తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 22 July 2024

గురు వందనం

 శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ స్వామి వారి అనుగ్రహంతో గురు పూర్ణిమ సందర్భంగా, మంత్రాశ్రమము, గుంటూరునందు 20-07-2024న ఏర్పాటు చేసిన కవితా గోష్ఠి లో నేను చదివిన పద్యములు.


కందము:

గురువగు తల్లికి దొలుతను

గురువగు తండ్రికిని పిదప గొప్పగ జగతిన్

గురువగు హరికిని తప్పక

గురుతెరుగుచు నతులనిడరె కువలయమందున్.


కందము:

గురువన బ్రహ్మయు విష్ణువు

గురువే మాహేశ్వరుండు కుంభినిలోనన్

గురువు పరంబ్రహ్మయు సరి

గురువుల పాదమ్ములకివె  కోటినమస్సుల్.


కందము:

గురువన లోకమ్మందున

గురుతరమగు బాధ్యతగల కోవిదుడగుచున్

నరులకు జ్ఞానమ్మిహమున

పరమును జేరగ సరియగు పథమును జూపున్.


ఉత్పలమాల:

వేదములన్ని గాచి సరి వేయివిధమ్ముల వేల్పు గాథలన్

మేదినిలోని మానవుల మేలును గోరుచు వ్రాసినాడుగా

పాదములంటి మ్రొక్కిడరె వ్యాసుని ముందట దల్చి నాపయిన్

సాదరమొప్ప నాదిగురు శంకరుకున్ మరి యొజ్జకోటికిన్. 


No comments: