తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 30 June 2017

వదినా నీకంద జేతు స్వర్గసుఖమ్ముల్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వదినా నీకంద జేతు స్వర్గసుఖమ్ముల్.


కందము: 
మదిలోనన్నే దలచుచు 
పదిలముగా పడకజేర వచ్చిన వనితా 
సుదినమ్మిది తోషపు త్రో 
వది, నా నీకంద జేతు స్వర్గసుఖమ్ముల్.

Wednesday, 28 June 2017

గాయము - వాపు - పుండు - రసి....తో ... కీచక వధ వర్ణన.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 02 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - గాయము - వాపు - పుండు - రసి....తో కీచక వధ వర్ణన. 


భీముడు కీచకునితో....

కందము: 
త్వరగా యమునే జూపెద 
మెరసిన నా పౌరుషమ్ము మెచ్చగ తుళువా!
పురమున కాపుండెవ్వడు 
గిరగిర నినుద్రిప్పి జంప కీచక! ధూర్తా! 

Sunday, 25 June 2017

కులటం గని పిలిచి సీత కురు లల్లమనెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 02 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కులటం గని పిలిచి సీత కురు లల్లమనెన్. 


కందము: 
అలమున్యాశ్రమమందున 
చెలికత్తెలు రాగ తావి చిందగ, చేతన్ 
గలిగిన సొంపుమొగలి రే 
కులటం గని పిలిచి సీత కురు లల్లమనెన్. 

Saturday, 24 June 2017

నిధనము - శవము - పాడె - చితి తో పెండ్లి వేడుక.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 01 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - నిధనము - శవము - పాడె - చితి తో పెండ్లి వేడుక.


కందము: 
వలచితినా మరదలునే 
అలశైశవమునను కలసి యాడిన దానిన్ 
వలదని ధనమున్ కట్నము
చెలువుగ పెండ్లాడ పాడె చెంగున మనసే. 

Friday, 23 June 2017

శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటులగున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 01 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటులగున్.



కందము: 
తనమాయను తెలియకయే 
పెనుపందిని గొట్టి నరుడు వీరుండగుచున్
ఘనముగనే వేయగ నీ 
శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటులగున్?

Thursday, 22 June 2017

కుడి, జడి, పొడి, గడి ... భారతార్థంలో...

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 01 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది: కుడి, జడి, పొడి, గడి ... భారతార్థంలో... 


కందము: 
పొడిచిన యెండకు నెండుచు
జడివానల తడిసి వనము సైచితి మికపై 
గడిపెదమజ్ఞాతమ్మును
కుడియెడమగ తీరిపోయి కూలును వెతలే. 

Wednesday, 21 June 2017

పార్వతి ముద్దాడె మెచ్చి పంకజనాభున్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 01 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పార్వతి ముద్దాడె మెచ్చి పంకజనాభున్.



కందము: 
ఉర్విజని బాలగణపతి 
పర్వతమున తిరుగుచుండ బట్టుక హరియే 
శర్వాణికీయ సుతునే 
పార్వతి ముద్దాడె, మెచ్చి పంకజనాభున్.

Tuesday, 20 June 2017

శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 12 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే.



కందము: 
శాస్త్రము లెన్నియొ జదివిన
శాస్త్రికి కోపమ్మెయున్న సరిగాదటులే 
మేస్త్రీ కూలీయైనను 
శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే.

Monday, 19 June 2017

తాళములో నుండు కప్ప దడదడలాడెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 12 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తాళములో నుండు కప్ప దడదడలాడెన్.



కందము: 
తాళము పొమ్మన పొరుగున 
తాళము నింటికిని వేసి తాళము క్రిందన్ 
తాళము వేయగ నా పా 
తాళములో నుండు కప్ప దడదడలాడెన్.

Sunday, 18 June 2017

గీతను బోధించె నరుఁడు గీష్పతి వినఁగన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 12 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - గీతను బోధించె నరుఁడు గీష్పతి వినఁగన్.



కందము: 
ప్రీతిగ పలికిన శ్లోకము 
లే తగు రాగమ్ములోన లెస్సగ బాడెన్ 
ఖ్యాతిగనె ఘంటసాలయె 
గీతను బోధించె నరుఁడు గీష్పతి వినఁగన్.

Saturday, 17 June 2017

బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 12 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్.



కందము: 
హలమును నేలను బట్టుచు 
పలుగోపాలకులు లాగి వక్రత దున్నన్ 
హల! 'చాలు' చాలు చాలని 
బలరాముఁడు 'సీతఁ' జూచి ఫక్కున నగియెన్.

Friday, 16 June 2017

మూడు నాలుగు గలిపిన ముప్పది కద.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 12 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మూడు నాలుగు గలిపిన ముప్పది కద.



తేటగీతి: 
ముప్పు మూడొక్కచోటను కొప్పులున్న 
ముప్పు దుష్ట చతుష్టయమ్మొకటిగాగ 
చెప్ప ముమ్మాటికిని విను ముప్పుముప్పు 
మూడు నాలుగు గలిపిన ముప్పది కద.

Thursday, 15 June 2017

దిన, వార, పక్ష, మాస మహాభారతార్థంలో....

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




దత్తపది - దిన, వార, పక్ష, మాస మహాభారతార్థంలో....



కందము:  
కద ధర్మ పక్షపాతివి 
మదినమ్మిన వారమయ్య మాధవ! నిన్నే
కదనమ్మున మాసఖునిగ 
సదయుడ తగు సాయమిచ్చి జయమీయ గదే!

Wednesday, 14 June 2017

కార్తికమున శివుని పూజ గడుఁ బాపమగున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కార్తికమున శివుని పూజ గడుఁ బాపమగున్. 


కందము: 
ఆర్తిగ నిముసమ్మైనను 
కీర్తించిన భవుని గలుగు కీర్తి శుభమ్ముల్ 
పూర్తిగ నెగగొట్టినచో 
కార్తికమున శివుని పూజ, గడుఁ బాపమగున్

Monday, 12 June 2017

ఇది చూ సి.నా.రె.

డా. సి.నా.రె. గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.


Image result for c narayana reddy images



తేటగీతి:
పాటలెన్నియొ చక్కగా వ్రాసినారె
వేల సాహిత్యముల దారి వేసినారె   
చేరి తెలుగును వెలుగగా జేసినారె
వాణి పుత్రుడవీవుగా వాహ్! సి.నా.రె.  

ఎదను జీల్పఁ గనంబడు హేమమణులు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఎదను జీల్పఁ గనంబడు హేమమణులు. 


తేటగీతి: 
బీరువాలోని 'చెస్టు'లో బీరుబోక 
దాచియుంతురు సంపదల్ దారుణముగ 
నల్ల ధనమును మార్చుక, నయమునట్టి 
యెదను జీల్పఁ గనంబడు హేమమణులు.

Sunday, 11 June 2017

తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్


కందము: 
మన్నున కష్టము బడుచును 
అన్నియు ఫలితములిక పరమాత్మునివనుచున్ 
అన్నము జగతికి నిడు రై 
తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్. 

Saturday, 10 June 2017

పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు



ఆటవెలది: 
గాటనున్నపశువు కాలుదువ్వుటగని
మోరనెత్త జూచి మోజుగనుచు 
దున్న తోడు బంప తోషమున దలచె 
పడ్డ, "వాఁడు కాఁడు చెడ్డవాఁడు".

Friday, 9 June 2017

భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్.



కందము: 
శ్రీమతి శ్రీవారు కలిసి 
రేమో మొగమటుగద్రిప్పి, యిట్టుల తుదకున్  
బామాలుచు భర్త పిలిచె 
భామా రమ్మనుచు, ముదిత భర్తను బిలిచెన్.

Thursday, 8 June 2017

విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే. 



ఉత్పలమాల: 
సుప్రజ పెండ్లిగాగ తగుచోటుకు మిత్రుల జేర బిల్వగా 
విప్రులుగానివారు తగ వేడ్కను నిల్వుగ నూపగా తలల్ 
విప్రకులమ్ము నాదనుచు పెద్దగ నడ్డముగానె చక్కగా 
విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే. 

Wednesday, 7 June 2017

సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్.


కందము: 
మొగ్గుచు ధర్మము వైపున 
తగ్గట్టుగ పేదవారి దయతో గనుమా 
దగ్గరకే రానీయకు 
సిగ్గెగ్గులు లేని మనుజు, సిరి తా వలచున్.

Monday, 5 June 2017

బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.


కందము: 
గుండా సుబ్బారాయుడు
కండలవీరుండు బూని ఘనమౌ ప్రతినన్ 
దండిగ పునుగులు బజ్జీల్ 
బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.

Sunday, 4 June 2017

హారము గొలిచిన నది పది యామడలుండెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - హారము గొలిచిన నది పది యామడలుండెన్.



కందము: 
తీరగు ' నెక్లెస్ ' రోడ్డది
యారహదారియె పురమున కావలనుండెన్ 
మీరిన పట్టణ కంఠపు 
హారము,గొలిచిన నది పది యామడలుండెన్.

Saturday, 3 June 2017

దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.


కందము: 
దేవుళ్ళాడక బయటే
దేవుని మదిలోననిలిపి దేహీ! పాహీ!
దేవుడ ! యన రక్షింపని 
దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.

Friday, 2 June 2017

కారాగారమున ఘనసుఖంబులు దక్కున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కారాగారమున ఘనసుఖంబులు దక్కున్. 



కందము: 
గారాబము తో తల్లియె 
మీరుచు తన సుతుల జేరి మెత్తని బుగ్గల్ 
తీరుగ నిమిరిన తోషులు 
కారా? గారమున ఘనసుఖంబులు దక్కున్.


Thursday, 1 June 2017

అయ్యను గని విరహమందె నతివ సహజమే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అయ్యను గని విరహమందె నతివ సహజమే.  


కందము: 
అయ్యడవిలోన నుండగ 
తొయ్యలి యా శూర్పణఖయె తొందరబడెగా 
నయ్యతి సుందరుడౌ రా 
మయ్యను గని విరహమందె నతివ సహజమే.