తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 1 September 2011

(21 ) పత్రి పేర్లను గలిగిన పద్యమిదియె .....

                      ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 

                    వీక్షకులందరకు వినాయక చవితి శుభాకాంక్షలు. 

ఆ.వె :  విఘ్న నాధు  గొలువ  విద్యలే గలుగును 
           విద్య వలన సకల విభవ  మొదవు !
           వక్రతుండు గొలువ సక్రమంబగు బుద్ది 
           గలిగి నరుడు భువిని యలర గలడు !!

అందరకు   గణేశ చతుర్థి శుభాకాంక్షలు. ఏ విషయాన్నయినా చందోబద్దంగా చెప్పటం మన సంప్రదాయం. 
అలా ఛందో బద్దంగా ఉన్నవాటిని నేర్చుకున్నప్పుడు ఎప్పటకీ మరచి పోము.. చిన్నతనం లో మా తల్లిదండ్రులు  
నేర్పిన ఒక పద్యాన్ని ప్రచురిస్తున్నాను.ఇది నేర్చుకున్న వారికి వినాయకుని పూజకు ఉపయోగించ వలసిన ఏకవింశతి (21 ) రకముల పత్రి పేర్లు కరతలామలకము లౌతాయి. ఈ తరం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఇస్తున్నాను. ఏమైనా దోషములు, సవరణలు వుంటే విజ్ఞులు, పెద్దలు సూచించినచో సరిదిద్ద గలవాడను. 
ఇది సంప్రదాయంగా పెద్దలు చెప్పుచున్న పద్యం . మూలము, రచయిత పేరు తెలియదు.

సీ :  సిద్ధి వినాయకా ! నిన్ను ప్రసిద్ధి గా పూజింతు
                             నొనరంగ నిరువది యొక్క పత్రి !
      దానిమ్మ, మరువము, దర్భ, విష్నుక్రాంత, 
                              ఉమ్మెత్త, దూర్వార, ఉత్తరేణి, 
     గరికయు, మారేడు, గన్నేరు, జిల్లేడు, 
                            దేవకాంచన, రేగు, దేవదారు,
       జాజి, బల్రక్కసి, జమ్మి, ఆవల తుమ్మి,
                          మాచి పత్రియు, నారె, మంచి మునగ,

తే.గీ :      అగరు గంధమ్ము కురువేరు అక్షతలును
               ధూప దీపమ్ము నైవేద్య 
*హారతులను  
               భాద్రపద శుధ్ధ చవితిని  పట్ట పగలు    
               కోరి  పూజింతు
నిను నేను కోర్కె దీర !    


(* యతి భంగము -సరి యగు పదము తెలిసిన విజ్ఞులు తెలుపగలరు )








11 comments:

Dr.Suryanarayana Vulimiri said...

శాస్త్రి గారికి, మీరు పద్యంలో సూచించిన వాటిలో దర్భ, గరిక, గరిక - ఈ మూడు ఒకటే. బలు రక్కసి పేరు వినలేదు. కాకతాళీయంగా నేను కూడ పత్రిపై ఒక వ్యాసం వ్రాసాను. నేను పేర్కొన్న పత్రాలు - మాచి పత్రి, వాక/వాకుడు, బిల్వ/మారేడు, దూర్వాలు/గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుకాత, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలి, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, మద్ది, జిల్లేడు. నా వ్యాసం ఈ లింకులో చూడగలరు.
http://vulimiribhakti.blogspot.com/2011/08/blog-post_30.html
వినాయక చవితి శుభాకాంక్షలు.

మిస్సన్న said...

శాస్త్రి గారూ మంచి పని చేశారు ఈ పద్యాన్ని మీ బ్లాగులో ఉంచి. ఈ విజ్ఞానము నేటి పిల్లలకు చాలా అవసరం.

నా దగ్గర ఉన్న పాఠంలో నాల్గవ పాదం ఇలా ఉంది:

జాజి, బల్రక్కసి, జమ్మి, దాసనిపువ్వు,
.....................గరిక, మాచీపత్రి, మంచి మొలక

మొలక బదులు మీ మునగ సరైన పదమని అనుకొంటున్నాను.
తేట గీతి ౩వ పాదం నా దగ్గర పాఠంలో కూడా స్పష్టత లేదు.

గోలి హనుమచ్చాస్త్రి said...

