తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 27 December 2018

కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-12-2018న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ 


కందము: 
క్షీరము బియ్యముతోడుగ
తీరుగ శర్కరను వేసి త్రిప్పుఛు కిస్మిస్
చేరెడు ఖాజులతో మమ 
కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ. 

Wednesday, 26 December 2018

వనమునన్ లభించు ఘనసుఖంబు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 12 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - వనమునన్ లభించు ఘనసుఖంబు


ఆటవెలది:
ప్రక్కవానిజూచి వెక్కుచునేడ్వక
కలిగినంతలోన గలిగి తృప్తి
సాయమొరులకింత సరిజేయు నరుని జీ
వనమునన్ లభించు ఘనసుఖంబు

Tuesday, 25 December 2018

'ఏ - సు - క్రీ - స్తు'- తో శ్రీకృష్ణ స్తుతి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 12 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


న్యస్తాక్షరి - 'ఏ - సు - క్రీ - స్తు'- తో శ్రీకృష్ణ స్తుతి


ఆటవెలది: 
ఏన్ గు రక్షజేయ నేగినవానిని
సుజన మునుల బ్రోచు చుండువాని
క్రీడి మనసు లోన వేడుచుండెడువాని
స్తుతులజేతు భక్తితోడ నేను.

Sunday, 23 December 2018

నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 12 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్


కందము: 
విలవిల లాడుచు, "డాక్టర్"!
తెలుపగలేనట్టి బాధ దీర్పరెయనుచున్
నెలతయె కాలికి గల యా
నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్.

Monday, 17 December 2018

ఏక్, దస్, సౌ, హజార్ .... భారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 12 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది - ఏక్, దస్, సౌ, హజార్ .... భారతార్థంలో 


కందము: 
సౌగంధిక పుష్పమ్మును
వేగముగా దెచ్చుకొరకు వెడలెద సఖియా  
ఆగగనంబహ జారిన 
నాగకనేకదలెదననె యనిలాత్మజుడే. 

Saturday, 8 December 2018

కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 12 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్.

కందము: 
స్మరణము జేయుచు దేవుని
మరణము వరకును భవాబ్ధి మరిదాటుటకున్ 
తరుణమునెరుగుచు తగునుప
కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్.

Saturday, 1 December 2018

శ్రీ రాముడు శివుని జంపె సీతకు సుతుడై

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 04 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - శ్రీ రాముడు శివుని జంపె సీతకు సుతుడై


కందము: 
ఆరవికుల తిలకుడెవడు? 
ఆరాధించు నెవని? హత మార్చెననంగా? 
తీరుగ కుశుడెటు వెలిగెను? 
శ్రీరాముఁడు-శివుని-జంపె- సీతకు సుతుఁడై.

Sunday, 11 November 2018

కప్పను గని పాము కలఁతఁ జెందె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-11-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - కప్పను గని పాము కలఁతఁ జెందె. 


ఆటవెలది: 
చొప్పగడ్డి వేయ చూడగానెద్దుకు
తుప్పలందు తాను తోడు "టార్చి" 
చేతకర్రబట్టి చీకటి నడచు వెం 
కప్పను గని పాము కలఁతఁ జెందె.

Saturday, 10 November 2018

లయమె శాంతిఁ గూర్చు నయముగాను

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-11-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


మస్య - లయమె శాంతిఁ గూర్చు నయముగాను


ఆటవెలది.  
భయముజెందవలదు భవరోగమంటిన 
కలతలేల యేల కలవరమ్ము
మనసునందు నిల్ప మాహేశ్వరుని యాని  
లయమె శాంతిఁ గూర్చు నయముగాను

Thursday, 8 November 2018

భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 8-11-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్.


కందము: 
సరి మీరు వచ్చువరకును 
నిరతము సింహాసనమ్ము నివియేయుంతున్
సరెయనుమని తా మ్రొక్కగ 
భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్.

Wednesday, 7 November 2018

బాబాలగుట్టులే పరికించి "డేరాల"

మీకు మీకుటుంబసభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

సీసము:
ధరను దాటి ధరలు తారలందున జేరె 
చేరి దించుమ నీవు "తారజువ్వ"! 
రెచ్చగొట్టి కులపు చిచ్చురేపెడివారి
ముచ్చెలు గాల్చుమా "చిచ్చుబుడ్డి"!
భూములనేమ్రింగు భూబకాసురులను
భూచక్రమా! కొట్టి పూడ్చుమమ్మ 
బాబాలగుట్టులే పరికించి "డేరాల" 
బ్రద్దలజేయుమా "బాంబు"! నీవె

తేటగీతి: 
వెలుగు పూవులనింటింట వేడ్కమీర
రాల్చు "కాకరపూవొత్తి"! రయముగాను 
మీరలందరు గలియగ మేలుగాను
పూర్తి "దీపాలపండుగ" పుడమి మీద.

Tuesday, 6 November 2018

నరక హంత కుండు గరళ గళుఁడు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 6-11-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - నరక హంత కుండు గరళ గళుఁడు.


ఆటవెలది: 
భేదమేమివలదు ప్రియముగా నిద్దర
గొలువుడయ్య మీదు కోర్కెదీర 
మిత్రులిరువురెపుడు, మెచ్చగాలోకాలు
నరక హంత కుండు, గరళ గళుఁడు

Monday, 5 November 2018

కన్ను-ముక్కు-చెవి-నోరు....భారతార్థంలో.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-04-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది: కన్ను-ముక్కు-చెవి-నోరు....భారతార్థంలో.


మయసభ చూచిన తర్వాత దుర్యోధనుని స్వగతం 


కందము: 
మాకన్ను కుట్టుచున్నది
చీ! కౌంతేయుల సిరులకు, చెవిలో బడెగా
యాకృష్ణ నోరు నవ్వగ
నాకసియే ముక్కుటించె నలుపగ వారిన్.

Sunday, 28 October 2018

చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-04-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్


కందము: 
పెడతలలవాని శత్రుని
కడుభక్తిని మదినిగొల్చు కపివరు స్వామిన్ 
విడువక హరుడే మది దల 
చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్.

Saturday, 27 October 2018

ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్.

27-10-2018 శంకరాభరణం బ్లాగునందు శ్రీ కంది శంకరయ్య గారు ఇచ్చిన సమస్యకు నా పూరణ.



సమస్య - ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్.



కందము:
దొరకొని బిల్వదళమ్ములు
మరియును గోక్షీరములను మంత్రసహితమున్
నిరతము జేసెడి శశిశే
ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్.


Friday, 26 October 2018

అష్టమికి జరుపగనొప్పు నట్లతదియ

26-10-2018న  శంకరాభరణం బ్లాగునందు శ్రీ కందిశంకరయ్య గారు ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - అష్టమికి జరుపగనొప్పు నట్లతదియ.


తే.గీ: 
మనసు పొంగగ వత్తురు మనుమరాండ్రు
వేచిచూడుము, చేయుమా వేడ్కమీర 
సరుకులన్నియుదెచ్చితి సరిగ మున్ను  
యష్టమికి, జరుపగనొప్పు నట్లతదియ.  

Thursday, 25 October 2018

సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్.

ఈ రోజు శంకరాభరణం బ్లాగునందు శ్రీ కందిశంకరయ్య గారు ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్


కందము.
నేనెక్కలేను కొండల
మేనునకా శక్తి లేదు, మించిన భక్తిన్
నేనిక్కడ, తిరుమల వా 
సా!నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్.

Monday, 22 October 2018

తెలుగు వాడనీకు


తెలుగు వాడనీకు 


ఆటవెలది: 
శివుని డమరుకమ్ము చిత్రమ్ముగా మ్రోగ
అక్షరమ్ము లన్ని యవని వెలసె
శబ్ద భేద మరసి చక్కగా నన్నింటి
నేర్వ వలయు వదల నేరమగును
కందము: 
అచ్చులు హల్లులు మొత్తము
ముచ్చటగా నేబదారు, బుధ్ధియె లేకన్
హెచ్చగునని సరి నేర్వక
కచ్చగ తగ్గించినావు కఠినాత్ముడవే.
ఆటవెలది:
తల్లి పోలిక గల తనయరా మన భాష
తల్లి సంస్కృతమ్ము తనయ తెనుగు
అన్య భాష జూడ నాలి వంటి దదియె
బెల్ల మాయె తల్లి యల్ల మాయె.
ఆటవెలది: 
సంస్కృతమ్ము నేర్వ చాదస్త మని యంద్రు 
తెలుగు మాటలాడ తెగులనంద్రు 
ఇంగిలీసు బలుక ' ఇంటలీజెం ' టంద్రు 
పుల్లకూర రుచియె పొరుగు దైన.
ఆటవెలది: 
ఆంగ్ల భాష లోని "ఆల్ఫబెట్ల" న్నియు 
నాల్గు బడులు నేర్చి నడకతోనె 
ఆంధ్ర భాష కున్న యక్షరంబులు కొన్ని  
తొలగ జేసి మదిని తొలుతు వేల.
ఆటవెలది:
అక్షరమ్ము లన్ని యక్కరగా నాల్గు 
బడులు నేర్వ వలయు, పదము లేమొ
వ్రాయుటొకటి వాని పలుకు వేరొక్కటి 
బరువు తోచ లేదె పరుల భాష?
ఆటవెలది:
*చావు* *చదువు* లేమొ 'చావు' 'చదువు' లాయె
*జంకు* *జంట* లాయె 'జంకు' 'జంట'
అక్షరమ్ము వ్రాయ నసలది లేకున్న
వ్రాయుటెట్లు దాని పలుకుటెట్లు.
తేటగీతి:
బడిని నేర్పగ గొప్పగా పరుల భాష
‘తెలుగు లెస్సన్న’ రోజులే తేలిపోయె 
వ్రాయ చదువగ నేర్వరే భావి యువత 
తెలుగు ‘లెస్సాయె’ భాషయే తెల్ల బోయె.

ఆటవెలది: 
తెలుగు వెలుగు లీనె దేశంబు వెలుపల 
మసక బోవునటుల మసలబోకు 
 తెలుగునేల మరచి తిరుగు చుండెదవేల?
విలువ గలదె నీకు తెలుగు నేల.

సీసము:
తెలుగు భాష రుచిని తెలియగా నిటులుండు
అమ్మ పెట్టెడి "ళుళు ళాయి" ముద్ద 
వత్సరాదిన తిను పచ్చడి రుచియును 
స్వామి రామ నవమి పానకమ్ము
ముద్దపప్పు గలుప మురిపించు గోంగూర
అన్నమాయిలలోన నావకాయ
పుణ్య తిథులలోన బులిపించు పులిహోర 
భారత రుచిమించు గారె ముక్క
ఆటవెలది:
అక్షరమ్మువంపు లనిననోటికి సొంపు 
చెవుల వినగ నింపు చవుల నింపు
సంపదనుచు దీని సలుపుమా సరిపెంపు 
విలువ లేని పనులు విడుచు కంపు.
కందము:
ఘనమైన కవివరేణ్యులు 
తెనుగును వెలిగించినారు దేదీప్యముగా 
మనమే మన మన మనముల 
విను దీక్షను బూని మిగుల వెలుగీయ వలెన్.
సీసము:
నన్నయార్యుల నోట నాటలాడిన భాష 
తిక్కనాదులు పంచె తీపి భాష
శ్రీనాథ కవి దిద్దె సింగారముల భాష 
పోతన్న గంధంపు పూత భాష
రాయలేలిన నాడు రాటుదేలిన భాష
భువన విజయ మందు కవన భాష
గిడుగు వారు మురిసి గొడుగు బట్టిన భాష
విశ్వనాథుని కల్పవృక్ష భాష
ఆటవెలది:
లాలి పాట పాడి లాలించి పాలించి
అమ్మనేర్పినట్టి యమృత భాష
తెలుగు జగతి లోన వెలుగొంద జేయగా
చేయి తలను నిలిపి చేయి బాస.
కందము:
పద్యం బవధానంబులు
గద్యంబులు భావయుక్త గానము వినగా
హృద్యంబగు శ్రోతలకే 
చోద్యంబగు తెనుగున'కవి' శోభను గూర్చున్
ఆటవెలది:
తెలుగు వాడలోన తెలుగు వాడని వాడ!
తెలుగు వాడ! నీకు తెలివి గలదె ?
తెలుగు వాడనీకు తెలుగు వాడిని జూపి
తెలుగు వాడి, పెంచు తెలుగు వాణి.

Thursday, 18 October 2018

మమ్మా కలి

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 

శ్రీమాత్రే నమః. 


Image result for durga maa image

కందము: 
అమ్మకడ నున్న శిశువుల
కిమ్మహిలో భయము గలద?హే జగదంబా!
మమ్మాకలి బాధలు, కను
మమ్మా! కలికల్మషములు మరియంటవుగా!  

Wednesday, 17 October 2018

ఈశ - హర - శివ - భవ పదాలతో దుర్గాస్తుతి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-10-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ

దత్తపది: ఈశ - హర - శివ - భవ పదాలతో దుర్గాస్తుతి. 

కందము: 
ఈశక్తి నిమ్ము మాతా! 
నీ శక్తిని దెలియు బుద్ధి, నీ విభవము మా 
కే శివమునుగూర్చెను గా 
యాశింతును పాపములిక హరణమ్మ్మగుగా! 

Tuesday, 16 October 2018

మందు కొట్టిరి యువతులు మనసుదీర.

సమస్య - మందు కొట్టిరి యువతులు మనసుదీర.



తే.గీ:
బీచి వద్దను చాటుగా బీటువేసి
కామ పీడుతుడొక్కడు కన్నుగొట్ట
కలసి యందరు వానిని కడలి తీర
మందు కొట్టిరి యువతులు మనసుదీర.


Thursday, 11 October 2018

వడియము లెండెను విడువని వానలలోనన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-04-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - వడియము లెండెను విడువని వానలలోనన్. 


కందము: 
బిడియమ్ముల వడియమ్ములు
సడిసేయక వెట్టుచుండ, చటుకున పతియే
గడివెట్టుచు సతి గలువగ 
వడియము లెండెను విడువని వానలలోనన్.  

Wednesday, 26 September 2018

మల్లియ తీవియకుఁగాసె మామిడి కాయల్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-04-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - మల్లియ తీవియకుఁగాసె మామిడి కాయల్


కందము: 
అల్లన జవ్వని పైటను 
మెల్లగ తా సర్దుకొనుచు మీదకురాగా 
ల్లరిగా మగడిట్లనె 
'మల్లియ తీవియకుఁగాసె మామిడి కాయల్'

Sunday, 23 September 2018

పతితల ఖండించి వండె బంధువులు దినన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-04-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - పతితల ఖండించి వండె బంధువులు దినన్


కందము: 
కొతిమెరె బాగున్నదిలే 
పతిదేవా కూరలోన బడవేతుననన్ 
సుతిమెత్తగ తా నూపగ
పతి తల - ఖండించి వండె బంధువులు దినన్. 

Sunday, 16 September 2018

దత్తపది - అమ్మ,అయ్య,అన్న,అక్క...రామాయణార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-03-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది - అమ్మ,అయ్య,అన్న,అక్క...రామాయణార్థంలో 


అమ్మయుతనయ దశకంఠు కపుడు జెప్పె 
నయ్యసురపతియె విడువ నాజనకజ 
నక్కజమ్మగు నీమాటలనుచు నతడె 
అన్నరుండేమి జేయులే యనెను మిడిసి.

Thursday, 13 September 2018

ఉడుగణపతిధరసుతునకు

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః

Image result for ganapati images


కం:
దండము నిడుదును, భక్తిని
దండగ నర్పించి జేతు దండిగ నుతులన్
దండగలుబోవ ఘన వే
దండపు వదనంపు మూర్తి దరహాసునికిన్.

కం:
ఉడుగణపతిధరసుతునకు
నిడుముల దొలగంగజేయ నిపుడీ చవితిన్
బెడుదును బెల్లంబటుకులు
కుడుములునుండ్రాళ్ళతోడ కొబ్బరిపలుకుల్.

Monday, 10 September 2018

లంక నేలినాడు లక్ష్మణుండు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-09-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - లంక నేలినాడు లక్ష్మణుండు. 


ఆ.వె: 
రావణానుజుండు రమ్యమౌ యశమందె 
లంక నేలి, నాడు లక్ష్మణుండు 
రామచంద్రులంత రాజ్యపట్టముగట్టి 
పడతి సీతతోడ వెడలిరాగ.

Saturday, 8 September 2018

చంద్రునిం గాంచి యేడ్చెఁగంజాతహితుఁడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-03-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - చంద్రునిం గాంచి యేడ్చెఁగంజాతహితుఁడు


తే.గీ: 
జనుల వాక్యము మన్నించి మనమునందు
జానకినిబంప దలచుచు కానలకును 
మదిని బాధను దిగమ్రింగు మాన్య రామ 
చంద్రునిం గాంచి యేడ్చెఁగంజాతహితుఁడు

Monday, 3 September 2018

హర - శివ - భవ - కపాలి, తో శ్రీకృష్ణ స్తుతి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 3-09 -2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది : హర - శివ - భవ - కపాలి,  తో శ్రీకృష్ణ స్తుతి. 


కందము: 
కలుషహర! కంసభంజన! 
వెలుగుల రాశి వలెకరుణ వేడిన మాపై 
చిలికించుము భవహర! హరి!
పలికెదము స్తుతులు  విడువక పాలించుమయా! 



  

Saturday, 1 September 2018

దత్తపది: మార్చి-మే-జులై-డిసెంబరు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-03-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది: మార్చి-మే-జులై-డిసెంబరు తో విళంబికి స్వాగతం. 


తే.గీ: 
కొన్ని రోజులైననుచెడు కోరి తుడిచి 
మార్చి ధరలోన క్రొత్తగా మంచి జూప 
కనులు తడిసెన్ బరుగునను కదలిరావె 
స్వాగతమ్మేయిది విళంబి సరిగ రావె.

Sunday, 26 August 2018

గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-03-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్. 

 
కందము: 
మగటిమి మత్స్య యంత్రమును  
తెగి పడగను నరుడు కొట్ట  దిగువకు వేగన్
తెగ మెచ్చుకొనగ నందరు 
గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్.   

Wednesday, 22 August 2018

మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-03-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు

తే.గీ: 
పూల విల్లును చక్కగా బూని చేత 
బీరమాడుచు బాణముల్ వేయ నతని 
మసి యొనర్చెను, శంకరున్ మన్మథుండు
లొంగదీయుట గలదటే లోకమందు.

Sunday, 15 July 2018

రాముని సుతుఁడర్జునుండు రావణు గెలిచెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 02 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - రాముని సుతుఁడర్జునుండు రావణు గెలిచెన్.


కందము: 
సోమూ!కుశుడెవ్వడురా? 
భీమునితమ్ముండెవడుర? భీమ రణంబున్ 
రాముండెవరిని గెలిచెను? 
"రాముని సుతుఁ- డర్జునుండు- రావణు గెలిచెన్."

Monday, 2 July 2018

మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 02 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్.



కందము: 
ఓసారెంటీయారూ!
మీ సములన్ గనఁగఁ గలమె మేదినియందున్ 
వేసము కృష్ణుని రూపున 
మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్.

Thursday, 28 June 2018

అక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 02 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - అక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్. 



కందము: 
ముక్కున కోపమ్మేలనె 
ముక్కెరనే దెత్తునీకు ముడవకె మూతిన్
మక్కువ దీర్చగ రా ! రమ 
ణక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.

Wednesday, 20 June 2018

బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 01 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్.



కందము: 
ప్రీతిగ కొందరు కావ్యపు 
వ్రాతల రామాయణమ్ము రంకనిరి గదా! 
పూత చరిత్రుల కథ నా 
'బూతు పురాణమ్ముఁ' జదువఁ బుణ్యం బబ్బున్.

Sunday, 17 June 2018

దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29- 01 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు



తేటగీతి: 
తనదు చీరెల సొమ్ములన్ తరచి చూచి 
తమకు లేవని లోలోన కుమిలి తలచు 
ఎదర ప్రక్కింటి వారల ఈర్ష్య మరియు 
దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు. 

Friday, 15 June 2018

రణమే యవధానమందు రహి మంగళమౌ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17- 01 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - రణమే యవధానమందు రహి మంగళమౌ



కందము:
గణములు యతులును తప్పక 
వణకక నిచ్చిన సమస్య వాక్చాతురితో 
చెణుకులతో సరసపు పూ 
రణమే యవధానమందు రహి మంగళమౌ.

Saturday, 9 June 2018

రామునకు మువ్వురు సతు లారతు లొసగిరి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 01 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - రామునకు మువ్వురు సతు లారతు లొసగిరి



తేటగీతి: 
పుట్టినదినము వేడుక బూని సేయ
హారతిమ్మని జెప్పగా దారలకును
దశరథుండట, ముందుగా దరినిజేరి
రామునకు, మువ్వురు సతు లారతు లొసగిరి

Tuesday, 5 June 2018

హస్త-చిత్త-స్వాతి-మూల....షడ్రసోపేత భోజనాన్ని వర్ణిస్తూ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 12 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ
 

దత్తపది: హస్త-చిత్త-స్వాతి-మూల....షడ్రసోపేత భోజనాన్ని వర్ణిస్తూ


తేటగీతి: 
స్వాతిశయమున తెల్గుభోజనము దినుడు
ఆహ!స్తవనీయ మైయుండు నారు రుచుల 
చిత్తమందున మరువరు జిహ్వ రుచుల
మొత్తమారోగ్య కరమౌను మూలబడరు.

Saturday, 2 June 2018

విల్లది రామునకునైన విరువదరమ్మే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 12 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - విల్లది రామునకునైన విరువదరమ్మే. 



కందము: 
చల్లని సాయం సమయము
మెల్లగ తుంపరలజల్లు, మిన్నున గనగా 
నల్లన సరి విరిసిన హరి  
విల్లది, రామునకునైన విరువదరమ్మే?

Thursday, 31 May 2018

మేరీ - యేసు - సిలువ - చర్చి....శ్రీకృష్ణుని స్తుతి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 12 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



దత్తపది: మేరీ - యేసు - సిలువ - చర్చి....శ్రీకృష్ణుని స్తుతి



మత్తేభము: 
కనగా భాసిలు వజ్ర దేహుడు మహా కారుణ్య కాశమ్ముతో 
చొనిపెన్ గాభువి శాంతినిండ నదియే సుజ్ఞానమౌ గీతగా 
వినుమేరీతిగ నైన మాధవుమదిన్ వేడంగ రక్షించుగా 
జనులన్ బ్రోవగ వాడె దిక్కుగదరా చర్చింప నేముండురా!

Tuesday, 29 May 2018

కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 12 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ

సమస్య - కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై. 

కందము: 
ఖాట్మండు నుండి నీవే 
చాట్మని ఫేస్బుక్కులోన చాటింగిడుచున్
జూట్మిల్ వద్దకు రమ్మన 
కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై.

Sunday, 6 May 2018

వేంకటపతికి భామలు వేయిమంది

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 12 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - వేంకటపతికి భామలు వేయిమంది



తే.గీ:
ఎక్కగోరుచు గిన్నీసు బుక్కులోన
మ్రొక్కు దీర్చగ నెంచుచు నొక్కచోట 
తలల నీలాలనిచ్చిరి తన్మయమున 
వేంకటపతికి, భామలు వేయిమంది.

Monday, 30 April 2018

గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 11 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్.


కందము: 
గౌరియన భూమి యర్థము 
వేరొకటిగ గలదు జూడ వివరింపంగా
నీరీతిగ నుకొనుమిక 
గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్.  

Sunday, 29 April 2018

పద్మములు ముకుళించెను భానుఁ జూచి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 11 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - పద్మములు ముకుళించెను భానుఁ జూచి. 


తేటగీతి: 

మంత్ర మహిమను దెలియగ మానవతియె

రవిని బిలువగ, సరగున భువిని జేరి 

కేలు బట్టగ సిగ్గున కుంతి నేత్ర 

పద్మములు ముకుళించెను భానుఁ జూచి. 

Thursday, 26 April 2018

రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 11 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు



తే.గీ: 
ఇంటివైద్యుండు వచ్చితా నిటులజెప్పె 
పాల ఉబ్బస మీమెకు పూల వాస
నసలు బడదుగ జాగ్రత్త, నయమగునులె 
రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు.

Wednesday, 25 April 2018

భారత రాజ్యాంగము-అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 11-10-2017 న వ్రాసిన  పద్యములు.


పద్య పక్షం - 12   

 “భారత రాజ్యాంగము-అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ ”

కం: 
భావప్రకటన మంచిదె
నా వాదమె గొప్పదనుచు ననకను  చర్చన్
చేవగ చక్కని భాషణ   
చే!వగజెందక నటునిటు జేయగవలెగా. 


కం: 
హక్కులనందరు దెలియుచు
చక్కగనే జెప్పుచుంద్రు సరిసరి నిజమే   
యెక్కడ బాధ్యత నెరుగరు 
తిక్కగ మాట్లాడువారి తెలివిని గనుడీ!  
కం: 
అచ్ఛా! భావప్రకటన 
స్వేచ్ఛయె నాకున్నదనుచు చెలగుచు పరులన్
స్వచ్ఛత లేమిని దిట్టుచు  
మ్లేచ్ఛునివలె మాటలాడ మేలగు నటరా!

ఆ.వె: 
తాను బలుకునదియె ధర్మంబుగా దోచు 
వినుటవారి వారి విధిగ దోచు    
మదికి దోచినటుల మాటాడకుండగ 
మదిని దోచునటుల  మసలవలయు.    

చం: 
పరులను కష్టబెట్టునటు పల్కుల బల్కుట మేలుగాదులే  
యొరులను దిట్టినంత నిను యోహొహొ యంచును మెచ్చుకోరులే 
మరువకు వారు దిట్ట నిను మానసమెట్టుల నీది కృంగునో
యెరుకనుగల్గి భావముల నెంతయొ మెత్తగ జెప్పగావలెన్.    

Monday, 23 April 2018

టీవీ సీరియళ్ళు-సమాజంపై ప్రభావం

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 26-09-2017 న వ్రాసిన  పద్యములు.


పద్య పక్షం - 11   

 “టీవీ సీరియళ్ళు-సమాజంపై ప్రభావం ” 

కం:   
సీర్యలు జూచెడి వేళల 
భార్యను పిలువంగజూచు భర్తను గనుచున్ 
మర్యాదగ జెప్పరులే 
మిర్యాలను నూరుదురిక మీదను వినరా!

ఆ.వె: 
చుట్టములునురాగ  జూడరే  యొకకంట 
నొక్కకంట జూచు చుంద్రు టీవి 
మాటలాడ బోరు మంచిగానొకగంట 
ముచ్చటాడ"బోరు" మోముద్రిప్పు.

సీ: 
అత్త కోరుచునుండు నాభక్తి, ఈటీవి 
కోడలేమొ గనును కోరి జెమిని
మామజూచునుగాద మాటీవి, జీటీవి 
భర్త గోరుచునుండు వార్తలన్ని 
పెద్దవాడిదిగోల ప్రియమైన స్పోర్ట్సుకై 
చిన్న దానికి బ్రీతి  జెమిని సినిమ 
పిల్లవాడలుగును పెట్టగా కార్టూన్లు  
ఛార్లిచాప్లిననుచు చంటిదడుగు

ఆ.వె:    
వారుబెట్టవీరు, వీరుబెట్టగవారు 
మార్చమంద్రు కోపమందుకొనుచు 
బుల్లితెరయె వచ్చి ముచ్చట్ల బోగొట్టె 
పెట్టె తంపులెన్నొ "పిచ్చి పెట్టె."

కం: 
రంగులలో జూపు పలుతె 
రంగుల గొడవలనురేపు, రమణీ మణులన్
రంగులమార్చెడి 'విలనుల ' 
రంగులు మారగ గనుదురు రంజుగ ప్రీతిన్.

చం: 
కలవరమేలలే వలదు, కన్నులనిండుగ 'టీవి 'జూడగా 
విలువలు దెల్పునట్టివియు, విజ్ఞత నేర్పెడు కొన్ని భాగముల్
కలవులె మంచివేయనుచు గానఁగ  మెచ్చెడువైన, నుండెలే 
కళలను నేర్పునట్టివియు, కమ్మని భక్తిని పెంచు నట్టివే.

Sunday, 22 April 2018

“వైద్యరంగం-మారుతున్న సమీకరణాలు ”

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 10-09-2017 న వ్రాసిన  పద్యములు.



పద్య పక్షం - 10   

“వైద్యరంగం-మారుతున్న సమీకరణాలు ”


సీ:
హస్తవాసిగలిగి యందరు రోగుల 
బాధలన్నియుగూడ బాపువారు
వాస్తవమ్ముల దాచి భయములన్ బెంచుచు
దోబూచులాడుచు దోచువారు
కాలునేదన్నుచు గట్టియాయువునిచ్చి
నేలపై ప్రాణమ్ము నిల్పువారు
కాలనే దన్నుచు ఘనమైన విలువలన్
డబ్బునేయాశించు గబ్బువారు
తే.గీ:
నమ్మకమ్ముగ వృత్తినే నమ్మువారు
అవయవమ్ముల జాటుగా నమ్మువారు
కలరు వారలు వీరలు గనగ భువిని
వైద్యరంగాన మిగిలిన వాని వలెనె.
ఆ.వె:
తల్లిదండ్రి గురువు తదుపరి వైద్యుండు
దైవసముడు గాని ధరణిలోన
వైద్యరంగమాయె వ్యాపారరంగమ్ము
రోగి బ్రతుకు నేడు రోదనాయె.
ఉ:
డబ్బును గోరకుండ మరి డస్సిన రోగుల జేరదీయుచున్
జబ్బుల బారద్రోలగల చక్కని వైద్యులు కొంద రుండగా
జబ్బులుజూపి వైద్యమును జచ్చిన వారికి జేసి గుట్టుగా
డబ్బులుగుంజి చాటుగను డాకొనువారలు కొందరయ్యయో.
ఓ వైద్యుడా!
కం:
బెస్టుగ నాడిని బట్టుక
హిస్టరి జెప్పితివినాడు హేవైద్యుడ! వే
టెస్టులు జేయించెదవుగ
వేస్టుగ నేడేల నయ్య విను మామొరలన్.
ఆ.వె:
భిషకు పేరు జెరిపి పెర్వర్టుగాబోకు
హరివి పిండబోకు హార్టునెపుడు
వైద్యుడీవు గనుక వైలెంటుగాబోకు
"వెజ్జు " వీవు "నానువెజ్జు " గాకు.

