తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 13 July 2019

నాన్న


నాన్న

కందము:
అమ్మయె దైవము సంతుకు
అమ్మకు దైవమ్ము తండ్రి యవనిని జూడన్
ఇమ్మను వాటిని వదలక
నిమ్మహిలో నాన్నయిచ్చు నిష్టముతోడన్.1

కందము:
విత్తనము నాన్న బ్రహ్మయె
విత్తమునే పంచి యిచ్చు విష్ణువు కాదా
చిత్తమున చెడ్డ భావన
చిత్తగు నట్లుగను గాల్చు శివుడే గదరా.2

కందము:
పొట్టన నుంచుక తల్లియె
పుట్టుక తానిచ్చి సంతు బుడమిని నిలుపున్
పొట్టన గుండెలనిడుకొని
పట్టుక తాతండ్రి నేర్పు పుడమిని నడకన్.3

కందము:
బుజ్జాయి గుండెపైనిడి
జొజ్జోయని వీపుదట్టి జోకొట్టుచునే
అజ్జొల్లు మూతి దుడుచుచు
బజ్జుండగబెట్టు నాన్న వాత్సల్యమహో!4

కందము:
ఆరోగము వచ్చినచో
నారోగ్యము బాగుజేయు నాన్నయె, కన్నా
ఆరోప్రాణము నీవను
ఆరోజులు మదిని దలుప నారోగ్యమ్మే.5

కందము:
ఎన్నగ కష్టములున్నను
నాన్నయె తా "నగుచు" నిచ్చునన్ని సుఖమ్ముల్
మిన్నగ పిన్నలకెప్పుడు
నన్నియు 'తానగుచు' నేర్పు నవనిని విద్యల్.6

ఆటవెలది:
పిన్న వయసునందు పిల్లల మనసున
భవిత బీజములను పాదుగొలిపి
పాటుబడును వాని పండింప తండ్రియే
పండువరకు తాను పండుకొనడు.7


కందము:
కడుపున బుట్టిన వానిని
కడుకొను ప్రేమలను తండ్రి ఘనముగ బెంచున్
కడు పుణ్య పురుషుడాతడు
కడుపున తినకున్న, సుతునకన్నము బెట్టున్.8

ఆటవెలది:
బుగ్గమీద నిమిరి ముద్దిచ్చునా వ్రేలు
నడక లోన బడక నడుపు వ్రేలు
తప్పుజేయునపుడు దడిపించునా వ్రేలు
జ్ఞానపథము జూపు నాన్న వ్రేలు.9

ఆటవెలది:
శతక పద్యములను శ్రద్ధగా నేర్పించి
పంచతంత్ర కథల మంచి దెలిపి
పోతనార్యు బలుకు బ్రీతిగా బలికించి
నవ్య పథము జూపు నాన్న ఘనుడు.10

కందము:
అడుగులు నేర్పుచు సుతులకు
నడుగుచునే మంచిచెడుల నన్నిదినమ్ముల్
అడుగున బడకను జగమున
నడుగడుగున తోడునుండు నాన్నకు జయహో!11

ఆటవెలది:
తనదు ప్రక్క వాడు తనను మించిననాడు
తట్టుకొనగలేడు ధరణి నరుడు
తానె ప్రక్కనుండి తనను మించగజేయు
నయముగాను సుతుని నాన్న, నిజము.12

తేటగీతి:
పండు కొనువేళ పొట్టనే పరుపుజేసి
కూరుచొనుటకు వంగుచున్ గుఱ్ఱమగుచు
దొరకు దోబూచులాటలో దొంగయగుచు
శిశువు నాడించు నాన్నకే చేతు నతులు.13

కందము:
కలలను గనుటయు నేర్పును
కలనాడున తోటివారి గనుటయు నేర్పున్
కలలవి కూలిన, నాన్నయె
కలతల బడకుండునట్టి ఘన'తల' నేర్పున్.14

కందము:
మనసున నుండని కోపము
కనులను కనుపింపజేసి కనుచును సుతులన్
ఘనులని తనకనిపించగ
కనిపించగజేయు తండ్రిగద నలుగురికిన్.15

సీసము:
పసితనమ్మునతాను పడకలో దరిజేరి
పంచు వెచ్చదనము పడక చలిని
పదములేరాగను పరుగువెట్టుచునుండ
పదములే బలుకును పదిలమనుచు
నయమున భయమున స్వయముగా ముందుకు
భయము 'నయము'జేసి పంపుచుండు
ఆకలికేమేమి యారోగ్యమో జెప్పు
ఆ కలిధర్మమ్ము లన్నిజెప్పు

ఆటవెలది:
నడక తోడ నేర్పు నడతను, పిల్లల
కోర్పువిలువ, నేర్పు గూర్చి నేర్పు
బుజ్జి చిన్నియనుచు బుజ్జగించుచు వారి
పెంచిపెద్దజేయు మంచి నాన్న.16




No comments: