తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 30 April 2018

గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 11 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్.


కందము: 
గౌరియన భూమి యర్థము 
వేరొకటిగ గలదు జూడ వివరింపంగా
నీరీతిగ నుకొనుమిక 
గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్.  

Sunday, 29 April 2018

పద్మములు ముకుళించెను భానుఁ జూచి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 11 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - పద్మములు ముకుళించెను భానుఁ జూచి. 


తేటగీతి: 

మంత్ర మహిమను దెలియగ మానవతియె

రవిని బిలువగ, సరగున భువిని జేరి 

కేలు బట్టగ సిగ్గున కుంతి నేత్ర 

పద్మములు ముకుళించెను భానుఁ జూచి. 

Thursday, 26 April 2018

రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 11 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు



తే.గీ: 
ఇంటివైద్యుండు వచ్చితా నిటులజెప్పె 
పాల ఉబ్బస మీమెకు పూల వాస
నసలు బడదుగ జాగ్రత్త, నయమగునులె 
రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు.

Wednesday, 25 April 2018

భారత రాజ్యాంగము-అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 11-10-2017 న వ్రాసిన  పద్యములు.


పద్య పక్షం - 12   

 “భారత రాజ్యాంగము-అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ ”

కం: 
భావప్రకటన మంచిదె
నా వాదమె గొప్పదనుచు ననకను  చర్చన్
చేవగ చక్కని భాషణ   
చే!వగజెందక నటునిటు జేయగవలెగా. 


కం: 
హక్కులనందరు దెలియుచు
చక్కగనే జెప్పుచుంద్రు సరిసరి నిజమే   
యెక్కడ బాధ్యత నెరుగరు 
తిక్కగ మాట్లాడువారి తెలివిని గనుడీ!  
కం: 
అచ్ఛా! భావప్రకటన 
స్వేచ్ఛయె నాకున్నదనుచు చెలగుచు పరులన్
స్వచ్ఛత లేమిని దిట్టుచు  
మ్లేచ్ఛునివలె మాటలాడ మేలగు నటరా!

ఆ.వె: 
తాను బలుకునదియె ధర్మంబుగా దోచు 
వినుటవారి వారి విధిగ దోచు    
మదికి దోచినటుల మాటాడకుండగ 
మదిని దోచునటుల  మసలవలయు.    

చం: 
పరులను కష్టబెట్టునటు పల్కుల బల్కుట మేలుగాదులే  
యొరులను దిట్టినంత నిను యోహొహొ యంచును మెచ్చుకోరులే 
మరువకు వారు దిట్ట నిను మానసమెట్టుల నీది కృంగునో
యెరుకనుగల్గి భావముల నెంతయొ మెత్తగ జెప్పగావలెన్.    

Monday, 23 April 2018

టీవీ సీరియళ్ళు-సమాజంపై ప్రభావం

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 26-09-2017 న వ్రాసిన  పద్యములు.


పద్య పక్షం - 11   

 “టీవీ సీరియళ్ళు-సమాజంపై ప్రభావం ” 

కం:   
సీర్యలు జూచెడి వేళల 
భార్యను పిలువంగజూచు భర్తను గనుచున్ 
మర్యాదగ జెప్పరులే 
మిర్యాలను నూరుదురిక మీదను వినరా!

ఆ.వె: 
చుట్టములునురాగ  జూడరే  యొకకంట 
నొక్కకంట జూచు చుంద్రు టీవి 
మాటలాడ బోరు మంచిగానొకగంట 
ముచ్చటాడ"బోరు" మోముద్రిప్పు.

సీ: 
అత్త కోరుచునుండు నాభక్తి, ఈటీవి 
కోడలేమొ గనును కోరి జెమిని
మామజూచునుగాద మాటీవి, జీటీవి 
భర్త గోరుచునుండు వార్తలన్ని 
పెద్దవాడిదిగోల ప్రియమైన స్పోర్ట్సుకై 
చిన్న దానికి బ్రీతి  జెమిని సినిమ 
పిల్లవాడలుగును పెట్టగా కార్టూన్లు  
ఛార్లిచాప్లిననుచు చంటిదడుగు

ఆ.వె:    
వారుబెట్టవీరు, వీరుబెట్టగవారు 
మార్చమంద్రు కోపమందుకొనుచు 
బుల్లితెరయె వచ్చి ముచ్చట్ల బోగొట్టె 
పెట్టె తంపులెన్నొ "పిచ్చి పెట్టె."

కం: 
రంగులలో జూపు పలుతె 
రంగుల గొడవలనురేపు, రమణీ మణులన్
రంగులమార్చెడి 'విలనుల ' 
రంగులు మారగ గనుదురు రంజుగ ప్రీతిన్.

చం: 
కలవరమేలలే వలదు, కన్నులనిండుగ 'టీవి 'జూడగా 
విలువలు దెల్పునట్టివియు, విజ్ఞత నేర్పెడు కొన్ని భాగముల్
కలవులె మంచివేయనుచు గానఁగ  మెచ్చెడువైన, నుండెలే 
కళలను నేర్పునట్టివియు, కమ్మని భక్తిని పెంచు నట్టివే.

Sunday, 22 April 2018

“వైద్యరంగం-మారుతున్న సమీకరణాలు ”

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 10-09-2017 న వ్రాసిన  పద్యములు.



పద్య పక్షం - 10   

“వైద్యరంగం-మారుతున్న సమీకరణాలు ”


సీ:
హస్తవాసిగలిగి యందరు రోగుల 
బాధలన్నియుగూడ బాపువారు
వాస్తవమ్ముల దాచి భయములన్ బెంచుచు
దోబూచులాడుచు దోచువారు
కాలునేదన్నుచు గట్టియాయువునిచ్చి
నేలపై ప్రాణమ్ము నిల్పువారు
కాలనే దన్నుచు ఘనమైన విలువలన్
డబ్బునేయాశించు గబ్బువారు
తే.గీ:
నమ్మకమ్ముగ వృత్తినే నమ్మువారు
అవయవమ్ముల జాటుగా నమ్మువారు
కలరు వారలు వీరలు గనగ భువిని
వైద్యరంగాన మిగిలిన వాని వలెనె.
ఆ.వె:
తల్లిదండ్రి గురువు తదుపరి వైద్యుండు
దైవసముడు గాని ధరణిలోన
వైద్యరంగమాయె వ్యాపారరంగమ్ము
రోగి బ్రతుకు నేడు రోదనాయె.
ఉ:
డబ్బును గోరకుండ మరి డస్సిన రోగుల జేరదీయుచున్
జబ్బుల బారద్రోలగల చక్కని వైద్యులు కొంద రుండగా
జబ్బులుజూపి వైద్యమును జచ్చిన వారికి జేసి గుట్టుగా
డబ్బులుగుంజి చాటుగను డాకొనువారలు కొందరయ్యయో.
ఓ వైద్యుడా!
కం:
బెస్టుగ నాడిని బట్టుక
హిస్టరి జెప్పితివినాడు హేవైద్యుడ! వే
టెస్టులు జేయించెదవుగ
వేస్టుగ నేడేల నయ్య విను మామొరలన్.
ఆ.వె:
భిషకు పేరు జెరిపి పెర్వర్టుగాబోకు
హరివి పిండబోకు హార్టునెపుడు
వైద్యుడీవు గనుక వైలెంటుగాబోకు
"వెజ్జు " వీవు "నానువెజ్జు " గాకు.

Saturday, 21 April 2018

ప్రత్యేక హోదా - న.మో. నమహ


ప్రత్యేక హోదా - న.మో. నమహ 

కం: 
తెలుగుల సయామి కవలల 
తలుపులు మూయుచును కోసి తదుపరి సరి కో
తలనే మాన్పుట  కొరకై  
తలపైనను చేయరేల తలలే లేవా! 
కం: 
మోదెను హస్తము గతమున 
మోదీయే మోది నేడు మోసముజేసెన్
మోదము లేనేలేద   
మ్మో! దీనిని గనుచు నేపి(AP) మూల్గుచునుండెన్.   
కం: 
హెచ్చుగ నిచ్చితిమనునట 
ఇచ్చినదే బిచ్చమందు రిచ్చట, చూడన్
హెచ్చుల తచ్చుల లెక్కకు 
పిచ్చియె పట్టేను ప్రజకు వేదన హెచ్చెన్ 
కం: 
గోదాలో దిగుమన్నా
హోదా ప్రత్యేకత కయి ఓతెలుగన్నా! 
రాదారి కురికి పోరిన 
రాదామరి కోరు ఫలము, రయమున రారా!
కం: 
భేదములందరు మరచుచు 
మీదటనొకగొంతు గలిపి మేమొకటన్నన్
ఖేదము తొలగును, దమ్మే
మోదమ్మయి యాంధ్ర ప్రజల మోములు వెలుగున్.
కం: 
 హా! మీకే దయరాదా 
హామీలనె యమలు బరచ హస్తిన వారూ!
క్షేమమ న.మో. నమహ విను  
మేమే సింగములగుచును మీదకు రాగా?

కం: 
మట్టిని నీటిని మాకిడి
వట్టిగనే గాలిమాట బలుకుచు, నింగిన్
గట్టిగ నడిగిన జూతువ
పుట్టింతుము యగ్నినింక పుడమిని గనుమా! 

Friday, 20 April 2018

తెలుగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర - మన కర్తవ్యం

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 24-08-2017 న వ్రాసిన  పద్యములు.

పద్య పక్షం - 9 

తెలుగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర - మన కర్తవ్యం 

ఆ.వె. 
మాత  గాద మనకు మాతృభూమియుగూడ
దివిని మించుగొప్ప, తెలియు మనకు   
మాతృభాష గూడ మరిజూడ గొప్పదే 
మరువబోకు దాని మడువబోకు.  

ఆ.వె. 
చిన్నవారికెపుడు  నాన్న, అమ్మయుగాక
మమ్మి డాడియనెడు మాట నేర్పి   
తెనుగు భాషలోని 'తీపి'ని యణగార్చి 
పైకి 'చేదు' కొనకు పరులభాష. 

ఆ.వె. 
తల్లిపాలుమొదట పిల్లవానికి ప్రీతి 
ఒల్లకున్న బ్రతుకు డొల్లయగును 
'చేతవెన్నముద్ద' చేరిముందుగ బెట్టు   
'జానిజాని షుగరు' చాలు పిదప.  

కం. 
పాలునుబంచుక నొకటై  
పాలకులును చేరి కూడి పండితవరులే   
పాలుగొని తెలుగునకు  దీ 
పాలను వెలిగించవలయు భాషకు తోడై.  

ఉ: 
తీయగరాదు తెల్గునిక తీరుగ మాధ్యమమంచు  పాలకుల్  
మాయనుజేయు యాంగ్లమును మధ్యకు ప్రక్కకు నెట్టగావలెన్ 
తీయగ పద్యముల్ బలికి తీయని భాషను మెచ్చ  నేర్పుచున్  
మాయగ జేయగావలయు మమ్మియు డాడిల పిచ్చినే బుధుల్.

Thursday, 19 April 2018

సమాజ శ్రేయస్సు--నా కర్తవ్యం

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 13-08-2017 న వ్రాసిన  పద్యములు.



పద్య పక్షం - 8 

“సమాజ శ్రేయస్సు--నా కర్తవ్యం” 


కం: 
దేశమన మట్టిగాదని 
దేశమనగ మనుషులనుచు  తెలియగవలె నీ   
దేశమ్మేమిచ్చెననక 
దేశమునకు నీవిడునది తెలియుచు నిడుమా. 

కం:
ఎన్నికవేళల నేతల 
మన్నిక దలపోసి యెన్న మాన్యుడవీవే 
ఎన్ని కలలైన దీరును 
మన్నిక నీనోటవడక మను పాలనయే. 

మత్తకోకిల: 
ఈసురోమని నీరసింపకు మేదిసేయకనుండుచున్  
ఈస బోవనియాశతోడ  పరేశు దల్చుచు శ్రద్ధగా   
ఈసడింపక నేటి దుస్థితి మార్చగావలె బూనుచున్ 
ఈసమాజము నిన్ను మెచ్చగ నీయగావలె శ్రేయముల్.   
ఆ.వె. 
భేదభావములను విడనాడి స్ఫూర్తితో
స్వచ్ఛభారతమ్ము సాగుజేయ 
శ్రేయఫలములింక చేరుగా చేరువగ 
కర్మజేయుమింక ధర్మముగను. 

తేటగీతి:
దురలవాటను దారిలో దూరకుండ  
మంచి నడవడినేరిచి మహిని నిలచి 
ఒరులక్షేమమ్ము గోరుచు నోర్మితోడ
నాదుకర్తవ్యమిదియని నడువుమయ్య.    

Wednesday, 18 April 2018

మాదక ద్రవ్యాల మత్తులో యువత-నాశనమవుతున్న భవిత

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 27-07-2017 న వ్రాసిన  పద్యములు.



పద్య పక్షం - 7 


“మాదక ద్రవ్యాల మత్తులో యువత-నాశనమవుతున్న భవిత”

సీ:
గంజాయిదమ్మునే గట్టిగా నెగబీల్చి 
దిమ్ముగా నట్టిట్టు  దిరుగువాడ 
కొకెయిన్ను చాటుగా కొసరికొసరివాడి 
మత్తుతో మాటుగా  మసలువాడ 
ఆహెరాయిన్నునే యాబగా దట్టించి
మైకమ్ము మరిమరీ మరుగువాడ        
బ్రౌనుషుగరు రుచి బాగుబాగనుచును 
మంపునన్ జగమునే మరచు వాడ

తే.గీ: 
అట్టి దారులు బురదలో నణగద్రొక్కు 
మంచి దెలియుచు మార్గమ్ము మార్చుకొనుము  
ఆయురారోగ్యమందగా హాయికొరకు 
మత్తు వీడుచు జరుగు గ'మ్మత్తు' గనుము.  

    
కం: 
మత్తున దిగి స్వర్గమునకు  
బెత్తెడు దూరంబనుచును  ప్రేలుట మేలా?
చిత్తగుగా మీభవితయె
మొత్తమునకు నరకమందు ముందుకు దాటన్.      

కం: 
మారకమనుచును దెలిసియు
మారకమున చాటునగొని మత్తిడు పొడులన్  
మారక వాడినచో విను 
మా! రకరకములుగజంపు, మారిన సుఖమౌ. 
  
కం: 
డ్రగ్సవి రక్తము బీ'ల్చెడు'  
బగ్సవి, విడువని నరులిక బావిని నిలిచే 
ఫ్రాగ్సుర, భావిని మరచే  
రోగ్సుర మరిచెప్పలేను రోతర వినరా!    

ఉ:  
మానుము మత్తునన్ దిగుట,మాదకద్రవ్యములంట బోకుమా 
మానవదేని సొత్తులును మైకపు దేహమునందు సత్తువల్ 
మానసమందు శాంతియును మస్తుగ బోవును చెప్పకుండగా
మానని రోగముల్ గలుగు మానవ! మానవ? నీవు మానువా !   

Monday, 16 April 2018

విచ్ఛిన్నమౌతున్న వివాహవ్యవస్థ - సంతానంపై దాని ప్రబావం

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 07-07-2017 న వ్రాసిన  పద్యములు.

పద్య పక్షం - 6

విచ్ఛిన్నమౌతున్న వివాహవ్యవస్థ - సంతానంపై దాని ప్రబావం  

ఓ సతీపతులారా!
తే.గీ: 
అర్థనారీశ తత్వమ్ము నర్థమరసి
ఈశుపరివార వైవిధ్య మింత దెలిసి
సతియు పతియును కూడగా, జగతి  బ్రతుకు
కాదు భారమ్ము తీరుబంగారు కలలు.

విడిపోవాలనుకునే దంపతులారా?

సీ: 
స్వర్గమందు బడిన సరిముడి విడదీసి  
నరకము గోరంగ నురకనేల?
అడుగులేడు నడచి యలయక దిరుగుచు 
వేడుకల్ బంచగా  నేడుపేల? 
అందరుమెచ్చగా యగ్ని సాక్షి గలసి  
అంటించు కొందురే యగ్గినేల?
బంధమంచు మదిని బలముగా దలపక 
బంధనమని దల్చి పరుగులేల?
ఆ.వె:
మావిడాకుసాక్షి మనువాడి మధ్యలో 
మా విడాకు లచుచు మసలుటేల? 
ఒకరికొకరు మనసు నోర్పుగా దెలుపక  
పండువంటి బ్రతుకు వదలుటేల?

వేరుగా ఉండాలనుకునే తల్లిదండ్రులారా? 

ఉ: 
చక్కని బండికిన్ గలుగు చక్రములిద్దరు దాని తొట్టిలో  
మక్కువమీరగాను తగు మాలిమి పిల్లల జూచుకొందురే
మిక్కిలి సర్దుబాటులను మీరలు జేయక సర్ద "బాటలన్"
ఎక్కడికేగగావలెనొ యేవిధిబాల్యము నీడ్చుకొందురో? 

ఆ.వె: 
తల్లిదండ్రి జూడ పిల్లవారలకును  
కళ్ళురెండుగాదె, కఠినులగుచు 
వేరుబడుచు బోగ పిల్లలబంచుక 
నొంటికంటితోడ నోర్వగలరె?  

ఈ చివరి మాట వినండి....
కం:
భేదములుండుట సహజము
వాదములను బెంచుకొనక భార్యాభర్తల్
ఖేదముబంచక సంతుకు 
మోదముతో గలసియుండ ముచ్చటలొదవున్. 

Saturday, 14 April 2018

సర్కారు బళ్ళు - చదువుల గుళ్ళు?

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 29-06-2017 న వ్రాసిన  పద్యములు.


పద్య పక్షం - 5 

సర్కారు బళ్ళు - చదువుల గుళ్ళు?


ఆ.వె. 
బళ్ళు నాడు గనగ పంతుళ్ళు దైవాలు   
పిల్లలకునుజూడ గుళ్ళు నిజము 
గోడకుర్చిశిక్ష గ్రుద్దుళ్ళు మొట్టుళ్ళు 
సైచినేర్చినారు చదువులపుడు.  

కం.
ఇబ్బడుల నాడు జూడగ 
నిబ్బడిముబ్బడిగ జదివి రెందరొ ముదమున్
అబ్బాయిలునమ్మాయిలు 
నబ్బాయిప్పుడు కరవయి రటబడి జదువన్.   

కం.
ప్రైవేటు వేటు చేతను 
కావలసిన విధి సలుపని "ఘన" గురువులచే 
ఆవల నాంగ్లపు కుతిచే 
ఈవిధి సర్కారుబడులె యిటగూలబడెన్.  

ఉ:  
కాలము మారిపోయినది ఖర్చును సైతము లెక్కజేయకన్ 
మూలననున్న గ్రామమున ముచ్చటనొక్కటి పాఠశాలయే 
వీలుగనున్న కాదనుచు వేట్కగ పట్నపు "కానువెంటు"కే  
వేలనుబోసి పంపెదరు పిల్లల, "బళ్ళిక" సాగుటెట్టులో?     


సీ"
ప్రాథమిక దశలో బాలబాలికలకు
మాతృభాషనునేర్వ మనగ వలయు  
ఆంగ్లభాషను హింది యనువైన వేళలో  
నేర్పుగా దప్పక నేర్పవలయు  
ఆటపాటలతోడ నానందబరచుచు
మంచి యారోగ్యమ్ము బంచవలయు 
దేశభక్తి గరపి తీరుగా పిల్లల  
మంచి పౌరులుగాను మార్చవలయు   

ఆ.వె:     
కోరి పిల్లలకును గురువులందరుగూడి 
మంచి నడతనేర్ప మసల వలయు  
నిట్లుజేసినపుడు నెచ్చటనైనను 
బడులుగాన బడును గుడులవోలె.
  

Friday, 13 April 2018

తొలకరి చినుకులు - రైతుల తలపులు.

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 09-06-2017 న వ్రాసిన  పద్యములు.



పద్య పక్షం - 4 

తొలకరి చినుకులు - రైతుల తలపులు.  


వేడి తొలగించు తొలకరి చినుకులు..... 
ఉ: 
సూటిగ వేడిబాణములు సూర్యుడు వేయగ గుండెలయ్యొ, హా! 
బీటలు వారి క్షేత్రములు  బీడుగ మారగ ఝల్లుఝల్లనెన్ 
ఘాటుగవేడి మ్రొక్కగను గాలికి గాలియె మేఘమాలలన్ 
మీటుచు వచ్చి చల్లుచును మీకిదె పట్టుడు జల్లుజల్లనెన్.       

కం: 
కరి మబ్బులు దిరుగుచు తొల  
కరి చినుకుల పొలముజల్లి కర్షకులారా!
సరిలేచిరండు రండని  
మరి విత్తుల పొలము జల్లమన్నవి త్వరగా.   

చిరు చినుకులకు  రైతుల తలపులు...   

సీ:
కాడిమానును బూన్ చి జోడెడ్లనే లేపి  
ఏరువాకను సాగ నేగవలయు  
అదను జూచుచు భూమి పదునెక్కియుండగా 
తిన్నగా పొలమును దున్నవలయు 
గొర్రునే బట్టుక కోరి విత్తనముల  
చాలువెంటను బట్టి చల్లవలయు 
మాగాణి పొలమునన్ మడిగట్టి వడ్లతో
నారు పెరగజేసి నాట వలయు 

ఆ.వె:
బలమునీయ నెరువు బహు మంచిగాజల్లి
కలుపుదీసి "మట్టిగలప" వలయు   
చీడపీడ నుండి  చివరిదాకనుపంట  
కంటి రెప్పవోలె గావవలయు.

కం:
విత్తనములగన నకిలీ   
బిత్తరగాళ్ళిచ్చు మందు, పేర్లును నకిలీ 
హత్తెరి మా చేబడకను 
మొత్తము నసలందగాను మ్రొక్కుదుము శివా!

ఆ.వె:  
అంతపెట్టుబడిని యప్పులుగా దెచ్చి 
పొలమునందు మేము  బోతుమమ్మ  
ధరలు సరిగనిచ్చి ధర మమ్ము గావుమా 
అమ్మువేళ  నూకలమ్మ తల్లి.  

Wednesday, 11 April 2018

వృద్ధాప్యం - కష్ట సుఖాలు.

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 22-05-2017 న వ్రాసిన  పద్యములు.

పద్య పక్షం - 3

వృద్ధాప్యం - కష్ట సుఖాలు.  



కం: 
పుట్టెడు వారికి పుడమిని
పుట్టెడు కష్టములు గలుగు ముదిమినిననుచున్  
తట్టెడు తలపుల తలపకు  
తట్టెడు సుఖములు గలుగును తగుజాగ్రతతో. 

సీ:
బట్టతలగ, ముగ్గు బుట్టగా జుట్టౌను 
మసకబారుచు చూపు మందగించు 
చెవులు వినగలేవు చేరుచునరచిన 
గంధమందదయయొ ఘ్రాణమునకు   
గుండెబలము జూడ కుంచించుకొనిపోవు
నింతతినిన పొట్ట నిమడబోదు
అడుగు వేసినడువ నాయాసమేవచ్చు 
చేవలేక పనుల జేయలేము 

ఆ.వె: 
ముసలి వయసుననివి ముప్పిరిగొనునని
ముందుగానె భయము జెందవలదు
తనువు విధము దెలిసి తగుపథమ్మునరసి 
బ్రతుకవలయు భువిని భయములేక. 

తే.గీ: 
వయసునందున జేయని పనుల దలచి
చదువ గుదరని పొత్తముల్ చదువవలయు
తిరుగ గుదరని క్షేత్రముల్ తిరుగవలయు
చేయ గుదరని కార్యముల్ చేయవలయు.

చం:
ముదిమిని జేరుకొంటినని ముక్కుచు  మూల్గుచు నొంటిగాడివై 
కదలకనుండబోక పలు కార్యములెన్నియొ చేయవచ్చుగా
వదలక బాలబాలికల వద్దకు జేర్చుచు పాట, పద్యముల్
ముదముగ గాథలన్ దెలిపి ముచ్చటదీరగ నేర్పవచ్చుగా. 
  
కం:
లౌకిక విషయములన్నియు 
నాకిక ముదిమిని వలదని, నమ్ముచు మదిలో
లోకేశు ధ్యాస నిలిపిన 
చీకాకులు లేని బ్రతుకు చిక్కును గదరా. 

Tuesday, 10 April 2018

జలవనరుల సద్వినియోగం.

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 12-05-2017 న వ్రాసిన  పద్యములు.


పద్య పక్షం - 2

జలవనరుల సద్వినియోగం. 

ఆటవెలది:  
వేదమంత్రములను వేనోళ్ళజెప్పిరి 
జలము గొప్పదనము జనము వినగ 
జవము జీవమందు జనులకు జలమున 
జలము లేనినాడు జనము లేరు.  

ఆటవెలది: 
జగము వృద్ధినొందు జలసిరియేనిండ  
నీరు లేనినాడు నీరుగారు
కుండయైన నిండకుండగ నానీరు  
నిండుకున్న ధరణి నిండుసున్న. 

కందము: 
గంగను నెత్తిన దాచెను 
జంగమ దేవరయె, కనుడు సత్యము నీరే 
బంగారమనుచు దాచిన 
కంగారే కరవులపుడు కలుగదు వినరా! . 

ఉత్పలమాల:  
ఇంకుడు గుంటనొక్కటిని యింటికి దాపున గట్టి దానిలో 
నింకగ వాననీరు నిక నెక్కువ భాగము నిల్వజేయుమా  
ఇంకను కుంటచెర్వులనె యెక్కడికక్కడ బూడ్చబోక మా
కింకను బుద్ధియున్నదని యింపుగ జెప్పుమ ముందువారికిన్.   

సీసము: 
కట్ట బగులగొట్టి కట్టకుమాగూడు 
శ్రద్దజూపకనున్న చెరువు పూడు 
తుంపరసేద్యమ్ము తోషమ్ముతో వాడు   
బిందుసేద్యమ్మునే  విధిగ వాడు
వంటయింటను నీరు పరిమితముగ వాడు 
స్నానమాడెడువేళ సరిగవాడు 
పారు మురుగు చెట్లపాదులకే వాడు
వాననీరింకగా వసుధ  వాడు 

ఆటవెలది: 
నదుల చెరువు నీరు నానారకములుగ
కలుషితమ్ము గాని కరణి వాడు
వరములైన జలవనరులను సరిగాను  
వాడకున్న నీదు బ్రతుకు వాడు.    

Monday, 9 April 2018

కార్మిక సంక్షేమం.

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 21-04-2017 న వ్రాసిన  పద్యములు.


పద్య పక్షం - 1 

కార్మిక సంక్షేమం.

సీసము: 
బట్టనేయుట మంచి భవనముల్ గట్టుట 
గనులబొగ్గులతీత కల్లు గీత 
పాత్రలన్ జేయుట వాహనాల్ నడుపుట 
యంత్రనిర్మాణమ్ము లందుగూడ 
మరియు రోడ్లును రైలు మార్గాల పనులందు  
రకరకముల పరిశ్రమలలోన  
నగర శుభ్రతలోన నా " ఇస్రొ" ఘనతను 
పాలు పత్రికబంచు పనులలోన    
ఆటవెలది: 
ఇందునందు జూడ నెందేని తామయి 
కరమునే తమ పరికరము జేయు   
ఘనులు ధాత్రిలోన కార్మికులే గాద   
కదలు జగము వారి కర్మ వలన.   

ఉత్పలమాల: 
ఎండలుమండుచున్నవని యెక్కడ నీడను గోరబోడు, కూ
ర్చుండడు వానలున్నవని చూరున క్రిందను,ప్రొద్దుప్రొద్దునన్  
మెండుగ చల్లగాను చలి మేనును దాకిన నిద్రబోవడే 
దండిగ జేయుకష్టమును దాచక కాయము కార్మికుండహో!  
   
తేటగీతి: 
తెరచి మేధను విజ్ఞులు తెలియబరచి 
కలల సౌధమ్మునే జూప గాలియందు 
శ్రమను జేయుచు దానినే యమలుబరచి  
మనకు జూపింత్రు కార్మికుల్ కనులముందు. 


ఆటవెలది: 
'సాఫ్టు వేరు' గాగ శాస్తజ్ఞులీ భూమి   
గార 'హార్డువేరు' కార్మికులును  
వీరు వారనుచును వేరుగా దలపకు 
ప్రగతి వృక్షమునకు వారు వేర్లు. 

కందము: 
కార్మిక సంక్షేమమ్మొక 
ధర్మంబని దలచి ప్రభుత ధారుణిలోనన్    
కూర్మిని జేసిన, భవితయె 
నిర్మాణంబగు పసిడిగ నిజముగ గాదా! 

Saturday, 7 April 2018

పరమపదము లభ్యమగును పాపాత్ములకే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 11 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ




సమస్య - పరమపదము లభ్యమగును పాపాత్ములకే.



కందము: 
పొరబడి పాపము జేసియు
సరిపశ్చాత్తాపమంది సద్వర్తనులై 
హరినమ్మి వేడుకొనగా 
పరమపదము లభ్యమగును పాపాత్ములకే.

Friday, 6 April 2018

దొర-డబ్బు-అప్పు-వడ్డి ... తో ఋణగ్రస్తుని బాధ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 11 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది: దొర-డబ్బు-అప్పు-వడ్డి ... తో ఋణగ్రస్తుని బాధ


కందము: 
అప్పును గోరగ దయతో
నప్పుడె దొరగారె యిచ్చినారుగ లక్షన్ 
చప్పున డబ్బును, గానీ
తిప్పలె మరి చక్రవడ్డి దీర్చగ నెటులో. 

Wednesday, 4 April 2018

బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 11 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.  


ఆ.వె: 
గౌరవించబోను కన్నవారి, బుధుల 
ధర్మ మింత నేను ధరణిసేయ 
నాదిదేవు మదిని యసలు గొల్వననుచు 
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.

Sunday, 1 April 2018

వాహన చోదకులు - రహదారి భద్రత

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు జనవరి 2017 న వ్రాసి పంపిన పద్యములు.

మోటారు వాహన చోదకులు -  రహదారి భద్రత  
***************************************

ద్విచక్ర వాహన చోదకుడా!  

కందము: 
తలపై 'హెల్మెట్ 'బెట్టగ
తలపైనను జేయవేల, ధర జారిపడన్ 
తలనేల బట్టుకొందువు 
తల నేలను దాకి పగుల తదుపరి నరుడా!
********************************************

మోటారు వాహన చోదకుడా! 

ఆటవెలది: 
చేత " సెల్లు ఫోను " చెవిప్రక్కనుంచేవు
వాహనమ్ము నడుపు వాడ, నీవు
నీదు గమ్యమెటకొ నిర్ణయించగలేవు
తోటి వారి భవిత త్రొక్కగలవు. 
************************************

అర్హతబొందని చోదకుడా!  

చంపకమాల:
తగినటువంటి శిక్షణను తగ్గనియర్హత బొందకుండగన్
తగుదును నేనులేయనుచు తప్పుగ దారిని వాహనమ్మునే 
తగనటువంటి వేగమున దౌడును దీయుచు  సాగిపోవగా  
తగులును నీకు దెబ్బలిక దారినబోయెడు వారికైన, హా! 
*****************************************************


మత్తులో నదిపే వాహన చోదకులారా! 

తేటగీతి: 
మందు ద్రాగుచు నడుప నేమందురనుచు 
ముందు వెనుకల జూడకే ముందుకేగ 
దారులందున వాహన దారులార 
కాలయములిక మీరెగా నేలపైన.  
*****************************************

అనర్హులైన పిల్లలకు వాహనమిచ్చే తలిదండ్రులారా!

ఉత్పలమాల:
అల్లరిజేసినారనుచు హాయిగ వాహనమిచ్చి పంపగా
నెల్లలుదాటు మోదమున నెక్కుచు ముందుకు ప్రక్క జూడకన్ 
పిల్లలు వేగవంతముగ వేడ్కను వంతులు వేయుచుంద్రుగా
తల్లులు తండ్రులా?  సుతుల దక్కని చోటునకంపువారలా ?    
********************************************************
రోడ్డు దాటాలనుకునే వాడా !

కోబ్రాలా కనుపించెడి
ఈబ్రాడ్ రోడ్ దాట చింత యేలా, వినుమా!
జీబ్రా క్రాసింగ్ జేరుచు 
గాబ్రానే బడక నీవు గబగబ నడుమా! 
**************************************************
కారులో షికారు కెళ్ళే వాడా! 

జోరుగ నడుపుచు కారు షి 
కారుగనే వచ్చినట్టి ఘనుడా, కనుమా!
తీరుగ సీట్ బెల్ట్ బెట్టుము 
మీరిన వేగమ్ము ద్దు, మించకు హద్దున్.   
*************************************************
 రహదారి భద్రతకు ఈ సూత్రాలు పాటించుమా! 

సీసము:
చరవాణిమ్రోగగా చక్కగానొకప్రక్క
         నాగిమాటలనాడి సాగవలయు 
మద్యమ్ము మత్తులో మతిచెడు గావున 
        నేబండి నడుపక నుండవలయు 
కనగ ద్విచక్ర వాహనదారులెల్లరున్  
        తల శిరస్త్రాణమున్ దాల్చవలయు
యంత్రపు శకట నియంత్రణన్ దెలిసిన 
        నరుడె వాహనమింక నడుప వలయు  

తేటగీతి: 
తెలిసి భద్రత విషయముల్ తెలివి గలిగి
ప్రజలు చక్కని దారిలో బడగ వలయు
నడుపువారలు, దారిలో నడచు వారు
పడక దారిని సుఖములు బడయ వలయు.  
******************************************************