తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 31 December 2015

వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు



ఆటవెలది: 
బాడి బిల్డరగుచు పదిమందిలో నిలచి 
చేతికండరములు సిక్సు ప్యాకు 
పొట్ట ఛాతి త్రిప్పి పొంగించుచు తిరిగి 
వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు

Monday, 28 December 2015

అద్దరినీ జేర్చమనీ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - అద్దరినీ జేర్చమనీ 





















కందము: 
దరిజేరిన మమ్ములనే 
దరిజేర్తువుగాద రామ ! దాశరధీ ! య 
ద్దరిజేర్చగ రమ్మని నీ
దరిశనమేయిచ్చినావు దండము తండ్రీ ! 

Sunday, 27 December 2015

ఏలూరుననుండు వారలెల్లరు కవులే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - ఏలూరుననుండు వారలెల్లరు కవులే



కందము: 
కాలంబప్పుడు చూడ, ర 
సాలూరగ కాళిదాసు సభలో కవియే 
మేలుగ భోజ మహారా 
జేలూరున నుండు వారలెల్లరు కవులే. 

Saturday, 26 December 2015

పైవి లేని వాడు పైకి వచ్చు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - పైవి లేని వాడు పైకి వచ్చు



















సీసము: 
తండ్రికి కనిపించు తప్పుడు విద్యార్థి 
డబ్బు తగులవేయు సుబ్బడి వలె 
తల్లికి కళ్ళలో ధనరాశి వలె దోచు 
కట్నమ్ము దోచెడు కనక బాబు 
నాయకమ్మన్యుల నయనాలలో వాడు 
జేలు కొట్టు వట్టి కీలుబొమ్మ 
పాఠాలు నేర్పెడి పంతులు గారికి 
నడ్డ గాడిదవలె నగుపడుగద 

ఆటవెలది: 
చిలిపి పనుల తోడ చినదాని కగుపించ 
కోతి చేష్టలనుచు కొక్కిరించు 
లెక్కలోననిడడు ప్రక్క వాడునుగూడ 
పైవి లేని వాడు పైకి వచ్చు. 

Friday, 25 December 2015

.రాముని భార్యలకు నింద రానే వచ్చెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రాముని భార్యలకు నింద రానే వచ్చెన్.



కందము: 
ఏమని చెప్పుదు గాధలు 
కామముతో సలుపుపనుల కతననపుడు సు 
త్రాముడు నగ్ని వలననే 
రా ! ముని భార్యలకు నింద రానే వచ్చెన్.

Thursday, 24 December 2015

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా 








కందము: 
చల్లని వానయె కురియగ 
జల్లుగనే మోము మీద చాలా ముదమే 
ఝల్లను మనసే, తడవగ 
పిల్లలవలె నాట్యమాడు పెద్దలు నిజమే ! 

కందము: 
ఇన్నాళ్ళకు గుర్తొచ్చా
చాన్నాళ్ళకు వచ్చినావె చప్పున వానా 
నిన్నే చుట్టములాగా 
చెన్నుగనే చేరదీయ చేతుల నిడితిన్.

Wednesday, 23 December 2015

మం " గళం " పల్లి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - మం " గళం " పల్లి 





























సీసము: 
పంచరత్నములను పరవశమ్మున బాడి 
త్యారాజును మన తలపు నింపు 
రాముని కీర్తనల్ రమ్యంబుగా పాడి 
అలనాటి గోపన్న యార్తి పంచు 
తిల్లాన జల్లులే తీపిగా కురిపించి 
ప్రేక్షకజనముల ప్రీతి ముంచు 
కర్ణాట సంగీత గానమ్ము తలపగా 
తనదు రూపమెమన తలను నిల్చు 

తేటగీతి: 
పేరునందునబాలుండె పెద్ద పేరు
వాద్యమున్నది పేరులో వాక్కు తీపి
గీతజెప్పిన వాడె సంగీతమందు
మంగళంబగు నాగళ మహిమనెన్న.

Tuesday, 22 December 2015

కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్.



కందము: 
చక్కగ సాఫ్ట్వేరొక్కడు 
కొక్కొరొ, కూకూ, ల కూత కోరుచు జేసెన్ 
చిక్కులు జరుగగనందున 
కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్.


పిల్లలు అల్లరి చేస్తూ అరిచిన కూతలు...

కందము: 
కిక్కీ యని కాదంబరి 
విక్కీ, తేజస్వి కలసి పిపిపీ యనుచున్ 
కుక్కూ యనుచును కోమలి 
కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల, కూసెన్.

Monday, 21 December 2015

మంచి విద్యల నేర్చుట మానవలెను.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మంచి విద్యల నేర్చుట మానవలెను.



హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో...

తేటగీతి: 
మించి తలచుట మనమున కొంచెమైన 
విడువకుండగ పూజించ విజ్ఞతయని 
మంచి చదువంచు హరిగాధ మదిని నిడకు 
మంచి విద్యల నేర్చుట మానవలెను.

Sunday, 20 December 2015

గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్.




కందము: 
నిర్భ యమందగ నరులకు  
దుర్భర తిమిరమ్ము తాను తొలగించునురా 
అర్భక సాగర ! సాగర 
గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్.

Saturday, 19 December 2015

సవతి లేని యింట సౌఖ్యమేది

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సవతి లేని యింట సౌఖ్యమేది



ఆటవెలది: 
హరికి సిరులరాణి మరియొకరు ధరణి 
భార్యలగుచు నొప్పు భాగ్యమొప్ప 
పుడమినున్న మనకు గడువగ భూదేవి 
సవతి లేని యింట సౌఖ్యమేది?

Friday, 18 December 2015

ఆకలి కవి (త)

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం:ఆకలి కవి (త)  



















తేటగీతి: 
కొట్టుకెళ్ళుదు తెత్తును కొబ్బ,రెండు 
మిరపకాయలు, మిరియాలు, మినపగుండ్లు
చింత పండును, బియ్యమ్ము, మెంతులున్ను 
అప్పు పెట్టిన మనశెట్టి యొప్పుకున్న 

Thursday, 17 December 2015

కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా.



ఉత్పలమాల: 
ఆకఠినాత్మురాలి మది యాశలు సాగగనీకు దైవమా 
మా కనుచూపు వీడు, మరి మమ్ములవీడిన సైపలేమయా 
శ్రీకర యంచయోధ్యపురి చిన్నలు పెద్దలు బాధతోడ లో 
కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా.

Wednesday, 16 December 2015

పిల్లి, పిల్ల

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - పిల్లి, పిల్ల  






















కందము: 
మెల్లగ రావే నాతో 
పిల్లీ, మాయమ్మ నాకు పిలచుచు నిచ్చున్
చల్లని పాలను, నీకును 
బుల్లీ నేనిత్తు నింక బుజ్జీ రావే !

Tuesday, 15 December 2015

మూగవాడు పాడె మోహనముగ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మూగవాడు పాడె మోహనముగ



ఆటవెలది: 
పట్నమందు జేరి పలువురు దిరుగాడు 
వీధి నడుమ నొకడు వేడుకొనుచు 
డప్పుగొట్టి పిలువ చప్పున పదిమంది 
మూగ, వాడు పాడె మోహనముగ. 

Monday, 14 December 2015

కప్పల పెండ్లి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - కప్పల పెండ్లి 























కందము: 
కప్పల పెండ్లిని జేయగ 
గప్పుచు నాకాశమంత కరిమేఘములే 
తెప్పలుగ చెరువు నిండగ 
నప్పుడె వానల్లు గురియు నిజమది వింటే. 

Saturday, 12 December 2015

విస్కీత్రాగి యవధాని వెస సభ కేఁగెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - విస్కీత్రాగి యవధాని వెస సభ కేఁగెన్.



కందము: 
మాస్కోలో చలియున్న న 
మస్కారము మీకననుచు మర్యాదకునై 
బిస్కెట్ కాఫీ, వలదని 
విస్కీ- త్రాగి యవధాని వెస సభ కేఁగెన్.


అసెంబ్లీకి వెళ్ళే ఎస్కే అవధాని అను ఒక ఎమ్మెల్యే గురించి.... 

కందము: 
ఎస్కే. అవధాన్యమ్మె
ల్యే, స్కాములలోననతడు నిన్వాల్వయ్యెన్
మస్కాగొట్టగ మాటల
విస్కీ త్రాగి యవధాని వెస సభ కేఁగెన్.

కందము: 
ఇస్కా నాం హై అవధా 
నీ, స్కూలున చదవలేదు, నేడెమ్మెల్యే 
మస్కా గొట్టును బాగుగ 
విస్కీ త్రాగి యవధాని వెస సభ కేఁగెన్.





Friday, 11 December 2015

భూకైలాస్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - భూకైలాస్. 





















తేటగీతి: 
ఆత్మలింగమ్ము భూమిలో నణగి పోయె 
వ్యర్ధమౌనయ్య నీశక్తి నాపుమింక 
క్షితిని గొప్పగ గోకర్ణ క్షేత్రమగుచు
వెలయు రావణ నీపేరు వెలుగులీను.

Thursday, 10 December 2015

రవికవిప్పి డాసె రమణి యతిని.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.





సమస్య - రవికవిప్పి డాసె రమణి యతిని.





ఆటవెలది: 
మడినిగట్టువారె మరి పాదపూజకు 
అర్హులనుచు జెప్ప నచటివారు 
కట్టి మడిని తాను కట్టిన చీరెయు 
రవికవిప్పి, డాసె రమణి యతిని.

Wednesday, 9 December 2015

మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్



కందము: 
తీరగు ధర్మము నెరుగుచు 
మారినచో తీవ్రవాద మంతమ్మగుచో 
నోరామా ! జరుగదెపుడు 
మారణహోమమ్ము, కూర్చు మహిలో శాంతిన్

Tuesday, 8 December 2015

పాలుత్యజించి నీరమును పాన మొనర్చును హంస లెప్పుడున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పాలుత్యజించి నీరమును పాన మొనర్చును హంస లెప్పుడున్



ఉత్పలమాల: 
చాల విశేషమే వినగ సాధ్యమదెట్టులొ చూచినారటే 
పాలను నీటినే గలిపి ప్రక్కన నుంచిన చెంతజేరి లో 
పాలను చూపబోక తమపాలుగ ద్రావగ వేరుచేయుచున్ 
పాలు, త్యజించి నీరమును, పాన మొనర్చును హంస లెప్పుడున్

Monday, 7 December 2015

శంతనుడు,మత్స్యగంధి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - శంతనుడు,మత్స్యగంధి 






















కందము: 
శంతనుడందురు నన్నే 
చెంతనునువు లేక నాకు చెలియా రాజ్యం 
బింతయు పట్టదు, పట్టుదు 
నింతీ ఓ మత్స్యగంధి యిదె నీ చేతిన్. 

కందము: 
నామీదాశను బడితివి 
స్వామీ శ్రీ దాశరాజు సరి నాపిత, నే 
నేమీ కోరను, యొప్పుగ 
నే మీదానగనె యడుగు నెవ్విధినైనన్.

Sunday, 6 December 2015

కాకి కాకిగాక కేకి యగునె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కాకి కాకిగాక కేకి యగునె.



ఆటవెలది: 
కేకిజూచి కాకి కాకతో కేకీక 
కోక జేసి కట్టి కూత గూయ 
"కాక కాక " గాక కేకికేకలగున 
కాకి కాకిగాక కేకి యగునె ?

Saturday, 5 December 2015

వామన గుంతలాట

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - వామనగుంతలాట 


















కందము: 
ఏమని చెప్పుదు నిప్పుడు 
' మీ, మా ' సీర్యళ్ళ టీవి మెచ్చెడు వేళన్ 
ప్రేమగ నొకచో జేరుచు 
వామనగుంతల నెయాడు వనితలు గలరే ?

Friday, 4 December 2015

చేతకానివాడు శ్రీహరి యట

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - చేతకానివాడు శ్రీహరి యట



ఆటవెలది: 
ధర్మ హాని జేయు దనుజుల పాలిటి 
సింహ స్వప్న మగుట చేత, వారి 
పనులు సాగనీక పరిమార్చు చుండుట 
చేత, కాని వాడు శ్రీహరి యట

Thursday, 3 December 2015

కర్ణుడెద్దునెక్కి కంసు జంపె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  16 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - కర్ణుడెద్దునెక్కి కంసు జంపె




ఆటవెలది: 
ఇంతి కుంతి బట్ట నినసుతు డెవ్వడు ?
హరుడు దేనినెక్కి తిరుగునయ్య ?
వెన్నుడెవనిజంపె పిడికిలి తానెత్తి ?
కర్ణు - డెద్దు నెక్కి- కంసు జంపె.

Wednesday, 2 December 2015

భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్.  



కందము:
ప్రీతిగ మనసున దలచుచు 
చేతులనే మోడ్చి గొల్వ జేజే లనుచున్ 
వాతాత్మజు, తొలగించును 
భూతప్రేతముల, పూజ మోక్షము నొసఁగున్.

Tuesday, 1 December 2015

అన్నమో రామ్మా...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - అన్నమో రామ్మా...






















ఆటవెలది: 
ఎత్తుకెళ్ళగలిగె నీయన నామెను 
కూడు బెట్ట మనుచు, చూడ నిపుడు 
పిన్నిగారి భర్త పిలుచుటకే నోరు 
రాక నీరసమున వ్రాలియుండు.