తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 31 July 2016

గానము సేయంగనొప్పు గాడిదలకడన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - గానము సేయంగనొప్పు గాడిదలకడన్.



కందము: 
జ్ఞానము నారసి సుస్వర 
గానము సేయంగనొప్పు ఘనసభలోనన్ 
జ్ఞానము లేకనపస్వర 
గానము సేయంగనొప్పు గాడిదలకడన్

Saturday, 30 July 2016

అబ్ అద్దము

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ  (న) చిత్రం - అబ్ అద్దము   









కందము: 
నారంభా నా యూర్వసి 
చేరంగా రావెయంచు చెంతనె రోజున్ 
తీరుగ జెప్పి యబద్ధము 
మీరే మోసమ్ముజేయ మేలా ! తెలిసెన్. 

Friday, 29 July 2016

అయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - అయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్.



" చంద్ర బాబు " స్వగతం....

చంపకమాల: 
భయమది పీకుచుండె మరి బాధ్యత లెట్టుల పూర్తి జేయుచున్
రయమున సింగపూరు వలె రాష్ట్రపు కేంద్రము కట్టగావలెన్
స్వయముగ రంగమందు దిగి సాగిల మోదికి మోదమందునా 
అయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్.

Thursday, 28 July 2016

వంకాయను చెఱకురసము వడియుచు నుండెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - వంకాయను చెఱకురసము వడియుచు నుండెన్. 




కందము: 
వంకాయ బాగ పెరిగెను
పొంకముగా ప్రక్కనున్న పొడవౌ మ్రానా
వంకకు కదలుచు గీరగ
వంకాయను చెఱకు, రసము వడియుచు నుండెన్. 

Wednesday, 27 July 2016

జాడీలు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - జాడీలు 









కందము: 
రంగారెడూరగాయల 
పొంగారగ రుచుల దాచి భోజనమునకై 
సింగారపు పచ్చడినిడు 
పింగాణీ జాడి నీకు పెక్కగు నెనరుల్.

Tuesday, 26 July 2016

చేయి తి(వి)రిగిన చిత్రకారుడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - చేయి తి(వి)రిగిన చిత్రకారుడు










తేటగీతి: 
వర్ణ చిత్రమ్ము గీయగా బాగుగాను 
చేయి దిరిగిన వాడెగా చేయగలడ
టంచు దలచకు చూడుమా యచ్చెరువున 
చేయి విరిగిన వాడిటన్ గీయుచుండె.

Monday, 25 July 2016

హరినే నాస్తికులు కొలుతు రనవరతంబున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - హరినే నాస్తికులు కొలుతు రనవరతంబున్.



కందము: 
హరి యెటులుండును చూడగ
హరి హరియన పాపమంత హరియించున,యే 
హరి గిరి లేనే లేడని
హరినే నాస్తికులు కొలుతు రనవరతంబున్

కందము: 
హరి యెక్కడ లేడందురు
హరి శూన్యము, పుట్టలేదు హరి యెచ్చట, నా 
హరి యన దొంగయె యనుచును
హరినే నాస్తికులు కొలుతు రనవరతంబున్

( తమకు తెయకుండానే నిందాస్తుతి తో పూజిస్తారని నా భావన )

Sunday, 24 July 2016

స్కందుడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - స్కందుడు 












కందము: 
వల్లియును దేవసేనయు
నుల్లము రంజిలగ జేర నూరువు పైనన్
సల్లలితరీతి నిలచిన
'పిల్లడు' శిఖివాహు స్కందు నారాధింతున్.

Saturday, 23 July 2016

నరనారి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - నరనారి








తేటగీతి: 
వినుడు కైలాస ముననున్న వేల్పు దల్చ 
అర్థ నారీశ్వరుండిక నార్తి బాపు
కనుడిటవిలాసముగ గీసె ఘనపు "గీత" 
అర్థ నరనారి చిత్రమ్ము నదివొ బాపు.

Friday, 22 July 2016

కసి - పసి - మసి - రసి ... రామాయణార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



దత్తపది - కసి - పసి - మసి - రసి ... రామాయణార్థంలో



ఆటవెలది:
పసిడి రంగు లేడి పరుగెత్తు చుండగ 
నరసి సీత కోరె నద్ది వలయు 
ననుచు రామచంద్రు నయ్యొయో తా భ్రమసి 
కైకసి సుతు బుద్ధి కనగ లేక. 

Thursday, 21 July 2016

టీవీలుండెనట మునికుటీరములందున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - టీవీలుండెనట మునికుటీరములందున్. 


కందము: 
ఆ వెనుకటి కాలములో 
సేవలు జేయుచు గురువులు చెప్పినదంతన్
చేవగ నేర్వగ మరి చి 
ట్టీ ! వీలుండెనట మునికుటీరములందున్

Wednesday, 20 July 2016

మదిరాపానమ్ము ముక్తిమార్గమ్ము గదా

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మదిరాపానమ్ము ముక్తిమార్గమ్ము గదా 


కందము: 
అది రామ నామమే యగు 
నది మధుర మధుర ముగదర యమృతముకంటెన్ 
మదిగోరెడు రుచిగల రస  
మదిరా ! పానమ్ము ముక్తిమార్గమ్ము గదా !

Tuesday, 19 July 2016

దుగ్ధధారఁ గురిసె దున్నపోతు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - దుగ్ధధారఁ గురిసె దున్నపోతు. 



ఆటవెలది: 
పండుకొనగ శ్రీనివాసుండు పుట్టలో
నిలువ గోవు పైననేమి జరిగె 
తెలియదనెద వేమి తెలుసుకో గాడిద! 
దుగ్ధధారఁ గురిసె, దున్నపోతు!

Monday, 18 July 2016

యమున సాయమున

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - యమున సాయమున 








కందము:  
యమునకు వెరవని హరిగని 
యమునయె తా దారినిచ్చె నటగనుమా సా
యమునకు, వసుదేవుండు ర
యమునను మ్రొక్కుచును సాగె నా నిశిలోనన్.

Sunday, 17 July 2016

భానుండస్తాద్రి గ్రుంకె పద్మము విరిసెన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భానుండస్తాద్రి గ్రుంకె పద్మము విరిసెన్


కందము: 
భానుని వలె నభిమన్యుడు 
సైనికులను " వ్యూహ "మందు చంపుచునుండన్
హీనులు గూల్చిరి మాటుగ  
భానుండస్తాద్రి గ్రుంకె "పద్మము" విరిసెన్. 

పద్మము = పద్మవ్యూహము.

Saturday, 16 July 2016

ఉల్లి రుచి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - ఉల్లి రుచి 









కందము: 
ఉల్లిని కోసిన రైతుకు
నుల్లము రంజిల్ల కొనగ నుత్సాహులకున్ 
ఉల్లిని కోసిన వనితకు 
మెల్లగ కన్నీరు నిచ్చు మీదట ' ధర ' లో. 

కందము: 
ఉల్లట్టు లుప్మలందున 
అల్లనవంకాయకూరలాలున గలుపన్ 
పుల్లని గోంగుర నుల్లిని 
చల్లన్నములోన దినగ చాలా రుచియౌ.

Friday, 15 July 2016

సిరికి మగడు చంద్రశేఖరుండు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సిరికి మగడు చంద్రశేఖరుండు


ఆటవెలది: 
సతికిని గిరిజకును శాంభవి గౌరికి 
భక్త జనుల బ్రోచు బాంధవికిని 
పార్వతికిని, కొల్చు వారల చేతియు 
సిరికి మగడు చంద్రశేఖరుండు.

Thursday, 14 July 2016

దనుజా!యే తీరుగ నను దయ జూచెదవో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - దనుజా!యే తీరుగ నను దయ జూచెదవో 



కందము: 
వినగా ఆజా భయ్యా
సునియే రాందాసు పాట, సోంచో బాద్ మే
ఘనముగ గాతా హూ,  మీ 
దను, జా ! " యే తీరుగ నను దయ జూచెదవో ? "

Wednesday, 13 July 2016

బొప్పాయి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - బొప్పాయి. 







కందము: 
గొప్పగ నుండును రుచియే 
చప్పున పండిన ఫలమును చక్కెర తోడన్ 
కప్పున కలిసిన ముక్కల 
బొప్పాయిని తినగ నరుల పొట్టకు హాయౌ. 

Monday, 11 July 2016

కందములను వ్రాయు కవులు గాడిదలు కదా.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - కందములను వ్రాయు కవులు గాడిదలు కదా. 




కందము: 
అందముగ నడవిలోపల 
పందికి పెండ్లాయె, నపుడు పాటలు వ్రాయన్ 
ముందుకు వచ్చెను పొగడుట 
కందములను, వ్రాయు కవులు గాడిదలు కదా! 

Sunday, 10 July 2016

పాలు - పెరుగు - వెన్న - నేయి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది: పాలు - పెరుగు - వెన్న - నేయి.  భారతార్థంలో.


దుర్యోధనుని స్వగతం.. 

నేనేల పాలు నిచ్చెద 
నీనేలనుపంచకున్న నిటు కసి పెరుగున్ 
నేనే యిచ్చెద వారికి 
నానా వెతలను కననిక నవ్వెన్నటికిన్.

Saturday, 9 July 2016

రాముఁ డడవి కేఁగె రంభ తోడ.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రాముఁ డడవి కేఁగె రంభ తోడ.



ఆటవెలది: 
జనము రాముతోడ జానకినే జూచి 
రంభయనుచు మెచ్చె, రామ రామ !
దిష్టి దగిలి నాడు కష్టమ్ములే రాగ 
రాముఁ డడవి కేఁగె ' రంభ ' తోడ.

Friday, 8 July 2016

శ,ష,స లేకుండా ... వాస్తు దోషంగురించి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



నిషిద్ధాక్షరి: శ,ష,స లేకుండా ... వాస్తు దోషంగురించి. 



ఆటవెలది: 
మూల లెక్కువైన మూలన బడవేయు 
దారి తప్పు నిచట ద్వారమున్న 
నిల్లు జరిపి కట్ట " నిల్లగు " వెతలన్ని 
నాదు మాట వినిన నాదు కొనును.

Thursday, 7 July 2016

చీర గట్టు కొనుము శ్రీనివాస.


శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - చీర గట్టు కొనుము శ్రీనివాస.



ఆటవెలది: 
సిరియె నిన్ను జేరి మురిపించు వేళను 
మరల తాను వదలి మరలి పోక 
ముందె నడుమునకును మోదమ్ముతో తనదు 
చీర గట్టు కొనుము శ్రీనివాస.

Wednesday, 6 July 2016

సూర్య నమస్కారములు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - సూర్య నమస్కారములు. 







కందము: 
సూర్యనమస్కారమ్ములు 
వీర్యమ్మును బెంచు మనకు , వెచ్చని వేళన్
సూర్యుని కెదురుగ జేసిన 
నార్యా ! మరి బొందు దేహ మారోగ్యమ్మున్.

Tuesday, 5 July 2016

సిందూర హనుమ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - సిందూర హనుమ  










తేటగీతి: 
దూరమున్నట్టి వారల నూరడించి 
దరికి జేర్చగ నూరంత పెరిగినావ 
కనుచు గొలిచిన నందరి గావు హనుమ !
సుందరాకార సిందూర సూర్య తేజ ! 

Monday, 4 July 2016

గరికిపాటి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - గరికిపాటి 










తేటగీతి: 
కనగ ధారణ యతనికి ' గరిక పాటి '  
మరి సహస్రావధానమ్ము ' గరిక పాటి ' 
గరిమ చాతుర్య భాషణ ' గరిక పాటి ' 
ఘనుడు చూడగ నవధాని " గరికిపాటి "

Sunday, 3 July 2016

సారము లేనివాడుఘన శైలమునెత్తె జనుల్ నుతింపగన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సారము లేనివాడుఘన శైలమునెత్తె జనుల్ నుతింపగన్ 



ఉత్పలమాల: 
తీరుగ జూడ బాలకుడు, దేవుడు వీడని గొల్చుచుండిరే 
మీరుచు నన్ను దల్పకనె మిన్నకనుండిరి యాదవాధముల్ 
దీరుతు వారి గర్వమును దేల్చెదనంచును రాళ్ళ వర్షమున్ 
జోరుగ గుర్యజేయ హరి, చూచుచు నీహరి లౌకికంపు సం 
సారము లేనివాడుఘన శైలమునెత్తె జనుల్ నుతింపగన్.