తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 4 October 2012

పువ్వులోన రెండు పువ్వు లమరె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - పువ్వులోన రెండు పువ్వు లమరె

ఆటవెలది:
అమ్మవారి ముఖమె యదియొక పద్మమ్ము
ఆమె కళ్ళు జూడ నందమైన
కలువ పూల వోలె కనుపించ, నిటు తోచె
పువ్వులోన రెండు పువ్వు లమరె.

ఆటవెలది:
మల్లికమ్మ వెడలె తల్లితో వైద్యుని
కడకు, చూచి చెప్పె గర్భ మందు
కవల పిల్ల లనుచు కడకునా వైద్యుండు
"పువ్వు, లోన రెండు పువ్వు లమరె"

ఆటవెలది:
పద్మ వదన తాను పద్మాక్షియే తాను
పద్మ నాభు  పాద పద్మములను
చేరి వత్తు చుండ చిలిపిగా హరి పల్కె
"పువ్వులోన రెండు పువ్వులమరె".

ఆటవెలది:
అల్ల నల్ల కలువ, అర్థ నారీశ్వర
సిగను జూడ నాకు మిగుల తోచె
రెండు పూల తోడ నిండుగా నర్చించ
"పువ్వులోన రెండు పువ్వులమరె"

ఆటవెలది:
వేసి పూవు మ్రుగ్గు వెలది గుమ్మడి పూవు
మధ్య నుంచ మనుచు మనుమరాలి
పంప నచట నిలువ, పడతి యిట్లనియెను
"పువ్వులోన రెండు పువ్వులమరె"


No comments: