తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 30 September 2015

మగవానికి గర్భమాయె మానిని గూడన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మగవానికి గర్భమాయె మానిని గూడన్



కందము: 
తెగ పూజలెన్నొ సలుపుచు 
మగ డాక్టరు చెప్పినట్టి మందులు వాడెన్ 
తెగిపోయెను దోషంబులు 
మగవానికి; గర్భమాయె మానిని గూడన్

Monday, 28 September 2015

సతినిజంపె రామచంద్రమూర్తి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సతినిజంపె రామచంద్రమూర్తి



ఆటవెలది: 
రావణాసురుండు రణములో నెదిరించ
పర వనితను బట్టె పాపియనుచు
తలచి మదిని వనిని తపియించుచున్నట్టి
సతిని, జంపె రామచంద్రమూర్తి

Sunday, 27 September 2015

సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్. 


చంపకమాల:
అతులిత శౌర్య మూర్తి మదనారికి భక్తుడు శౌరికాప్తుడౌ 
స్తుతమతి సవ్యసాచి గని చూపుల ప్రేమను చూపి మెచ్చె స
మ్మతమున నాయులూచి, సఖు మానసమిట్టులె దోచి పాండురా 
ట్సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్. 

Thursday, 24 September 2015

నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే.



కందము: 
గట్టి సినీ ప్రొడ్యూసరు 
చిట్టిని పెండ్లాడుచుండ సినిమా తారల్ 
చుట్టముల తోడు వచ్చెను 
నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే.

కందము: 
పుట్టిన సుతలను దక్షుడు 
మెట్టింటికి పంపనెంచి మేనానే యి 
ప్పట్టున పిలుమని చెప్పగ 
నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే.

(దక్షుని పుత్రికలు 27 నక్షత్రాలు) 

Wednesday, 23 September 2015

గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  30 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ 



కందము: 
వెతలందున నిది తలచకు 
'గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ '
వెతలందున నిది తలచుము 
'గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ '

Monday, 21 September 2015

మల్లియ తీవియకుగాచె మామిడికాయల్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మల్లియ తీవియకుగాచె మామిడికాయల్


కందము:
అల్లన నడచుచు దిరిగెడి
నల్లని కన్నయ్య మొలకు నాణెముగానే
అల్లిన బంగరు త్రాడది
మల్లియ తీవియకుగాచె మామిడికాయల్

Sunday, 20 September 2015

నాలు గైదులు పదునాఱు నలిననయన.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - నాలు గైదులు పదునాఱు నలిననయన.



తేటగీతి:
పైన క్రిందుగ పదునారు పదియునారు 
కలసి ముప్పదిరెండుగ కలవు నీకు 
పైన నాలుగదనము పైపండ్లు నాకు 
నాలు గైదులు, పదునాఱు నలిననయన.

Saturday, 19 September 2015

జందెము విడనాడువాడె సద్బ్రాహ్మణుడౌ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - జందెము విడనాడువాడె సద్బ్రాహ్మణుడౌ


కందము: 
విందువె ! శ్రావణ పౌర్ణమి 
నందున, మరి తీరిపోగ నాశౌచములే 
జందెము మార్చగ ప్రాతది 
జందెము విడనాడువాడె సద్బ్రాహ్మణుడౌ

Friday, 18 September 2015

గీతాపారాయణమ్ము కీడొనరించున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - గీతాపారాయణమ్ము కీడొనరించున్




కందము: 
గీతా పారాయణమును 
సీతా రాములకు పూజ చేతువ యిపుడే !
ప్రీతియు శుభ్రత లేకను 
గీతా ! పారాయణమ్ము కీడొనరించున్

Thursday, 17 September 2015

"కంప్యుటరు" గణ (న) నాథ !

ఓం శ్రీ గణాధిపాయ నమః. 

వీక్షకులందరికీ  వినాయక చవితి శుభాకాంక్షలు.
























సీసము:
మాత పంచెను నీకు "మదరుబోర్డ్ సాఫ్ట్వేరు" 
హరుడిచ్చె గజశిర "హార్డువేరు" 
ముల్లోకముల "నెట్టు" లల్ల "కనెక్షన్లు" 
మూషికమేగాగ "మౌసు" నీకు 
"ఓం" లు జూడగ "డాటు కాం"లుగా మారగా 
దైవాల "వెబ్ సైట్ల" త్రోవ నీవు 
పన్ను "రైటరు డిస్కు" పిన్నుగానే జేసి 
వ్యాస భారతమీవు వ్రాసినావు

ఆటవెలది: 
గణనయంత్రములను ఘన "కంప్యుటరు" వీవు   
గణముల పతి నీవె గణన నాథ ! 
మంచి "సైట్ల" నీవు మాతోడ తెరిపించి 
"వైరసు" దరి రాని వరమునిమ్మ. 

Wednesday, 16 September 2015

వెన్న దొంగలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - వెన్న దొంగలు 























కందము:
వెన్నను మ్రుచ్చిలు చుండిన 
వెన్నుని గన ముద్దు వచ్చు, వెనకనె నీడై 
వెన్నంటి నడచు రాముడు
వెన్నంటిన చేయి దాచి వీధికి రారే !

Tuesday, 15 September 2015

చిల్లర " నాణెములు "

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - చిల్లర " నాణెములు " 



















కందము: 
చెల్లని నాణెములనుచును 
చిల్లరగా చూడబోకు చేరిచి దాచన్ 
పిల్లల పిల్లలకే సరి 
గల్లాలో గత చరిత్ర కనబడు గాదా !

