తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 31 August 2013

కపిని వలచి గిరిజ తపము సేసె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కపిని వలచి గిరిజ తపము సేసె.

ఆటవెలది:
దక్ష యజ్ఞ మందు దహనంబు తానాయె
సతిగ నున్న చరిత సమసి పోయె
తిరిగి జేర దలచి మరు రూపుగా వృషా
కపిని వలచి గిరిజ తపము సేసె.

Friday, 30 August 2013

ముగిసె నాషాడ మని యేడ్చె ముద్దుగుమ్మ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ముగిసె నాషాడ మని యేడ్చె ముద్దుగుమ్మ.

తేటగీతి:
అమ్మగారింట నాషాఢ మనుచు జేరి
తల్లి ప్రేమను పొందెను తనివిదీర
శ్రావణంబున పతి దరి సాగనంప
ముగిసె నాషాడ మని యేడ్చె ముద్దుగుమ్మ.

Thursday, 29 August 2013

సుభాస్ చంద్ర బోస్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - సుభాస్ చంద్ర బోస్




























తేటగీతి:
తెల్లవారల పాలన తెల్లవారి
చంద్ర కాంతులు విరియగ చంద్ర బోసు
భరత జాతిని నడిపించె పరుగులెత్తి
మాయమాయెను తుదకు నేమాయెనేమొ?

Wednesday, 28 August 2013

వచ్చిన పని సఫల మయ్యె వైరము హెచ్చెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - వచ్చిన పని సఫల మయ్యె వైరము హెచ్చెన్.
కందము:
చిచ్చర పిడుగై తిరుగుచు
వచ్చిన సూకరము గొట్ట వాదము మొదలై
రెచ్చిరి హర నరులు,  భవుడు
వచ్చిన పని సఫల మయ్యె వైరము హెచ్చెన్.

Tuesday, 27 August 2013

సింహము (హరి)

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - సింహము (హరి) 






















కందము:
హరిణము కనబడెనేమో!
హరి కదలుచు నుండె దూక నాకటికేమో!
హరి! హరి! రక్షణ జేయుము
హరియింపక లేడి యుసురు నచ్యుత! స్వామీ!

Monday, 26 August 2013

భాష రానివాడె పండితుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - భాష రానివాడె పండితుండు.

కందము:
నాటకమ్ము లోన నాకు వేషము నీయ
నగదు నిత్తు చాల ననుచు బలుక
మురిసి కవిని జేసె ముత్తయ్య నటజూడ
భాష రానివాడె పండితుండు. 

Friday, 23 August 2013

ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్
కందము: 
లేతగ దూరెను కిరణపు
జ్యోతులు, భేదాలు లేవు సూర్యుని కిలలో
గీతాచార్యుని గుడిలో
నీతాకుల గుడిసెలోన, నినుఁ డుదయించెన్ 

Thursday, 22 August 2013

పెండ్లికాని పిల్ల బిడ్డను గనె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - పెండ్లికాని పిల్ల బిడ్డను గనె.

ఆటవెలది:  
తమ్ము కొడుకు పెండ్లి తానుగా పిలిచెను
పురిటి కిటకు వచ్చె పుత్రి- నాదు
మనసు లాగు చుండె మరి నేటి రాత్రియె
పెండ్లి- కాని పిల్ల బిడ్డను గనె.

Wednesday, 21 August 2013

బాల కార్మికుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
 
వర్ణ(న) చిత్రం - బాల కార్మికుడు















ఆటవెలది:
బలము లేనివాడ పాల బుగ్గల వాడ
పలక యేది  చేత బలపమేది
సుత్తి గొట్ట కనకు సుత్తిని గొట్టకు
పనిని విడచి వెడలు బడికి చిన్న!

