తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 31 May 2015

" ఆవకాయ్ " పద్యాలు.

" ఆవకాయ్ "  పద్యాలు.

శ్రీమతి వలబోజు జ్యోతి గారు నిర్వహించిన "ఆవకాయ పద్యాలు" e-book  కొరకు నేను  వ్రాసిన పద్యములు.

ఆటవెలది:
ఆవ పిండి ముద్ద నర చేత బట్టిన
పసుపు గణపతి గనపడును గాదె
అయ్య దలచి నేడు , నయ్యావకాయను
దలచి వ్రాతు పద్యములను నేను.

ఆటవెలది:
వేదములను సామ వేదమ్ము తాననె
పక్షులందు గరుడ  పక్షిననియె
తెలుగు వాడె యైన  పలుకును హరి " యూర
గాయలందు నావకాయ నేను. "

ఆటవెలది:
మజ్జిగన్నమందు  మరియావ ముక్కను
నంజుకొనగ దినుచు  నమలి తొక్క
టెంకె మీది పీచు నింకనింకను గోరి
పీకిపీకి దినుట ప్రియము గాదె.

తేటగీతి:
వేడియన్నములో కొంత  వేడినెయ్యి
ముద్దపప్పును జేరిచి  ముద్దుగాను
ఆవకాయను గలిపిన  యావ గలుగు
తినగ నోటికి , తెలియర  తెలుగు వాడ.

కందము:
పుల్లని మామిడి ముక్కలు
చెల్లగ సన్నావ పిండి చేతన్ గలుపన్
తెల్లని లవణము, కారము
మెల్లగ తైలమ్ము జేర్చ మీదట నావౌ.

కందము:
పడిపోయిన లక్ష్మణుకై
వడి సంజీవనిని దెచ్చెవాయుసుతుండే
మడిజాడి నావకాయను
సడిలేకను దెచ్చి పెట్ట సరియగు గాదా !

కందము:

ఎరుపుగను నూనె గారుచు
మెరుపుగ నున్నావకాయ మేలుగ గలుపన్
పెరుగన్నములో, రుచియే
పెరుగునులే నిజము, తినుము  ప్రియ నేస్తమ ! రా !

కందము:
ఖండాంతరమందున్నను
ఖండితముగ జెప్పవచ్చుకలిపిన ముద్దన్
మెండుగ నావను జేరిచి
మండుటలేదనుచు జెప్ప మన " తెలుగోడే ".

కందము:
ఇయ్యావ దినిన దేవత
లయ్యమృతమ్మునకు బోవ నాశించరుగా
అయ్యారె ! తెలుగు వారుగ
నియ్యవనిని బుట్టి ' నాక ' మిచటికి దేరే.

కందము:
వ్రేపల్లియలో గాకను
" రేపల్లె " ను కృష్ణుడుండ  రేపులు మాపుల్
ఆ పాలు వెన్న వలదని
తాపెరుగున నావకాయ తనివిని దినుగా.

కందము:
ఆవది, రుచులను జేర్చెడి
నావది, తగు ఘాటు, వేడి నందించుటకున్
త్రోవది, శ్రమ జీవులకున్
చేవది, విను దీనిగొప్ప  చెప్పగ లేనే !

No comments: