తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 21 October 2024

సత్యము

 అమరావతి సాహితీ మిత్రులు

వారం వారం పద్య కవితల పోటీ - 1 లో ప్రశంస పొందిన పద్యాలు.
అంశం:సత్యం
శీర్షిక:సత్యము

ఆటవెలది:
సత్యవచన మెపుడు శాంతినే బంచును
మనసు తేలికగును మంచిగలుగు
కల్లలాడ మదిని గందరగోళమే
నరుడు గోలుపోవు నమ్మకమ్ము.

ఆటవెలది:
త్రాడు జూచి పాము దలచుచున్ బెదరకు
త్రాడె యనుచు బాము దరికిబోకు
తెలివితోడ గనగ దెలియును సత్యమ్ము
సాగు జీవనమ్ము శాంతి తోడ.

ఆటవెలది:
మంచినీటి "నుయ్యి" మరిజూడగా "బావి"
మంచి "క్రతువు" నొక్క మంచి "సుతుడు"
వరుస కొకటికొకటి వందగానెక్కువ
మించి "సత్యవాక్కు" మేలుమేలు.

ఆటవెలది:
తీపి బొంకు వలన తీపులే మిగులును
చేదు నిజము పైకి చేదుకొనును
వాక్కునందు శక్తి పదిరెట్లు పెరుగును
పలుక సత్యమెపుడు పదుగురెదుట.

ఆటవెలది:
నిలుచు బ్రహ్మమొకటె నిజముగా సత్యమ్ము
జగతి మిథ్య యనుచు సరిగనెరిగి
తడవకుండునట్టి తామరాకును బోలి
బ్రతుకు నడుపు నరుడు భాగ్యశాలి.


No comments: