|| శ్రీరాముని పాదము || Bhakti Song || Sri Ramuni Padamu Song || Goli Songs ||
తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
Monday, 14 July 2025
Thursday, 10 July 2025
Tuesday, 1 July 2025
ఒక (నాటి) "పల్లెతనము"
రవళి మాస పత్రిక (జులై 2025 ) లో ప్రచురింపబడిన నేను వ్రాసిన పద్యములు.
సీ:
మట్టిమిద్దెల ఇళ్ళు మండువా లోగిళ్ళు
పూరిళ్ళు డాబాలు చేరియుండు
ఇండ్లముందున దారి కిరువైపులందున
అరుగులే వరుసగా నమరియుండు
ఊరికి బయటన నుండుగా సత్రమ్ము
వచ్చువారికి బస నిచ్చుచుండు
గడ్డివాములు చొప్పకట్టల దొడ్లుండు
పెరడున కూరలే బెరుగుచుండు
ఆ.వె:
పచ్చనిపొలములవి పల్లె చుట్టుననుండు
పండ్ల చెట్లు కొన్ని బరగుచుండు
దిగుడుబావి గూడ తీరుగానొకటుండు
ఇట్టి పల్లెజూడ నింపుగుండు.
సీ:
గిలక బావుల నుండి "గిలగిలల్" "గలగలల్"
రేపుమాపులు సడి రేగుచుండు
కోళ్ళ "కొక్కొరకో"లు కుక్కల "భౌభౌ"లు
మేక గొఱ్ఱెల "మే"లు మేలుగుండు
ఆవు,దున్నలు, గేదె లాయెడ్ల కొట్టముల్
అంబారవమ్ముల నలరుచుండు
ఊరపిచ్చుకలవి ఊరించు "కిచకిచల్"
కాకుల "కాకా"లు కలసియుండు
తే.గీ:
రెండు పిల్లుల పోట్లాట రేగుచుండు
అరకనదలించు చప్పుళ్ళు హాయిగుండు
వేకువందున దంపుళ్ళు వీనువిందు
ఊరునందున విన మది యూరుచుండు.
సీ:
కూడలిలోనొక్క గుడియొక్కటుండును
రాముడందుననుండి రక్షజేయు
బొడ్రాయి యొక్కటి పొందికగానుండు
పోలేరు తల్లియే పూజలందు
పవన సుతుడు బైట ప్రహరిలో మధ్యన
గుడిలేక నిలచుచు కుశలమిచ్చు
విఘ్న నాథునిగూడి విశ్వేశు డొకచోట
ఆలయమ్ముననుండి యభయమిచ్చు
ఆ.వె:
కాలమునకు దగిన కల్యాణ కార్యముల్
ఊరిలోన జరుగు నుత్సవములు
అందరచట గూడి యానందములుబొంది
గ్రామమునను తృప్తి గలిగి యుంద్రు.
Monday, 30 June 2025
Saturday, 28 June 2025
Thursday, 26 June 2025
Wednesday, 25 June 2025
Tuesday, 24 June 2025
"సైనికులారా వందనం" పాట లింకు
"సైనికులారా వందనం" పాట లింకు
గోలిపాటలు
|| సైనికులారా వందనం || sainikulara song || Goli Songs || - YouTube
Saturday, 21 June 2025
"సెల్ ఫోన్" పాట లింకు
"సెల్ ఫోన్" పాట లింకు
"సెల్ మోహము రంగా!" వినండి
కుదిరితే ఒక్క లైక్
వీలైతే నాలుగు షేర్స్
మరి నచ్చితే సబ్స్కైబ్ చేయగలరు.
|| సెల్ మోహము రంగా! || Cell Phone Song || Goli Songs || - YouTube
Thursday, 19 June 2025
"గోలి పాటలు" ఛానల్ - తిరుమలవాసా పాట
PLEAE LIKE SHARE & SBSCRIBE THE CHANNEL "GOLI PATALU"
|| తిరుమల వాసా! || Bhakti Song || tirumala vasa song || Goli Songs ||
Tuesday, 6 May 2025
ఓ! యువకా! యువతీ! యువతా!
ఓ! యువకా!
సీసము:
"గంజాయి" దమ్ముతో "నెంజాయి" జేయుచు
నందున స్వర్గమ్ము నందబోకు
"కొకెయిన్"ను చాటుగా గోరుచు కొని, వాడి
మత్తునందున మాటు మసలబోకు
ఆ "హెరాయిన్ను"నే హాయిగా బొందుచు
మైకమ్ము నందున మ్రగ్గబోకు
"బ్రౌనుషుగరు" నింక వదలలేననుచును
మంపున తెలివినే మరువబోకు
తేటగీతి: :
పాడు "బెట్టింగు" జూదమ్ము లాడబోకు
దుష్ట సాంగత్య మందున దూరబోకు
ఇట్టి నీతుల బెడచెవి బెట్టబోకు
విననిచో నీవగుదువుర! పెద్ద "బోకు".
