తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 31 December 2024

సమయోచిత పద్యరత్నము – 45

 


ఉత్పలమాల:
మర్మమదొక్కటే, మడియ  మర్త్యుని వెంట మరేది రాదురా!
కర్మలు చేయువేళ సరిగా గని మంచియు చెడ్డలెంచుచున్
ధర్మము దప్పకన్ నరుడు ధారుణి జక్కగ సాగగావలెన్  
ధర్మమదొక్కటే భువిని దాటిన గూడను తోడు వచ్చురా!


Monday, 30 December 2024

సమయోచిత పద్యరత్నము – 44

 


చంపకమాల:  
పురిసెడు "గంగ" నీరు గొని పుక్కిట జేర్చుచు ద్రావ జాలినన్  
మరువక "కృష్ణ గీత" గని  మన్నననింతగ నేర్వబూనినన్
"హరి" మదిదల్చి యర్చనను హాయిగ నిత్యము సల్పుచుండినన్  
దరికిక రాడు మానవుని దాపునకే "యమధర్మరాజ"హో!  


Saturday, 28 December 2024

సమయోచిత పద్యరత్నము – 43

 



ఉత్పలమాల:
ఎంచగ నీటిమీది యల లేయవి, గాలిని దీపరాశియౌ  
మించిన మెర్పుటద్దములు, మీదట జూడగ నెండమావులే
కొంచెము నిల్వలేని కరి గుల్కెడు వీనులవౌను,మానవుల్  
చంచలమైన సంపదల జేరగబిల్తు రదేల శంకరా!


Friday, 27 December 2024

సమయోచిత పద్యరత్నము – 42

 

ఉత్పలమాల:
ధీరుడ,వాయుపుత్ర,శుభ ధీమతి, సుందర వజ్ర దేహుడా!
మారుతి,ఆంజనేయ,మహిమాన్విత నామసుధారసాస్యుడా!
కోరెద పీఠమున్ నిలువ, కోర్కెలు దీర్చుచు దేవ! పావనీ!
శ్రీరఘురామ లక్ష్మణులు సీతయు తోడుత నీవునామదిన్.    


Thursday, 26 December 2024

సమయోచిత పద్యరత్నము – 41

 


చంపకమాల:
చిరునగవుండి, కాంతులను  జిమ్ముచు ముద్దులనొల్కు మోముయున్
సరసపు భాషణల్ గలిగి, చంచలమౌనటు లేడి కన్నులున్
పరువపు పొంగులున్, నడక  బాగగు హంసల బోలు చేడియన్  
కరువును దీరగా గనుచు కన్నును గీటగ జూచు కాంతుడే.  


Tuesday, 24 December 2024

సమయోచిత పద్యరత్నము – 40

 


ఉత్పలమాల:
చూడగ దీప పర్వమున జ్యోతుల వెల్గెడు లక్ష్మి నీవెలే!
వేడుక గోకులాష్టమిని వీడక గొల్చెడు గౌరి వీవు! మా
గోడును దీర్చు పార్వతి వహా! శివరాత్రిని బూజ సేయగా
వీడను నిన్ను హే! లలిత! వింటిని “హోలి”కి వాణివీవుగా!


Monday, 23 December 2024

సమయోచిత పద్యరత్నము – 39

 


ఉత్పలమాల:
తల్లిని మించి పోషణను ధారుణి జేయగ వారు లేరుగా!
అల్లన దారతో సమము హాయిని గూర్పెడు వారలుండునా?
కల్లయెగాదు విద్య కనకంబున జేసిన భూషణమ్మెగా!
యుల్లమునందు చింత తగ'నొప్పిన' కాయము గాయమేసుమా!


Sunday, 22 December 2024

సమయోచిత పద్యరత్నము – 38

 

ఉత్పలమాల:
భారతి వీణ మీటుచును భర్గుని గాధల నాలపించగా
నీరజ నేత్రి హర్షరుచి నేత్రములంబడ వాణి జేరుచున్
తీరుగ మెచ్చబోవ సతి  తీయని పల్కుల, తాను సిగ్గుతో
జారును వీణటంచు సరి చాటుగ వస్త్రము పైన గప్పెగా.


Saturday, 21 December 2024

సమయోచిత పద్యరత్నము – 37

 

ఉత్పలమాల:
పాలకుడెవ్వడైన తన ప్రక్కన వానిని బాగ మెచ్చుచున్
మేలుగనుండు స్థానమున మెండుగ నుండగ జేసి, దానిపై  
జాలని క్రింద ద్రించ దిగజారుచు, మీదట  తూలనాడుగా
మేలుగ మర్మముల్ దెలిసి మెట్లుగ మెట్లుగ వృద్ధి నీవలెన్.



Friday, 20 December 2024

సమయోచిత పద్యరత్నము – 36

 

శార్దూలము:
ఏపాదమ్మున గంగబుట్టె నదియే యిప్పొద్దు నీకండరా!
మాపాపమ్ముల ద్రుంచుమంచు మదినే మందారపుష్పమ్ముగా
దీపమ్ముల్ మరి ధూపమంచు నిడుచున్ తీరైన సధ్బావనన్
తాపమ్ముల్ సరి దీర్చుమంచు హరినే దైవమ్ముగా గొల్వుమా!


Thursday, 19 December 2024

సమయోచిత పద్యరత్నము – 35

 

ఉత్పలమాల:
చల్లని మంచినీరు మరి జారగ గొంతున హాయినిండుగా
చల్లదనమ్ము నిచ్చునుగ సాదిన గంధము తాప వేళలన్
చల్లని చెట్టునీడ గన సంతస మందుదురెండలన్ నరుల్  
చల్లగనౌగ యుల్లమది చక్కని  తేనెల జల్లు మాటతో.


Wednesday, 18 December 2024

సమయోచిత పద్యరత్నము – 34

 

(కోవిడ్ సమయంలో వ్రాసినది)

మత్తేభము: 

స్తవనీయుండగు జానకీపతి తగన్ తాభద్ర శైలమ్ముపై

నవనీజాతను బట్టువేళ గనగా నయ్యో నరుల్ లేరనెన్ 

దివిదేవుల్ దిగ శాంతిగల్గు ప్రజకున్  దీవింప రారండనన్  

భువిలో రాముని పెండ్లి జూడ వరుసన్ బోచుండిరే దేవతల్.


Tuesday, 17 December 2024

సమయోచిత పద్యరత్నము – 33

 

ఉత్పలమాల:
మానవ! యీ వసంతమున మానసమందును హాయి నిండుగా
పైనను నింగి దాకునటు బారుగ నిల్చిన పొన్నలున్ పొదల్
తేనియలూరు మామిడుల తీరగు తోపుల జేరి కూయగా
వీనుల విందుగాద పలు వేలుగ జిల్కల, కోకిల స్వరాల్.



Monday, 16 December 2024

సమయోచిత పద్యరత్నము – 32

 

మత్తేభము:
సరియుత్సాహము గల్గినట్టి నరునిన్, సద్బుద్ధి తోడన్ సదా
గురి తా దల్చుచు గార్యముల్ సలుపుచున్, కొండంత దైర్యమ్ముతో
మరువన్ జాలక మేలు, దేవుని నుతుల్  మౌనంపు ధ్యానంబిడన్    
సిరి తా మెచ్చుచు వాని చెంతకు దగన్ జేరంగ వచ్చున్ గదా!


Sunday, 15 December 2024

సమయోచిత పద్యరత్నము – 31

 

చంపకమాల:  
కలిగిన కష్టముల్ మరియు గానగ నుండని నష్టముల్, సదా
తలపున జీకటుల్ గిరుల దాటగలేమను భీతివీడుచున్
గెలుపది నిశ్చయంబనుచు, గ్రీడగ బోరగ  నాత్మశక్తితో
వెలుగు, జయంబు దక్కునిక, వీడక పట్టును సాగిపొమ్మికన్.




Saturday, 14 December 2024

సమయోచిత పద్యరత్నము – 30


ఉత్పలమాల:
జ్ఞానముగల్గు సత్వగుణ సజ్జను కెప్డు, రజోగుణమ్ముచే
దానను లోభమున్ గలుగు దప్పక, నున్న తమోగుణమ్ము య
జ్ఞానము తోడనా భ్రమ యజాగ్రతయున్ మరపన్నదౌనుగా
మానవ నైజమే యదియు మానగ సాధన జేయగావలెన్.


Friday, 13 December 2024

సమయోచిత పద్యరత్నము – 29


ఉత్పలమాల:
చేతుల శుభ్రతన్ గడిగి చేరి గృహమ్ముల నుండగా బ్రజల్  
చేతలు గొప్పగా గలిగి శీఘ్రము దా ముభయాంధ్ర పాలకుల్
భీతినిబాప, బూనిరిగ పీడ "కరోనను" బారద్రోలగన్    
చేతులు మోడ్తు "శ్రీ" హరికి  జేయగ స్వస్థత  దెల్గు నేలలన్.


Thursday, 12 December 2024

సమయోచిత పద్యరత్నము – 28

 

ఉత్పలమాల:
పూతను బూచె, వేప నటు బోవుచు గోసెడు వారు లేరుగా
లేతగ గాచె మామిడులు, లేరుగ ద్రెంపగ వచ్చువారలే
కూతలు గూయ జాలిగొని కోయిలలన్నియు మూగవాయెగా
మూతలుబడ్ద తల్పులను మూల జనాళిని జూచి శార్వరీ!


Wednesday, 11 December 2024

సమయోచిత పద్యరత్నము – 27

 

స్వాగతమమ్మ నీకునిక శార్వరి వత్సర రూప ధారిణీ!
యేగుచు నా 'వికారి' చెడు నిచ్చుచు సాగెనులే "కరోన" తో
మాగతి జూడుమమ్మ, పరమౌషధ మొక్కటి నందజేసి మా
సాగెడి జీవితాన రుజ జావగజేయుమ వైద్య రూపివై.


Tuesday, 10 December 2024

సమయోచిత పద్యరత్నము – 26

 

శార్దూలము:
ఏయే కాలమునందు నేది గలదో? యే మూర్తమం దేదియో?
ఏయే చోటున నేది వచ్చునొ? నదే యే దేశమున్ గల్గునో
కాయంబందిన వారిజాతక విధిన్ కాలమ్ము తానిచ్చుగా
ఆయావేళల లాభనష్టము, శుభంబా హానినిన్ మృత్యువున్.


Monday, 9 December 2024

సమయోచిత పద్యరత్నము – 25

 

   
ఉత్పలమాల:    
ఎక్కడినుండి వచ్చినదొ? యిట్టుల దేశములన్ని దాటుచున్
పెక్కురి ప్రాణముల్ గొనుచు భీకర మౌచును, కానుపింపకన్
టక్కరిదౌ "కరోన" యకటా! భయమందకు శౌచ శుభ్రతల్
జక్కగ మీర, దానికిక సాగక నాటలు సాగిపోవుగా.


Sunday, 8 December 2024

సమయోచిత పద్యరత్నము – 24

  

మత్తేభము:  

అవమానంబులు మానముల్ తెలియగా నాశీతలోష్ణమ్ము,లీ

యవనిన్ శత్రుల మిత్రులందు వినరా యా నింద, స్తోత్రమ్ము, గౌ

రవముల్, ఘోరపరాభవమ్ము, గెలుపుల్ రానట్టి వేళన్, భళా

స్తవనీయుండగు నొక్కలాగున ధరన్ తా భక్తితో నిల్వగా.

Saturday, 7 December 2024

సమయోచిత పద్యరత్నము – 23

 

 
చంపకమాల:  
అడిగినదాని లేదనక నట్టిటు జూచుట, జాగుసేయుటల్
వడివడి జెప్పకుండ నొకవైపుగ నేగుట, నేలజూచుటల్
చిడిముడిజేసి కన్ బొమలు చీదర జూపుట, ప్రక్కవారలన్
పడిపడి గోరగాను పలువార్తల, నయ్యది "లేదనే" సుమా!

Friday, 6 December 2024

సమయోచిత పద్యరత్నము – 22


ఉత్పలమాల:
ఎంతటి దుష్టులైన మరియెంతటి దోషము లున్న వారలన్
సుంతయు వారిగూర్చి తెగ సోదిని జెప్పుట తూలనాడుటల్
ఇంతయు భావ్య మౌన? కన నింతయు సాయము జేయకుండగా  
నంతగ హానిజేయ మనకౌనిక హానియు నంతకంతగా.


Thursday, 5 December 2024

సమయోచిత పద్యరత్నము – 21

 

 
ఉత్పలమాల:
పెట్టిన నాడు పూజ్యుడని పేర్మిని హారతి బట్టుచుంద్రుగా
గట్టిగ దైవమంచు తగ గైతలు జెప్పుచు నుంద్రు, వారలే
తిట్టులదండకమ్ము మరి తీరుగ నందుచు గ్రోధమందుచున్
పెట్టనినాడు దూరుచును బెట్టగ జూతురు దూరమందునన్.



Wednesday, 4 December 2024

సమయోచిత పద్యరత్నము – 20

 

చంపకమాల:
భుజములనెన్మిదిన్ గలిగి పూచిన పద్మము వామహస్తమున్
నిజముగ దక్షిణంబు మరి నిండగు బిల్వము బట్టి దేవి, యం
బుజమున గూర్చునుండ బలు భూషణ ధారిణి, రెండు ప్రక్కలన్
గజములుజేరియుండు, సరి గావగ గొల్తురు యక్షులాదిగన్.


Tuesday, 3 December 2024

సమయోచిత పద్యరత్నము – 19

 

     
చంపకమాల:
సదమల భక్తి తోడ మది సాధన జేయుచు కీర్తనంబులన్
వదలక నీవెదిక్కుయన, పాడుగుణమ్ములు పారిపోవుగా
పదములబట్టి శ్రీహరిని బ్రార్థన జేయగ, జుట్టుముట్టు యా
పదలను మట్టుబెట్టుచును భద్రము గాచును దేవదేవుడే.


Monday, 2 December 2024

సమయోచిత పద్యరత్నము – 18

 

చంపకమాల:

కన 'మది' క్షేత్రమౌను, సరి కల్పన నాగలి, దాని దున్ని యో

చన లను విత్తనమ్ములను శ్రద్ధగ జల్లి సకాలమందునన్

ఘనమగు ధ్యానవర్షమున  గ్రమ్మగ జేసిన సేద్యమిద్ధరన్

మనమున నీతి, శీలతయు, మాన్యత, స్వచ్ఛత పంట పండుగా. 


సమయోచిత పద్యరత్నము – 17

 

చంపకమాల:

సిరిగలవాడె సర్వమును జెప్పగ జ్ఞానము యున్నవాడగున్ 

సిరిగలవాడె భాషణము జక్కగజేయగ గల్గు నిద్ధరన్

సిరిగలవాడె పెద్ద, కులశేఖరు డౌగద, కాలమిట్టిదే

సిరిగలవానిచెంతకిక జేరు గుణమ్ములనున్ జనమ్ములే.

   

Saturday, 30 November 2024

సమయోచిత పద్యరత్నము – 16

 

ఉత్పలమాల:
భానుని గొల్వ రోగముల బారగ జేయును, శ్రద్ధగానిలన్
ధ్యానముజేయ నగ్నినిల ధాన్యము చేకురు, నీశు దల్పగా
జ్ఞానము గల్గు దప్పకను, సన్నుతిజేయ జనార్దనున్ మదిన్
దీనత బాపి మోక్షమును తీరుగనిచ్చును నిక్కమిద్ధరన్.


Friday, 29 November 2024

సమయోచిత పద్యరత్నము – 15

 

చంపకమాల:
పరసతిగోరు బుద్ధియును, వస్త్రము గట్టుట నా పరాయిదిన్
పర గృహమందు భోజనము, బండుట గూడదదెంతవారికిన్
పరు నిజ శయ్యపైన,గన భాగ్యమదంతయు జారిపోవు, నా
పర యిది, లేకయున్న సిరి బారును జూడ కుబేరుకైననున్.


Thursday, 28 November 2024

సమయోచిత పద్యరత్నము – 14

 

ఉత్పలమాల:
తుమ్మెదగుంపు బోలుజడ దోపిన మల్లెలు, చంపకమ్ముగా
నమ్మణి ముక్కు, నేత్రముల నారయ వారిజమట్లు, నెర్రనౌ
కమ్మని మోవి, పల్వరుస, గాత్రము నందున తేనెలూరగా
నిమ్ముగబల్కు, ఫాలమున నింతగు బొట్టు, సుకన్యకందమౌ.


Wednesday, 27 November 2024

సమయోచిత పద్యరత్నము – 13

 

ఉత్పలమాల:
చల్లని చేతులన్ సుతుల సాకుచు పాలన జేయుచుంద్రుగా
తల్లియె దైవమింక భువి తండ్రియె దైవము, మానవాళికిన్
చల్లని చూపులన్ బ్రతుక సాయము జేయును లోకనాధుడే
అల్లన వారిసేవ లిహ మందున నా పరమందు సౌఖ్యమౌ.


Tuesday, 26 November 2024

సమయోచిత పద్యరత్నము – 12

 

ఉత్పలమాల:
ఓమ్మన దైవరూపమది, యోమ్మనగా ప్రణవమ్ము, చూడగా
నోమ్మన నాదిశబ్దమది, యోమ్మన మూలము భాషలన్నిటన్
ఓమ్మన నాదరాజమది,  యోమ్మన మంత్రపు ద్వారమయ్యెడిన్
ఓమ్మది తాక వీనులకహో! మది  నిండును దివ్యభావనల్.

Monday, 25 November 2024

సమయోచిత పద్యరత్నము – 11

 

చంపకమాల:
నిజముగ నెన్ని వాద్యముల నెన్నుచు బట్టుచు మీటుచుండినన్  
ప్రజలమనంబు జూరగొని రంజిల జేయుటకే గదా, సదా
భజనలు లేక నెన్మిదియు పైబది విద్యలు భుక్తి కోసమా?
నిజమగు విద్యలన్న నవి నిక్కము ముక్తిని గూర్చుకోసమే.


Saturday, 23 November 2024

సమయోచిత పద్యరత్నము – 10

 

చంపకమాల:
విషయములెన్నొనేర్పు, మన వేదపు లోతుల దెల్పుచుండు, క
ల్మషములబాపు, లోన ఘనమైన కథామృతమందజేయుచున్
విషమసమస్యలందు భువి వేదనజెందెడు మానవాళికిన్
శషభిషలేని యౌషధము జక్కగనిచ్చును "భారత"మ్మహో!


Friday, 22 November 2024

సమయోచిత పద్యరత్నము – 9

 


చంపకమాల:
పనులవి నూరునున్న విను పట్టెడు బువ్వ భుజించగావలెన్
పనులవి వేయియున్న నొక పట్టున స్నానము జేయగావలెన్
పనులవి లక్ష యున్న గని పాత్రత దానము జేయగావలెన్
పనులవి కోటియున్న హరి భక్తిదలంచి భజించగావలెన్.


Wednesday, 20 November 2024

సమయోచిత పద్యరత్నము – 8

 


ఉత్పలమాల:
పాములగట్టి గుఱ్ఱముల బండికి,  చక్రమదొక్కటైన, నా  
వ్యోమమునందు భాస్కరు డనూరుని తోడనె సాగుచుండుగా
ఏమియు గొప్పదైన "సరి హేతువు" లేక మహాత్ములెప్పుడున్
నీమముతోడనా పనిని నిక్కము జేయుదు రిద్ధరన్ గనన్.


Tuesday, 19 November 2024

సమయోచిత పద్యరత్నము – 7

 


ఉత్పలమాల:
ధ్యానముజేతు నేను శశిధారి, త్రిశూలిని చంద్రమౌళినిన్
గానముజేతు శంకరుని గంగను దాల్చిన వాని, శంభునిన్
దానమునీయమందు ప్రమధాధిపు మోక్షవరమ్ము, చింతనన్
మానను, లేడిబట్టి సతిమన్నన ప్రక్కన దాల్చు వానినిన్.


Friday, 15 November 2024

సమయోచిత పద్యరత్నము – 6

 

చంపకమాల:
క్షితిజనులంత స్వప్నమున శ్రీలను బొందుట, సౌఖ్యమందుటల్
గతజలమౌను జూడ కనికట్టుగ, నిద్రను మేల్కొనంగనే  
అతివలమీది మోహమది యట్టులె మాయయె,మొహమందగా
మతిచెడు గాద, దూరమగు మాధవుపైనను మించు భక్తియున్.


Thursday, 14 November 2024

సమయోచిత పద్యరత్నము – 5

 

చంపకమాల:

గురుచరణమ్ము బట్టి తన గోడును జెప్పుచు సేవజేయగా

బరువును దీర్చి నేను యను  భ్రాంతిని దేహమునందు బోవగా

సరియగు బోధజేయుచును సత్కృపతోడను వెన్ను దట్టుచున్

మరిమరి జ్ఞానజ్యోతులను మానసమందున నింపు, సత్యమే.



పిల్లలు దైవాల రూపు

 

కందము:
కల్లయు కపటమ్మెరుగని
పిల్లలు దైవాల రూపు, పెంచుడు వారిన్
తల్లియు తండ్రియు గురువులు
మల్లెల వలె స్వచ్ఛమైన మనసుల నెదగన్.

కందము:
మొక్కగ నుండగ నప్పుడె
చక్కగ సరియైన విధము సరి వంచవలెన్
దక్కునె మ్రానైన? సుగతి
చక్కని బాలలను మేలు జగతిని నిలుపన్.

కందము:
చెప్పుడు నీతికథలనే
చెప్పుడు మాటలను వినగ చేటగుననుచున్
చొప్పగ జేయక బుద్ధిని
చొప్పడ జేయంగవలయు శోధన ప్రతిభన్.

కందము:
పెద్దలనెడ గౌరవమును
సుద్దుల నోర్మిని, వినయము జూపెడు విధమున్
ముద్దుగ చదువుల నేర్పిన
నద్దియె సరియైన విద్య యగు పిన్నలకున్.

కందము:
గద్దెలనెక్కిన వారలు
పెద్దలు సరిదారి నెరిగి ప్రేమగ నెపుడున్
దిద్దుచు రేపటి పౌరుల
హద్దులలోనుంచి పెంచ హాయగు గదరా!


Wednesday, 13 November 2024

సమయోచిత పద్యరత్నము – 4

 


చంపకమాల:
కమలము ప్రీతి శ్రీహరికి గావున దానిని చేతబట్టుగా
కమలమె శ్రీ సుఖాసనము, గాదిలి బ్రహ్మకు గూడ పీఠమే  
కమలము, మానవా! హరిని గానగవచ్చును  మొగ్గవంటి హృ
త్కమలము భక్తితోడను వికాసము జేయగ యోగదృష్టితోన్.


Tuesday, 12 November 2024

సమయోచిత పద్యరత్నము – 3

 


ఉత్పలమాల:
ఆ గణకోటి నాథుడవె, ఆప్రణవంబున శబ్ద రూపివే!
వేగపు వ్రాతగానివిలె, వేకవులందున శ్రీకవీశువే!
శ్రీగురు, బ్రహ్మలందు సరి జేరిన వాడవె, విఘ్నరాజ, నిన్  
ధ్యానముజేసి మ్రొక్కెదను ధన్యత జెందగ నో గణాధిపా!


Monday, 11 November 2024

సమయోచిత పద్యరత్నము - 2

 సమయోచిత పద్యరత్నము - 2

చంపకమాల:
వలపుల లేడికళ్ళు నెలవంకను బోలిన కన్నుబొమ్మలున్
పులకలురేపు మాటలును ముద్దుగ నల్కల ముచ్చటాటలున్  
కలివిడిగల్గి కోరిననె కౌగిలినిచ్చెడి మోవి తీపిదౌ
చెలియను గల్గినట్టి సఖు జీవితమంతయు పండుగేయగున్.

Sunday, 10 November 2024

సమయోచిత పద్యరత్నము - 1

 గతంలో (2020) శ్రీ చండ్రపాటి రామ్మోహన్ గారు "సాహితీ ప్రియ మిత్ర సంగమము" వాట్సప్ గ్రూప్ నందు నిర్వహించిన "సమయోచిత పద్యరత్నము"ల పోటీలో ఇచ్చిన అంశములకు తగ్గట్లుగా రోజుకొకటి చొప్పున నేను వ్రాసిన పద్యములు. 


సమయోచిత పద్యరత్నము - 1          

ఉత్పలమాల:

శ్రీపరమేశు కంఠమున చెల్వపు మాలను వైచి, పెండ్లిలో

తా పదమంటువేళ నట దాకిన "బుస్సన" పెండెరమ్ములే

చూపుల భీతి,లజ్జయును జొప్పడి కందుచు వెల్గు మోముదౌ  

చేపలకండ్ల "శైలసుత" చెన్నుగ మీకిడుగాక సంపదల్.   


 


Tuesday, 5 November 2024

పోరు

 అమరావతి సాహితీ మిత్రులు  

వారం వారం పద్య కవితల పోటీ - 2 కొరకు వ్రాసిన పద్యములు 

అంశం:యుద్ధం  

శీర్షిక:పోరు 


తేటగీతి:  

మంచి చెడులకు యుద్ధమే యెంచి చూడ 

వెలుగు చీకటి కెప్పుడు కలదు పోరు 

ధర్మ రక్షకు సమరమ్ము తప్పదెపుడు 

వసుధనే నింపగా శాంతి పచ్చదనము. 


తేటగీతి:    

యుద్ధమును జేయ నెప్పుడు సిద్ధమనకు    

సిద్ధమేయైన విడువకు చివరి వరకు  

ధర్మ యుద్దమునకు తోడు దైవమెపుడు 

దుష్ట శిక్షణమే చూడ తుదకు జరుగు.        


తేటగీతి: 

స్వార్ధ మెంచుచు కొందరు వదలబోరు 

పోరు సలుపుచు నుందురీ పుడమిలోన 

వనిని బుట్టిన కార్చిచ్చు వలెనె నదియు

కాల్చి వేయును వారినే కూల్చివేయు.  

  

తేటగీతి:  

మనుగడకు శాంతి దక్కగా మనుజు లిలను 

అనిని సలుపగ వలయుగా ననవరతము      

మనసునందున చాటుగా మసలు యరుల  

నణచగావలె నారింటి నారు వరకు.     


తేటగీతి: 

బ్రతుకు పోరున నెవ్వరు  బ్రతికిపోరు 

పారిపోక నిల బ్రతికి పోరవలయు   

కత్తి సాహసమే యోర్మి కవచమవగ     

ధర్మ నియతిని బూనగా దక్కు జయము.   



Thursday, 31 October 2024

ఎన్ని "మందు"లో

 మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ దీపావళి 

శుభాకాంక్షలు. 

దీపావళికి ఎన్ని "మందు"లో........ 

సీసము: 

త్రాగుబోతు నరులు తమ తప్పు దెలియుచు 

"మందు" వాడకమింక మానునాడు

పంటల చీడలన్ పరిమార్చునట్లుగా  

"మందు" కల్తీ లేక అందునాడు  

పిచ్చిగా యువతయే రెచ్చుచు పలు మత్తు   

"మందు"లే కోరక మసలునాడు  

ఆవేశపరులయో ఆత్మహత్యకు చేదు  

"మందు"నే త్రాగక మనెడునాడు  

తేటగీతి:

"మందు"లే యన్ని రోగాల మాన్పునాడు    

"మందు"లకు తగు తెలివి పెంపొందునాడు    

"మందు"లనుగాల్చ చౌకగా నందునాడు 

పూర్తి "దీపాలపండుగ" భువనమందు.  


Monday, 21 October 2024

సత్యము

 అమరావతి సాహితీ మిత్రులు

వారం వారం పద్య కవితల పోటీ - 1 లో ప్రశంస పొందిన పద్యాలు.
అంశం:సత్యం
శీర్షిక:సత్యము

ఆటవెలది:
సత్యవచన మెపుడు శాంతినే బంచును
మనసు తేలికగును మంచిగలుగు
కల్లలాడ మదిని గందరగోళమే
నరుడు గోలుపోవు నమ్మకమ్ము.

ఆటవెలది:
త్రాడు జూచి పాము దలచుచున్ బెదరకు
త్రాడె యనుచు బాము దరికిబోకు
తెలివితోడ గనగ దెలియును సత్యమ్ము
సాగు జీవనమ్ము శాంతి తోడ.

ఆటవెలది:
మంచినీటి "నుయ్యి" మరిజూడగా "బావి"
మంచి "క్రతువు" నొక్క మంచి "సుతుడు"
వరుస కొకటికొకటి వందగానెక్కువ
మించి "సత్యవాక్కు" మేలుమేలు.

ఆటవెలది:
తీపి బొంకు వలన తీపులే మిగులును
చేదు నిజము పైకి చేదుకొనును
వాక్కునందు శక్తి పదిరెట్లు పెరుగును
పలుక సత్యమెపుడు పదుగురెదుట.

ఆటవెలది:
నిలుచు బ్రహ్మమొకటె నిజముగా సత్యమ్ము
జగతి మిథ్య యనుచు సరిగనెరిగి
తడవకుండునట్టి తామరాకును బోలి
బ్రతుకు నడుపు నరుడు భాగ్యశాలి.


Saturday, 7 September 2024

సిద్ధి బుద్ధి నాథ

 


వినాయక చవితి శుభాకాంక్షలు. 


శ్రీ మహా గణాధిపతయే నమః


సీసము:

ప్రకృతి వనరు దోచు "స్వాహాల" నరులనే

తొండమ్ముతో నీవు తుక్కురేపు

సంఘ విద్రోహుల సంస్కార హీనులన్ 

దంతమ్మున దరిమి తరిమి గ్రుచ్చు 

కులమత కలహాల నిలబెంచు వారినే

ఉండ్రాళ్ళతో కండ్ల నురిమి కొట్టు

సైపలేనివి "నెట్టు" "సైబరు" మోసాల

వలను ద్రెంపగ నీదు నెలుక బంపు 

ఆటవెలది:

చేటచెవుల నూపి చేటులన్ దొలగించు  

సూక్ష్మ దృష్టి గనుచు శుభములిమ్ము

సిద్ధి బుద్ధి నాథ! చిత్తాన గొల్తుము

విద్యతోడ మంచి వినయమిమ్ము.

Saturday, 31 August 2024

"గోలీ"లు (92-95)

 సెప్టెంబరు '24 "రవళి" మాస పత్రికలో ప్రచురింపబడిన నా రచనలు.  


కందము:  

ఏ పుణ్యమొ నరుడైతివి

ఆ “పుట”యే నీకొకటట నమరెను చరితన్

ఆపక "నీ కథ" వ్రాయుము

“ఆపుట” నేరికిని సాధ్యమగునా గోలీ!


కందము:

నింపాదిగ ధర్మముగా

సంపాదన గూడబెట్టి సత్పురుషులిలన్

ఇంపుగ కొంతను పేదకు  

పంపకముగ కూడ, పెట్ట వలెరా గోలీ!


కందము:

"పగలే" వద్దనియెదరుగ

జగమందున "రాత్రిపని" నిశాచరులెపుడున్  

"పగ"లే వద్దనియెదరుగ

తగ శాంతిని గోరువారు తధ్యము గోలీ!


కందము:

తల పెట్టుము దిశదెలియుచు

నిల నిద్రను బోవువేళ నిక తల్పముపై

తలపెట్టుము సత్కార్యము

నలవాటుగ ప్రతిదినమ్ము నటులే గోలీ!

Monday, 22 July 2024

గురు వందనం

 శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ స్వామి వారి అనుగ్రహంతో గురు పూర్ణిమ సందర్భంగా, మంత్రాశ్రమము, గుంటూరునందు 20-07-2024న ఏర్పాటు చేసిన కవితా గోష్ఠి లో నేను చదివిన పద్యములు.


కందము:

గురువగు తల్లికి దొలుతను

గురువగు తండ్రికిని పిదప గొప్పగ జగతిన్

గురువగు హరికిని తప్పక

గురుతెరుగుచు నతులనిడరె కువలయమందున్.


కందము:

గురువన బ్రహ్మయు విష్ణువు

గురువే మాహేశ్వరుండు కుంభినిలోనన్

గురువు పరంబ్రహ్మయు సరి

గురువుల పాదమ్ములకివె  కోటినమస్సుల్.


కందము:

గురువన లోకమ్మందున

గురుతరమగు బాధ్యతగల కోవిదుడగుచున్

నరులకు జ్ఞానమ్మిహమున

పరమును జేరగ సరియగు పథమును జూపున్.


ఉత్పలమాల:

వేదములన్ని గాచి సరి వేయివిధమ్ముల వేల్పు గాథలన్

మేదినిలోని మానవుల మేలును గోరుచు వ్రాసినాడుగా

పాదములంటి మ్రొక్కిడరె వ్యాసుని ముందట దల్చి నాపయిన్

సాదరమొప్ప నాదిగురు శంకరుకున్ మరి యొజ్జకోటికిన్. 


Thursday, 11 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 157

 

కందము: 

"కన్నుల్లొ మిసమిసలు" కని 

హన్నా!అందాలు దాచకనువగు వేళన్

అన్నట్టి పాట వినగా

ఎన్నెన్నో తీయనికల లెదలో మెదలున్. 

Wednesday, 10 July 2024

"గోలీ"లు 88 - 91

 


జులై 2024 "రవళి" మాసపత్రికలో ప్రచురితమయినవి.

కందము: 

చిరిగిన బట్టల గట్టిన

నిరుపేదల జూచి జాలి నిజముగ వేయున్

"చిరుగుల" బట్టల గట్టిన

చిరు"గుల" "కలవారి" గనిన సిగ్గగు గోలీ! 


కందము: 

చదువునకు తోడు పిల్లలు 

వదలక సంస్కారము సరి పాటించు విధ

మ్మది నేర్వ వలయు నప్పుడె

చదువులు సార్థకమగుగద జగతిని గోలీ! 


కందము:

దెబ్బలు తగిలినవని శిల 

ఆబ్బా!యని క్రిందబడగ నది బండయగున్  

నిబ్బరముగ నిలచినచో

నబ్బురముగ శిల్పమగుగ నవనిని గోలీ!


కందము:

ముద్దౌచు చమట, నన్నపు 

ముద్దగుగా రైతు జనుల పుణ్యము పండన్   

ముద్దుల బిడ్డని బంచును 

ముద్దుగనా పుడమితల్లి మురిపెము గోలీ! 

ఘంటసాల పాటల "కందాలు" - 156

 


కందము: 

"జయహే! నవనీల" యనుచు

ప్రియముగ వనమాలి లీల, వినగా హరియే 

స్వయముగ మధురమ్మంటివి 

లయబద్దపు మధురగీతి రక్తియెగట్టున్.    

  

Tuesday, 9 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 155

 

కందము:  

"మంచితనానికి తావే"

యెంచగనింతైనలేదదెచ్చట ననుచున్

కొంచెము మనసుకు మమతకు 

నించుక లేదన విలువలె, యేడ్చును మనసే.   

Sunday, 7 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 154

 

కందము:  

"ఈ యుదయం నా హృదయం"

హాయిగనే ప్రకృతి హొయలు నందముగానే 

తీయగ తెలిపినది వినగ   

మాయగ వేకువలు నిలచు మామనసులలో.


Saturday, 6 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 153

 

కందము: 

"అందాల రాణివే" నను

జెందక కవ్వించి సిగ్గు జెందగనేలా? 

అందగ రా! చెలి! యనుచు ప

సందుగ నాలాపమిడిన సరి గీతమహో!

  

Friday, 5 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 152

 

కందము: 

ఆ "యెంతఘాటు ప్రేమయొ"

హాయిగ విన జాబిలి మలయానిలములవే

తీయని విరహము బెంచగ 

జేయును దరిజేరగ చెలి చెలికానికహా!





 

 


Thursday, 4 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 151

 

కందము: 

"విరిసిన వెన్నెలవొ" నగవు

కరుణయె లేనట్టి శిలను కరగించుననిన్

మరిమరి తలచుచు చెలి! యె

వ్వరివో నీవనుచునడుగు పాటయె వహ్వా. 






Wednesday, 3 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 150

 

కందము: 

ఆ"భారతీయుల కళా 

ప్రాభవమొలికించి" పద్య పాదములన్నిన్ 

భావము చక్కగ నొలుకుచు 

మావీనులనింపుచుండు మాధుర్యమునే. 


 


Saturday, 29 June 2024

ఘంటసాల పాటల "కందాలు" - 149

 


కందము: 

"ఖుషిఖుషిగా నవ్వుతు" విన 

హుషారదియె మదికి గల్గహో చెలితోడన్ 

భేషుగ మేఘాల రథము

న షికారును చేసినట్లు నయముగ దోచున్. 


Friday, 28 June 2024

ఘంటసాల పాటల "కందాలు" - 148

 

కందము:

"ఎందున్నావో  చెలి 

అందుకొ నా కౌగిలి" యను నా గీతమ్మే  

విందగు మా చెవులకు మరి 

ఎందెందో నున్న చెలియ  ఎదలో మెదలున్.

  

Thursday, 27 June 2024

ఘంటసాల పాటల "కందాలు" - 147

 

కందము"
"జీవితమే ఓ పూబా
టా" వీనులలో బడగనె టక్కున నోరే
చేవగ “నాహ హహహ్హ” ని
తా వంతగ నందుకొనును తథ్యము మాకే.


Friday, 21 June 2024

ఘంటసాల పాటల "కందాలు" - 146

 




కందము:
"ఈ యందానికి బంధం"
తీయని ఆ పాట వినగ తేలును మనసే
ఆ యెరుపుబుగ్గ చిన్నది
హాయిగ ప్రియుజేరియుండినట్లుగ తోచున్.


Saturday, 8 June 2024

ఘంటసాల పాటల "కందాలు" - 145

 


కందము:
ఆ "మొదటి పెగ్గులో మజ"
ఆమమ పపప దదద నినియన గల్గు నిషా
మా మనసునందు మత్తుగ
హే మోజే వినగ పండుగే ప్రతిరోజౌ.


Monday, 3 June 2024

"గోలీ"లు (84-87)

 



(జూన్ 2024 రవళి మాసపత్రికలో ప్రచురితమయినవి)


కందము:

కాలము జూడగ మాయా

జాలము, లోకాల బట్టి చక్కగ లాగే

గాలము, దీనిన్ తెలియగ  

జాలము, జాలమున నైన సత్యము గోలీ!


కందము:

మొగమున నొక్కటియౌ చిరు

నగవును మరి వదలబోక నగవలె, నదియే

నగవలె మెరయుచు నీకిక

జగమున గలిగించుగద హుషారును  గోలీ!  


కందము:

దీపములార్పుట మానుము

దీపము వెలిగించి మ్రొక్కి దేవుని చెంతన్

తాపీగా ధ్యానించుము

"హ్యాపీ బర్త్ డే" దినమున హాయగు గోలీ! 


కందము: 

కాలూ చేతులు కదుపగ 

వేలుగ పలునాటలుండ వీడుచు వాటిన్ 

వ్రేలున మీటెడు నాటల  

వ్రేలాడెడు పిల్లవాండ్రు "వేస్టుర"  గోలీ!

 

Monday, 27 May 2024

ఘంటసాల పాటల "కందాలు" - 144

 

కందము: 

"నీలో నేనై" అనుచును

నాలో నీవై అనుచును నయముగు పాడన్ 

మాలో "నశక్తి" నయమగు 

తేలును ఉత్సాహపు మది తీయని కలలన్.


Thursday, 23 May 2024

ఘంటసాల పాటల "కందాలు" - 143

 

కందము: 

"జగదభిరామా!"యనుచును

జగమునకే రామ మహిమ చాటితివయ్యా

అగణితగుణముల వానిని

స్వగతమ్మున తలచి పాడ సాంత్వన కలుగున్.


  

Monday, 20 May 2024

ఘంటసాల పాటల "కందాలు" - 142

 

కందము:
"మనసే వెన్నెలగా మా
రెను ఈ వేళా" యని మధురిమలే చిలుకన్
వినసొంపుగనౌ పాటది
మనసున జవ్వని నిలచుచు మరులూరించున్.

Wednesday, 15 May 2024

ఘంటసాల పాటల "కందాలు" -141

 

కందము:
"నిన్నే! నిన్నే! చెలి" యని
కన్నియ మరదలు సుభద్ర కై యతి రూపున్
అన్నరుడు పిలుచు విధముగ
హన్నా! గానమ్మది విన హాయౌ మదికిన్.

Friday, 3 May 2024

ఘంటసాల పాటల "కందాలు" - 140



కందము: 

"నీమధు మురళీ గాన" మ

దే మామనసులు చివురిడ దివ్యముగా గా

నామృతమే పంచితివయ

ఏమందుము మోడులు విన నెదుగుచు బూయున్.


Thursday, 2 May 2024

"గోలీ"లు - 83



కందము: 

ఓటును వేయుట కొరకై

నోటీయగ రాగ, వలదు "నో" యనవలయున్

పోటీ దారుల తోడన్

పో!"టీ" కూడా వలదని, పోవలె గోలీ!   



Wednesday, 1 May 2024

ఘంటసాల పాటల "కందాలు" - 139


కందము: 

"వేషము మార్చెను" అనుచును

భాషను తా మార్చెననుచు బాడగ బహు సం   

తోషము గూర్చును, మనుషి జి

గీషల వర్ణించు పాట, కేల్మోడ్తునిదే.


Monday, 29 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 138

 

కందము: 

"వెన్నెల లోనా వేడి" యు 

వెన్నెలలోనా నదేల  విరహమ్మనుచున్

అన్నుల మి"న్నగు" చెలితో 

నెన్నుచు జాబిలిని, పాడ నేదో సుఖమౌ.

Wednesday, 17 April 2024

దశరథ నందన

 శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః  

మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.   


కందము: 

దశరథ నందన రాముని  

దశకంఠుని వైరి మరియు దయగల ప్రభువున్    

దశదిశల నున్న వానిని 

దశలవి మారును గొలువగ దక్కును సుఖముల్.




Monday, 15 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 137

 

కందము: 

"ఇల్లాటి రోజు" మరియును

ఇల్లాటీ హాయి రాదు  హెహ్హే యనుచున్

చల్లాకి చిన్నదానితొ

అల్లీబిల్లిగను బాడుటదియొక హాయౌ. 

Sunday, 14 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 136

 


కందము: 

"భూమ్మీదా సుఖ పడితే"

అమ్మో యీపాట మస్తు హాయిని నింపున్  

గమ్మత్తుగాను మనసుల

నమ్మధువే గొప్ప, యేల నమృతమ్మనుచున్.



Saturday, 13 April 2024

బాల రాముడు

 జికె తెలుగు టాకీస్ వారి ఖగేశ్వరి ఉగాది పురస్కారములు 2024 న  

ద్వితీయ బహుమతి పొందిన  పద్యములు.


అంశం: "నేటి అయోధ్యలో బాల రాముడు" 


ఆటవెలది: 

"మోడి" విడక ధర్మ పోరాటమే సల్ప 

"రామజన్మభూమి" రగడ దీరె     

వందలేండ్ల పిదప నందెగా న్యాయమ్ము   

మందిరమ్ము వెలసె నందముగను. 


మోడి=పట్టుదల 


కందము:

పాలకుడే లోకములకు

పాలకడలిని పవళించు పరమాత్ముండే 

పాలను ద్రావెడి ముద్దుల 

బాలక రూపమ్ము నచట బాగుగ నిలచెన్.


చంపకమాల: 

జననియు జన్మభూమియును స్వర్గముకంటెను గొప్పదన్న నా   

యినకుల భూషణుండు జగదీశుడు కొల్వయె నీ యయోధ్యయే 

తన నిజ జన్మభూమియని, ధన్యతనందిరి భక్తులెల్లరున్ 

మనముల "రామలల్ల మము మన్నన సేయు”మటంచు మ్రొక్కుచున్. 


ఉత్పలమాల: 

ఒద్దిక మందిరమ్ము ఘనమొప్పగ గట్టిరి గా యయోధ్యలో

ముద్దుల బాలరాము సరి మోమును జెక్కిరి సొంపుమీరగా  

పెద్దగ మంత్ర యంత్రబల విగ్రహ మచ్చట నిల్పినారహో

వద్దిక జాగు, సాగుడిక వానిని జూడగ జన్మ ధన్యమౌ. 


ఉత్సాహము:

వరగుణముల రాఘవుండు "బాలు" రూపు నిలువగా   

భరత భూమి సంతసించి భాగ్యమింక నాదనెన్  

త్వరితగతిని భక్తులార!  దర్శనమ్మునందరే! 

స్వరము బెంచి "రామ" యనుచు భక్తి భజన జేయరే! 


Friday, 12 April 2024

తప్పులు లేక సాగుడిక

 "భావుక" FB  సమూహము  వారు నిర్వహించిన "క్రోధి" "ఉగాది కవితల పోటీ" లో బహుమతి పొందిన నా పద్యములు.


ఉత్పలమాల:

కాలము మీది గానితరి గష్టములెన్నియు సైపగావలెన్  

గాలము వీడిపోవు, సరికాలము వచ్చి వసంతమందులే

సోలక రండు మీరనుచు, సోయగమొప్పగ గూసె కోయిలల్

జాలినిజూపి "క్రోధి" మము జక్కగ జూడుమ నీదు పాలనన్.

ఉత్పలమాల:

చప్పని జీవితమ్ములిక చప్పున మారగ జేయ బూనుచున్  

రొప్పక తీపి చేదు వగరున్మరి బుల్పుయు నుప్పు కారమే  

యొప్పిన లేహ్యమున్ దినుచు నుత్సహమంది యుగాదివేళలో  

తప్పులు లేక సాగుడిక ధైర్యమునందుచు వెల్గు దారిలో.

 


Tuesday, 9 April 2024

"నగు" నుగాది.

 అందరకు "క్రోధి"నామ నూతన సంవత్సర "ఉగాది" శుభాకాంక్షలు.

 

కందము: 

క్రోధియను వత్సరము, వి

రోధములును జనుల కెపుడు రుజలే లేకన్

బాధలు దొలుగగ వలెనని

మాధవునే వేడుకొందు మనసున నెపుడున్.  

 


సీసము: 

ఉచిత తాయిలముల నూరింతయే తీపి  

కరకు మాటలనుట కారమగును   

మందు విందులనిచ్చు మచ్చికయే చేదు   

బాసలెన్నియొ జేయు పలుకు వగరు

పోటిదారుని దిట్టు పోకడయే యుప్పు

బలుపు చేష్టలవియె  పులుపు గదర 

కాకులెన్నియొవచ్చు కోకిల కూతలన్

సంతగా నిదిగొ వసంతమనుచు  

 

తేటగీతి:

ఎన్నికల పండుగది వచ్చె నెంచి మంచి

నాయకులకును మీ ఓటునయముగాను 

వేయ రాష్ట్రమ్ము దేశమ్ము వెలుగులీని 

ఐదునేడులు మీకింక "నగు" నుగాది.     


Tuesday, 2 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 135



కందము:
"నీ పేరేంటో చెప్పు" అ
నేపాటయె, యింటిపేరునే చెపు బేబీ!
నూ పాలరాతి బొమ్మని
ఆపానుపు జేరుగుర్తు ననుటయె వహవా!



Monday, 1 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 134

 

కందము: 

"చెప్పాలని వుందీ" యను   

గొప్పగు పాటను వినగను కోరిక కలుగున్ 

అప్పటికప్పుడు చెలితో

చప్పున మాట్లాడినట్లె సరి మది తోచున్.  


Saturday, 23 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 133

 

కందము:
"ఒక్క క్షణం ఒక్క క్షణం"
చక్కని ఆ పాట మదికి సంతసమిచ్చున్
చిక్కని హాయిని మోయుట
మక్కువయను మోయలేని మందమ్మైనన్.


Saturday, 16 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 132

 

కందము:
"ఆ నవ్వుల కోసమె" యని
ఆ నడకల కోసమనుచు నా చెలి మనసున్
ఆనెడి పాటను వినగా
తా నగుచును వచ్చు చెలియ తనివిగ ప్రియునే.

Friday, 15 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 131

 

కందము: 

"ఆకులు పోకలు" పాటను

మా కంఠమ్మెత్తి బాడ మనసుప్పొంగున్ 

ఆ కళ్ళతోటి కళ్ళెము 

నా కదములు త్రొక్కినట్టు లాడును మదియే.



Thursday, 14 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 130


కందము: 

"కలవరమాయే మదిలో"

ఇలలో నీపాట వినగ నెవ్వరికైనన్

కలియుచు వీణయు వేణువు

వలపుల రాగాలబాడు భావన కలుగున్.   

Tuesday, 12 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 129


కందము:

"ఓ నాన్నా! నీ మనసే"
ఆ నాన్నది మనసు వెన్న అమృతమ్మనుచున్
గానముజేసిన పాటయె
మానవునకు నాన్న గొప్ప మదిలో నింపున్.



Monday, 11 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 128

 


కందము:
"చీకటిలొ కారుచీకటి
లో కాలమనే" యనుచును లోబాధలహో
ఆకంఠమందు పలుకగ
మాకది విన గుండెలేమొ మరి బరువెక్కున్.


Sunday, 10 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 127

 

కందము: 

"నెలవంక తొంగి చూసిం

ది" లలలలాల మనసైన తీయని పాటన్

కలువల రాజును దలచుచు

చెలికాడున్ చెలియ పాడ చెలువము హెచ్చున్.


Saturday, 9 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 126

 

కందము: 

"రా! వెన్నెలదొర!" యనుచును

ఆ వింతను కనవదేల యనుచును పాడన్ 

ఆ వాలు కనుల చిన్నది

తావలచిన వాని మ్రోల తనివిగ వాలున్.


Friday, 8 March 2024

చల్ల కొండమీది సామి

 ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు

మీకు మీ కుటుంబ సభ్యులు అందరకు "మహా శివరాత్రి" శుభాకాంక్షలు.

కందము: 

కొండంత దేవుడీవని 

కొండంతగ వరములీయ కోరముర హరా!

కొండంత అండగుండుము

కొండెక్కెడివరకు మాకు కోరెదమిదియే. 

ఆటవెలది:

చల్ల కొండమీది సామివే నీవయ్య 

పాల కడలి పైని పద్మ నాభు

నెయ్యమందినావు, నీగొప్ప దెలియగ

పెరుగు భక్తి మాకు ప్రియముగాను. 

ఉత్సాహము: 

భయము గలుగదయ్య నరులు భక్తి నిన్ను గొల్వగా 

జయములవియె చేరనడచు శంకలేక వేడగా

నయముగలుగు జీవితమున నమ్మి పూజ సేయగా

లయములగును  కష్టములును లాభమొదవు ఈశ్వరా .


Thursday, 7 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 125

 

కందము:
"నీ కోసం వెలిసిందీ"
మాకా పాటయె చెవులకు మధువులు నింపున్
లోకమ్మున ప్రేమికులే
సోకుగనే పాడుకొంద్రు చూపుచు ప్రేమల్.

Wednesday, 6 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 124

 


కందము:
"వయ్యారమొలికె చిన్నది"
అయ్యారే ఇట్టిపాట హాయగువినగా
సయ్యాట లాడబొమ్మను
తొయ్యలితోగూడి, మనసు తొందరజేయున్.


Tuesday, 5 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 123



కందము:
"జయహే! నవనీల" వినగ
నయముగ నానందమొదవు, "నల్లనివాడే"
ప్రియముగ "మధురము" లెన్నో
స్వయముగ గలిగుండెననుచు బాగుగ బాడెన్.


Monday, 4 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 122



కందము:
"భలె!మంచి చౌక బేరము"
బలెబలె ఆ పాటమాకు బాగుగ నచ్చున్
కలిమిచెలి పతిని వీధుల
నలనారదుడమ్ము విధమహహహా! ముదమౌ.

Sunday, 3 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 121

 

కందము: 

"ఓ చెలి! కోపమ?" వినగా

మాచెవులను సోకుగీత మాధుర్యమహో! 

ఆ చివరి పద్యమాహహ!

దోచును మది, "సీను" లోకి తోడ్కొనిపోవున్.


Saturday, 2 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 120

 

కందము:
"నను పాలింపగ నడచీ"
వినగా నాపాట మాకు వీనులవిందౌ
కనగా గోపాలుండే
కనికరమున తరలివచ్చి కనినట్లుండున్.

Thursday, 15 February 2024

అల"వాట్"సప్



కందము:  

గ్రీట్సులకున్ ముచ్చట్లకు 

మేట్సుల, కాఫీసులకును మేలగునిదియే 

హ్యాట్సాఫ్ నే చెప్పెదమిక 

“వాట్సప్” కే గ్రూపు గాను వందన మనుచున్.


సీసము:  

పంపగా వచ్చులే వాయిస్సు మెస్సేజి

సెల్ఫీలు మరియెన్నొ  చిత్రములను

చూపగా వచ్చులే ఛూజింగు వీడియోస్  

లైవులో ప్రోగ్రాము మూవి వోలె 

మాట్లాడ వచ్చులే మనవారితోగూడి 

కబురులెన్నేనియు కనులగనుచు 

దింపగా వచ్చులే దిక్కౌచు నేరికిన్  

కోరు లొకేషన్ను చేర బంపి 


తేటగీతి: 

నేర్వగా వచ్చు కళలను నేర్పవచ్చు   

మంచిగా జేరి  గ్రూపుల మనమె జేసి

చెప్పగా వచ్చు నేడికన్ సెల్లునందు       

గొప్ప మాధ్యమ"మాయె" వాట్సప్పునిజము.         


తేటగీతి: 

ఉప్పులేనట్టి కూరనే యొప్పుకొనును

అవసరమ్ముల కొన్నింటి నవతలిడును  

నొప్పులెన్నేని బాధించ నోర్చుకొనును

సైపలేడుర నరుడు వాట్సప్పు లేక.


కందము:

అలవాటైతే ప్రీతిగ       

నల వాట్సప్పును వదలరహా! స్మార్ట్  ఫోనున్   

గలవారలు, డే అండ్ నైట్      

కలవారలు లేనివారు  కనెద రడిక్టై.  

       

కందము: 

ఎన్నుచు మాయల మారులె  

నిన్నున్ బడవేసి వలను నిండుగ ముంచన్  

కన్నింగ్ ఛాట్లను జేతురు    

చిన్నా! అన్నోను కాల్సు ఛీ! ముట్టకుమా!   


తేటగీతి:

"గుడ్డుమార్నింగు" వద్దురా "గుడ్డునైటు"  

"టేస్టు" లేనట్టి పోస్టులు "వేస్టు" గదర! 

"ఎత్తిపోతల" పథకమ్ము నెత్తివేయి   

"సరస ఫలముల" బంచు వాట్సప్పు మేలు.    

 

 

Tuesday, 13 February 2024

ఘంటసాల పాటల "కందాలు" - 119


కందము:
"డీరిడిరిడిరి డిరిడి" యని
మీరిన గడుసైనపాట మెచ్చుచు వినగా
ఊరుచు హుషారు మదియే
ఊరేగును "హహహహహహ హుహ్హూ" యనుచున్.

Friday, 9 February 2024

"గోలీ"లు - 82



కందము:

మొట్టుచు నెత్తిన గొట్టుచు   

బట్టీ బట్టించ వంటబట్టదు చదువే 

పట్టగ వచ్చును "మార్కులు" 

"ఫట్టు"ర నీ "మార్కు" జూప,"పట్టదు" గోలీ!     



Thursday, 8 February 2024

క్రొత్త "way" మన పద్యం - 1

 

ఆటవెలది: 

"సాల్టు","క్యాంఫ"రేమొ సరినొక్క కలరుండు  

టెస్టు జేసి చూడ టేస్టు వేరు

"మెన్ను"లోన "జెంట్లిమెన్న"న డిఫరురా  

వర్డ్సు వినుము ఆస్కు వన్సుమోరు.



Wednesday, 7 February 2024

ట్రాఫిక్కు"జాము"

 కందము:

హర్రీబర్రీ నగరము
హుర్రే!"ట్రాఫిక్కు జా" మహో, కన వెహికిల్స్
గొర్రెల మందగ తోచును
వర్రీతో "జాము" కడుగు వరకే కదలున్.


Tuesday, 6 February 2024

తల తోక

 నిన్న 5-2-2024 న "సాహిత్యం" గ్రూప్ నందు ఇచ్చిన సమస్య "తలతోక లేనివేమనపద్యాలు" కు నా పూరణ.


ఆటవెలది:

ఆటవెలదులందు నందముగాజెప్పె

నీతి, జనులు దెలియ నిజముగ, కల

వె? తలతోక లేనివేమనపద్యాలు

తలయె "విశ్వ", తోక తలప "వేమ"



"గోలీ"లు 80-81



ఫిబ్రవరి '24 "రవళి" మాస పత్రికలో ప్రచురితమైన నేను వ్రాసిన పద్యములు.


కందము: 

వినవలదుర చెడు మాటలు 

కనవలదుర కానిపనులు కన్నులతోడన్ 

అనవలదుర చెడు పలుకులు 

మనవలదుర మంచిలేక  మనమున గోలీ! 


కందము: 

మన మేమనవలదుర భువి 

మనమే గొప్పని పరుషపు మాటల పరులన్    

మన వలెనందరు సుఖముగ

మనవలెనని దలచవలయు  మనముల గోలీ!

Friday, 26 January 2024

అల్లూరి

      

గత  2023సం.  స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా "అచ్చంగా తెలుగు" గ్రూప్ వారు నిర్వహించిన  పద్యాల పోటీ లో బహుమతి పొందిన పద్యములు.   

 

అల్లూరి సీతారామరాజు


ఉత్పలమాల:  

చేరి పరాయిపాలనను చిక్కిన జాతికి స్వేచ్ఛనీయగా  

భారత మాత దాస్యమును బ్రద్దలు జేయగ బూనిరెందరో

వీరులు, వారిలోన ఘన విప్లవ వీరుడు తెల్గునేలపై

పోరుచు నేల రాలె గద, పుణ్య చరిత్రుడు రామరాజహో!


ఆటవెలది:  

కట్టె నొంటిపైన కాషాయమును తాను

పట్టె విల్లుచేత పటుతరముగ

ఇట్టె రాజు నిలువ నిల మన్య ప్రజకు కన్

పట్టె పరశురామ భాతి నిజము.


కందము:

విల్లమ్ములు చేబూనిన

అల్లూరియె మదిని మెదల నదరుట మొదలై

"తెల్లోడి" గుండె జారుచు

నల్లాడుచు "సేవ్ మి" యనుచు నా "గాడ్" దలచున్.


ఉత్పలమాల:

దిక్కయి మన్నెపుంబ్రజల దీనత మాన్పగ, పోరు సల్పుచున్

పెక్కుగ నాయుధాలు తన పేర టపాలను పంపి దోచుచున్

చుక్కలు చూపినట్టి ఘన శూరుడు, రాజును జంపబూనుచున్

టక్కరి "రూథరూఫరు" "డెటాకు"ను జేయగ నెంచె మాటుగా.


కందము:  

పడమటి సూర్యున కర్ఘ్యము

నిడు రాజుకు "దొంగ దొరలు"  నెక్కిడి "గన్నుల్" 

విడువగ తూటాల్, వీడెను  

పుడమిని, తన కీర్తి వదలి మూసెను కన్నుల్.