        పిల్లలు ట్విన్సని జెప్పెను,
        పిల్లలు గలిగిరి సుమతికి పెళ్ళికి ముందే!  

Sunday 14 August 2011

శంకరాభ(పూ)రణం - మకరము పట్టంగ నాకు మరులు గలిగె....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02- 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.  

                 సమస్య : మకరము పట్టంగ నాకు మరులు గలిగె రా

కం:  మకరము మా రాశులు ! క్షే
       మకరము మా జాతకంబు! మనువే కుదిరెన్!
       'మకరము' లగ్నములో వా
       మ  కరము పట్టంగ, నాకు మరులు గలిగె రా!  

Saturday 13 August 2011

శంకరాభ(పూ)రణం - కవులు నియమములకు గట్టు బడరు....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01- 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                      సమస్య :  కవులు నియమములకు గట్టు బడరు

ఆ.వె: గణము,ప్రాస,యతులు,కట్టుబాటులు కొన్ని
          పద్య కవిత లందు పరిఢవిల్లు!
         వచన కవిత లందు, భావ కవిత లం
దు
         కవులు నియమములకు గట్టు బడరు!  

Friday 12 August 2011

శంకరాభ(పూ)రణం - యముని మహిషము యమహా....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31- 03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                 సమస్య : యముని మహిషము యమహా  యయినది

ఆ.వె :  సైకతముల యందు సాగిపో వలెనన్న
           ఆంజనేయు  గుఱ్ఱ మదియె హాయి !
           దుక్కి రైతు తాను 'దున్న'గా వలెనన్న
           యముని మహిషము, యమ హాయయినది!

 ఆంజనేయు గుఱ్ఱము = ఒంటె
 

Thursday 11 August 2011

శంకరాభ(పూ)రణం - చదువు కొండెక్కినది కళాశాలలందు.....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30- 03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                 సమస్య :  చదువు కొండెక్కినది కళాశాలలందు.

తే.గీ :   శక్తి లేదు ఆసక్తితో చదువు 'కొనగ '
            వంద వందలా?లక్షల పరిధి దాటె!
            చేతికందునె?పేదలు 'చేరి' కొనగ
            చదువు, 'కొండె 'క్కినది కళాశాలలందు.  

Tuesday 9 August 2011

శంకరాభ(పూ)రణం - కవి నాశము గోరె దన సుకావ్యములోనన్....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29- 03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


              సమస్య : కవి నాశము గోరె దన సుకావ్యములోనన్.


కం :  రవి కుల తిలకుని చరితము
         నవలీలగ వ్రా సె తాను; ఆదికవందున్
         కవిరాజు, ఇంద్రజిత్ జన
         క, వినాశము గోరె దన సుకావ్యములోనన్!

Monday 8 August 2011

శంకరాభ(పూ)రణం - పువ్వు బోడుల తలలెల్ల బోడు లయ్యె ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                   సమస్య :  పువ్వు బోడుల తలలెల్ల బోడు లయ్యె


తే.గీ :  తల్లి స్వస్థత గోరుచు తనయ లపుడు
          నిలువు దోపిడి మ్రొక్కును నిర్ణయించి
          తీర్చ మ్రొక్కులు వెళ్ళిరి తిరుపతికట
          పువ్వు బోడుల తలలెల్ల బోడు లయ్యె! 

Saturday 6 August 2011

శంకరాభ(పూ)రణం - రాతికి నాతిపైన ననురాగము గల్గుట నైజమే ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                    సమస్య : రాతికి నాతిపైన ననురాగము గల్గుట నైజమేకదా


ఉ:  రాతిరి ప్రొద్దులందు చెలి రాకను గోరుచు నొక్క శిల్పి సం
      ప్రీతిని,దూర దేశమున 'ప్రేమ'ను దల్చుచు నామె రూపునే
      చేతనుబట్టి తానులిని చెక్కెను బొమ్మను, చూడ చక్కగా
      రాతికి; నాతిపైన ననురాగము గల్గుట నైజమేకదా!

Tuesday 2 August 2011

శంకరాభ(పూ)రణం - ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                    సమస్య : ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు

ఆ.వె: రేపు వ్రాయ వలె పరీక్ష; శ్రద్ధ గలిగి
         రాత్రి యంత టీలు త్రాగి త్రాగి
         చదువు చుంటి, గడిచె సమయ మిట్టులె జూడ
         ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు ! 

Monday 1 August 2011

శంకరాభ(పూ)రణం - ఆంజనేయున కొప్పెను హస్తి ముఖము...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

               సమస్య :  ఆంజనేయున కొప్పెను హస్తి ముఖము

వినాయక చవితికి పట్టణాలలో పెద్ద పెద్ద ప్రతిమలు చేసేవారు రకరకాలుగా చేస్తుంటారు.వేషము మొత్తము మార్చి వేసి ముఖము మాత్రం వినాయకునిది పెడతారు.సాయి,నటరాజు,కోదండధర రాముడు,కాళీయ మర్దనం చేస్తున్న కృష్ణుడు,రామ లక్ష్మణులను భుజాన దాల్చిన హనుమంతుడు, బాటింగ్ చేస్తున్న క్రికెట్ గణపతి ఇలా ఎన్నో...అదీ నాఫూరణకు ప్రేరణ.

తే.గీ:  సిద్ధి నాథుని ప్రతిమలు చేయువారు
         క్రొత్త క్ర్తొత్తగ చేసిరి కోరి కోరి
         సాయి,రాముడు,కృష్ణుడు,శంకర, మరి
         ఆంజనేయున కొప్పెను హస్తి ముఖము.