Saturday, 21 April 2018

ప్రత్యేక హోదా - న.మో. నమహ


ప్రత్యేక హోదా - న.మో. నమహ 

కం: 
తెలుగుల సయామి కవలల 
తలుపులు మూయుచును కోసి తదుపరి సరి కో
తలనే మాన్పుట  కొరకై  
తలపైనను చేయరేల తలలే లేవా! 
కం: 
మోదెను హస్తము గతమున 
మోదీయే మోది నేడు మోసముజేసెన్
మోదము లేనేలేద   
మ్మో! దీనిని గనుచు నేపి(AP) మూల్గుచునుండెన్.   
కం: 
హెచ్చుగ నిచ్చితిమనునట 
ఇచ్చినదే బిచ్చమందు రిచ్చట, చూడన్
హెచ్చుల తచ్చుల లెక్కకు 
పిచ్చియె పట్టేను ప్రజకు వేదన హెచ్చెన్ 
కం: 
గోదాలో దిగుమన్నా
హోదా ప్రత్యేకత కయి ఓతెలుగన్నా! 
రాదారి కురికి పోరిన 
రాదామరి కోరు ఫలము, రయమున రారా!
కం: 
భేదములందరు మరచుచు 
మీదటనొకగొంతు గలిపి మేమొకటన్నన్
ఖేదము తొలగును, దమ్మే
మోదమ్మయి యాంధ్ర ప్రజల మోములు వెలుగున్.
కం: 
 హా! మీకే దయరాదా 
హామీలనె యమలు బరచ హస్తిన వారూ!
క్షేమమ న.మో. నమహ విను  
మేమే సింగములగుచును మీదకు రాగా?

కం: 
మట్టిని నీటిని మాకిడి
వట్టిగనే గాలిమాట బలుకుచు, నింగిన్
గట్టిగ నడిగిన జూతువ
పుట్టింతుము యగ్నినింక పుడమిని గనుమా! 

Friday, 20 April 2018

తెలుగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర - మన కర్తవ్యం

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 24-08-2017 న వ్రాసిన  పద్యములు.

పద్య పక్షం - 9 

తెలుగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర - మన కర్తవ్యం 

ఆ.వె. 
మాత  గాద మనకు మాతృభూమియుగూడ
దివిని మించుగొప్ప, తెలియు మనకు   
మాతృభాష గూడ మరిజూడ గొప్పదే 
మరువబోకు దాని మడువబోకు.  

ఆ.వె. 
చిన్నవారికెపుడు  నాన్న, అమ్మయుగాక
మమ్మి డాడియనెడు మాట నేర్పి   
తెనుగు భాషలోని 'తీపి'ని యణగార్చి 
పైకి 'చేదు' కొనకు పరులభాష. 

ఆ.వె. 
తల్లిపాలుమొదట పిల్లవానికి ప్రీతి 
ఒల్లకున్న బ్రతుకు డొల్లయగును 
'చేతవెన్నముద్ద' చేరిముందుగ బెట్టు   
'జానిజాని షుగరు' చాలు పిదప.  

కం. 
పాలునుబంచుక నొకటై  
పాలకులును చేరి కూడి పండితవరులే   
పాలుగొని తెలుగునకు  దీ 
పాలను వెలిగించవలయు భాషకు తోడై.  

ఉ: 
తీయగరాదు తెల్గునిక తీరుగ మాధ్యమమంచు  పాలకుల్  
మాయనుజేయు యాంగ్లమును మధ్యకు ప్రక్కకు నెట్టగావలెన్ 
తీయగ పద్యముల్ బలికి తీయని భాషను మెచ్చ  నేర్పుచున్  
మాయగ జేయగావలయు మమ్మియు డాడిల పిచ్చినే బుధుల్.

Thursday, 19 April 2018

సమాజ శ్రేయస్సు--నా కర్తవ్యం

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 13-08-2017 న వ్రాసిన  పద్యములు.



పద్య పక్షం - 8 

“సమాజ శ్రేయస్సు--నా కర్తవ్యం” 


కం: 
దేశమన మట్టిగాదని 
దేశమనగ మనుషులనుచు  తెలియగవలె నీ   
దేశమ్మేమిచ్చెననక 
దేశమునకు నీవిడునది తెలియుచు నిడుమా. 

కం:
ఎన్నికవేళల నేతల 
మన్నిక దలపోసి యెన్న మాన్యుడవీవే 
ఎన్ని కలలైన దీరును 
మన్నిక నీనోటవడక మను పాలనయే. 

మత్తకోకిల: 
ఈసురోమని నీరసింపకు మేదిసేయకనుండుచున్  
ఈస బోవనియాశతోడ  పరేశు దల్చుచు శ్రద్ధగా   
ఈసడింపక నేటి దుస్థితి మార్చగావలె బూనుచున్ 
ఈసమాజము నిన్ను మెచ్చగ నీయగావలె శ్రేయముల్.   
ఆ.వె. 
భేదభావములను విడనాడి స్ఫూర్తితో
స్వచ్ఛభారతమ్ము సాగుజేయ 
శ్రేయఫలములింక చేరుగా చేరువగ 
కర్మజేయుమింక ధర్మముగను. 

తేటగీతి:
దురలవాటను దారిలో దూరకుండ  
మంచి నడవడినేరిచి మహిని నిలచి 
ఒరులక్షేమమ్ము గోరుచు నోర్మితోడ
నాదుకర్తవ్యమిదియని నడువుమయ్య.