సూర్య నారాయణ గారూ ! మిస్సన్న గారూ! ధన్యవాదములు.
ప్రాంత భేదాలను బట్టి పేర్లలో గాని, ఉపయోగించే పత్రి లో గాని తేడాలు ఉండవచ్చు నేమో !

గోలి హనుమచ్చాస్త్రి said...

రావు గారూ! ధన్యవాదములు.

Anonymous said...

గరికయు మారేడు బదులు గరగర మారేడు అని ...ఆరె మాచెయు పత్రి మంచి మునగ ...అని చదువుకొన్నట్లు గుర్తు...

దీనితొ పాటు గా

తుండము నేకదంతము తోరపు బొజ్జయు వామ హస్తమున్, మెండుగ మ్రోయు గజ్జలు మెల్లని చూపులు మందహసమున్,....... కోరిన విద్యల కెల్ల ఒజ్జవైయుండెడి ఓయి గణధిపా నీకు మ్రొక్కెదన్ అని కూడ వేరొక పద్యము.
మధ్య లొ ఒక పాదము గుర్తుకు రావడం లేదు.

కంది శంకరయ్య said...

మీ ఆటవెలది పద్యం అద్భుతంగా ఉంది.
ఇక మీ పత్రుల పేర్ల పద్యం నాకైతే క్రొత్తది. ఇంతకు ముందెప్పుడూ వినలేదు. పద్యాన్ని పెట్టినందుకు, దానిపై చర్చ జరుగుతున్నందుకు సంతోషం, ధన్యవాదాలు.
21 పత్రాలు ...
మాచీ (సంపెంగ), బృహతీ (కంటకారి/వాకుడు), బిల్వ (మారేడు), దూర్వా (గరికపోచ), దుత్తూర (ఉమ్మెత్త), బదరీ (రేగు), అపామార్గ (ఉత్తరేణి), తులసి, చూత (మామిడి), కరవీర (గన్నేరు), విష్ణుక్రాంత (నల్ల దింటెన), దాడిమీ (దానిమ్మ), దేవదారు (దేవదారి), మరువక (మరువం), సింధువాక (వావిలి), జాజి, గణకీ (పణపత్రి/సబ్యాకు), శమీ (జమ్మి), అశ్వత్థ (రావి), అర్జున (మద్ది), అర్క (జిల్లేడు).

గోలి హనుమచ్చాస్త్రి said...

అజ్ఞాత (శ్రీనివాస్ ?) గారూ ! ధన్యవాదములు. మొదటిది గరిక అంటేనే అర్థ మౌతుందని అలా మార్చాను. రెండవది యతి మైత్రి కోసం మార్చవలసి వచ్చింది.

శంకరం మాస్టరు గారూ ! బహుకాల వీక్షణం. సుస్వాగతం. 21 పత్రముల పేర్లు వివరముగా (సంస్కృతం = తెలుగు) తెలిపినందులకు ధన్యవాదములు. ప్రాంతాలను బట్టి కొన్ని కొన్ని రకముల పత్రులు మరి ఉండవచ్చునని భావించుచున్నాను.

కంది శంకరయ్య said...

శాస్త్రి గారూ
అప్పుడప్పుడు మీ బ్లాగులోకి అడుగుపెడుతూ ఉంటాను. ఎలాగూ ‘శంకరాభరణం’లో మీ పూరణలపై వ్యాఖ్యానిస్తున్నాను కనుక మళ్ళీ ఇక్కడ కామెంట్ పెట్టడం లేదు.
మీ చేపపిల్లలతో ఆడుకోవడం నాకు సరదా. బోర్ కొట్టినప్పుడు మీ బ్లాగుకు వచ్చి కాసేపు ఆ చేపపిల్లలతో కాలక్షేపం చేస్తాను.

Dr.Suryanarayana Vulimiri said...

శంకరం గారు, మాచీని మాచిపత్రి అంటారండి. సంపెంగ కాదు.

గోలి హనుమచ్చాస్త్రి said...

సూర్య నారాయణ గారూ ! ధన్యవాదములు.
శంకరార్యా ! అప్పుడప్పుడు ఆట విడుపుగా నా బ్లాగును వీక్షించు చున్నందులకు సంతోషం.

Tulasi Akkineni said...

గణేశాయ నమః

తేటగీతి పద్యం లో *హారతి వద్ద దివ్యహారతి అనవచ్చేమో నని తోచిందండి.