తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 5 November 2024

పోరు

 అమరావతి సాహితీ మిత్రులు  

వారం వారం పద్య కవితల పోటీ - 2 కొరకు వ్రాసిన పద్యములు 

అంశం:యుద్ధం  

శీర్షిక:పోరు 


తేటగీతి:  

మంచి చెడులకు యుద్ధమే యెంచి చూడ 

వెలుగు చీకటి కెప్పుడు కలదు పోరు 

ధర్మ రక్షకు సమరమ్ము తప్పదెపుడు 

వసుధనే నింపగా శాంతి పచ్చదనము. 


తేటగీతి:    

యుద్ధమును జేయ నెప్పుడు సిద్ధమనకు    

సిద్ధమేయైన విడువకు చివరి వరకు  

ధర్మ యుద్దమునకు తోడు దైవమెపుడు 

దుష్ట శిక్షణమే చూడ తుదకు జరుగు.        


తేటగీతి: 

స్వార్ధ మెంచుచు కొందరు వదలబోరు 

పోరు సలుపుచు నుందురీ పుడమిలోన 

వనిని బుట్టిన కార్చిచ్చు వలెనె నదియు

కాల్చి వేయును వారినే కూల్చివేయు.  

  

తేటగీతి:  

మనుగడకు శాంతి దక్కగా మనుజు లిలను 

అనిని సలుపగ వలయుగా ననవరతము      

మనసునందున చాటుగా మసలు యరుల  

నణచగావలె నారింటి నారు వరకు.     


తేటగీతి: 

బ్రతుకు పోరున నెవ్వరు  బ్రతికిపోరు 

పారిపోక నిల బ్రతికి పోరవలయు   

కత్తి సాహసమే యోర్మి కవచమవగ     

ధర్మ నియతిని బూనగా దక్కు జయము.   



No comments: