తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 30 November 2015

నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ. 




కందము: 
మీరిన వయసున తీరని 
కోరికలే రేగెనంచు కోమలి కొరకై 
చేరుచు వెదకుచు నొక చి
న్నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ.

Sunday, 29 November 2015

ముక్కలాట


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - ముక్కలాట 





















కందము: 
ఆక్కౌంటున బ్యాలెన్సును 
ముక్కొక్కటి చెప్పమంటి మూణ్ణిమిషాలా? 
ముక్కలె చూచుచునుంటిని 
ముక్కేదియొ బోధపడక మూల్గుచునుంటిన్ !

కందము: 
ఒక్కటె ముక్కన జెప్పుము 
చెక్కిచ్చితి పైకమిందు జేరెన మేడం ? 
చిక్కులు ముక్కలతోనే 
ముక్కొక్కటి తేల్చలేక మూడాఫాయెన్ !

Saturday, 28 November 2015

సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.



కందము: 
ఆరామదాసు చెప్పెను 
మారాముని నామమన్న మధురంబనుచున్ 
రారా ! నామపు రుచి మన 
సారా గ్రోలంగ, జన్మ చరితార్థ మగున్.

Friday, 27 November 2015

లాగూ..లాగూ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న చిత్రం - లాగూ..లాగూ






















కందము: 
లాగును కట్టితివిటనీ 
లాగున నీబ్రతుకునీడ్వ లాఘవముననే 
లాగుచు నుంటివి బండిని 
లాగించక తప్పదుగద లాగుమలాగే ! 

Thursday, 26 November 2015

కమలము ముకుళించె సూర్యకరములు సోకన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కమలము ముకుళించె సూర్యకరములు సోకన్.



కందము: 
తిమిరాంతకునే మునిస 
త్తముమంత్రపు మహిమ జూడ దరికే పిలిచెన్ 
రమణీ యన కుంతీ ముఖ 
కమలము ముకుళించె, సూర్యకరములు సోకన్.

Wednesday, 25 November 2015

పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున.




తేటగీతి: 
పడుచు ప్రాయమునందున పడితివెన్నొ
కష్ట నష్టాలు కాలమ్ము గడచిపోయె
మాధవుని గొల్వుమనుచును మనసు వెంట
బడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున.

Tuesday, 24 November 2015

పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్. 



కందము: 
విందులు నాకెందుకులే 
విందురె నే జెప్పుచుంటి వేడిగయన్నం
బందున నెయ్యావయు ప
ప్పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్. 

Monday, 23 November 2015

తలపెట్టెలు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - తలపెట్టెలు. 


కందము: 
తల 'పెట్టగ' చదువుల నీ 
'తలపెట్టెలు' పెట్టినారు తలలకు ముందే 
తల 'పట్టున' చదువులు మరి 
'తలపట్టక ' ముందుముందు దారుణ మగునో !   

తలపెట్టె = కంప్యూటరుకు నా తలను పుట్టిన పేరు

Sunday, 22 November 2015

తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.



తేటగీతి:
మంచి దారిని చూపగా మానవులకు
ప్రథమ గురువులు తలిదండ్రి వసుధ లోన
దారిదప్పిన వారల దరిని వారి
తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.

Saturday, 21 November 2015

మిరపకాయ బజ్జీలు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం: మిరపకాయ బజ్జీలు.



















కందము: 
బజ్జీలను తినగా సమ 
ఉజ్జీలే జేరిరిచట నూరగ నోరే !
బుజ్జీ! త్వరగా వేయుము 
పిజ్జాలను మరచి నేడు పిల్లలు వచ్చెన్. 

Friday, 20 November 2015

పరిహాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  31 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - పరిహాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్



కందము: 
సరివారు, కానివారలు 
సిరులే లేనట్టివారు శ్రీమంతులునున్ 
దరిజేర జూచి తానొక 
పరి,హాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్

Thursday, 19 November 2015

ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  30 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్.



ఉత్పలమాల: 
శారద మాతనే దలచి సాధ్యము గానిది లేదటంచు నా 
పూరణ లన్ని జేసి ఘన పూరుషుడన్న టువంటి పేరుతో 
ధారణజూపి, పండితుల వద్దకు జేరిన నొక్క తప్పు ని 
ర్ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్.

Wednesday, 18 November 2015

అమ్మా..యీ ! పూలను గొను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - అమ్మా..యీ ! పూలను గొను





















కందము: 
అమ్మమ్మ పూలనమ్ముట
అమ్మమ్మా తప్పుగాదదాకటికొరకే 
అమ్మాయీ ! పూలను గొను
మమ్మా ! యీ పేదరాలి నాదుకొనమ్మా !

Tuesday, 17 November 2015

రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్.



ఉత్పలమాల: 
సంభవమిద్దిగాదనుచు సందియమందకు మెంచిచూడగన్ 
శంభుని విల్లు వంచి ఘన జానకి బట్టెను నొక్క రాత్రి తా 
స్తంభముప్రక్కనుండ - మది దల్పక నూర్వశి మేనకన్ మరిన్ 
రంభను- జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్.

Monday, 16 November 2015

కొమ్మ చేయి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - కొమ్మ చేయి 

















కందము:
కొమ్మకు చేతులు పండెను 
కొమ్మల గోరింట దూసి గోటికి బెట్టన్ 
గుమ్ముగ చేతులు నిండెగ 
నిమ్ముగ నే గాజులెల్ల నిరవుగ తొడగన్

Sunday, 15 November 2015

తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరసెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరసెన్



కందము: 
తారట్లాడుచు గన వ 
స్తారో రారోననుచును, సరగున నపుడే  
తీరగు సినిమా సభలో 
తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరసెన్


Saturday, 14 November 2015

పాపము చేయంగవలెను భాగ్యము నందన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - పాపము చేయంగవలెను భాగ్యము నందన్.




కందము: 
పాపము చేసెను గనుకనె 
శాపము దగిలెను దరిద్ర జనులకటంచున్
కోపము జెందక సాయము 
పాపము, చేయంగవలెను భాగ్యము నందన్.

Friday, 13 November 2015

పండ్లతో ఇండ్లు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - పండ్లతో ఇండ్లు 




















కందము: 
పండ్లును కూరలు నారల
నిండ్లను గట్టెడు విధంబు నివ్విధి గంటిన్
కండ్లకు విందుగ నాయెను
పండ్లను కొరుకంగ బోక పరికించుడయా ! 

Thursday, 12 November 2015

కాకిని బెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కాకిని బెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో




ఉత్పలమాల: 
కాకని చెప్పుచుండ మరి కాకని దల్చకు కాకనంగ నే 
కాకియుగాదు పేరుగన "కాకరపాదుల కిట్టమూర్తి" యే 
కాకియుగూడ గాదు విన కాకని బిల్తురు నిట్టి వాని నీ 
"కాకి"ని బెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో

Wednesday, 11 November 2015

అందరికీ దీపావళి శుభాకాంక్షలు.









కందము: 
ఆకటిక పేద లందరి
యాకటి బాధలకునంద నాహారమ్మే
చీకటి బ్రతుకుల వెలుగు త 
దేకముగా గలుగ నాడు దీపావళియే. 

Monday, 9 November 2015

పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె



తేటగీతి: 
పిల్లి పాత్రకు కార్టూను పిక్చరందు 
ఎలుకపాత్రకు డబ్బింగు నిరవుగాను 
చెప్పు వారలు నొకచోట చేరి కలియ 
పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె

Sunday, 8 November 2015

లాడెను చేయిపట్టుకొని లాగెనుద్రౌపది కౌగలింతకై.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - లాడెను చేయిపట్టుకొని లాగెనుద్రౌపది కౌగలింతకై. 



ఉత్పలమాల:
వీడను నిన్ను పొందకను, వీడిని కీచకుడందురే సఖీ
నీడగనీదు వెంటబడి నిక్కము కోర్కెను దీర్చుకొందునే
వీడిని బొంద సౌఖ్యములు పెక్కగు నీకని, వ్యర్థ భాషణా
లాడెను, చేయిపట్టుకొని లాగెను, ద్రౌపది కౌగలింతకై. 

Friday, 6 November 2015

నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే



కందము: 
వెలుగులు చిందెడు మోమున
తిలకమ్మును దాల్చివచ్చె  దేవళమునకున్ 
అలజూడుడు గుడిచుట్టును 
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే

Thursday, 5 November 2015

కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్.




కందము: 
సంపత్కుమార ! వ్రాయుము 
'కుంపటిలో నొక్క కుక్క కూనల నీనెన్.'
సొంపుగ వ్రాసితి చూడుము 
'కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్.'

Wednesday, 4 November 2015

వర్షంలో పిల్లలు.



శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - వర్షంలో పిల్లలు. 

















కందము: 
జల్లుల తడిసెడి వేళల 
పిల్లల నేత్రంబులందు వెలుగులు చిమ్మున్ 
చల్లని హర్షపు జల్లులు 
మెల్లగ నా వర్షమందు మేలుగ కలియున్. 

Sunday, 1 November 2015

చేప చన్నులలో బాలు చెంబె డన్ని

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - చేప చన్నులలో బాలు చెంబె డన్ని



తేటగీతి: 
చేతి లోనుండి నీటిని చేర్చి కొట్టి 
పొదుగు గడుగుచు చన్నుల పుష్టి జూచి 
పిండ బూనుము గోమాత ప్రీతి పాలు 
చేప, చన్నులలో బాలు చెంబె డన్ని