తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 31 August 2016

మఠమున సన్యాసి యొకఁడు మానిని గూడెన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  16 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మఠమున సన్యాసి యొకఁడు మానిని గూడెన్


కందము: 
కఠినము వనితల హృదయము
పఠనము జేయంగలేము వారలమదినే 
ఛీ!ఠట్! చేరకు మనినన్ 
మఠమున సన్యాసి - యొకఁడు మానిని గూడెన్.  

Tuesday, 30 August 2016

కాకర కాయల రసమ్ము కడుమధురమగున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కాకర కాయల రసమ్ము కడుమధురమగున్. 


కందము: 
భీకర మధుమేహమ్మే 
తాకిన జనులికను తీపి తాగరు, మదిలో 
త్రాగుట కొరకై దల్తురు 
"కాకర కాయల రసమ్ము కడుమధురమగున్"

Monday, 29 August 2016

కాలికి ముల్లు గ్రుచ్చినది కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కాలికి ముల్లు గ్రుచ్చినది కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్.



ఉత్పలమాల: 
మేలుగ పూలమొక్కలను మెచ్చగ బెంచితి నింటి తోటలో 
మూలలు మూలలున్ దిరిగి మొక్కల నీటిని పోయగా నటన్ 
కాలునివోలె మొల్చినది కాండము లావయె తుమ్మ మొక్కయే 
కాలికి ముల్లు గ్రుచ్చినది, కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్.

Sunday, 28 August 2016

పూరి - వడ - దోస - గారె... భారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - పూరి - వడ - దోస - గారె... భారతార్థంలో

  
తేటగీతి: 
దేవదత్తమ్ము పూరించి తేజమలర 
చనెనిదో సమరమునకు గనుడు నరుడు 
కౌరవేయుల కప్పుడే గారె చెమట 
వైరి జనులంత వడవడ వణకిరపుడు. 

Saturday, 27 August 2016

రాజు లిద్దఱు ప్రేమసామ్రాజ్యమునకు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రాజు లిద్దఱు ప్రేమసామ్రాజ్యమునకు.



తేటగీతి: 
రాచకన్నెలు ప్రేమించె రాజ సుతుల 
పెద్దవారల సమ్మతి పేర్మి మీర 
భర్త లయ్యిరి ముదమున వలచిన యువ 
రాజు లిద్దఱు ప్రేమ, సామ్రాజ్యమునకు.

Friday, 26 August 2016

హార మొసఁగు శుభము లందఱకును.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - హార మొసఁగు శుభము లందఱకును.


ఆటవెలది: 
ఏబి సీ విటమిను లైరను కూరల 
శుచియు శుభ్రత గల చోట రుచిగ 
వండి ప్రేమ తోడ వడ్డించు నట్టియా 
హార మొసఁగు శుభము లందఱకును.

Thursday, 25 August 2016

నందుని నందను గన

అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. 

















కందము: 
నందుని నందను గన నా
నందము గలుగునుగ మనసు నందున మనకే
అందని రూపము మనమున
నందముగా నగుచు నిలచు నందెదననుచున్.

భారత దేశాధిపతి ఒబామాయె సుమీ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భారత దేశాధిపతి ఒబామాయె సుమీ

కందము: 
మీరిచ్చిన " చిత్రము " లో 
పేరెన్నిక గన్న వారి పేర్లను చెపుదున్ 
తీరుగ గనపడె మోదీ 
భారత దేశాధిపతి, ఒబామాయె సుమీ! 

Wednesday, 24 August 2016

ఏడవగ ఫలమేమి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  30 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - ఏడవగ ఫలమేమి 










తేటగీతి: 
మొదటియాటకు ' సినిమాకు ' మోదమలర
పోదమంచును మగడేమొ ' ఫోను' జేసె 
ఎదురు చూచెను సతి ' టైము ' యేడవగను 
రాడు రాడాయె ఫలమేమి యేడవగను.

