తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 31 January 2014

కొమ్ములు జనియించెఁ గనుఁడు కోమలి తలపై.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కొమ్ములు జనియించెఁ గనుఁడు కోమలి తలపై.

పూతన చనిపోగానే తన అసలు రూపం వచ్చింది కదా...
కందము:
అమ్మడు పూతన, కృష్ణుని
రొమ్మున కానించ జచ్చె రొద బెట్టుచు హా !
అమ్మో ! నోటను కోరలు
కొమ్ములు జనియించెఁ గనుఁడు కోమలి తలపై.




టీచర్ పై కోపం వచ్చిన ఒక అమ్మాయి ఆమె బొమ్మను ఇలా వేసింది...
కందము:
పమ్మీ యలిగెను,  టీచర్
బొమ్మను చిత్రించె తాను 'బోర్డున', మొలిచెన్
అమ్మడి నోటను కోరలు
కొమ్ములు జనియించెఁ గనుఁడు కోమలి తలపై. 

Thursday, 30 January 2014

పతిని బాధపెట్టు వనిత సాధ్వి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పతిని బాధపెట్టు వనిత సాధ్వి

ఆటవెలది:
పాడు బుధ్ధి తోడ పలుకరించగ వచ్చి
ఆశ లెన్నొ జూపి యనునయించ
లెక్క జేయ కుండ ప్రక్కింటి యా  ' రతీ
పతిని '  బాధపెట్టు వనిత సాధ్వి

Wednesday, 29 January 2014

నవరాత్రులలో దుర్గా !

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - నవరాత్రులలో దుర్గా !


 

















కందము:
నవరాత్రులలో దుర్గా!
నవ విధముల నీదు రూప నామమ్ములె మా
నవులే ధ్యానించినచో
నవనాడుల శక్తి నిండి నవనవ లాడున్.

Tuesday, 28 January 2014

పాట పాడి కొలుతు బ్రతుకమ్మ నీరూపు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పాట పాడి కొలుతు బ్రతుకమ్మ నీరూపు


 


















ఆటవెలది:
పాట పాడి కొలుతు బ్రతుకమ్మ నీరూపు
రంగు రంగు పూల హంగు దీర్చి
బాట పరువు మమ్మ బాగుగా పూలతో
నాదు బ్రతుకు లోన, నతులు నీకు.

Monday, 27 January 2014

తల లేకుండఁగఁ జూడఁగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపఁగన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తల లేకుండఁగఁ జూడఁగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపఁగన్.


మత్తేభము:
తలపై వాణియె నిల్చియుండి కరుణన్ తా విద్యలందీయగా
తలపుల్ చేతల  పండితాళి మనలన్ తప్పంచు జూపింపకన్
విలువల్ గల్గిన మంచి భావములతో,  వేరైన దోషంబు  కై
తల లేకుండఁగఁ జూడఁగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపఁగన్.

Sunday, 26 January 2014

సుబ్బరముగ పగులగొట్టి చూచును

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


నర్ణ (న) చిత్రం - సుబ్బరముగ  పగులగొట్టి చూచును

















కందము:
అబ్బుధ్ధి మారదెప్పుడు
'సుబ్బరముగ ' పగులగొట్టి చూచును దేనిన్
అబ్బా! సెల్ఫోనైనను
కొబ్బరి కాయై ననేమి కోతికి యొకటే.

తేటగీతి:
హారమందున నారాము హనుమ వెదకి
త్రెంచి వేసిన సంగతి తెలిసె నేమొ
కపియె కూర్చొని యారాముగాను తాను
వెదకు చుండెన సెల్ విప్పి వేగిరముగ.

Saturday, 25 January 2014

చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్. 



కందము:
చూడగ ధరలే ధరనే
వీడెను గ
నుపట్టు పైన విన్వీధిని తా
రాడుచు, నేదైన కొనగ
చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్.

కందము:
నేడే సినిమా తారలు
వేడుకగా పట్టణమున వీధుల నడచెన్
మేడెక్కి యరచె యువకులు
"చూడుఁడదే పట్టపగలె చుక్కలు వొడిచెన్"

Friday, 24 January 2014

పెద్దగ "మను" చరిత నీది

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పెద్దగ "మను" చరిత నీది

 




















కందము:
పెద్దన్నవు భువన విజయ

పద్దెమ్ముల జెప్పు కవికి ! భళి రాయలె తా
నద్దిర పల్లకి మ్రోసెను
పెద్దగ "మను" చరిత నీది పెద్దన ! జేజే!

Thursday, 23 January 2014

పగుళు లిచ్చె నాదు బ్రతుకు పొలము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పగుళు లిచ్చె నాదు బ్రతుకు పొలము


 

















 
ఆటవెలది:
చుక్క నీరు లేక ' చిక్కితి' విధిచేత
నాట లేదు నాటు నాటినుండి
నాటె గునప మొకటి నాగుండె దేవుడు
పగుళు లిచ్చె నాదు బ్రతుకు పొలము

Wednesday, 22 January 2014

కుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నుల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నుల్.

కందము:
ఇంతేనా యని పూరణ
గంతులనే వేసి వ్రాసి కంటిని నేనే
భ్రాంతిగ " సుతులని " నిజమిది
"కుంతికి నైదుగురు 'సుతలు' గుణసంపన్నుల్."


కందము:
కుంతియను లేమ కనియెను
చింతించుచు బాబు కొరకు చేడియ వరుసన్
వింతనక, నేడు చూడగ
కుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నుల్.

కందము:
వింతగ నొకటే కాన్పున
కుంతికి నైదుగురు సుతలు, గుణసంపన్నుల్
చింతయె లేదులె నేడా

యింతులకే పెండ్లి జేసె నెంతో వేడ్కన్.


Tuesday, 21 January 2014

ఉభయ కవి మిత్రుడాయన

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - ఉభయ కవి మిత్రుడాయన

 















 



కందము:
ఉభయ కవి మిత్రుడాయనె
యభయంబిడి పర్వమర్ధ మాతడు వ్రాసెన్  
శుభమాయె తెలుగు జాతికి
నభవుండని నుతులు జేతు నా యెర్రనకే.

Monday, 20 January 2014

క్రికెట్టు - హాకీ - టెన్నిసు - చెస్ ...భారతార్థంలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - క్రికెట్టు - హాకీ - టెన్నిసు - చెస్ ...భారతార్థంలో


సంధికొరకు వెళ్ళిన కృష్ణుని దుర్యోధనాదులు తాడుతో బంధించబోయారు...

తేటగీతి:
క్రి కెట్టుల జెప్పక సంధి
ని,  చెన
టెన్ని సుద్దులు చెప్పిన టెక్కు బోయె
తాడు గట్టిరి పట్ట, హా! కీడు సేయ
సమర శంఖము పూరించె సమరమునకు.

Sunday, 19 January 2014

విష్ణు సముడు తిక్కన

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - విష్ణు సముడు తిక్కన





















కందము:
తిక్కన భారతమును కడు
మక్కువతో ననువదించి మనకందించెన్
పెక్కగు  పర్వంబులనే
దక్కెను కవి విష్ణు సముడు త్రయమున జూడన్

Saturday, 18 January 2014

హెడ్మాస్టరు నేర్వసాగె నేబీసీడీల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - హెడ్మాస్టరు నేర్వసాగె నేబీసీడీల్.


కందము:
హెడ్మరి పొగరా ! యనుచును 
' పడ్మా ' యని పద్మనుగని  వ్రాసెను  పలకన్ 
' పడ్మయు ' కొడతాడనుకొని
హెడ్మాస్టరు, నేర్వసాగె నేబీసీడీల్.


ఒక హెడ్మాస్టరు గారి మనుమరాలు ముద్దుగా టీచర్ ఆట ఆడుతూ..

కందము:
గుడ్మాన్ నీవే తాతా
ప్యాడ్మరి పేపర్ నునీవు బట్టుకు రైటిట్
హెడ్మిస్సును నేనే నన
హెడ్మాస్టరు నేర్వసాగె నేబీసీడీల్.

Friday, 17 January 2014

' మ ' నన్నయ్య

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం -' మ '  నన్నయ్య




























కందము:
నన్నయ్య తెలుగు కవులకు
అన్నయ్యై యాదికవిగ నలరారెగదా  
వన్నెగ నిలచును భువి తెలు
గున్నంత వరకు నిజము రోరన్నయ్యా !

Thursday, 16 January 2014

వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే


కందము:
వక్త్రము లేదనకుము బహు
వక్త్రంబులు గలవు చూడ పరమాత్మునికే
వక్త్రముల పొగడ, కావలె
వక్త్రంబుల్ పది, గలిగినవానికి జేజే!

Wednesday, 15 January 2014

హరి హరీ ! హరి కథ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - హరి హరీ ! హరి కథ.



 
















కందము:
పసగా జెప్పినచో నవ
రసములు మరి జాలువారు రక్తియు గట్టున్
కొస పిట్ట కథలు మెరయును
దెస లేక హరి కథ నేడు దిక్కులు జూచెన్.

Tuesday, 14 January 2014

ఆంధ్ర జనుల కనుల నాహ్లాద బాష్పాలు

బ్లాగు వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.




















 


సీసము:
ముగ్గుల్ల గొబ్బిళ్ళు ముంగిళ్ళ రంజిల్లు
హరిదాసు భజనలే హాయి జల్లు
గంగిరెద్దులగంతు గమ్మత్తు చప్పుళ్ళు
గాలి పటము, పందె గాళ్ళ కోళ్ళు
అల్లుళ్ళు కోడళ్ళకత్తింట సందళ్ళు
బుజ్జాయిల తలల  భోగి పళ్ళు
పులగమన్నమరిసె పులిహోర పొంగళ్ళు
పరవశమ్మొందెడు పల్లెటూళ్ళు

ఆటవెలది:
కనుమ నాడు రైతు కనులలో కాంతులు
కనగ సంతసమున కదలు నీళ్ళు
ఆంధ్ర జనులకెల్ల నాహ్లాద బాష్పాలు
సంకురాత్రి నాటి సంబరాలు. 

Monday, 13 January 2014

రేగుపండు వోలె రేగు సొగసు.

బ్లాగు వీక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.

 


















ఆటవెలది:
మనసులోన భోగి మంటలనే వేసి
కలత జ్ఞాపకముల  గాల్చివేయ 
యోగములొనగూరు  రోగమ్ములే బోవు   
రేగుపండు వోలె రేగు సొగసు.

రమణీ రమ్మనెను సీత రాముని గనుచున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రమణీ రమ్మనెను సీత రాముని గనుచున్.

కందము:
రమణీయ కనక మృగమిట
దుముకుచు తిరుగాడు చుండె దూరముగా  నా
సముఖమునకు చేకొని వీ
రమణీ ! రమ్మనెను సీత రాముని గనుచున్.

Sunday, 12 January 2014

మనుమనిగా తాతను గని మనుమనె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - మనుమనిగా తాతను గని మనుమనె


 














 




కందము:
మనుమనిగా తాతను గని
మనుమనె రాజుగ మగధకు, మామను జంపెన్
మనుజుల గీతలు మార్చగ
ఘన గీతా బోధ జేసె కంసారి కదా !

Saturday, 11 January 2014

కాశి యనిన భువిని కైలాసమే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కాశి యనిన భువిని కైలాసమే

 
















ఆటవెలది:
కాశి యనిన భువిని కైలాసమే గాద
వారణాసి కరుగు వారి కెపుడు
అన్నపూర్ణ కరుగు నన్ని కోర్కెలు దీర్చు
జంగమయ్య గొలువ గంగ మునిగి. 

Friday, 10 January 2014

తిరుమలేశుడైన దిరిపెమెత్తు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - తిరుమలేశుడైన దిరిపెమెత్తు 

ఆటవెలది:
అచ్చి రాని నాడు లచ్చియే నిలువదు
ఇచ్చకాలు కూడ కచ్చ లగును
కలసి రాని నాడు కామేశ్వరుండైన
తిరుమలేశుడైన దిరిపెమెత్తు

Thursday, 9 January 2014

తెలుగు భోజనం కావాలి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - తెలుగు భోజనం కావాలి

 
















తేటగీతి :
తెలుగు భోజన మనినేను తినగ వస్తి
కంచ మందున చూడగా కళ్ళు తిరిగె
ముద్ద పప్పుయు కూరేది ముద్ద దిగను
ఆయి లేదాయె శూన్యమే యప్పడమ్ము

తేటగీతి :
ఒరుగు వడియము లేదయ్య ఉప్పు మిరప
మినప గారెలు పులిహోర మీద జీడి
పప్పు కిస్ మిస్సు వేసిన పాయసమ్ము
ఆవకాయయు గోంగూర లసలు లేవు

తేటగీతి :
చింత యుసిరిక లిటలేవు చింత దీర్చ
కలదె పులుసందు లేదులే గడ్డ పెరుగు
ఆకు యొక్కటి చూడగా నరటి బాగు
అన్ని వేళల దొరకునే యిన్ని రుచులు


తేటగీతి : 
కాన తిందును 'బిర్యాని' 'కర్డ్ చట్ని'
అన్ని కలుపుచు నొవ్వక యన్న దాత
అన్న మెయ్యది ఏదైన నదియె బ్రహ్మ
మనుచు దలతును మాన్యుల మాట లెపుడు. 

Wednesday, 8 January 2014

హింస కలుగఁజేయు హితము భువికి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - హింస కలుగఁజేయు హితము భువికి.


ఆటవెలది:
పంట పండు కొరకు వ్యవసాయదారుండు
పిచ్చి మొక్కలన్ని పీకి వేయు
చీడ పీడ లన్ని చెలగును గద యిట్టి
హింస కలుగఁజేయు హితము భువికి.

Tuesday, 7 January 2014

అలుగకు బాపూ !

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - అలుగకు బాపూ !


 













 
కందము:
కొల్లాయి, కర్ర తోడనె
తెల్లోరిని వెడల గొట్టి తెచ్చిన స్వేచ్చన్
తెల్లారగ జేతురెయని
నల్లోరిని జూడనిటుల నలుకా  బాపూ !  

Monday, 6 January 2014

అనుమానించు పతిఁ బడసి యతివ సుఖపడెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - అనుమానించు పతిఁ బడసి యతివ సుఖపడెన్
కందము:
అనుమానము పెను భూత
మ్మని  మానక చేయు పనుల నన్నిటి తానే
గని లోప రహితమునకై
అనుమానించు పతిఁ బడసి యతివ సుఖపడెన్.

Sunday, 5 January 2014

మీ రాధను ప్రేమ మించె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - మీ రాధ మదిని ప్రేమ మించె



 
















కందము:
మీరా గానమునే విను,
మీ రాధను ప్రేమ మించె మేనును మరిచెన్
రారా కన్నయ్యా యని
నోరారగ బిలుచు చుండెనో కృష్ణయ్యా ! 

Saturday, 4 January 2014

గాంగేయుం డనఁగఁ గ్రీడిగా నెఱుఁగవలెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గాంగేయుం డనఁగఁ గ్రీడిగా నెఱుఁగవలెన్.


ఉత్తర గోగ్రహణం లో..అజ్ఞాత వాసం పూర్తి అయిన పిదప మాత్రమే కిరీటి బయట పడ్డాడని భీష్ముడు దుర్యోధనునికి చెప్పగా .. దుర్యోధనుడు కర్ణునితో...

కందము:
సింగమె బయటకు వచ్చెను
హంగుగ నజ్ఞాతవాస మయిపోయె నిదే
సంగర మునకై కనుడని
గాంగేయుం డనఁగఁ గ్రీడిగా నెఱుఁగవలెన్.

Wednesday, 1 January 2014

బ్లాగు వీక్షకులకు 2014 ఆంగ్ల నూతన వత్సర శుభాకాంక్షలు.



















కందము: 
పదమూడు వెడలి పోయెను
పదునాలుగు రెండు వేల పైనను వచ్చెన్
పదిలముగా సుఖశాంతులు
వదలక మీకందవలయు వత్సరమందున్.