Tuesday, 20 August 2013

కరము - తరము - వరము - హరము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

దత్తపది : కరము - తరము - వరము - హరము
రాయబారానికి పోనున్న కృష్ణునిముందు ద్రౌపది ఆవేదనను గూర్చి

ఆటవెలది:
కలుష హర ముకుంద గమనించు నన్నిటు
దుస్ససేను చర్య దుఃఖ కరము
తరము గాదు నాకు దానిని మరువగా
వరము నిమ్ము నాకు వాని చావు.

Monday, 19 August 2013

బంగరులేడి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం -  బంగరులేడి.




















ఆటవెలది: 
పసిడి వనచరమ్ము పట్టి తెచ్చిన చూడ
పచ్చ నౌను మనదు భవిత నిజము
నాదు మనసు తెలిసి నాథుడా వెడలుము
తరుణ మిదియె వేగ తరలుమింక.

Sunday, 18 August 2013

తండ్రి నేర్పు విద్య తప్పు గాదె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - తండ్రి నేర్పు విద్య తప్పు గాదె

ఆటవెలది:
దోపిడీలు జేసి దోచుచు జనులను
దొరక కుండ తిరుగు దొరయె వాడు
నన్ను మించ వలయు నా పుత్రు డనుచును
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె ?

Saturday, 17 August 2013

మాట తప్పు వాఁడు మంచివాఁడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - మాట తప్పు వాఁడు మంచివాఁడు
ఆటవెలది:
ప్రక్క యింటి లోని పాపయ్య గారికి
పుత్రు లిద్దరయ్య పోల్చి చూడ
వారి గూర్చి నేను  వరుసగా చెప్పెద
మాట తప్పు వాఁడు,  మంచివాఁడు

Friday, 16 August 2013

తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.

తేటగీతి:
జన్మనిచ్చిన గ్రామంబు 'ఛాఛ' బోరు
కజ్జ కాయలు తల్లీయ 'పిజ్జ' గోరు
మమ్మి యనుగాని యిమ్ముగ నమ్మ యనరు
తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.

Thursday, 15 August 2013

బలముగ నిలుపుము భారత మాతన్.

వీక్షకులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.   




 
















కందము :
బలియై రెందరొ  స్వేచ్చా
ఫలితములన్ మనకునీయ - ఫలమందెగదా!
ఫలముల జేయకుమా ని
ష్ఫలముగ - బలముగ నిలుపుము భారత మాతన్. 



Wednesday, 14 August 2013

తాటక సంహారము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - తాటక సంహారము



























కందము:
తాటక నిలువుము నిను బం
తాటగ నే నాడుకొందు ధైర్యము గలదా?
తాటను దీసెద నటుపై
తాటాకును గాల్చినట్లు తగులంబెడుదున్!

Tuesday, 13 August 2013

వంట జేయలేని వాడు మగడ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - వంట జేయలేని వాడు మగడ

ఆటవెలది:
కార్య భార మనుచు భార్య మాట వినక
శెలవు నాడు బాసు పిలువ వెడలె
భక్ష్య భోజ్య ములను బహు బహు విధముల
వంటజేయ - లేనివాడు మగడ?

Monday, 12 August 2013

పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.
తేటగీతి:
వామ భాగము గూర్చుండ వసుధ పుత్రి
వెనుక తమ్ముళ్ళు మువ్వురు వేడ్క నిలువ
హనుమ పాదాల బట్టగ నలరుచు గను
పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

Sunday, 11 August 2013

సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.

కందము:
మేనా హిమగిరి పుత్రిని
మీనాక్షిని మూడుకండ్ల మేలగు దొరకున్
మేనున సగమమరిన దొర
సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.

Saturday, 10 August 2013

గురు పత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - గురు పత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్.

కందము:
తిరుగక పార్టీలనుచును
చిరు ప్రాయపు పిల్లల నిక చేకొని ముద్దుల్
మురిపెము లిమ్మని పైకినె
గురు పత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్.

