తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 29 January 2012

రాహు కాలాన వెడల గార్యము సఫలము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


           సమస్య - రాహు కాలాన వెడల గార్యము సఫలము



తేటగీతి: 

విఘ్న మన్నది లేకుండ విజయమంద
మంచి చెడ్డలు గమనించి మసలు కొనుడు
రాహు కాలాన వెడల గార్యము సఫలము
కాదు, నిజమది తెలియగ గనుడు  మీరు. 

Saturday, 28 January 2012

భార్యలిద్దరు శ్రీరామ భద్రునకును

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

             
              సమస్య -  భార్యలిద్దరు శ్రీరామ భద్రునకును


 తేటగీతి:

విజయ నగరపు సామ్రాట్టు  విజయమంది
రాయలప్పుడు నగరికి రాగ, రయము
మ్రొక్కు దీర్చిరి వేడ్కను మోదమలర
భార్యలిద్దరు శ్రీరామ భద్రునకును. 

Friday, 27 January 2012

బిడ్డ గన్నతల్లి గొడ్డురాలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                     సమస్య - బిడ్డ  గన్నతల్లి   గొడ్డురాలు

 ఆటవెలది:

పడతి నెలలు నిండ ప్రసవించు నెవ్వరి ?
ప్రసవ మిడిన ముదిత పాప కెవరు?
సంతు లేని ఇంతి చక్కటి పేరేమి?
బిడ్డ  గన్నతల్లి   గొడ్డురాలు.  

Thursday, 26 January 2012

కన్నులలో జన్ను లమరె కాంతా మణికిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


            సమస్య - కన్నులలో జన్ను లమరె కాంతా మణికిన్

 కందము: 

సన్నగ వరుడటు జూచిన
కన్నులలో జన్ను లమరె, గాంతామణికిన్
చెన్నుగ సిగ్గులు మొలిచెను
చిన్నా!యిటు జూడ కనుచు చెంగును గప్పెన్. 

 కందము:

అన్నలుసు బడినదెక్కడ?
కన్నా! మగమేక గొంతు కచ్చట వేమో?
చిన్నా! మెట్టెల వెవరికి?
కన్నులలో- జన్ను లమరె - కాంతా మణికిన్.

Wednesday, 25 January 2012

గొప్ప వారి కుండు గొంచె బుద్ధి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


        సమస్య - గొప్ప వారి కుండు గొంచె బుద్ధి


ఆటవెలది:

కొంత మంది జూడ వింతగా నుందురు
ఒరుల మాట వినరు ఓర్పు తోడ
అందు రెపుడు మేము 'అందరి కన్నను
గొప్ప' - వారి కుండు గొంచె బుద్ధి.

Tuesday, 24 January 2012

గుఱ్ఱానికి నైదు కాళ్ళు కోడికి వలెనే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

 సమస్య - గుఱ్ఱానికి నైదు కాళ్ళు కోడికి వలెనే

కందము:
కుఱ్ఱాడ! తలలు శ్రీహరి
గుఱ్ఱానికి నైదు, కాళ్ళు కోడికి వలెనే
మఱ్ఱాకు పైన వేసెను
బుఱ్ఱా వారిటుల క్రొత్త బొమ్మను గనుమా. 

కందము:
 
జెఱ్ఱికి కాళ్ళకు చెప్పులు
గుఱ్ఱానికి నైదు కాళ్ళు, కోడికి వలెనే
గొఱ్ఱెకు బఱ్ఱెకు యీకలు
కుఱ్ఱాడట గీసి జూపె కోతికి కొమ్ముల్.  

Monday, 23 January 2012

సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


 సమస్య - సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్.

 కందము:

సంపద ఆరోగ్యమ్మే
సంపద మరి ప్రేమ,  మనకు సంతోషమ్మే
సంపద, వాటిని జెరిపెడి
సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్. 

Sunday, 22 January 2012

దృఢ సత్వంబున జీమ తుమ్మె గదరా దిగ్దంతులల్లాడగన్

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

 సమస్య - దృఢ సత్వంబున జీమ తుమ్మె గదరా దిగ్దంతులల్లాడగన్

డుఢు-ఢూ అనే రెండు చీమల పెండ్లి గురించి తీసిన కార్టూన్ ఫిల్మ్ లోని ఒక సన్నివేశం ..నా ఊహలో..

ఉత్పలమాల:

'డుఢు,ఢూ చీమల పెండ్లి 'యంచు నొక  కార్టూన్ ఫిల్ము; అందొక్కచో
డుఢు,ఢూ ప్రక్కన శాస్త్రి గారు వడి పట్టున్ పట్టె నశ్యంబునే
డుఢు నాసంబుల రేగి దూరి తెగ ఘాటున్ పుట్టి మంటెత్తగా
దృఢ సత్వంబున జీమ తుమ్మె గదరా దిగ్దంతులల్లాడగన్.

Saturday, 21 January 2012

కలిమి గలిగించు కలకంఠి కంటి నీరు.

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

           సమస్య - కలిమి గలిగించు కలకంఠి కంటి నీరు.

 తేటగీతి:

భర్త 'యెమ్మెల్యె'  చనిపోగ  భార్య నిలచి
పోటి జేసెను ఏడ్చెను  సీటు కొరకు
కరుణ జూపెను ఓటరు గాన గెలిచె
'కలిమి గలిగించు కలకంఠి కంటి నీరు.'

తేటగీతి:

బయట వ్యాపారములు జేయ బాగు గాను
కలిమి గలిగించు, కలకంఠి కంటి నీరు
యింట గార్చిన యిల్లాలి యేడ్పు వలన
కదలి పోవును చెప్పక కలుములన్ని.  

Friday, 20 January 2012

వంక బెట్ట దగును శంకరునకు.

కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                
                     సమస్య -  వంక బెట్ట దగును శంకరునకు.

          ఆట వెలది:
భక్తి మనసు నిండ పరమేశు దలచుచు
పద్య మొకటి చెప్పి ప్రస్తుతించ

నీమమేమి లేదు నిందాస్తుతులు జెప్పి
వంక బెట్ట దగును శంకరునకు.

చిట్టి పొట్టి బొమ్మ లిట్టుల సర్దుము
ముందు వైపు నిడుము స్కందు నిటుల
కరి ముఖుని కుడి మరి గిరితనయ నెడమ
వంక బెట్ట దగును శంకరునకు.



 

Thursday, 19 January 2012

కవిని పెండ్లి యాడి కాంత వగచె.

కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


          సమస్య -  కవిని పెండ్లి యాడి కాంత వగచె.

 ఆట వెలది: 

కలికి కూర లడుగ కంద పద్యము జెప్పు
పాత్ర లడుగ సీస పద్య మిచ్చు
పూల నడుగ నుడువు పూని చంపకమాల
కవిని పెండ్లి యాడి కాంత వగచె. 

Wednesday, 18 January 2012

దేశము మాకు వద్దనెడి తెంపరులే మన జాతి రత్నముల్.

కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


సమస్య -  దేశము మాకు వద్దనెడి తెంపరులే మన జాతి రత్నముల్. 


 ఉత్పలమాల: 

దేశము దోచుకుందమిక దేశము ముక్కలు జేసుకుంద మా
కాశము హద్దు, నేడిటుల కాసులు 'స్విస్సున' దాచుదామనున్
దేశము కోసమే బ్రతికి, దేశము కిత్తును ప్రాణమన్న సం
దేశము మాకు వద్దనెడి తెంపరులే మన జాతి రత్నముల్.  

Tuesday, 17 January 2012

విద్య యొసగునే వినయంబు వెఱ్ఱిగాక

కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

  
సమస్య - విద్య యొసగునే వినయంబు వెఱ్ఱిగాక

తేటగీతి:

బుద్ధి,సుద్దులు నేర్పెడు విద్దె వదలి
శాస్త్ర విజ్ఞాన, గణితము చాలు ననుచు,
బట్టి బట్టుచు 'నాబ్జెక్టు' బాట నడువ;
విద్య యొసగునే వినయంబు వెఱ్ఱిగాక!

Monday, 16 January 2012

మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి.

కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
  

సమస్య - మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి.


 తేట గీతి: 


బుర్ర మీసాలు బానెడు బొర్ర యున్న 
తాత వద్దకు చనువుగ తరలి వెళ్ళి
నిమ్మకాయలు నిలబడు నిజము అనుచు
మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి.  

Sunday, 15 January 2012

కరము లెత్తి మ్రొక్కు మరుణ కిరణు.

         వీక్షకులందరకు 
         మకర సంక్రాంతి 
         శుభాకాంక్షలు.

ఆట వెలది:

 సకల శుభ  కరమ్ము సౌభాగ్యకర క్షేమ
కరము వరము లిచ్చి కరుణ జూచు
మకర సంక్రమణము మనకు  హిత కరము 
కరము లెత్తి మ్రొక్కు రుణ కిరణు. 

Saturday, 14 January 2012

పనికి రాని చెత్త పరమ దారిద్ర్యంబు

         బ్లాగు వీక్షకులందరకు 
   భోగి పర్వదిన శుభా కాంక్షలు.

ఆట వెలది:
పనికి రాని చెత్త పరమ దారిద్ర్యంబు
కాల్చి వేయ మనకు కలుగు సిరులు
క్రొత్త ఆశ లేవొ కోరక చిగురించు
భోగములకు పంట భోగిమంట.

Friday, 13 January 2012

నాస్తికులకు దేవతలన్న నయము భయము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

        సమస్య - నాస్తికులకు దేవతలన్న నయము భయము


తేట గీతి:

తలుపు మూసిన వెలుగులు దాటిరావు
అడుగకున్నను తెరచిన ఆక్రమించు
తలపు తెరిచిన దూరును దైవమనుచు
నాస్తికులకు దేవతలన్న నయము భయము. 

తేట గీతి:

తలపు మూసిన *దూరును దైవమనుచు
ఆస్తికులకు దేవతలన్న నయము భయము
తలపు తెరిచిన 'దూరును' దైవమనుచు
నాస్తికులకు దేవతలన్న నయము భయము. 

*దూరు = నిందించు, తిట్టు 
'దూరు' = ప్రవేశించు   
 

Thursday, 12 January 2012

దత్తపది - "లాడెన్, ఊడెన్, వీడెన్, వాడెన్"

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

          దత్తపది - "లాడెన్, ఊడెన్, వీడెన్, వాడెన్"
         ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ స్థితిగతులపై 

కం: వాడెను మోములు ప్రభుతకు
       వీడెను పాలన స్థిరముగ వెలిగెడు యాశల్
       ఊడెను ప్రాభవమని య
       ల్లాడెను, కాంగ్రెస్సు బండి లాగుట యెటులో! 

మత్తకోకిల:

వీడె నాజత యన్న ధైర్యము వీడె కాంగ్రెసు పార్టిలో
ఊడెనా మరి సీటు రాదని ఊడ బట్టుకు నుండెగా
వాడెనా మరి ధైర్యమింకను, వాడ మందులు లేక య
ల్లాడె, నేటికి గట్టునెక్కెడు లక్ష్యమే కనరాదుగా.


Wednesday, 11 January 2012

యతి మోహావేశ మెసగ నతివను బిలిచెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

       సమస్య - యతి  మోహావేశ మెసగ నతివను బిలిచెన్.

కం: అతి ఘోర తపము జేసియు
       గతిదప్పెను మేనక మరి కనుగీటగనే
       మతిచెడి గాధేయుండని*
       యతి  మోహావేశ మెసగ నతివను బిలిచెన్.

      *(గాదేయుండు + అనియతి) 

Tuesday, 10 January 2012

'సిరి' అనే పదం 'లక్ష్మి' అనే అర్థం లో కాకుండా శ్రీదేవి ప్రార్థన

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

 దత్తపది - 'సిరి' అనే పదం 'లక్ష్మి' అనే అర్థం లో కాకుండా శ్రీదేవి ప్రార్థన.

కం:   ముసిరిన దారిద్ర్యంబులు
         కసిరిన పోనట్టి నష్ట కష్టము   చేత 
         న్నుసిరిక చందము జేతువు
        'మసి-రిత్తగ ' నిను భజించ  మాతా ! లక్ష్మీ!

Sunday, 8 January 2012

తమ్ముల గాంచి కోపమున దామరసేక్షణ తిట్టె నయ్యెడన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


               సమస్య - తమ్ముల గాంచి కోపమున దామరసేక్షణ తిట్టె నయ్యెడన్. 


ఉ:  గుమ్ముగ పేక పందెములు గుర్ర్రపు రేసులు లాటరీలతో
      ద్రిమ్మరి, మిత్రబృందముల ద్రిప్పుచు, యార్జన లేకపోయినన్
      సొమ్ములు గుల్లజేయు కడు సోమరి పెన్మిటి  యాడుచుండు  ద్యూ
      తమ్ముల గాంచి కోపమున దామరసేక్షణ తిట్టె నయ్యెడన్. 

Saturday, 7 January 2012

కనక దుర్గ యిచ్చు కష్ట ములను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

               సమస్య -  కనక దుర్గ యిచ్చు కష్ట ములను

ఆ.వె:   తల్లి బిడ్డ కిచ్చు దండన లనుకొన
           కనక దుర్గ యిచ్చు కష్ట ములను
           పిదప ఒడిని జేర్చి పిల్లవానికి గోరు
           ముద్ద లిడిన రీతి ముద్దు జేయు. 




Tuesday, 3 January 2012

ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-01-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
  
సమస్య - ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో. 


 ఉ:   ఉత్పల,మాల, స్నేహితులె ఒక్కెడ జేరి పఠించుచుండగా
      
నుత్పల లక్షణంబులనె యొప్పుగ జెప్పెద నంచు మాలతో
       నుత్పల జెప్పె పద్యమున నుండును నాలుగు పాదముల్ మరిన్
       ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో. 

Sunday, 1 January 2012

నూతన 'ఆంగ్ల వత్సర' శుభాకాంక్షలు.

బ్లాగు వీక్షకులన్దరకు నూతన 'ఆంగ్ల వత్సర' శుభాకాంక్షలు.


కం: జాతర నిత్యము జరుగుచు
       చైతన్యము హెచ్చి సుఖము శాంతుల తోడన్
       నూతన సంవత్సరమున
       ప్రీతిగ సిరులన్ని భువిని పెంపొంద వలెన్.