తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 30 June 2015

గొడ్డురాలి బిడ్డలు గుణకోవిదులట.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గొడ్డురాలి బిడ్డలు గుణకోవిదులట.


తేటగీతి:
రాణి కోమలి బిలుతురు ' రాలి ' యనుచు
ప్రక్కనున్నట్టి పంకజ భర్త తిట్టె
కన్న కొడుకును " కంటివా దున్న, యెలుగు
గొడ్డు " రాలి బిడ్డలు గుణకోవిదులట. 

Monday, 29 June 2015

తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్.


కందము:
చేతిని నోటికి చూడీ
రీతిగ నడ్డమ్ము వెట్టి "రేయ్ " దగ్గుమనన్
ప్రీతిగ తాననుకరణను
తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్.

Sunday, 28 June 2015

తనివి గల్గించె రాముఁడు దానవులకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తనివి గల్గించె రాముఁడు దానవులకు 



తేటగీతి:
దానవుండైన ధర్మమ్ము దయయుయున్న
ఘన విభీషణు వోలె, నే గాతు ననుచు
ధర్మ నిరతి దయాగుణ దాన శీల
త, నివి గల్గించె రాముఁడు దానవులకు

Saturday, 27 June 2015

కడప మిరియముల్ గుమ్మడి కాయలంత

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కడప మిరియముల్ గుమ్మడి కాయలంత

తేటగీతి:
గండు చీమల చిత్రమున్ గనుచు నుంటి
చిత్రమైనట్టి పాట్లనే చీమ పడెను
దూలమంతగ కనబడు మ్రోల నింటి
కడప, మిరియముల్ గుమ్మడి కాయలంత

Friday, 26 June 2015

పూలవానకు శిరమునఁ బుండ్లు రేఁగె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పూలవానకు శిరమునఁ బుండ్లు రేఁగె.


తేటగీతి:
పానకాల్రావు కేపూలు పడవు - నేడు
పదవి విరమించు వేళలో బట్ట తలను
పూలు జల్లుచు మిత్రులే పోగ - చూడ
పూలవానకు శిరమునఁ బుండ్లు రేఁగె.

Thursday, 25 June 2015

గాంగేయుడు పెండ్లియాడి కనె సత్సుతులన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గాంగేయుడు పెండ్లియాడి కనె సత్సుతులన్


కందము:
హంగగు పేరున నాటక
రంగములో భీష్మునిగను రాజిల్లెగదా
రంగారాయుండభినవ
గాంగేయుడు, పెండ్లియాడి కనె సత్సుతులన్

Wednesday, 24 June 2015

చెంపమీద గొట్ట సిరులు గురియు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - చెంపమీద గొట్ట సిరులు గురియు


ఆటవెలది:
చిన్నదాని సిగ్గు సిరులేగ చెలునికి
తరుణి ప్రేమ పంచు తరుణమందు
చుబుక మందుకొనుచు చూపుడు వ్రేలితో
చెంపమీద గొట్ట సిరులు గురియు

Tuesday, 23 June 2015

విప్రవరుఁడు మాంసమ్ముతో విందొ సంగె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - విప్రవరుఁడు మాంసమ్ముతో విందొ సంగె


తేటగీతి:
మంచి మాటను వినడయ్య మంగరాజు
పెండ్లి పేరంటములలోన ప్రియముగాను
వలదు మాంసమ్ము పెట్టకు వలదనిన
విప్రవరుఁడు - మాంసమ్ముతో విందొ సంగె. 

Monday, 22 June 2015

సచిన్ టెండూల్కర్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - సచిన్ టెండూల్కర్. 


సచిన్ క్రికెట్టు నుండి విశ్రాంతి తీసుకుంటున్నాననగానె క్రీజు, బాలు, బ్యాటుల మనోగతం...

చంపకమాల:
పరుగులు దీయ దీయ పయి పచ్చిగ పుండయె - "నింక హాయిలే "
మెరుపుగ బాద బాదగను మిన్నుకు మన్నుకు నైతి - " హాయికన్ "
చురుకుగ నూపునూపు తరి చుక్కలు కన్పడె బంతికొట్ట - " హాయ్ "
మరియిక పండుగంచు మది మెచ్చెను క్రీజుయు, బాలు, బ్యాటులే.

Sunday, 21 June 2015

ఆర్త జనరక్ష సేయని హరియె దిక్కు .

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఆర్త జనరక్ష సేయని హరియె దిక్కు .

తేటగీతి:
అక్షరంబది మారననర్థ మగును
' ఆర్త జనరక్ష సేయగ హరియె దిక్కు'
వ్రాయమంటిని నేనట్లు, వ్రాసితీవు
' ఆర్త జనరక్ష సేయని హరియె దిక్కు' .


తేటగీతి:
చేరబిల్చిన కృష్ణకున్ చీరెలిచ్చె
చేతగాదన గజరాజు జేరదీసె
విడచి చేతల, చేతులన్ వేడు వరకు
ఆర్త జనరక్ష సేయని హరియె దిక్కు.

Saturday, 20 June 2015

కమలాప్తుని రశ్మి సోఁకి కలువలు విచ్చెన్ .

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కమలాప్తుని రశ్మి సోఁకి కలువలు విచ్చెన్ .

కందము:
సుమములు వేచెను సరసున
కమనీయపు చందమామ గగనమునుండే
గమనించి కురిపె వెన్నెల
కమలాప్తుని రశ్మి సోఁకి - కలువలు విచ్చెన్ .

( వెన్నెల రావాలంటే చంద్రునిపై సూర్య రశ్మి పడాలి )

Friday, 19 June 2015

" వల " నాలుగు పాదాలలో వచేట్లు శకుంతలాదుష్యంతుల ప్రణయము..

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - " వల " నాలుగు పాదాలలో వచేట్లు శకుంతలాదుష్యంతుల ప్రణయము..



కందము:
వలచి శకుంతల తా భూ
వలయంబునునేలు రాజు వద్దకుజేరెన్
వలరాజు పొదల జేరుచు
వలపించగ ప్రియముజెంది పరిణయమాడెన్.
 

కందము:
వలచినదని దుష్యంతుడు
వలపించి పిదప వలదన వాపోవుచు  నా
వలగనెను శకుంతల భూ
వలయంబును నేలు భరతు, భర్తయె మెచ్చన్.


Thursday, 18 June 2015

మత్తుఁ గలిగించువాఁడె పో మంచివాఁడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మత్తుఁ గలిగించువాఁడె పో మంచివాఁడు


తేటగీతి:
మదిని బాధలు చెలరేగి మౌనమంది
చిన్నబోవుచు నుండగా చెంతజేరి
మంచిమాటల గమ్మత్తు పెంచి పంచి
మత్తుఁ గలిగించువాఁడె పో మంచివాఁడు

Wednesday, 17 June 2015

ప్రాణ మొసఁగును మృత్యు దేవత జనులకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ప్రాణ మొసఁగును మృత్యు దేవత జనులకు


తేటగీతి:
ఒక్కరిద్దరికెట్టులో దక్కెగాని
అందరడుగగ నా " రూలు " నతడు మార్చి
తనదు ధర్మంబు దప్పుచు తప్పకెటుల
ప్రాణ మొసఁగును మృత్యు దేవత జనులకు?

Tuesday, 16 June 2015

సాహెబు ముప్ప్రొద్దు లందు సంధ్యను వార్చున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సాహెబు ముప్ప్రొద్దు లందు సంధ్యను వార్చున్.  



కందము:
స్నేహితుడు వీడు నాకే
శ్రీహరిశర్మంద్రు, పూజ జేయును గుడిలో
జీహా ! యనిచెప్పె నిటుల
సాహెబు - ముప్ప్రొద్దు లందు సంధ్యను వార్చున్.  

Monday, 15 June 2015

రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్.



ఒక పిల్ల వానికి, భక్తి గలిగి చక్కని చదువుకై కృషి జేసినచో భగవంతుడు చక్కని భవిష్యత్తునిస్తాడని చెప్పగా వాని ఊహలో ....
ఉత్పలమాల :
చక్కని విద్యయున్న మరి సాగును జీవన మెంతొ నిండుగా
మ్రొక్కిన చాలునింక హరి మోదము తోడను తోడునుండితా
దక్కగ జేయునింక కృషి తగ్గటు జేయుమనంగ నూహలో
రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్.

Sunday, 14 June 2015

కర్ణుఁడు సుయోధనుని జంపెఁ గదనమందు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కర్ణుఁడు సుయోధనుని జంపెఁ గదనమందు


కర్ణుడు బ్రతికి ఉన్నంత వరకు దుర్యోధనుని భీముడు యేమీ చేయలేడు...

తేటగీతి:
భీమసేనుడు, మడుగున భీరువగుచు
దాగియున్నట్టి వానిని దరికి బిలిచె
తోడు నీడగ మెలిగిన వాడు లేడు
కర్ణుఁడు, సుయోధనుని జంపెఁ గదనమందు.

Friday, 12 June 2015

భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్.


చంపకమాల:
వరములబొంది రావణుడు బాధలవెట్టుఛు శిష్టకోటినే
దురితములెన్నొజేసి మరి దొంగిలి దెచ్చెను జానకీసతిన్
హరి ధరబుట్టి రామునిగ నాయసురున్, మద కాముకున్, ప్రలో
భ రతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్.

Thursday, 11 June 2015

దీపము నార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దీపము నార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్.


కందము:
దీపము బెట్టుచు నిత్యం
బాపరమేశుని వదలక నర్చన లిడుచున్
ధూపముతో చెడుశక్తుల
దీపము నార్పఁగ, గృహమునఁ దేజ మ్మెసఁగెన్.


కందము:
ఈ పడతి బొమ్మ చీకటి
లోపల తా వెల్గు, జూడ  లోనికి రమ్మా
చూపెద నని తా నొక్కడు
దీపము నార్పఁగ, గృహమునఁ దేజ మ్మెసఁగెన్.

Wednesday, 10 June 2015

వచ్చును దీపావళి యను పండుగ నవమిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - వచ్చును దీపావళి యను పండుగ నవమిన్


కందము:
పిచ్చయ్యయే 'నవంబరు '
నచ్చముగా తెలుగులోన 'నవమని' తలచెన్
రెచ్చుచు జెప్పెను " వినరా !
వచ్చును దీపావళి యను పండుగ నవమిన్."

Tuesday, 9 June 2015

విరసంబౌ కావ్య మొప్పె వీనుల విందై.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - విరసంబౌ కావ్య మొప్పె వీనుల విందై.


కందము:
సరసస్వర లయగతి సం
భరితముగా బాణిగట్టి పాడగ ఘనుడౌ
పరమాద్భుత గాయకుడే
విరసంబౌ కావ్య మొప్పె వీనుల విందై.

Sunday, 7 June 2015

కలి గలిగిన వాని యింట కలవే సుఖముల్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కలి గలిగిన వాని యింట కలవే సుఖముల్


కందము:
తెలియుచు దీర్చగ పరులా
కలి, గలిగిన వాని యింట కలవే, సుఖముల్
తెలిసియు దీర్చక పరులా
కలి, గలిగిన వాని యింట కలవే సుఖముల్ ?

Saturday, 6 June 2015

అత్రి మునికి యహల్యయే పుత్రిక యగు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అత్రి మునికి యహల్యయే పుత్రిక యగు.


తేటగీతి: 
దూరదర్శిని లో " డబ్బు దోచుకోండి "
అనుచు బెట్టిన " ప్రోగాము ' అందులోన
నొక్క ప్రశ్నకు జెప్పెను నొక్కి యొకడు
అత్రి మునికి యహల్యయే పుత్రిక యగు.

Friday, 5 June 2015

కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము.



తేటగీతి:
పైన పండ్లేమొ వచ్చెను పాపకిపుడు
శాంతి జేయగ నెంచగా చక్కగాను
మేనమామేమొ కుదరదు మెచ్చననక
కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము.


తేటగీతి:
తల్లి కడుపున బైటకే తరలు నపుడు
నాన్న ముద్దిడ నెదపైన నాడునపుడు
చిట్టి పాపడు నవ్వుతో చిందు వేసి
కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము

Thursday, 4 June 2015

మామా యని బావ మఱఁది మాటలు గలిపెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మామా యని బావ మఱఁది మాటలు గలిపెన్


కందము:
ఏమాటకు ముందైనను
' మామామా ' యనుచు నత్తి మాటలు వచ్చున్
మోమాటము బడుతూనే
' మామా ' యని బావ మఱఁ ది మాటలు గలిపెన్.


కందము:
మా మాయ జూచి, బావా !
నా మాటల వినుము నేను నచ్చితి దానిన్
ప్రేమగ పెండ్లాడుదునని
మా మాయని, బావమఱఁది మాటలు గలిపెన్.

Wednesday, 3 June 2015

సంచిత పాప కర్మములు సౌఖ్యము లిచ్చును జన్మ జన్మలన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - సంచిత పాప కర్మములు సౌఖ్యము లిచ్చును జన్మ జన్మలన్



ఉత్పలమాల:
ఎంచగ మోక్షమన్నదిక నేగతి వచ్చునొ నంతదాక, నా
పంచముఖంబులన్ గలిగి పార్వతి నాథుగ వెల్గు వానినే
మంచిగ దల్చి మానవులు మానసమందున గొల్వ, దొల్గుగా
సంచిత పాప కర్మములు, సౌఖ్యము లిచ్చును జన్మ జన్మలన్

Tuesday, 2 June 2015

పతి తల ఖండించెనంట పార్వతి కినుకన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పతి తల ఖండించెనంట పార్వతి కినుకన్

కందము:
గతినీవెయనగ సురలే
మతిహీనుడు మందబుద్ధి మహిషాననుడౌ
అతిదుర్మార్గుడు రాక్షస
పతి తల ఖండించెనంట పార్వతి కినుకన్

Monday, 1 June 2015

పచ్చికను దిన నొల్లదు పాడి యావు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పచ్చికను దిన నొల్లదు పాడి యావు


తేటగీతి:
ఆవురావురనుచు గడ్డినంత మేసి
అరగకదిపుడు జైలునకరిగె కొంద
రనెడు మాటలకర్థంబు నరయలేక
పచ్చికను దిన నొల్లదు పాడి యావు

తేటగీతి:
పట్నమందలి యావును పట్టితెచ్చి
పంటపొలముల దిప్పగ పల్లెనందు
నాగరీకపు తిండిలా నచ్చకేమొ
పచ్చికను దిన నొల్లదు పాడి యావు