తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 3 November 2020

కాలున ద్రొక్కెదము 'కరోనా!

 కరోనాపై పోరాటం....అంతర్జాతీయ కవితల పోటీ కొరకు వ్రాసిన పద్యాలు.  



కాలున ద్రొక్కెదము 'కరోనా!


కందము:
మీరుచు సురవైరులు సరి
మారుచు వైరసులుగ భువిని మాయలతోడన్
తీరుగ కనబడకను మరి
మారణహోమమ్ము జేయ మరిగిరియకటా!

ఆటవెలది:
ఊహనగరి బుట్టి యూహింప లేనట్టి
కీడు సేయుచుండె పాడు పురుగు
కొమ్ములన్ని విరిచి కొట్టి కరోనాను
మట్టిగరపుటెపుడు మహిని దేవ! .

ఆటవెలది:  
ప్రక్కవారితోడ పాటించు  దూరమ్ము
తరచు గడుగవలయు కరములెపుడు
ముఖమునకు 'మాస్కు' మూసి కట్టగవలె  
మూడు మంత్రములివి ముప్పుదప్పు.

సీసము:
తగిన సమయమున తగుసూచనిడువార్కి
పాటింపజేసెడు పాలకులకు
వ్యాధులణగజేయు వైద్యబృందములకు
ఊరు శుభ్రబరచు ధీరులకును
దీక్షతో పనిచేయు రక్షకభటులకు
అవసరముల దీర్చు యన్యులకును
భూరివిరాళాలు పూనిబంపెడు వార్కి
పేదలకన్నమ్ము బెట్టు వార్కి    
 
ఆటవెలది:
దీటుగా గనుగొన దివ్యౌషధమ్మునే
శ్రమను జేయుచుండు శాస్త్రులకును
ఈ'కరోన' వేళ నెంతయో కీర్తించి
కోటిదండములను కోరిజేతు.

కందకు:
కాలము మారును నిలబడు
కాలూనుచు రణముజేయ కదలితిమింకన్  
కాలిచి మసినేజేయుచు
కాలున ద్రొక్కెదము నిన్ను గనవె కరోనా!

No comments: