తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 31 January 2013

జయజయ యంచు కౌరవులు సాఁగిలి మ్రొక్కిరి కృష్ణమూర్తికిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - జయజయ యంచు కౌరవులు సాఁగిలి మ్రొక్కిరి కృష్ణమూర్తికిన్.

కౌరవ పాత్ర ధారులు భక్తితో...
చంపకమాల:
నయముగ నేడు వేయునది నాటక మే మరి యందు మిమ్ములన్
స్వయముగ మేము దిట్టవలె శాపము బెట్టకు మంచు శ్రద్ధతో
భయమును భక్తియున్ గలిగి భాగవ తోత్తమ గావు మాధవా
జయజయ యంచు కౌరవులు సాఁగిలి మ్రొక్కిరి కృష్ణమూర్తికిన్.

Wednesday, 30 January 2013

వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు.
తేటగీతి:
కావ్య వాణిని కర్నాట కాధములకు
అమ్మ బోననె పోతన్న యాకటికిని
పొట్ట నిండుట కొరకిటు పొరుగు కీయ
వాణిని, తిరస్కరించెడివాఁడె బుధుఁడు.

Tuesday, 29 January 2013

దైవ మనెడి పదము తద్భ వమ్ము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - దైవ మనెడి పదము తద్భ వమ్ము

ఆటవెలది:
దైవ మనెడి వాని దైన్యమ్ము దీరగ
పదము లంటి కొల్తు భక్తి తోడ
దైవ మనెడి పదము తద్భవమ్మో మరి
తత్సమమ్మనియెడి తలపు లేల?


Monday, 28 January 2013

కడలి నీ రంతయును నిండెఁ గడవలోన.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - కడలి నీ రంతయును నిండెఁ గడవలోన.

తేటగీతి:
కడవ నొక్కటి జాలరి పడవలోన
నుంచి వేటకు వెళ్లగ నొక్క సారి
పెద్ద అల వచ్చి పైబడ బెదరె వాడు
కడలి నీ రంతయును నిండెఁ గడవలోన.

పూర్వము పుస్తకములకు స్థానము "భాండాగారములే".
తేటగీతి:
'కడలి నీరను' గ్రంథమ్ము కష్ట పడుచు
వ్రాసె నొక్కడు బహు తాళ పత్రములను
కడవ నుంచెను దాచగ, ఖాళి లేదు
కడలి నీ రంతయును నిండెఁ గడవలోన.

Sunday, 27 January 2013

విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.

టమాట పంట కోసినా  కొనేవారు లేక, కోసిన కూలి కూడా రాక రోడ్డు మీద పారబోసిన సంఘటనలు ఎన్నో...
తేటగీతి:
రామములగలు కాసెను గ్రామమందు
కోయు వారికి కావలె వేయి, వాని
కొనెడు వారలు జూడగ కనరు గాన
విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.
 

తేటగీతి:
వాన పెల్లయి గట్టి తుఫాను వచ్చి
చెరువు కట్టలు తెగిపడి చేలలోన
నీరు నిండిన రైతు కన్నీరు తోడ
విఱుగఁ బండిన చేలను విడువఁ దగును
.

Saturday, 26 January 2013

గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్. 

కందము:
రణమున దెచ్చిన స్వేచ్చయె
గణ నాయకులకు మిగులగ కలుముల నిచ్చెన్
గుణవంతులు తిన శూన్యము
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.

Friday, 25 January 2013

కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్.

కందము:
కోటీశ్వరుడౌ కోటయ
ఏటికి పోటొనరి  పొంగ నెక్కెను మేడన్
అటు వచ్చు వారు లేకను
కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్.

Monday, 21 January 2013

గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే!

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ


సమస్య - గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే!

