తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 31 December 2012

మారు బూజింతు దైత్య సంహారు ధీరు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - మారు బూజింతు దైత్య సంహారు ధీరు.

తేటగీతి:
తాటకాంతకు, సరియేడు తాటి చెట్లు
వ్రేల్చి యొక్కట శరమున, గూల్చి వాలి
దశముఖాసురు జంపిన దశరథుని కు
మారు బూజింతు దైత్య సంహారు ధీరు.

Sunday, 30 December 2012

పంది మిగుల చొక్కె సుందరాంగి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - పంది  మిగుల చొక్కె సుందరాంగి.
ఆటవెలది:
'సాఫ్టు వేరు ఫీల్డు' చక్కని జీతమ్ము
చిన్న తనము నందు స్నేహి తుండు
పెండ్లి యాడు మనిన వేడ్కతో తా వల
పంది, మిగుల చొక్కె సుందరాంగి.




Saturday, 29 December 2012

కవి గౌరవ మెల్ల కావ్యగానము చెఱచెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - కవి గౌరవ మెల్ల కావ్యగానము చెఱచెన్.

కందము:
చవు లూరగ పాడెను పు
ష్పవిలాపమును ఘంటసాలయె, దానిన్
భువి నొకడు మార్చి పాడగ
కవి గౌరవ మెల్ల కావ్యగానము చెఱచెన్.

Friday, 28 December 2012

నిషేధాక్షరి - (క,ఖ,గ,ఘ,ఙ లను) ఉపయోగించకుండా కాకి, కోకిల

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

నిషేధాక్షరి - (క,ఖ,గ,ఘ,ఙ లను) ఉపయోగించకుండా కాకి, కోకిల ల సామ్యభేదాలపై

కందము:
నలుపే రెండును చూడగ
తలపే వేర్వేరు యరపు దారులు వేరౌ
తలపున మెత్తురు దీనిని
తలుపులు మూసేరు చూడ దానిని నిజమే ?

Thursday, 27 December 2012

పదుగు రాడు మాట పాడి గాదు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - పదుగు రాడు మాట పాడి గాదు 

ఆటవెలది:
పదుగు రాడు మాట పాడియై ధర జెల్లు
నన్న మాట దెలిసి యనృత ఘటన
నిజము జేయ నెంచి నిర్ద్వంద్వముగ జేరి
పదుగు రాడు మాట పాడి గాదు

Wednesday, 26 December 2012

దండనము కాదు కాదది పండువయ్యె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - దండనము కాదు కాదది పండువయ్యె 

తేటగీతి:
పేడి గాగను శాపంబు క్రీడి కిచ్చె
స్వర్గ మందున నూర్వశి,  భాగ్య మదియె
పరగ మేలయ్యె నజ్ఞాత వాసమందు
దండనము కాదు కాదది పండువయ్యె

Tuesday, 25 December 2012

అమవసనాఁటి రాత్రి యొక యంగన చూపెను చంద్రికాద్యుతుల్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - అమవసనాఁటి రాత్రి యొక యంగన చూపెను చంద్రికాద్యుతుల్

(దీపావళి పండుగ నాడు ఒక వనిత వర్ణ చిత్రమును గీసి భర్తకు చూపిన సందర్భం)

చంపకమాల:
విమల సువర్ణ చిత్రమును వేడ్కను దివ్వెల పర్వమందునన్
సుమ సుకుమార హస్తముల సోయగ మొప్పగ గీసి చూపెగా
హిమగిరి శోభలన్ పతికి హేమపు కాంతుల నిండు చంద్రునా
యమవసనాఁటి రాత్రి యొక యంగన చూపెను చంద్రికాద్యుతుల్.

Monday, 24 December 2012

త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె

తేటగీతి:
ప్రీతి నెలుకలనే తిని పీడ లేక
రైతు బాన్ధవి గా నిల్చి రక్ష జేయు
మేత జనులకు మిగులుచు మేలు గాను
త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె?

తేటగీతి:
హరున కాభరణము మరి హరికి పక్క
చేరి చూడగ శివునికి చిన్ని కొడుకు
పుట్టలో పాలు పోయంగ పుణ్య మిచ్చు
త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె?

Saturday, 22 December 2012

మద్యము సేవించువాఁడు మాన్యుఁడు జగతిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - మద్యము సేవించువాఁడు మాన్యుఁడు జగతిన్


కందము:
హృద్యంబగు రస కవితా
సేద్యంబున పద్యచయము చెరకు రసంబే 
గద్యము జంబీర మదియె
మద్యము, సేవించువాఁడు మాన్యుఁడు జగతిన్

Friday, 21 December 2012

గంగ మునిఁగిపోయె గంగలోన.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - గంగ మునిఁగిపోయె గంగలోన. 

ఆటవెలది:
గంగ యనెడు పడవ గంగయ్య నడుపును
పొంగు వచ్చి నదికి పోటు పెరిగి
సుడిని జిక్కె నయ్యొ చూడగా నొకనాడు
గంగ మునిఁగిపోయె గంగలోన.

Thursday, 20 December 2012

విష గుళికయయ్యె గీతావివేక రసము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - విష గుళికయయ్యె గీతావివేక రసము.

తేటగీతి:
చూడ చెరకును మెచ్చదు శునక మెపుడు
పంది మెచ్చదు పన్నీరు పైన బడిన
అన్నమరుగని రోగికి నట్లె సుధయు
విష గుళికయయ్యె గీతావివేక రసము.

Wednesday, 19 December 2012

సంపన్నుల దైవ మగును శంకరుఁ డెన్నన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - సంపన్నుల దైవ మగును శంకరుఁ డెన్నన్ 

కందము:
నింపాదిగ శివ పూజల
నింపార నమక చమక సహితముగ భక్తిన్
సంపన్నము జేయు సుగుణ
సంపన్నుల దైవ మగును శంకరుఁ డెన్నన్

Tuesday, 18 December 2012

భామను పెండ్లాడి యొకఁడు బలిపశువయ్యెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - భామను పెండ్లాడి యొకఁడు బలిపశువయ్యెన్.

కందము:
'కామిని' యయ్యెను 'కాముడు'
ప్రేమల తో 'మెయిలు' బెట్ట ప్రీతిగ 'నెట్' లో
'కాముగ' పడె  వలనెట్లో
భామను పెండ్లాడి యొకఁడు బలిపశువయ్యెన్.

కాముగ = calm గ
వలనెట్లో = వలను + ఎట్లో

Monday, 17 December 2012

తేనెబొట్టుతో నంబుధి తియ్యనయ్యె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - తేనెబొట్టుతో నంబుధి తియ్యనయ్యె. 
తేటగీతి:
అసుర కులమను సాగర మందు జూడ
పుట్టె ప్రహ్లాదు డాతని పుణ్య మధుర
భావ మందున నాయెగా పావనమ్ము
తేనెబొట్టుతో నంబుధి తియ్యనయ్యె.

Sunday, 16 December 2012

యోగులు కాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలగన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - యోగులు కాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలగన్.

ఉత్పలమాల:
భోగముగోరు వారు మరి బొక్కిన దానిని దాచ నెంచుచున్
రోగములెన్ని యున్న యవ రోధము లేకనె లేకి బుధ్ధితో
వాగెడు వారు జూడ తన ప్రక్కన మూగెడు దుష్ట మిత్ర సం
యోగులు కాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలగన్.

Saturday, 15 December 2012

పలికి చేసి చూచి కొలిచి యలరు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - పలికి చేసి చూచి కొలిచి యలరు.
ఆటవెలది:
పసి వయస్సు నందె బాల ప్రహ్లాదుడు
హరిని చక్రి శౌరి నార్తి హరుని
నోట, చేత, కంట, నొవ్వక మనసున
పలికి, చేసి, చూచి, కొలిచి యలరు.

Friday, 14 December 2012

శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్ 
కందము:
చేకొనె నటుకుల మూటను
శ్రీకరమగు తనదు నింటి సిరి మూటదియే
నీకన్న చెలువు డేడని
శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్ 

Thursday, 13 December 2012

దత్తపది - ‘పాలు, పెరుగు, చల్ల, వెన్న.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

దత్తపది - ‘పాలు, పెరుగు, చల్ల, వెన్న- పాడి సంబంధ  అర్థంలో కాకుండా
మహాభారతార్థంలో


రాయబారానికి వెళ్ళునప్పుడు ధర్మరాజు కృష్ణునితో..
ఆటవెలది:
మాకు రక్ష నీవె మాన్య నీవెన్నడు
పెరుగు కక్ష లన్ని విరుగ జేయ
గ్రామపంచ కంబు కలిగిన మా పాలు
చల్లనయ్య కృష్ణ చాలు మాకు

Wednesday, 12 December 2012

సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు.

ఆటవెలది:
గొప్ప గురువు తాను కోరకనే శిష్య
హితము గోర వలయు నిదియె ధర్మ
మసుర గురువు గాన ననవరతంబు న
సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు.

Tuesday, 11 December 2012

సమరమునే కోరినాఁడు శాంతిని పొందన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య -  సమరమునే కోరినాఁడు శాంతిని పొందన్.

కందము:
రమణులతో చెడ దిరుగగ
గమనించెను రోగములను కామేశ్వర్రావ్
శ్రమయనక వెడలి 'డాక్టరు
సమరమునే' కోరినాఁడు శాంతిని పొందన్. 

Monday, 10 December 2012

తునికి సాయపడుము కనుము సుఖము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - తునికి సాయపడుము కనుము సుఖము

ఆటవెలది:
ఒరుల కింత నిడిన నొన గూడు సిరు లెన్నొ
ఉన్న దాని లోన నుచిత రీతి
తలచి మదిని సుంత దారిద్ర్య ఋణ పీడి
తునికి సాయపడుము కనుము సుఖము

Sunday, 9 December 2012

ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతిసౌఖ్యముల్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతిసౌఖ్యముల్

ఉత్పలమాల:
ధర్మము రక్ష జేయు గద ధర్మమునే తగు రక్ష జేయగా
"కర్మము" నేడు భారతపు గాధలు భాగవతమ్ము జెప్పినన్
'ధర్మము నిల్పు వారలకు ధారుణి కష్టము లంద్రు' చూడ నా
ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతిసౌఖ్యముల్


నాల్గవపాదము లో  ధర్మము = గుణము 

Saturday, 8 December 2012

హరుని పూజ సేయ హాని కలుగు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - హరుని పూజ సేయ హాని కలుగు.

( హరి హరులలో భేదభావమునెంచి  ఒకరిని పూజించి మరొకరిని ద్వేషిస్తే హాని కలుగునని నా భావం.)
 
ఆటవెలది:
హరిని మదిని రోసి హరు మాత్రమే దల్చి
ఘోర మరణ మంది నారసురులు
భవుని హృదయ మందు భావమ్ము నెరుగక
హరుని పూజ సేయ హాని కలుగు.

Friday, 7 December 2012

ఆపదలను దొలచు పాపచయము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ఆపదలను దొలచు పాపచయము.

ఆటవెలది:
పాప భీతి లేక పరమేశు పై భక్తి
చింత నింత లేక సిగ్గు లేక
పాప ములను జేయు భడవ పుణ్యంబుల
నాప, దలను దొలచు పాపచయము.


Thursday, 6 December 2012

సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్.

కందము:
తా దరి జేరుచు రాముని
"నాదరికే రార! మార ! నాథా!" యను మం
డోదరి పతి రావణు నిజ
సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్.

కందము:
పోదా సిరి తల్లిని సతి
సోదరిఁ దిట్టిన జనులకు, శుభములు గలుగున్
యేదరి నారీ మణులే
వేదన నే చెందకుండ వేడుక జెందన్.

Wednesday, 5 December 2012

ఖర వాహన మెక్కి మురిసి కవి యూరేగెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ఖర వాహన మెక్కి మురిసి కవి యూరేగెన్

కందము:
శర వేగముతో కవితలు
బర బర వ్రాయంగ నేర్చు వానికి నేడే
బిరుదము నిచ్చిరి "కవిశే
ఖర" వాహన మెక్కి మురిసి కవి యూరేగెన్

Tuesday, 4 December 2012

హనుమంతుని భార్య లిద్దఱని చెప్పఁదగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - హనుమంతుని భార్య లిద్దఱని చెప్పఁదగున్. 

కందము:
విన హనుమ రుద్ర తేజము
కన మనసాయె పతి కోతి ఘనమగు చేష్టల్
వినువీధి నుండి జూచిరి
హనుమంతుని, భార్య లిద్దఱని చెప్పఁదగున్.

Monday, 3 December 2012

ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ.

తేటగీతి:
కోతి నొక్కటి చాటుగా కూల్చి వేసె
రాజు గా జేసె నొక కోతి రక్ష వేడ
నొక్క కోతిని మదిలోన నుంచె జూడ
నొక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?

Sunday, 2 December 2012

గుణవంతున్ దెగనాడి నాతి వలచెన్ గోవర్ధనోద్ధారకున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - గుణవంతున్ దెగనాడి నాతి వలచెన్ గోవర్ధనోద్ధారకున్.

(మీరా బాయి పరంగా...)  
మత్తేభము:
ఘనుడా ద్రౌపది మాన రక్ష కుడినే గానంబుతో మీర 'నా
తనువే కృష్ణుని కంకితం' బని భువిన్ తా మానసంబందునన్
మనువాడంగను మానవాధములనే మన్నించకే యిట్టి దు
ర్గుణవంతున్ దెగనాడి నాతి వలచెన్ గోవర్ధనోద్ధారకున్.

Saturday, 1 December 2012

భాను కాంతి తో తారలు ప్రభలఁ జెలఁగె.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - భాను కాంతి తో తారలు ప్రభలఁ జెలఁగె.

తేటగీతి: 
వంద రోజుల వేడుక బరగ నచట
వేల ప్రేక్షక జనమును,  వెలుగులీను
నటుల వేదిక నుండగ ' నటుల జంట'
భాను, కాంతి - తో తారలు ప్రభలఁ జెలఁగె.