తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 30 March 2011

దత్తపది : రారా, సారా, పోరా, తేరా.

గతములో ఆకాశవాణి సరస వినోదిని కార్యక్రమమున ఇచ్చిన దత్తపదికి నా పూరణ. (రామాయణార్థంలో)


  దత్తపది - రారా,సారా,పోరా,తేరా.
(భారతార్థంలో)  

శా.  రారాజా!విను నాదు మాటలిక రాజ్యమ్ము రక్షింపగా !
       పోరామ్మును జేయకున్న సుఖముల్ బొందేరుగా!నా మన 
      స్సారామ్మును జెందుచుండెనిక మీ సంధిన్ గుదుర్పంగ!పో 
      తే, రాదీ తరుణమ్ము పంచు సగమున్!ధీశాలి కౌంతేయుకున్!         
 

Tuesday, 29 March 2011

దత్తపది - రారా, సారా, పోరా, తేరా.

గతములో ఆకాశవాణి సరస వినోదిని కార్యక్రమమున ఇచ్చిన దత్తపదికి నా పూరణ. (రామాయణార్థంలో)


దత్తపది - రారా,సారా,పోరా,తేరా.

కం. రారా! మారుడ! నిను మన
     సారా కామించినాను,సరసకు జేరన్
     పోరాడకు!సమయము, పో
     తేరాదని చుప్పనాతి తీయగ పలికెన్.

Saturday, 26 March 2011

దత్తపది - దోస, వంగ , బీర , కంద.

గతములో ఆకాశవాణి సరస వినోదిని కార్యక్రమమున ఇచ్సిన  దత్తపదికి నా పూరణ.


                  దత్తపది : దోస, బీర, వంగ, కంద.


                 సీతాపహరణం తరువాత రావణునితో మండోదరి అన్న మాటలు.


ఉ. శ్రీ రఘు రామచంద్రు సతి సీతను దెచ్చుట దోసమేగదా !
     కారణమద్దిజాలు!మనకందర కొచ్చును  ముప్పు! క్షేమమా 
     వీరుని యాశ్రయించ,  వినవే! గెలువంగలనంచు పోరులో, 
     బీరము లాడబోకుమ విభీషణు మాటల నాలకింపుమా!

Friday, 25 March 2011

దత్త పది - రవి, గురు, కుజ, బుధ.

గతములో ఆకాశవాణి సరసవినోదిని కార్యక్రమమున ఇచ్చిన దత్తపది   కి చేసిన పూరణ. 

దత్తపది : రవి, గురు, కుజ, బుధ... కందము, రామాయణార్థం  లో 

కం. గురు సమ్మతమును గైకొని  
       చురుకుగ రవి కుల తిలకుడు సూత్రము  లాగన్
       హర కార్ముకంబు ధబ్బున
      విరుగన్ రాముకు జనకజ  వేసెను మాలన్. 















Thursday, 24 March 2011

దత్తపది - జాన, ,వాన, తాన, ఆన.

గతములో ఆకాశవాణి సరస వినోదిని కార్యక్రమమున ఇచ్చిన దత్తపదికి పూరణ

దత్తపది : జాన, వాన, తాన, ఆన.

కం. వానర వీరుడు మారుతి 
      తానవలీలంగ జేరి దానవ పురికిన్ 
       జానకి మాతను కనుగొని 
      ఆ నరపతి రాము మాట లామెకు జెప్పెన్.
 

Tuesday, 22 March 2011

ఫిబ్రవరి ౨౦౦౧౧ సుజనరంజని


ఫిబ్రవరి ౨౦౧౧ సుజనరంజని వెబ్ పత్రిక లో పూరించిన  సమస్యలు 
 
   రాముని వధియించి, సీత రావణు జేరెన్
రాముని తో యుద్ధానికి వెళుతూ రావణుడు మందోదరితో.... 

కం. భామరొ!నేనిక వచ్చెద
                   రాముని వధియించి! సీత రావణు జేరెన్
                    ప్రేమతొ యని తలచుము యిదె
                   నీమనసున! యనుచు పలికె కామాతురుడై.

 కర్ణుని పెండ్లి యాడెనట కవ్వడి పంపగ ద్రోవదంతటన్.

వర్ణములన్ని నేర్చి తన వద్దకు వచ్చిన పుత్రుజూచి యా
               వర్ణమెకాదు మాటలను వ్రాయుము యంచును జెప్పె తండ్రి-సౌ
               వర్ణము,కృష్ణమూర్తి,పరివ్రాజక బృందము,కుంభకర్ణుడున్,   
                 కర్ణునిపెండ్లి,యాడెనటకవ్వడి,పంపగ,ద్రోవదంతటన్.



నా, నానా  ' ' కార పద్యం 

కం
. నీ నాన్నే నన్ననెనా?
   
నేనే నీ నాన్న నైన నిన్ననినానా?*
    *
నీ నాన్నన్నను నేనే!
   
నానీ!నీ నాన్న నాన్న నానాన్నేనే!
*(
నిన్న+అనినానా)
*(
నీ నాన్న+అన్నను) 

Monday, 21 March 2011

జనవరి ౨౦౧౧ సుజనరంజని

 జనవరి 2011 సుజనరంజని వెబ్ పత్రికలో ఇచ్చిన సమస్యలకు పూరణములు.

             సమస్య : బేరమాడబోతె నేరమాయె.


      ఆ.వె.|| తారలంటి దిరుగు ధరలుజూడ మనకు
             తిరుగుచుండె తలలు తినగ కొనగ 
             ఘోరకలిని నేడు,కూరగాయలుగూడ  
             బేరమాడబోతె నేరమాయె.


సమస్య : లింగమడ్డువచ్చె గుడిని మ్రింగ బోవ



 
 తే.గీ.|| నగలు దోచంగ నంగడి నక్కి యొకడు  
        సర్దబోవంగ చెయివేయ సైరనపుడె
        మ్రోగి దొరుకంగ గార్డుకు, మ్రోగె వీపు 
        లింగమడ్డువచ్చె గుడిని మ్రింగ బోవ 
          

 


                       తెలుగు పాటశాల - ఘంటసాల
సీ.||  జానపదమొకండు - జనులు మెచ్చగపాడు
                  పద్యంబెయొక్కడు - పాడగలుగు
      లలితగీతమొకడు - లయబద్ధముగబాడు
                  శ్లోకంబుకొక్కడు - శోభదెచ్చు
      శాస్త్రీయమొక్కడు - శ్రావ్యంబుగాపాడు
                 కీర్తనతొ యొకండు - కీర్తిబొందు
      భక్తి గీతమొకడు - రక్తిగా పాడును
                పాశ్చాత్యమొక్కడు - పలుక గలుగు
 
.వె.||    ఎట్టిపాటలైన యే శ్లోకములుయైన
           పద్యమైన మరియు గద్యమైన
           నవరసంబులొలుకు నాయాసమేలేక
           ఘంటసాలవారి గళమునందు.

Sunday, 20 March 2011

దేవతాస్తుతి

       శ్రీ ఆంజనేయ స్తుతి

శ్రీ రఘురామ నామమను శ్రీకర సాగర మందు మీనమై
వైరుల  గూల్చు వేళగన వన్య మృగంబుల జీల్చు సింగమై
కోరి మనంబునన్ దలచి కొల్చిన వారికి కామధేనువై
కోరినవిచ్చు చుండు కపికుంజరు గొల్తును సర్వ వేళలన్.

           శ్రీ రామ స్తుతి

కోతిని మట్టు బెట్టి యొక కోతికి రాజ్యము కట్టబెట్టియున్
కోతులగూడి రక్కసుల గూలిచి వేసి రణంబు గెల్చియున్
కోతిని బంటు జేసికొని కొల్వును దీరిచి యుండునట్టి ఆ
కోతుల రాయనిన్ గొలిచి కోరిన దీరును కామితార్ధముల్.

           శ్రీ కంఠ స్తుతి 


గిరిజా ప్రియ! శ్రీకంధర!
పురహర! నిశిచర,సుర, నర పూజిత చరణా!
సరినీకెవ్వరు లేరిక!
కరుణారస హృదయ మమ్ము కావగ రారా!

నిలకడ లేని గంగయును నీలపు గొంతున కాలకూటమున్
వలువలు లేని దేహమును ఫాలము నందున అగ్ని నేత్రమున్
కలిగిన నీలకంఠ! లయకార! సదాశివ! ఓ మహేశ! మా
కలతలు బాపి మమ్ములను గాచెడి దైవము నీవె శంకరా!

            శ్రీ మాతా స్తుతి

మహిషాసుర మర్దని!ఓ
మహిమాన్విత లోక జనని! మాధవు జెల్లీ!
మహదేవుని పట్టమహిషి!
మహిజనులను గావుమమ్మ మహిమల తోడన్!

          శ్రీ గణ నాథ స్తుతి

విఘ్న నాధు గొలువ వినయంబు తోడను
విఘ్న బాధ తొలగు విద్య వచ్చు
సిద్ధి బుద్ధి నాథు చిత్తాన పూజింప
బుద్ధి పెరుగు  కార్య సిద్ధి గలుగు.

ముందు మాట

వీక్షక మిత్రులకు నమస్కారములు.నేను పండితుడను గాను.మాతృ భాషాభిమానిగా,పద్య రచనయందాసక్తి ఉన్న వానిగా నేను పూరించిన కొన్ని సమస్యాపూరణములను పరిచయము  జేసెదను.ఔత్సాహికులు తమ అభిప్రాయములను పంచుకోవలసినదిగా కోరుచున్నాను.పండితులు సహృదయంతో లోటు పాట్లను,సవరణలను తెలిపి మార్గ దర్శన జేయ ప్రార్ధన.        

సు స్వాగతం

బ్లాగు వీక్షకులకు సమస్యల' తో 'రణానికి ('పూ' రణానికి) సుస్వాగతం