Tuesday, 23 August 2016

అన్నమొ రామచంద్ర!యని యందరు చచ్చిన రామరాజ్యమే

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అన్నమొ రామచంద్ర!యని యందరు చచ్చిన రామరాజ్యమే. 


ఉత్పలమాల: 
పన్నుల మీద పన్నులిడి పన్నుల రాలగ రాలు వేసి యా 
పన్నులు రైతు బాంధవుల పంటల నష్టము పండు వేళలో 
దన్నుగ నిల్చి నాయకులు దైర్యము జెప్పక మిన్నకుండినన్ 
"అన్నమొ రామచంద్ర!" యని యందరు చచ్చిన రామరాజ్యమే?

Monday, 22 August 2016

శ్రీ కాళ హస్తి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - శ్రీ కాళ హస్తి. 









కందము: 
చుర చుర దీపము గాల్చగ
బిర బిర తా హరుని పైన పేర్చిన గూటిన్ 
కొర కొర జూచుచు మ్రింగగ
హరహర యని దూకి లూత హరునే జేరెన్. 

కందము:  
అన్నాగము పూజలలో 
నన్నాగము పోటి బడుచు నాగము సేయన్ 
పన్నాగమందు జావగ 
పన్నగ ధరుడేమొ మెచ్చి పంచెను ముక్తిన్. 

Sunday, 21 August 2016

మన్ను నోట మిన్ను

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - మన్ను నోట మిన్ను 












కందము: 
మన్నును తిన్నావా ! మరి 
వెన్నలు చాలంగ లేద వెన్నల దొంగా ! 
అన్నయ్య జెప్పె నిటురా 
కన్నయ్యా ! యనుచు బిలిచి కరమున బట్టెన్. 

కందము: 
నారాయణు డని తెలియక 
నోరును తెరవంగ జేయు నువిద యశోడన్ 
తీరుగ జూపుచు విశ్వము
నోరును తెరవంగ జేసె నుగదహరి, భళా ! 

Friday, 19 August 2016

జలుబు - దగ్గు - నొప్పి - నలత... రామాయణార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - జలుబు - దగ్గు - నొప్పి - నలత... రామాయణార్థంలో


ఆటవెలది: 
ప్రజలు బుద్ధి లేక పరుషమ్ము లాడిన
సుంతదగ్గునయ్య నింతి మహిమ 
ప్రీతి తోడ నొప్పి సీతను విడువకు
కానల తరుమకుము కఠిన రామ !

Thursday, 18 August 2016

దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ.


శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ.



కందము: 
మును " హరి " యించెను శ్రుతులను 
ఘనుడొక్కడు మానవతిని గద "హరి " యించెన్ 
మనరు " హరి " యనక నిముసము 
దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ.

Wednesday, 17 August 2016

రాజా పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రాజా పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై. 



శార్దూలము: 
మేజా బల్లను తెల్ల కాగితమునే మేలొందగా బర్చుచున్
నేజూడంగను గంటలోనె త్వరగా నీటైన " పైంటింగు " నా
రోజే వేసెను నాదు మిత్రు డిడిగో రోహిత్ సుభాష్ శర్మ రా
రాజా ! పున్నమి రాత్రి, పూచె సరసిన్ రాజీవముల్ " చిత్రమై ".

Tuesday, 16 August 2016

సుతుపదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సుతుపదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్


కందము: 
మితి మీరి జదివియున్నను
సుతునకు నుద్యోగమేది ? చొరబడ కొలువున్
వెతలే దీరగ, దశరథ
సుతుపదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్. 

Monday, 15 August 2016

దేవకీ పుత్రుడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - దేవకీ పుత్రుడు 









కందము: 
దేవకి కడుపున బుట్టెను 
దేవతలకు పరమ పూజ్య దేవుండితడే
దేవుళ్ళాడిన దొరకడ
దే ! వచ్చెను భువికి శిష్ట దీనుల బ్రోవన్.



Sunday, 14 August 2016

అవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్. 



మత్తేభము: 
అవరుల్ మూడుగ టైముబెట్ట సభయం దష్టావధానమ్ములో
యువబౌలర్లుగ ప్రశ్నలెన్నొ కవులే యోవర్లుగా వేయగా
యవధాన్యత్తరి పద్య పాదములతో నబ్బ్యాటు షాట్లివ్వగా
నవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్. 

Saturday, 13 August 2016

వలచి బెండ్లాడె వృద్ధుని పడుచుపిల్ల.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వలచి బెండ్లాడె వృద్ధుని పడుచుపిల్ల.


తేటగీతి: 
సతియె జూడగ హిమవంతు సుతగగాగ 
తపము జేయుచు గజచర్మ ధారి హరుని
యాదిదేవు,సనాతను నాత్మ నెంచి
వలచి బెండ్లాడె, వృద్ధుని పడుచుపిల్ల.

Friday, 12 August 2016

కొమ్మ కమ్మలు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కొమ్మ కమ్మలు. 







కందము: 
మాటీ లోలాకులనే 
ధాటిగనే చెవికి పడుచు దరియించె నహా ! 
పోటీ బడుచును కమ్మలు 
బోటికి మేవన్నె తోడ, బుద్ధిగ నూగెన్.

Thursday, 11 August 2016

తెలుగు భోజనం

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - తెలుగు భోజనం  









తేటగీతి: 
అన్నమందున కూరలు నావకాయ 
చారు పప్పును గూడెగా చాలుచాలు  
తెలుగు భోజనమిది గాదె తెలియగాను 
పెరుగు జేర్చిన తిను కోర్కె పెరుగునయ్య. 

Wednesday, 10 August 2016

వానపాము కాటు ప్రాణ హరము

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వానపాము కాటు ప్రాణ హరము


ఆటవెలది:
పడగయున్న తోక పొడవుగా యున్నను 
పైన పొడలెయుండి పరులెత్త 
విషము గలుగు పాము వినుమన్న యది కాదు 
వాన పాము , కాటు ప్రాణ హరము

Tuesday, 9 August 2016

ద్యూత మద్యపాన రతులు నీతిపరులు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - ద్యూత మద్యపాన రతులు నీతిపరులు.



తేటగీతి: 
ఒక్క తల్లికి పుట్టిన చక్కనైన 
సుతులు బుద్ధిని కారుగా చూడ నొకటి 
అవగ వచ్చును వారలు నటుగ నిటుగ 
ద్యూత మద్యపాన రతులు, నీతిపరులు.

Monday, 8 August 2016

పిట్ట, పొట్ట

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పిట్ట, పొట్ట









కందము: 
పొట్టను నింపుట కొరకై 
పిట్టల చేపట్టు విధము పిల్లడు జూపెన్ 
కొట్టక తిట్టక పట్టగ 
పిట్టలకే మేత, పైన పెట్టెను చేటన్.

Sunday, 7 August 2016

న్యస్తాక్షరి - ‘శ్రీ-సీ-తా-రా-ము-ల-కు-వం-ద-న-ము-లు’

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
 
అంశం- రామకథ. 
ఛందస్సు- (పన్నెండు పాదాల) తేటగీతిక.
పన్నెండుపాదాల మొదటి అక్షరాలు వరుసగా 
‘శ్రీ-సీ-తా-రా-ము-ల-కు-వం-ద-న-ము-లు’ ఉండాలి.


తేట గీతి: 
శ్రీధవుండిల రక్షింప శిష్ట జనుల 
సీతగా సిరి రాముడై చేరె తాను 
తాము శంఖమ్ము చక్రమ్ము పాము పడక 
రాము తోడుగ బుట్టెగా ప్రేమ మీర 
మునుల యాగమ్ము రక్షించి జనక పురిని 
లలన సీతను పెండ్లాడె, పలుక తండ్రి 
కుదురుగా వనముల కేగె కోరి కోరి 
వంకరాలోచనలు జేసి లంక రాజు 
దరికి జేరిచి మైథిలిన్ దాచగాను 
నచ్చి హనుమను బంపగా నాతి వెదకె 
ముష్కరాధములందర మోదిజంప 
లుప్తమయ్యెను పాపాలు లోకమందు.

Saturday, 6 August 2016

ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్ 


చంపకమాల:
ప్రవరుఁడు పాదలేపనము పాదముక్రిందను పూసి చేరెగా 
జవజవ మంచు కొండలను,జవ్వని చేతికి చిక్కి స్రొక్కెగా 
శివ శివ ! చేర యింటికిని చిత్రము నిద్రను స్వప్నమందునన్ 
ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్. 

Friday, 5 August 2016

దారము లేకుండ పుష్పదామములల్లెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దారము లేకుండ పుష్పదామములల్లెన్.


కందము: 
చేరుచు కోసిన పూవుల 
తీరగు కనకాంబరమ్ము తెల్లని మల్లెల్ 
పేరుగ గ్రుచ్చుచు సతి మం 
దారము లేకుండ పుష్పదామములల్లెన్.

Thursday, 4 August 2016

సున్న మున్నఁ జాలు నన్నమేల

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సున్న మున్నఁ జాలు నన్నమేల



ఆటవెలది: 
ఆకు వక్క తోడ నంత సున్నము గలుప
విడెమనంటి గాని వినక నీవు
పోక వలదు నాకు నాకులె నమిలెద
సున్న మున్నఁ జాలు నన్న, మేల?

Wednesday, 3 August 2016

భామను వేధింపఁ దగును పదుగురు మెచ్చన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భామను వేధింపఁ దగును పదుగురు మెచ్చన్.


తులాభార సమయం లో శ్రీకృష్ణుని మనోగతం....
కందము: 
ప్రేమను సంపదగొన న
న్నీమునికే దానమిచ్చి యిట్టుల జేసెన్ 
తా మనసు మార్చు కొనగను
భామను వేధింపఁ దగును పదుగురు మెచ్చన్.

Tuesday, 2 August 2016

గిరిజా రమణా

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - గిరిజా రమణా









కందము:
గిరిజా రమణా ! ఘన హిమ 
గిరి నిలయా ! దేవ ! వ్యోమకేశా ! ఈశా ! 
గిరిగీచినట్లు కూర్చొన 
గిరిపై మే ' మెట్లు' జేరి కీర్తింతుమయా !

Monday, 1 August 2016

లౌక్యం లేని చదువు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - లౌక్యం లేని చదువు








ఆటవెలది: 
విద్య నేర్చినట్టి విప్రులు నల్వురు
అడవిలోన జనుచు నస్థికలను
జూచి సింగమువని వేచుచు తలచిరి 
శిక్షణమ్మునట పరీక్ష జేయ

తేటగీతి: 
సమయ సందర్భములులేక భయములేక
చదువును పరీక్ష సేయగ నొదవు కీడు
ననుచు నొక్కడు జెప్పగా నవ్వినట్టి
మిత్రులన్ వీడి చెట్టెక్కి మిన్నకుండె.

తేటగీతి: 
అప్పుడతికించి జేర్చెగా నస్థులొకడు
మాంస, చర్మము, రూపమ్ము మార్చె నొకడు
ప్రాణమున్ బోసె నొక్కడు, రయము నపుడు
పైకి దూకుచు సింహమ్ము వారి జంపె

కందము: 
గట్టిగ లౌక్యము దెలిసిన
చెట్టెక్కిన వాడు దిగెను చింతించి యనెన్
కొట్టుక జెప్పితి తలపై
నిట్టుల పెడ చెవిని బెట్ట నీరీతాయెన్.