Monday, 14 September 2015

రాముఁడనఁగను సాక్షాత్తు రావణుండె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - రాముఁడనఁగను సాక్షాత్తు రావణుండె.




తేటగీతి: 
చూడనటన భూకైలాసు చోద్యమంద 
ఎంటియారును వేరుగా నెంచగలమె 
నటనమందున జీవించె నందమూరి 
రాముఁడనఁగను సాక్షాత్తు రావణుండె.

Sunday, 13 September 2015

పందికిన్ బుట్టె చక్కని పాడియావు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పందికిన్ బుట్టె చక్కని పాడియావు



తేటగీతి: 
తెలుపు రంగును జూడగా నలుపు బుద్ధి 
పందికిన్ బుట్టె, చక్కని పాడియావు
నడచి వెడలుచు నుండగా బడగ జేసి
బురదనే మీద, నవ్వెను గురుగురనుచు.

Saturday, 12 September 2015

రావణుఁ దల్చు సీతఁ గని రాముఁడు నవ్వెను సంతసమ్మునన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రావణుఁ దల్చు సీతఁ గని రాముఁడు నవ్వెను సంతసమ్మునన్.



ఉత్పలమాల: 
రావణు సంహరించి పతి రాముని తోడను పుష్పకంబునన్ 
త్రోవను సాగువేళ గని దూరమునుండియె క్రింద జింకలన్
భావమునందు నా గతము బాధగ దోచగ మీదవాలుచున్ 
రావణుఁ దల్చు సీతఁ గని రాముఁడు నవ్వెను సంతసమ్మునన్

Friday, 11 September 2015

తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్


కందము: 
ఘన ప్రహ్లాదుని జనకుడు 
తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్
చనుబాల నెపమునను పూ 
తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్

Thursday, 10 September 2015

భర్తను వధియించ వనిత పరితోషించెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భర్తను వధియించ వనిత పరితోషించెన్.



కందము:
ధూర్తుడు మూర్ఖుడు కడు చెడు 
వర్తన గల వాని పైకి వానర సఖుడై 
యార్తిని బాపగ లంకా 
భర్తను వధియించ వనిత పరితోషించెన్.

Wednesday, 9 September 2015

సీతకు రాఘవుఁడు పుట్టి శివధను వెత్తెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - సీతకు రాఘవుఁడు పుట్టి శివధను వెత్తెన్.



కందము: 
ఈ తరుణి లక్ష్మి రూపము 
నే తగు వరు వెదకి చేతు నిటు పెళ్ళనుచున్
ప్రీతిగ జనకుడు వెదకగ
సీతకు, రాఘవుఁడు పుట్టి శివధను వెత్తెన్.

Monday, 7 September 2015

గరుడుని మ్రింగిన దట భుజగము గుటుకునన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - గరుడుని మ్రింగిన దట భుజగము గుటుకునన్.



కందము: 
తిరుగుచు నుండగ సూర్యుడు 
మరి రాహువు వచ్చి మ్రింగె మసకయె జగమే 
సరిదోచె నిట్లు మనమున 
గరుడుని మ్రింగిన దట భుజగము గుటుకునన్.

Sunday, 6 September 2015

చే ' తల ' దలపన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - చే ' తల ' దలపన్.


























కందము:
చేయేలేదనుచేదీ 
చేయగ లేననక నొక్క చేతనె పనులన్ 
జేయుచునునుండె నాతడు 
చేయగ లేనట్టిదేది చే ' తల ' దలపన్.

Saturday, 5 September 2015

శ్రీ వాల్మీకీ !

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం: శ్రీ వాల్మీకీ !



















కందము: 
శ్రీ కర రాముని కథనే 
కూకూయను కొమ్మపైని కోకిల వలెనే 
మాకందగ జేసిన యో 
శ్రీ కవివర వందనమ్ము శ్రీ వాల్మీకీ !

(కూజంతం రామ రామేతి
మధురం మధురాక్షరమ్|
ఆరుహ్య కవితా శాఖాం
వందే వాల్మీకి కోకిలమ్||)

Friday, 4 September 2015

శ్రీకృష్ణుడుశూర్పణఖకు జెవులం గోసెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శ్రీకృష్ణుడుశూర్పణఖకు జెవులం గోసెన్.


కందము: 
ఆ  కలికి సత్యభామకు 
శ్రీకరమగు రామచరిత జెప్పుచు నపుడే 
నాకతన నిట్లు చెప్పెను 
శ్రీకృష్ణుడు, "శూర్పణఖకు జెవులం గోసెన్".

Thursday, 3 September 2015

రావణునిపత్ని సీతమ్మ రామభగిని

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రావణునిపత్ని సీతమ్మ రామభగిని



తేటగీతి:
రామచరితము ' సీరియల్ ' రమ్యముగను 
తీయదలచితి నూరూరు తిరుగుచుంటి
పాత్రధారులకోసమై వరుస మిగిలె 
రావణునిపత్ని, సీతమ్మ, రామభగిని

Wednesday, 2 September 2015

తలకాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తలకాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్



కందము: 
ములగయు గుమ్మడి దోసయు 
పలురకముల కాయలనిడి వండగ పులుసున్ 
పిలకను ముడివేసి నిమిరి 
తల, కాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్

Tuesday, 1 September 2015

కదళీ ఫలం.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - కదళీ ఫలం. 











కందము: 
ఈ కదళీ ఫలములు మన 
కేకార్యమ్మునకునైన నేనోమునకున్ 
శ్రీకరమగు , రుచికరమగు
నాకటికిని తినెడు వారి కారోగ్యమిడున్.