తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 31 May 2015

" ఆవకాయ్ " పద్యాలు.

" ఆవకాయ్ "  పద్యాలు.

శ్రీమతి వలబోజు జ్యోతి గారు నిర్వహించిన "ఆవకాయ పద్యాలు" e-book  కొరకు నేను  వ్రాసిన పద్యములు.

ఆటవెలది:
ఆవ పిండి ముద్ద నర చేత బట్టిన
పసుపు గణపతి గనపడును గాదె
అయ్య దలచి నేడు , నయ్యావకాయను
దలచి వ్రాతు పద్యములను నేను.

ఆటవెలది:
వేదములను సామ వేదమ్ము తాననె
పక్షులందు గరుడ  పక్షిననియె
తెలుగు వాడె యైన  పలుకును హరి " యూర
గాయలందు నావకాయ నేను. "

ఆటవెలది:
మజ్జిగన్నమందు  మరియావ ముక్కను
నంజుకొనగ దినుచు  నమలి తొక్క
టెంకె మీది పీచు నింకనింకను గోరి
పీకిపీకి దినుట ప్రియము గాదె.

తేటగీతి:
వేడియన్నములో కొంత  వేడినెయ్యి
ముద్దపప్పును జేరిచి  ముద్దుగాను
ఆవకాయను గలిపిన  యావ గలుగు
తినగ నోటికి , తెలియర  తెలుగు వాడ.

కందము:
పుల్లని మామిడి ముక్కలు
చెల్లగ సన్నావ పిండి చేతన్ గలుపన్
తెల్లని లవణము, కారము
మెల్లగ తైలమ్ము జేర్చ మీదట నావౌ.

కందము:
పడిపోయిన లక్ష్మణుకై
వడి సంజీవనిని దెచ్చెవాయుసుతుండే
మడిజాడి నావకాయను
సడిలేకను దెచ్చి పెట్ట సరియగు గాదా !

కందము:

ఎరుపుగను నూనె గారుచు
మెరుపుగ నున్నావకాయ మేలుగ గలుపన్
పెరుగన్నములో, రుచియే
పెరుగునులే నిజము, తినుము  ప్రియ నేస్తమ ! రా !

కందము:
ఖండాంతరమందున్నను
ఖండితముగ జెప్పవచ్చుకలిపిన ముద్దన్
మెండుగ నావను జేరిచి
మండుటలేదనుచు జెప్ప మన " తెలుగోడే ".

కందము:
ఇయ్యావ దినిన దేవత
లయ్యమృతమ్మునకు బోవ నాశించరుగా
అయ్యారె ! తెలుగు వారుగ
నియ్యవనిని బుట్టి ' నాక ' మిచటికి దేరే.

కందము:
వ్రేపల్లియలో గాకను
" రేపల్లె " ను కృష్ణుడుండ  రేపులు మాపుల్
ఆ పాలు వెన్న వలదని
తాపెరుగున నావకాయ తనివిని దినుగా.

కందము:
ఆవది, రుచులను జేర్చెడి
నావది, తగు ఘాటు, వేడి నందించుటకున్
త్రోవది, శ్రమ జీవులకున్
చేవది, విను దీనిగొప్ప  చెప్పగ లేనే !

Saturday, 30 May 2015

జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్. 


కందము:
ప్రీతిగ నీశుని సేవల
నేతీరుగ మరచిపోక నిత్యము కొలిచే
రీతిని కొలువనుకొన నీ
జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్.

Friday, 29 May 2015

ముద్దబంతిపూవు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - ముద్దబంతిపూవు 

ఆటవెలది:
ముద్దబంతి పూవు ముద్దుగా గనిపించు
నెరుపు పసుపు రంగు లెదను దోచు
ఇంతికొప్పులోన నీశ్వరి మెడలోన
బంతి కాంతులీను నింతకింత.

Thursday, 28 May 2015

జగడము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - జగడముకందము:
జగమున నరులిట నిరతము
పగలను సెగలను గలుగుచు వగచుట తగునా
జగడము లధికము లగుగద
జగడము వదలిన జనులకు జగతిని సుఖమౌ.

Wednesday, 27 May 2015

శూర్పణఖ రామచంద్రుని సోదరి యఁట

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - శూర్పణఖ రామచంద్రుని సోదరి యఁటతేటగీతి:
చుప్పనాతియనుచు బిల్వ నొప్పునెవరి?
నదియ కామించె నెవ్వరి నడవిలోన?
వరస కేమగు రావణాసురున కామె?
శూర్పణఖ - రామచంద్రుని - సోదరి యఁట 

Tuesday, 26 May 2015

తొమ్మిదిలో నొకటి దీయ తొయ్యలి పదియౌ .

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తొమ్మిదిలో నొకటి దీయ తొయ్యలి పదియౌ . 


కందము:
నమ్ముము నాల్గున నొక్కటి
కొమ్మా ! మరి దీయనైదు - క్రొత్తగనుందా !
యిమ్ముగ " రోమన్ "  అంకెల
తొమ్మిదిలో నొకటి దీయ తొయ్యలి ! పదియౌ .

Monday, 25 May 2015

కడుపునొప్పి యనుచుఁ గరము మురిసె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కడుపునొప్పి యనుచుఁ గరము మురిసె


ఆటవెలది:
కరము నొప్పిబుట్ట కరకర లాడించు
నోట వేసి తిండి పూట పూట
నేడు ముట్టడాయె నిమ్మరసమ్మును
కడుపునొప్పి యనుచుఁ, - గరము మురిసె.

Sunday, 24 May 2015

తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్.కందము:
తలలేని పనులతో కల
తలనే జనమందు పెంచి తన్నుక జచ్చే
తలపులు గలిగిం ' చెడు ' నే
తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్.

Saturday, 23 May 2015

సరస్వతీ పూజ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న ) చిత్రం - సరస్వతీ పూజ


 


ఉత్పలమాల:
తెల్లని హంస వాహనము తెల్లని దుస్తుల తెల్ల తామరన్
చల్లని చూపుతో కరుణ జల్లుగ జల్లుచు సర్వప్రాణిపై
నుల్లము లుల్లసిల్ల పరమోత్తమ జ్ఞానము, మాట నేర్పుచున్
తల్లిగనున్న భారతికి దండము బెట్టుదు వాగ్విశుద్ధికై.

Friday, 22 May 2015

ధవున కపుడు గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ధవున కపుడు గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్.


కందము:
యవనిక ప్రేమించెను మా
ధవునే తా పెండ్లియాడి తన్మయమందెన్
నవవధువు ముదము గూర్పగ
ధవున కపుడు -  గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్.

Thursday, 21 May 2015

కనుల వినవచ్చు వీనుల గాంచ వచ్చు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కనుల వినవచ్చు వీనుల గాంచ వచ్చు తేటగీతి:
చెవులు పనిజేయకున్నచో చెవిటి వాడు
చూపులేని కబోదియు చోద్యముగను
సాధనమ్మున విషయమ్ము సవివరముగ
కనుల వినవచ్చు, వీనుల గాంచ వచ్చు

Wednesday, 20 May 2015

అరిసెల వేఁచఁగావలయు నాముదమందునఁ బెండ్లివిందుకై.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అరిసెల వేఁచఁగావలయు నాముదమందునఁ బెండ్లివిందుకై.


వంట వారు పెండ్లి వారిని వంటలు యేమిచేయాలో అడుగు సందర్భం...

చంపకమాల:
మరి వినరండి వంటకము మమ్ముల మెచ్చగ జేయు వారమే
కరకర లాడునప్పడము కాకర వేపుడు కజ్జెకాయలున్
సరిసరి సేమ్య పాయసము శర్కర గల్పుచు నేతి తోడనా
యరిసెల వేఁచఁగావలయు నా ? ముదమందునఁ బెండ్లివిందుకై.