Friday, 9 August 2013

శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు

తేటగీతి:
స్త్రీలు బాలలు వృద్ధులు చేతగాని
పిరికి వారలు మరియును పేడి వారి
నెన్ని యుద్ధము చేయుట కన్న జూడ
శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు

Thursday, 8 August 2013

విశ్వకవి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - విశ్వకవి  






















కందము:
అంజలి గైకొనుమా గీ
తాంజలి కృతి కర్త! భరత ధాత్రిని నీవే
రంజిల జేసితి వయ్యా!
కుంజరముగ 'విశ్వకవివి' కొను మా ప్రణతుల్.

Wednesday, 7 August 2013

తులను పట్టు నెడలఁ గలుగు సుఖము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - తులను పట్టు నెడలఁ గలుగు సుఖము.

ఆటవెలది:
తులను దూగు సిరులు కలిగియున్నను గాని
హితుల గతుల నిడు మహిత వరులను
మతుల జెరచ కుండ మన్నింపుగల స్నేహి
తులను పట్టు నెడలఁ గలుగు సుఖము.

Tuesday, 6 August 2013

అమ్మాయీ ! అమ్మకు జేజే !






శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-06-2012

న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న)చిత్రం - అమ్మాయీ ! అమ్మకు జేజే ! 
భ్రూణ హత్యకు పాల్పడకుండా అమాయిని గన్న అమ్మకు జేజే !





 

















కందము:
అమ్మా ! యీలోకమ్మున
నమ్మాయిగ బుట్టి నావు,  అమ్మయ్యా! మీ
యమ్మకు జేజేలిత్తును
అమ్మాయీ ! యందుకొనుము, హాయ్ హాయ్ తల్లీ!

Monday, 5 August 2013

కనులు లేనివాఁడు కన్ను గొట్టె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కనులు లేనివాఁడు కన్ను గొట్టె.

ఆటవెలది:
నడచి వెడలుచుండ నళినాక్షి యొక్కతె
చాల గాలి వీచి జారె పైట
బుద్ధియున్న వాడు మూసెను తన రెండు
కనులు, లేనివాఁడు కన్ను గొట్టె.

Sunday, 4 August 2013

భిక్షగాడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ(న) చిత్రం - భిక్షగాడు.
















తేటగీతి:
గుడిశ లేదయ్య నాకింత కుడువ లేదు
కాలు కదపగ లేనయ్య కాలునెడకు
దారి లేదయ్య యడిగితి దారి లేక
దారి బోవుచు చేయుడు ధర్మమిపుడు. 

Saturday, 3 August 2013

ఆంధ్ర కేసరి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - ఆంధ్ర కేసరి.  






















తేటగీతి:
రొమ్ము జూపుచు చావును రమ్మనుచును
తెలుగు తెగువను తెలిపెను 'వెలుగు యొజ్జ'
కేసరి యను నామ మతనికే సరి యని
ఆంధ్ర మాతయె పలికిన యాప్త మూర్తి.

Friday, 2 August 2013

దత్తపది - అక్క, అన్న, వదిన, మామ పదాలతో..

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - అక్క, అన్న, వదిన, మామ పదాలతో...మండోదరి రావణునకు చేసిన హితబోధ.     
తేటగీతి:
అక్కటా!  జనకజ పైన నాశ  వదలు
మన్న, మామాట వినవెట్టి మాయ గ్రమ్మె!
క్షేమ మా మనుజులె యని జేయకున్న!
వినవ ! దినకర కులజుని వేడు శరణు.

 

Thursday, 1 August 2013

కడు దరిద్రుడు రాజ యోగమ్మునందె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కడు దరిద్రుడు రాజ యోగమ్మునందె.

తేటగీతి:
ప్రజల పాలన యందున ప్రజల బాగు
కొరకు పోరెడు వారికి కోరి ప్రజలు
పదవి నిత్తురు జూడగ భరత భువిని
కడు దరిద్రుడు రాజ యోగమ్మునందె.