మత్తకోకిల:

బుజ్జగించుచు తల్లిదండ్రులు బువ్వ బెట్టుచు పెంచగా
 
ఒజ్జలే మరి పల్కు పద్యము నోర్పుతో చదివించగా

గుజ్జు రూపపు దేవదేవుని కోరి దల్చుచు వ్రాయగా 

గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే!

Sunday, 20 January 2013

కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.

ఉత్పలమాల: 
లోకులె యెన్నుకున్న ఘన లోక్సభనందున నెంచి చూడగా
లోకము మేలు గోరి మది రోయక శ్రద్ధను జూపి గట్టిగా
వాకొని పోరు హంసలవి వచ్చును తక్కువ తక్కినందరున్
కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.

Saturday, 19 January 2013

చెడుగులతో దేశమెల్ల శ్రీకర మయ్యెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - చెడుగులతో దేశమెల్ల శ్రీకర మయ్యెన్

కందము:
నడవడికను సరి నేర్చిన
బుడుగుల తో దేశమెల్ల బుద్ధిని వొందన్
దడ దడ మూలము ద్రుంచిన
చెడుగులతో దేశమెల్ల శ్రీకర మయ్యెన్

Friday, 18 January 2013

మకరశేఖరుండు మమ్ము బ్రోచు


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - మకరశేఖరుండు మమ్ము బ్రోచు. 

ఆటవెలది:
మహిత క్షేమ కరుడు మనమందు దల్చిన
జటల ధారి శివుడు జంగమయ్య
హిమ నగజధవ హరు డీశుండు మహిని హి
మకరశేఖరుండు మమ్ము బ్రోచు.

Thursday, 17 January 2013

పాపులను బ్రోచులే భగవంతుఁ డెపుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - పాపులను బ్రోచులే భగవంతుఁ డెపుడు

తేటగీతి:
మాట విననట్టి కొడుకును మందలించి
చేరి కొట్టుచు తగినట్టి శిక్ష వేసి
అనున యించును గద తండ్రి, యటులె చూడ
పాపులను బ్రోచులే భగవంతుఁ డెపుడు

Wednesday, 16 January 2013

దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య_- దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్.

కందము:
దారము తో రుద్రాక్షలు
హారముగా మెడను దాల్చి హరు నర్చింపన్
చేరవు బాధలది మహో
దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్.

Tuesday, 15 January 2013

పస లేని పశువు కడివెడు పాల నొసెంగెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - పస లేని పశువు కడివెడు పాల నొసెంగెన్.
కందము:
దెస తోచక వరదలలో
గస బెట్టుచు ' పాల కడవ ' గాడిద పైనన్
వెస మోపి పంచె నొక్కడు
పస లేని పశువు ' కడివెడు పాల ' నొసెంగెన్.

Monday, 14 January 2013

మకర సంక్రమణము మతిని చెఱచు.

 బ్లాగు వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
 
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - మకర సంక్రమణము మతిని చెఱచు.

ఆటవెలది:
పండు గనుచు చూపు పదులుగా సినిమాలు
మంచి వనగ నొకటి నెంచ లేము
దూర దర్శిని తల దూరిచి దర్శించ
మకర సంక్రమణము మతిని చెఱచు.

Sunday, 13 January 2013

రేగు మంటనిడ బ్రతుకు రేగు పండు.

భోగి పర్వదిన శుభాకాంక్షలు.

భోగి మంటలు వేసేము వేగ రండు
పనికి రానట్టి వాటిని వైచి పొండు
మనసు నందున నెలకొన్న మలినములను
రేగు మంటనిడ బ్రతుకు రేగు పండు.

Saturday, 12 January 2013

తమ్ములను నుతింతు నెమ్మనమున


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - తమ్ములను నుతింతు నెమ్మనమున

ఆటవెలది: 
శ్రద్ధ తోడ సలుప సత్య దేవు వ్రతము
పిలచినాడ నేను ప్రియము గాను
అక్క చెల్లి మరియు నగ్రజు నిద్దరు
తమ్ములను, నుతింతు నెమ్మనమున

ఆటవెలది:
శంకరయ్య గారి 'శంకరా భరణమ్ము'
కల్ప వృక్ష మాయె కవి వరులకు
కదలి చేరి పలుకు కవికోకిలల కూజి
తమ్ములను నుతింతు నెమ్మనమున

Friday, 11 January 2013

సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో.

శంకరాభరణం చిత్రం లో శంకరశాస్త్రిని ఏర్యల్  శాస్త్రి అని గేలి చేసినవారు శంకర శాస్త్రి పాడినసంగతులు పలుక లేక బిక్క చచ్చి పోయిన సందర్భం....

కందము:
ఎంగిలి పాటల ' సింగరు '
లింగితమును మాని తిట్టి 'రేర్యల్ శాస్త్రిన్'
సంగతులు రాక 'శంకర
సంగీతము' విన్నవారు చచ్చిరి త్రుటిలో.

Thursday, 10 January 2013

ధర్మవిదులకుఁ బూజ్యుఁడు త్రాగుఁబోతు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - ధర్మవిదులకుఁ బూజ్యుఁడు త్రాగుఁబోతు
తేటగీతి:
గీత యందున జెప్పెను కృష్ణ మూర్తి
అన్నమయ్యయు సమదృష్టి యనుచు జెప్పె
ధర్మవిదులకుఁ బూజ్యుఁడు త్రాగుఁబోతు
కుక్క యైనను కనుపించు నొక్క రీతి.

Wednesday, 9 January 2013

పాతకాలపు టలవాట్లు పాడు చేయు


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - పాతకాలపు టలవాట్లు పాడు చేయు

తేటగీతి:
పాతకాలపు టలవాట్లు పాడు చేయు
నేటి కాలపు టలవాట్లు మేటి యనుచు
తలచు టెన్నడు నరునికి తగదు తగదు
క్రొత్త పాతల మంచి చేకొనగ వలయు.

Tuesday, 8 January 2013

విగ్రహములతో నిండెను వీధు లెల్ల.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - విగ్రహములతో నిండెను వీధు లెల్ల. 


తేటగీతి:
విగ్రహంబుల పుష్టియు వినగ కనగ
నష్టి నైవేద్య మనియన్న నానుడి వలె
పరమ సోమరి పోతులు పరగ తిరుగు
విగ్రహములతో నిండెను వీధు లెల్ల.

Monday, 7 January 2013

మానములేని స్త్రీని గనిమాతగ మ్రొక్కిరి పండితోత్తముల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - మానములేని స్త్రీని గనిమాతగ మ్రొక్కిరి పండితోత్తముల్.

ఉత్పలమాల:
నేనొక రేయి గంటి కల నిద్దురలో మన తెన్గు తల్లియే
జ్ఞానములేని వారలయి కాదని పుత్రు లగౌర వించగా
దీనత వీధి గుమ్మమున దిక్కులు జూచుచు నున్నపుత్ర స
మ్మానములేని స్త్రీని గనిమాతగ మ్రొక్కిరి పండితోత్తముల్.

Thursday, 3 January 2013

పూల పానుపు కాదది ముండ్ల బాట.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - పూల పానుపు కాదది ముండ్ల బాట. 
తేటగీతి:
పెట్టి పుట్టినవారికి పేర్మి మీర
పుడమి బ్రతుకును నడుపగ పూల బాట
పాపకర్మల ఫలితము బడయు వార్కి
పూల పానుపు కాదది ముండ్ల బాట.

Wednesday, 2 January 2013

నామంబుల లోన పంగ నామము మేలౌ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - నామంబుల లోన పంగ నామము మేలౌ.
కందము:
క్షేమంబును గూరుచు హరి
నీమంబున పూజ జేయ నిశ్చల మతితో
నామ జపము జేయ నుదుట
నామంబుల లోన పంగ నామము మేలౌ.