Tuesday, 19 May 2015

వేపపుల్ల

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


 వర్ణన - వేపపుల్ల


ఆటవెలది:
నోరు శుభ్రపడును తీరుగా నమలిన
చేదు చంపు క్రిముల చేర నీదు
వేపపుల్ల తోడ వీలుగా చేసెడు
దంత ధావనమె ముదమ్ము గూర్చు.కాన్వెంట్ విద్యార్థి తన స్నేహితునితో ... వేపపుల్ల గురించి..

కందము:
బ్రష్షది తాతకు, నోరే
ప్రెష్షుగ నుండేను, కడుగ బేక్టీర్యాయే
హుష్షని మాయంబగు, నా
యుష్షే బెరుగునని తాత యూరిలొ చెప్పెన్.

Monday, 18 May 2015

ఆనప పాదునకు జూడ ననుములు పండెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఆనప పాదునకు జూడ ననుములు పండెన్.
 
కందము:
వానలు కురియగ నాటితి
నీనేలను త్రవ్వి, కొన్ని నెలలున్ గడిచెన్
కానగ కాయలు కాసెగ
నానప పాదునకు - జూడ ననుములు పండెన్.

Sunday, 17 May 2015

త్య్రంబక సంభవుడు మరదియగు శ్రీపతికిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - త్య్రంబక సంభవుడు  మరదియగు శ్రీపతికిన్.


కందము:
అంబకు పుత్రుడు నగు హే
రంబుని యనుజుండునెవరు ? రమకే తమ్ముం
డంబరమేలెడు చంద్రుడు ?
త్య్రంబక సంభవుడు - మరదియగు శ్రీపతికిన్.

Saturday, 16 May 2015

ఓమనగుంటలు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - ఓమనగుంటలు. 


కందము:
గుంటలునారుగ నుండును
కంటిరె యిరువైపులందు కాయలు పిక్కెల్
గుంటలవేయుచు నోమన
గుంటాటలనాడు నాడు గుర్తున్ గలదే ?


కందము:
గ్రామము లందానాడుల
నోమనగుంటాట నతివలుత్సాహముతో
ఓ ! మరి పిల్లలతో హో
హో ! మనసుప్పొంగ నాడయో నేడేదీ ?

Friday, 15 May 2015

రాము నోడించె వాలి సంగ్రామ మందు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - రాము నోడించె వాలి సంగ్రామ మందు.


తేటగీతి:
మొదటి విడతన నిర్వురి ముఖము లొక్క
రూపు నుండగ వదలక తూపు నప్డు
మరలి రాగ,  కపి యొకటి మదిని దలచె
" రాము నోడించె వాలి సంగ్రామ మందు." 

Thursday, 14 May 2015

తాళము ....తాళము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - తాళము


నాట్యము నేర్పించు గురువు తన శిష్యునికి పెట్టెలోనున్న తాళ పత్ర గ్రంధమును త్వరగా తెమ్మని చెప్పుట...

కందము:
తాళము మీదను వ్రాసితి
తాళమునెటు వేయవలెనొ తకతయ్యనుచున్
తాళము తీసిటు తెమ్ముర
తాళము నాలస్యమింక త్వరగా రారా !

Wednesday, 13 May 2015

అన్నము లేనివాఁడు పరమాన్నముఁ బంచును వాడ వాడలన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - అన్నము లేనివాఁడు పరమాన్నముఁ బంచును వాడ వాడలన్.
ఉత్పలమాల:
ఆన్నియు సన్యసించి మది నాశలులేకను భక్తు డొక్కడున్
సన్నుతి జేయుచుండె మది శంకర సన్నుతి జేయు కీర్తనల్
చెన్నుగ బాడుచుండు నవి చేరగ చూచెడు వారు మెచ్చగా
నన్నము లేనివాఁడు పరమాన్నముఁ బంచును వాడ వాడలన్.

Tuesday, 12 May 2015

గడ్డి మేయు జనుల కెల్లగలుగు సుఖము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గడ్డి మేయు జనుల కెల్లగలుగు సుఖము


తేటగీతి:
పాలుపేడయు మరియును పంచితమ్ము
మంచిదందురు, గోవుల బెంచుడయ్య
కలిమి నిచ్చును, మనకవి కష్ట మిడక
గడ్డి మేయు, జనుల కెల్లగలుగు సుఖము

Monday, 11 May 2015

అంధేరా కో మారో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - జాతి పిత. 


కందము:
సత్యాహింసల మార్గము
నీత్యాగము మరువలేము, నీవే గాంధీ !
ముత్యపుటుంగరమైతివి
సత్యంబుగ భరత మాత సరియంగుళికిన్.

కందము:
గాంధీ జీకో మాన్లో
అంధా నేతా జనోంకొ అందర్ డాలో
అంధేరా కో మారో
గాంధీ జీకా జమాన కల్సే దేఖో !

Sunday, 10 May 2015

మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్.

కందము:
ముడిగట్టి బుడ్డి బొడ్డున
గుడికందుల పండిత శివ గురవారావే
మడిగట్ట పొలమునకు జనె
మడిగట్టిన ' పండితుండు ' మద్యము గ్రోలెన్.

Saturday, 9 May 2015

కోడిపందెములు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కోడిపందెములు.


 

కందము:
బాదాము బెట్టి పెంచుచు 
పాదములకు  కత్తిగట్టి పందెము వెట్టున్
జూదముల నాడి మనుజులు
మాదేహము గాల్చి తింద్రు మాగతి గనరే !

Friday, 8 May 2015

ముంచి నట్టి వాడె పూజ్యుడయ్య.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - ముంచి నట్టి వాడె పూజ్యుడయ్య.ఆటవెలది:
నల్లనైన వాడు, నడి చెర్వు నీటిలో
పాము జేర దాని పడగ పైన
నదిమి నాట్యమాడ నల్లదే తనపాద
ముంచి నట్టి వాడె పూజ్యుడయ్య.

Wednesday, 6 May 2015

జారుల కృత్యములు మనకు సంతోష మిడున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - జారుల కృత్యములు మనకు సంతోష మిడున్

కందము:
వైరుల గుట్టులనే గని
చారులు తగు సూచనలను చప్పున నీయన్
తీరును కష్టము, లిట్టుల
జారుల కృత్యములు మనకు సంతోష మిడున్

Tuesday, 5 May 2015

శివకుటుంబము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం  - శివకుటుంబము. ఆటవెలది:
మేనసగము దాల్చి మేనకా పుత్రిని
ఏన్గుముఖము వానినెత్తుకొనుచు
శక్తి హస్తు పొదివి చక్కగా పట్టిన
శివకుటుంబము గన శ్రీలు గలుగు.

Monday, 4 May 2015

కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.


కందము:
కోలన వేయగ దలచుచు
కాలూనిన పుష్పబాణు గాలిచి వేసెన్
వాలగు చూపులకే బడి
కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.

Sunday, 3 May 2015

పరనింద.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - పరనింద.


కందము:
పరనింద పనికి రాదుర !
పరమానందమ్ము నెపుడు పంచగవలెరా !
పరనింద సేయ దలతువ !
పరులకు నీవైన గాని పరుడవె గనుమా !

Saturday, 2 May 2015

అప్పు లేనివాఁడె యధముఁడు గద.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - అప్పు లేనివాఁడె యధముఁడు గద.


ఆటవెలది: 
అప్పువలన గలుగు ననుబంధములు తన
దార, పుత్ర, గృహము, ధరను జూడ
నప్పులేని వాని కవియన్ని గూడునా ?
అప్పు లేనివాఁడె యధముఁడు గద.

Friday, 1 May 2015

పోస్టు కార్డు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - పోస్టు కార్డు.
 


కందము:
మమ్మీ దీన్నేమందురు
అమ్మూలన స్టాంపులోన నట తాతుండెన్
అమ్మమ్మ నాడు తాతకె
సెమ్మెస్ వ్రాసెడిదిదనుచు చెప్పెను నాకే.