కందము:
"సోషల్ మీడియ" లోనన్
భేషుగనే పేరుబొంది "ఫేమ"స్సవగా
"ఛీ!షిట్! షే"మను "పోస్టులు"
తోషముతో బెట్టవలదు దోషము సుమ్మా!
కందము:
బూతుల బల్కకు మోరీ!
రోతగ నీనోట, వలదురో యగు "మోరీ"
“ట్రూతు”ను దెలియుచు ప్రీతిగ
రీతిగ మాట్లాడు వాడె “రియలగు హీరో”.
ఓ! యువతీ!
కందము:
చిరుగుల దుస్తుల "ఫ్యాషన్"
చిరు "గులగా" మారె నేడు "ఛీఛీ" యనగా!
సరి "రోడ్డు"నందు గుంతలు
మరి "డ్రస్సు"కు కంతలుంట మంచిది కాదే!
కందము:
"మేలూ" "ఫిమేలు" తేడా
లేలా యని "సేప్టి"లేక నేగుట మేలా?
పోలిక "మేల్" కన ముల్లే
చీలుగ నరిటాకు "ముల్లె" "సిస్టర్" వినవే!
సీసము:
తోడేళ్ళు చిరుతలు తొంగి చూచుచునుండు
దొరికినంతనె బట్టి కొరికివేయు
వగలుజూపుచు బ్రీతి "వల"రాజు సాలీడు
చిక్కబుచ్చు కొనగ జేరబిలుచు
బండగా నున్నట్టి కొండచిలువగాడు
సూటిగా దరిజేర నోటబట్టు
నక్కిమూలననున్న నక్క జిత్తులమారి
మోసమ్ముతో నిన్ను ముంచివేయు
ఆటవెలది:
లేడి వంటి దాన లేప్రాయముల చాన
గండములవి నీకు కలవు శాన
కామ మృగములిట్టి కాన నుండును గాన
జాగరూకత గని సాగవలయు.
ఓ! యువతా!
చంపకమాల:
చదువులు నేర్వమంచు సరి చక్కని "కాలెజి" లందు జేర్చుచున్
మృదువుగ జెప్పిపంపగను మీరిన వేడ్కను తల్లిదండ్రులే
హృదయమునందు వారినిక నెంతయు దల్పక పిల్లలింతయున్
చదవక "లేజి" గా దిరిగి "చాటు షికారులు" జేయ భావ్యమా?
ఉత్పలమాల:
మీరిన ఖర్చు జేయుచును మిత్రులతోడను “పార్టి, పబ్బులన్”
జేరుచు నుండు వారు పెను చీడర యింటికి, తల్లి దండ్రికిన్
భారము కొంతదీర పలు పద్ధతులందున "పార్టుటైము జాబ్స్"
తీరుగ జేసి విద్యలను తేకువ నేర్చెడు వారు ధన్యులౌ.
సీసము:
సాంకేతికత కత్తి సరిజూచి వాడుచు
విహరించు విజ్ఞాన వీధులందు
రాజకీయములందు రాణకెక్కుచు నీతి
పాలనన్ బంచుమా పదవులందు
బహువిధంపు కళలు బాగుగానేరిచి
భాసించు చుండుమా వసుధనందు
అంకుర సంస్థల నవియెన్నొ స్థాపించి
ఘనముగా నిల్పు మాకాశమందు
ఆటవెలది:
ఓర్మి, బుద్ధి, తెగువ నోటమి నోడించి
జయము లందవలయు జగతినందు
యువత తేజమొప్పి యుల్లాసముగనుండ
నుత్సవములు నిండు నుర్వినందు.
ఉత్సాహము:
తల్లిదండ్రి గురువులందు తగిన భక్తి జూపుడీ
ఉల్లమందు సాటివారి నొక్కరీతి గాంచుడీ
ఎల్లలేని జ్ఞాన పథము నెరిగి వేడ్క సాగుడీ
వెల్లువగుచు యువత శక్తి విశ్వమంత నిండగా.
కందము:
నిన్నకు రేపనుదానికి
పన్నుగ నిలుచుండు గొప్ప వారధి, యువతన్
దన్నుగ నిలుపక నుండిన
వెన్నెముకే లేక భావి వెలవెల బోవున్.
ఆటవెలది:
యువత శక్తి జూడ నురకలెత్తెడి నది
వదలివేయ నదియు వ్యర్ధమగును
ఆనకట్ట తోడ నదుపుజేయుచు వాడ
బహుళ ఫలములందు భవిత వెలుగు.
Monday, 28 April 2025
శ్రీ సరస్వతీ దేవి స్తుతి
" ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.
అంశం: శ్రీ సరస్వతీ దేవి స్తుతి
కందము:
చదువుల తల్లీ! నీదయ
నొదవును మా జీవనమ్ము నుద్ధతి, శోభల్
వదలనులే సతతము నీ
పదములనే కీర్తిజేతు పదములతోడన్.
కందము:
నీ పదముల నే గొలువగ
నే పదములు రాక నాకు నేడ్పది వచ్చెన్
ఆ పదసంపద నిచ్చుచు
నాపదనే దీర్పవమ్మ హరిసుతురాణీ!
ఉత్పలమాల:
తెల్లని హంస వాహనము తెల్లని పద్మము నీదు వాసమే
తెల్లని వస్త్రధారణము తెల్లని తల్లివి నీవె కావొకో!
తెల్లములాయె నీయునికి, తేలికగాదులె నీదు దీవెనల్
చల్లగ పొందుటన్న, మది చక్కగ గావలె తెల్లతెల్లగా.
కందము:
నా రసన "అల్లిబిల్లిగ"
నూరకనే వాగజూచు "నూరక"ముందే
మీరుచు నణగంద్రొక్కుచు
నారాయణు సుతుని రాణి నాట్యంబిడవే!
కందము:
పొత్తము చేతన్ బట్టితి
చిత్తము "ఫేస్ బుక్కు" పైన చింతన "వాట్సాప్"
చిత్తగుచు నుండె చదువులు
మొత్తము నా మదిని మార్చ మ్రొక్కెద వాణీ!
కందము:
చిన్నప్పుడు బడి చదువుల
నున్నప్పుడు నిద్రలేచి యుదయము చదువన్
కన్నులు మూయుచు భారతి!
నిన్నే దలచుచు మొదలిడ నేర్చితి తల్లీ!
కందము:
ఎయ్యది దోచగలేరో!
ఎయ్యది మరి పరులకీయ నింతయు బోదో!
ఎయ్యది కీర్తికి నెలవో!
అయ్యది నాకీయగొల్తు నబ్జజు రాణీ!
కందము:
మీయత్త యిచ్చు సంపద
యే యావత్తుగ కరగును నరక్షణముననే
దోయిలి యొగ్గెద నీకే
మాయని చదువుల సిరులను మాకిడ వాణీ!
Sunday, 27 April 2025
అనురాగ దాంపత్యం
" ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.
అంశం: అనురాగ దాంపత్యం
కందము:
బెల్లము జీరా వలెనే
తెల్లని బియ్యమ్ము పసుపు తీరుగ, మరియున్
చల్లని పాలూ తేనెగ
నుల్లములే కలసి జంటలుండగ వలయున్.
కందము:
పలుకుల ములుకులు వదలక
యలకల నలకలను కనుల నటునిటు నిడకన్
కులుకుల నడకలు విడువక
యలయక నిరువురు మనవలె నహ!యొహొ! యనగా.
కందము:
అలసిన వేళల, మరితా
నలగిన వేళల దెలియుచు నటు పైవారే
మెళకువ భాగస్వామికి
తెలివిగ సేవలను జేయ "దెన్ నో వారే".
కందము:
నసుగుట తగ్గించుచు, మరి
విసుగును నదుపుననెయుంచి వేధించుటలన్
కసరుటలు మాని కొంతగ
దొసగులనే యెంచకున్న దొరలును ప్రేమల్.
కందము:
కస్సులు బుస్సులు జూపక
"లెస్సులు మోరు" లనుమాట లేపక, లవ్లీ
నెస్సుగ "డిస్కస్సు"లతో
లెస్సగ జీవింప వలయులే దంపతులే.
కందము:
ప్రేమించి యెంచుకున్నను
ప్రేమగనే పెండ్లిచూపు, లేవేమైనన్
ప్రేమనుగని, పంచగవలె
ప్రేమలనే, పెండ్లియాడి పిదపను గూడన్.
ఆటవెలది:
భార్య భర్త నెపుడు భారమ్మననరాదు
భర్త కూడ నటుల పలుకరాదు
బరువు బాధ్యతలను పరువుగా మోయుచు
సాకవలయు తాము సంతునెపుడు.
కందము:
అనురాగమ్మను రాగ
మ్మనుదినమును బాడుకొనుచు నాలూమగలే
"మనవలె నితరపు జంటలు
మనవలె నాదర్శమిదిగొ మనమే" యనుచున్.
కందము:
మనసున "సీక్రేట్స్" లేకను
ఘన "స్మ్మార్ట్ ఫోన్ పాసు వర్డ్సు" కననీయవలెన్
తనమన "పేరెంట్స"నకను
ధనమందున విడువవలయు దాపరికములన్.
కందము:
అతిజేయని యలుకలతో
శ్రుతిమించని దెప్పిపొడుపు చురకలతోడన్
సతిపతి నెయ్యపు కిన్కల
మతిదలచి విడచి కలసిన మహసరసమహా!
Saturday, 26 April 2025
కర్షకుడి గొప్పతనం
" ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.
అంశం: కర్షకుడి గొప్పతనం
కందము:
పొలమను కాగితమందున
హలమను కలమును గదుపుచు నవనిని ప్రజకే
ఫలవంతపు పంటల కవి
తలనిడు కర్షకకవి కిదె తల తలపాగా!
కందము:
నీరదమును తా జూచుచు
నీరిమ్మని వేడుకొనుచు నీరిడి కండ్లన్
నీరెండ మాత్రమే కని
నీరెండిన నేత్రములతొ నింగిని గనుగా!
కందము:
పనులకు బోవుటలోనను
ఇనునకు పోటీగ లేచు నెప్పుడుగూడన్
కనులతొ నక్షత్రములను
మిను జూచిన పిదప తాను మేనున్ వాల్చున్.
కందము:
చలి పులికి నులికి పడకను
జలజల వర్షమ్ముకైన సంశయమిడకన్
అలమండుటెండ కదరక
ఫలసాయము కొరకు జేయు వ్యవసాయమ్మున్.
కందము:
తన చెమటను తన రక్తము
తన శ్రమనే ధారబోసి తన సౌఖ్యమ్మున్
తనబాగు నెంచి జూడక
మనకన్నము బెట్టు రైతు మహనీయుండే.
కందము:
వర్షములెన్నియొ మారిన
ఘర్షణలను సైచి తాను ఘనుడై నిలచున్
కర్షకుడు "కాడి వదలడు"
శీర్షముగ సమాజమునకు చేవల నిడుగా.
కందము:
భూమిని తల్లిగ దలచును
భామినిగా దలచు నెడ్ల బండిని, హలముల్
సామాను కాడి సుతులగు
ప్రేమన్ గోవులును యెడ్లు ప్రియబాంధవులౌ.
కందము:
ఎంచక ఫలితము నెదలో
వంచననే యెన్నిమార్లు ప్రకృతియె చేయన్
కించిత్తు పట్టు వదలక
మంచిగ తన కర్మజేయు మాన్యుడతండే.
ఆటవెలది:
పనిని చెమటనోడ్చు పది "సెంట్ల" పొలమైన
చెమట దలచు తాను "సెంటు"గాను
తిండి తిప్పలందు తెలియడే "డీసెంటు"
అన్ని పనులలోన "నిన్నొసెంటు"
ఆటవెలది:
పంట ప్రతిదినమ్ము పరికించి చూచును
కలుపులన్ని దీసి “ఖతము” జేయు
చీడ మందు వేసి వాడులే యెరువులు
"స్ట్రిక్టు" పాలకుండు క్షేత్రమునకు.
ఆటవెలది:
పనుల "హార్డు వేరు" కనగ "రూటే" వేరు
మనసు "సాఫ్టు వేరు" మసలు తీరు
వేరు చేసి చూడ విశ్వమ్ము తార్మారు
అవని వృక్షమునకు నతడు "వేరు"
Thursday, 24 April 2025
స్నేహమాధుర్యం
" ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.
అంశం: స్నేహమాధుర్యం
కందము:
ఫండును జూడక కనగా
ట్రెండేమియు నెంచబోక రేబవలొకటై
బ్రాండుగ జగతిని నిలిచిన
ఫ్రెండ్సునకే చెప్పవలయు ఫెయిరుగ హ్యేట్సాఫ్.
కందము:
నెయ్యము గొప్పదిరా! మా
నెయ్యము సరియైన మంచి నేస్తము దొరుకన్
నయ్యనుచు జెప్పకుండగ
అయ్యారే! స్నేహ హస్తమందింతుముగా.
కందము:
మస్తుగ సోంచాయిస్తివ
దోస్తానా మంచిగుంటె దొరలెక్కే య
న్పిస్తది, పరెషాన్లో మన
కిస్తడులే దోస్తు జోషు, యినుకోరా బై!
కందము:
ప్రెండే టీచర్, ట్యూటర్
ప్రెండే బ్రదరండుసిస్టరేయగు వినరా!
ప్రెండుదె హెల్పింగ్ నేచర్
ఫ్రెండ్షిప్ లెస్ లైఫు బోరు ఫ్రెండాల్ రౌండర్.
సీసము:
సహవాసి గలుగుచో చాలమనశ్శాంతి
హితుడు మనకు సన్నిహితుగ మెలగు
మిత్రుడొక్కడు గూడ మితమౌను వెతలెల్ల
సఖుడు మనకు గొప్ప సహచరుండు
సంగడీడు తెలియ సంపదే మనకౌను
పొత్తుకాని చెలిమి పోని సొత్తు
శ్రేయోభిలాషిచే చేయూత శ్రేయమ్ము
చెలికాడు జోడైన చింత రాదు
ఆటవెలది:
ఉద్దికాడి సాయ మున్నచో అది మేలు
దోస్తు తోడు చాలు మస్తు హాయి
నేస్తగాడి మాట వాస్తవమ్ముల మూట
విహితుడున్న బ్రతుకు ప్రియముగొలుపు.
కందము:
నేస్తులు హరిహరులు జగతి
నేస్తులు నారాయణుడును నిజముగ నరుడే
నేస్తులు బాపూరమణలు
మస్తుగ పేరొందినారు మనయాంధ్రులలో.
కందము:
కందము:
ఉప్పునకున్ మరి పాలకు,
నిప్పుకు గప్పురమునకును నేస్తము తగునా?
తుప్పిచ్చు నీటి కినుముకు
నొప్పదు, స్నేహమ్మిక వలదోగులతోడన్.
కందము:
మిత్రుని సుతుడౌ కర్ణుడు
మిత్రుడు రారాజు కయిన, మేలే లేదే?
చిత్రము చెడుపని మెచ్చుచు
నాత్రమునన్ బడగ వైచె, హతవిధి గనుమా!
Wednesday, 23 April 2025
జాతీయ పతాకం
" ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.
అంశం : జాతీయ పతాకం
కందము:
రంగులుమూడు నడిమి గుం
డ్రంగానే ధర్మచక్ర రచనయు గలిసెన్
పింగళి వెంకయ కూర్చిన
హంగగు జెండాకు జేతు నభివందనమున్.
కందము:
మూడగు రంగుల, త్యాగము
తోడుగ శాంతియు సహనము తో నడుమనుచున్
జాడను దెలుపు పతాకము
వేడుకగా భారతవిను వీధిని గనుమా!
కందము:
పువ్వుల రేకులు రువ్వుచు
దవ్వున నొక తెల్ల గువ్వ ధాటిగ నెగురన్
చివ్వలు వలదని, నవ్వుచు
మువ్వన్నెల కేతనమ్ము ముదమున నెగిరెన్.
కందము:
రంగులు మూడును మెరయగ
ముంగిలినేదాటు శత్రు మూకలకెపుడున్
"రంగుబడుద్ద"ని జెప్పుచు
నింగిని దాకగ పతాక నిత్యమ్మెగురున్.
Sunday, 20 April 2025
రాఖీ
" ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.
అంశము: రాఖీ
కందము:
సోదరి కట్టును "రాఖీ"
"సో" దరి జేరుము సతతము శుభమగు నీకున్
సోదర "రక్షయె" నీకన
"సో" "దీ" పూర్ణిమ దినమున "సోదీ"యనకన్.
ఆటవెలది
అమ్మ ప్రేమగాద అక్కయ్య, చెల్లిది
నాన్న రక్ష తమ్ముడన్నదియును
రక్ష బంధనమ్ము రాగాలుపండించు
"రాఖి పున్నమి"కిని రమ్యముగను.
కందము:
బంగారపుదైనన్ మరి
రంగులదారమ్ముదైన రాగమ్మొకటే
హంగులజూడక దెల్పును
చెంగట సోదరునికి "రాఖి" చెల్లెలు కట్టన్.
కందము:
రక్షా బంధన వేళను
అక్షయమగు ప్రేమనీయమనుచును గట్టున్
లక్షలు గోరక సోదరి
లక్షణముగ సోదరులకు రాఖీ లెపుడున్.
కందము:
ప్రేమను తెలుపని ప్రేయసి
"కాము"గ నెటువచ్చి తాను కట్టునొ "రాఖీ"
ఏమో నా గతి యనుచును
"దీమాక్" చెడి "లవరు" జచ్చు దినమిది గదరా!
కందము:
నిన్నా దృష్టిని జూచుట
నెన్నడు నే జేయలేదు "నీతోడ"నుచున్
అన్నా!యని "వన్ సైడ్ లౌ"
సున్నానే జేయగల్గు "సూపర్" దినమే.
Friday, 18 April 2025
మాట - మౌనం
" ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.
అంశం: మాట - మౌనం
కందము:
నీటుగ నొకటో రెండో
మాటలలో భావములవి మనకే తెలియున్
బాటలు పలువిధములగును
మాటలు లేనట్టివేళ మౌనములోనన్.
కందము:
మాటలు కోటలు దాటుట
మాటలవే యీటెలగుట మంచిద? వినుమా!
మాటకు మాటలననియెడు
మాటల మాట్లాట వదలు, మౌనమె మేలౌ.
కందము:
నరులకు దేవుండిచ్చిన
వరమదిరా చూడ మాట పలుకుట, నాల్కన్
నరమునె యదుపునబెట్టుము
మరి తూలెడువేళ కొంత మౌనమ్మిడుచున్.
కందము:
హీనుడు నీ దరిజేరుచు
నేనేరా గొప్పయనుచు నిందలు వేయన్
మౌనిగ మౌనము దాల్చుము
కోనల కోతుల కెదుటను కుందేలువలెన్.
ఆటవెలది:
కాకి రేపుమాపు "కాకకాకా"యను
కోకిలమ్మ "కూత" కొంత వరకె
సమయమెరుగు పలుకు సరిమెత్తురందరు
కానివేళ మేలు మౌనమెపుడు.
కందము:
మాటున నిలవకు, నిజమును
మాటలలో దెలుప నీకు మౌనమ్మేలా?
మాటాడువారి మౌనము
మాటలలో జెప్పలేము మహికహితమ్మే.
కందము:
మాటలు మనకవి మీటలు
దీటుగనే నొక్క గలుగు తీయని నాదం
ఘాటును పెంచిన వినుటకు
నాటుగనే యుండు మదిని నాటును గుబులే.
Thursday, 17 April 2025
గురువంటే
" ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.
అంశం: ఇతడుకదా గురువంటే.
కందము:
గురువగు తల్లికి దొలుతను
గురువగు తండ్రికిని పిదప గొప్పగ జగతిన్
గురువగు హరికిని తప్పక
గురుతెరుగుచు నతులనిడరె కువలయమందున్.
కందము:
బత్తెము గురువది చూచును
పొత్తము మరి చూడరయ్యొ పోకిరి పిల్లల్
బెత్తము చూపిన హత్తెరి
కత్తులనే వారు చూపు, కాలము మారెన్.
కందము:
చురకలు, చెణుకులు, చరితలు
మెరుపులు కథలను గలుపుచు మెచ్చగ చదువుల్
గరపగ వలయును చక్కగ
గురువులు తమపాఠములవి గురుతుగనుండన్.
కందము:
పొత్తమునందలి భావపు
విత్తనముల "పదునెరుగుచు" విద్యార్థుల దౌ
చిత్తపు పొలముల జల్లుచు
మొత్తము "సరి భావ లతల" బూయించవలెన్.
కందము:
చదువది పొత్తములోనిది
మొదలంటుచు చివరి వరకు మొత్తము నేర్పన్
చదువుల జెప్పుటె కానీ!
చదువరులకు గరపవలయు సంస్కారమ్మున్.
కందము:
విద్యార్థి శక్తి నెరుగుచు
నుద్యోగపు చదువుతోడ నొక కళలోనన్
ఉద్యతి నిష్ణాతుండవ
సద్యోగము నీయవలయు సద్గురువెపుడున్.
కందము:
గురువన నెవ్వరు? విను, నలు
గురు కలసినవేళ బిల్చు "గురుగురు" కాడోయ్
గురువన జ్ఞానపు దీపము
గురుతెరుగగ దారిజూపు గోరగ భక్తిన్.
కందము:
పొత్తము నొకచేతను మరి
బెత్తము నొకచేత బట్టి ప్రియముగ చదువుల్
మెత్తగ, నవసర మగుతరి
మొత్తుచు నేర్పించు గురువు పూజ్యుండిలలో.
Wednesday, 16 April 2025
అమ్మ గొప్ప తనం
"ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.
అంశం:: అమ్మ గొప్ప తనం
కందము:
అమ్మయె వాణియు, శక్తియు
నమ్మయె శ్రీ అన్నపూర్ణ యామెయె సిరిలే
అమ్మయె కాళిక మాతయు
అమ్మో! యెన్నెన్ని రూపులామెవి కనగా!
ఆటవెలది:
"అమ్మనగుచు నున్న నందమ్ము నెంచను
సోకు తగ్గుననుచు సొక్కిపోను
నందనులను గనుటనం దందు ప్రియమని"
అమ్మ నగుచు జెప్పు నందరకును.
కందము:
నలుపును తెలుపును జూడదు
పలుయంగపు లోపమైన పట్టెడు ప్రేమే!
నలిపిన తా నూరుకొనదు
పలుకును "నాబిడ్డ నాకు బంగరుకొండే!"
కందము:
చిచ్చోలుళుళుళు హాయీ!
చిచ్చీ! నాకన్న! బుజ్జి! చిన్నీ! యనుచున్
ఇచ్చుచు పాలను నిద్దుర
బుచ్చును బజ్జుండబెట్టి బుగ్గలు నిమురున్.
కందము:
తనరూపము "చిన్నది"గా
తన నాథుడె "బాబు"రూపు ధరియించెననున్
తన "అమ్మానాన్నాట"యె
ఘనముగ నిజమాయె నంచు కైతలు పాడున్.
కందము:
తన పాటలు తన మాటలు
తనయాటలు తనదు ప్రేమ తన్మయమందన్
తనివార బంచుకొనగను
తన వారసులహహ వచ్చె ధన్యంబనుగా.
కందము:
కొమ్మను నేనై పెరుగగ
నిమ్ముగ చేకొనగ భర్త నెయ్యముతోడన్
అమ్మను నేనవ బుట్టెను
"ముమ్ముమ్మ"ని తేనెపలుకు బుజ్జాయనుగా.
కందము:
ఆ చిన్ని ముక్కు నాన్నది
ఆ చక్కనికళ్ళు జూడ నమ్మవె మరియున్
ఆ చుబుకమేమొ తాతది
ఆ చుక్కయె నుదుట బామ్మదన మురియునుగా.
కందము:
నిద్దురగాచుచు, సేవలు
ముద్దుగ జేయుచును, గోరు ముద్దల నిడుచున్
"దద్దాదద్దా" మాటల
నొద్దిక విని యర్థమరసి యుప్పొంగునుగా.
కందము:
అబ్బాయా! అమ్మాయా!
అబ్బా!తాజూడదెప్పు డా గౌను మరిన్
జుబ్బాలు గూడ వేయును
అబ్బో! కృష్ణమ్మ కృష్ణుడని దీవించున్.
కందము:
అమ్మా, నాన్నా, అక్కా
మామ్మా, తాతయ్య, యత్త, మామా యనుచున్
ముమ్మారు, నాల్గుమార్లని
ఇమ్ముగ మాటలను నేర్పు నిష్టముతోడన్.
కందము:
కుడుపుచు వేళకు, శ్రద్ధగ
గడుపుచు తా రాత్రిపగలు కన్నల నెపుడున్
కడుపును వీడుచు బుట్టిన
గడుపుననే బెట్టి తల్లి కాచును ప్రేమన్.
కందము:
నవ్విన నవ్వును, యేడ్చిన
నొవ్వుచు దానేడ్చు, ముద్దు నోటన్ శిశువే
కవ్వించిన కవ్వించును
బువ్వనుదిను నటన జూపు బువ్వను దినగన్.
కందము:
మొట్టును మట్టిని దిన్నన్
గట్టిగనే కండ్లనురిమి గదుముచు జూచున్
తిట్టును పెరిగిన నల్లరి
కొట్టును చెడుపనులుజేయ కూనల హితయై.
కందము:
కంటికి రెప్పగ జూచును
ఒంటికి చిరుగాయమైన నోర్వక వగచున్
ఇంటికి చుట్టాల్ వచ్చిన
గంటల "సీర్యల్" గ మలచు గద శిశు చేష్టల్.
కందము:
కడుపున బుట్టిన వారల
కడుపును జూచుచును బెట్టు ఖాద్యములెన్నో
కడుపున బెట్టుక జూచును
కడు పుణ్యపురాశి యమ్మ కదరా భువిలో.
కందము:
లాలను కుదురుగ బోయును
లాలీయని పాడి నిద్దురను రావించున్
లాలించు నేడ్చు వేళల
లీలలు కానట్టి పనులు లేవని చెప్పున్.
కందము:
ఆ చలిపులి వణికించదు
ఆ చెంగును గప్పుకొన్న, న”మ్మది” లోనన్
"బూచోని" భయము శిశువుకు
ఆ చంకననెక్క దీరు “నమ్మ"ది యగుచో.
ఆటవెలది:
కడుపు నిండు వరకు కనిపెట్టి వడ్డించు
తాను తినగ దాచ తలపు నిడదు
అమ్మ వండుపాత్ర అక్షయ పాత్రయే
అన్నపూర్ణ సాటి యవని తల్లి.
ఆటవెలది:
మూకుడన్నమంత ముద్దు బిడ్డకు బెట్టి
బడికి బంపి చదువు బాట నడిపి
గ్లాసు నీరు త్రాగి కడుపు నింపుకొనెడు
నిండు మనసు తల్లి నీకు నతులు.
కందము:
పెట్టిన బెట్టక బోయిన
బెట్టుగ తన ముదుమి లోన పిల్లల కెపుడున్
కట్టెగ మారెడి వరకున్
దిట్టకనే మనసులోన దీవెనలిచ్చున్.
(సరదాగా ఒక మణిప్రవాళము)
కందము:
తన స్లిమ్నెస్స్ తన డైటింగ్
తన బ్యూటీ షేపుమారి తన బాడీకిన్
తన లైఫుకు రిస్కైనను
తను మదరవ థింకు జేయు దా ఉమెనే వావ్!
కందము:
వింటిరె బిడ్డన్ గని తా
నొంటరిగా కుప్పతొట్టె నుంచుట మేలా?
కంటేనె అమ్మగాదుర!
కంటికి రెప్పగను వారి గంటేనేరా!
తేటగీతి:
నిండుచూలాలు నింగిని "నీలి మబ్బు"
ప్రసవ వేదన "నురుము"లై బడుచునుండ
"మెరుపు" శస్త్రచికిత్సనే మేలు జేయ
"చినుకు" బిడ్డను గని సంతసించె తల్లి.
చంపకమాల:
తనపతి త్రాగివచ్చి పడి తన్నిన గ్రుద్దిన తానె యోర్చుచున్
ధనమది తిండి తిప్పలకు దమ్మిడినీయక మొండిసేసినన్
తనదగు రెక్క కష్టమున దక్కిన దానితొ ప్రేమ బెంచి తా
గనినటువంటి పిల్లలను గాచెడు తల్లికి వందనమ్మహో!
ఉత్పలమాల:
ఎన్నగ తల్లిప్రేమగన నేమి మహత్యము చేరియున్నదో!
మిన్నుల మన్నులన్నిలచి మిన్నగనేలెడు విశ్వరూపుడే
చిన్నగ మారి భూమిపయి చెన్నుగ "వ్రేలెడు" పాపడౌచు తా
వెన్నునిగా యశోద కడ ప్రేమలుబొందెడు భాగ్యమందెగా!
Friday, 11 April 2025
మాటనీరె
ఆటవెలది:
ఉద్యమమ్ము జేయ నుద్యమించగవలెనాంధ్రభాష కొరకు నందరికను
మాటనీరె మీరు మాట నీరుగ గాక
తెలుగుతల్లి మోము వెలుగునటుల.
Thursday, 10 April 2025
వసంత ఋతు వర్ణన
"అమరావతి సాహితీ మిత్రులు"
యఫ్.బి. గ్రూప్ నందు ఇచ్చిన అంశమునకు నేను వ్రాసిన పద్యములు."వసంత ఋతు వర్ణన"
కందము:
తడి చలిగాలులు పోయెను
పొడిగా నాహ్లాదమిచ్చు పోడిమి గాలుల్
వడిలేక మంద్రగతి స
వ్వడి లేకను తెల్గునేల బాగుగ సాగెన్.
తేటగీతి:
బోడులైనట్టి మ్రానులే భువిని జూడ
చిగురుబోడుల తలపించె చిగురు వేసి
క్రొత్త పూతల పుప్పొడుల్ మత్తుగొలిపె
పైరగాలుల దిరుగుచు పరవశమున.
కందము:
వనవాసము వీడుచు మరి
తన మాసము వచ్చెనంచు త్వరితముగానే
ఘనమగు "కూకూ" రవముల
వినిపించగ కోయిలమ్మ వేడ్కగ వచ్చెన్.
తేటగీతి:
వేపపూత సువాసన వెల్లివిరిసె
మావి చిగురుల కాంతులు మహిని నిండె
"కుకుకు మేళమ్ము" వాయించె కోకిలములు
స్వాగతించెను జగతి వసంతు రయము.
ఉత్సాహము:
ఆత్రమంది తనను పిలచు నవని జనుల ప్రీతికై
మిత్రుడగుచు వత్సరాది మేలు దినము నందునన్
చైత్ర రథము నెక్కి వచ్చె సంబరాలు నిండగా
చిత్రరథుని పనుపు తోడ శీఘ్రమే వసంతుడే.
Sunday, 6 April 2025
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః
Sunday, 30 March 2025
శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరకు శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు.
కందము:
విశ్వావసు వత్సరమా!
విశ్వాసముతో బిలచితి, ప్రియముగ నీవే
విశ్వమునన్ సుఖశాంతుల
విశ్వంభరు కృపను మాకు వీడకనిడవే!
Thursday, 27 March 2025
సమయోచిత పద్యరత్నము – 108
తెల్లని వస్త్రముల్ గలిగి, తేజము సర్వము వ్యాప్తి జెందుచున్
చల్లని వెన్నెలల్ గురియు చక్కని చంద్రుని కాంతి చాయతో
నల్లన నాల్గు చేతులు,సుహాసపు శాంతపు మోము వానినే
యుల్లమునందునన్ నిలిపియుంచుదు విఘ్నములన్ని బోవగన్.
Wednesday, 26 March 2025
సమయోచిత పద్యరత్నము – 107
ఉత్పలమాల:
కమ్మని జ్ఞానవంతులుగ గమ్మని దీవెనలందజేసి, మో
దమ్మును బంచి, మా బ్రతుకు దమ్మున నీడ్చెడు శక్తినిచ్చి, దా
నమ్ముల జేయు బుద్ధి వదనమ్ముల తేజము బెంపుజేసి, న్యా
యమ్ముల వర్తనమ్ము, విజయమ్ముల నీయుమ, విశ్వరూపిణీ!
Tuesday, 25 March 2025
సమయోచిత పద్య రత్నము - 106
ఉత్పలమాల:
వందనమేను జేతు ఘన వాక్కులు నేర్పిన తెల్గుతల్లికిన్
వందనమేను జేతు సరి బల్కిన తీపిని బంచు భాషకున్
వందనమేనుజేతు నను పాలన జేసెడి తెల్గునేలకున్
వందనమేనుజేతు విని పద్యము మెచ్చెడి తెల్గువారికిన్.
Monday, 24 March 2025
సమయోచిత పద్య రత్నము - 105
ఉత్పలమాల:
హత్తెరి చూడగానిది బృహత్తర కార్యమె, "చండ్రపాటి" చే
క్రొత్తగు నొర్వడిన్ దెలిపె, కోరుచు వ్రాసెడు పండితాళికే
హత్తుకుబోయె మానసము నందున సత్యము"మోహనమ్ము"గా
నిత్తరి యర్చనల్ సలిపి రిచ్చట వాణికి నిట్టి సత్క్రియన్.
Sunday, 23 March 2025
సమయోచిత పద్య రత్నము - 104
ఉత్పలమాల:
చక్కని సాహితీప్రియుల సంగమ మిచ్చట, తెల్గు నేలపై
మిక్కిలి శ్రద్ధతో కవులు మీరుచు పద్య సు "మాల" లల్లగన్
పెక్కురుజేరి రిచ్చటకు, పేర్మి సుమాలను నూటనెన్మిదిన్
వాక్కులమాత దీవెనల బంచగ, బేర్చిరి చూడ రండహో!
Saturday, 22 March 2025
సమయోచిత పద్య రత్నము - 103
మత్తకోకిల:
రామదాసుడ! వాయుపుత్రుడ!రక్ష మాకిక నీవెరా
నీమమెంచుచు దల్తుమింకను నిన్ మహా మహిమాన్వితా!
స్వామినిన్నిక గోరి కొల్చిన చండ్రపాటి నివాస! మా
కేమికావలెనన్ననిత్తువు హే!నమో!హనుమాన్!ప్రభో!
Friday, 21 March 2025
సమయోచిత పద్య రత్నము - 102
పుట్టుచు వాయుదేవునకు, పోవగ లంక జలమ్ముదాటి, యా
గట్టున జూచి భూమిసుత, భగ్గున మండెడు నిప్పుతోకతో
నట్టిటు లంకగాల్చి, కడ కాకస యానము జేసి రామునిన్
గట్టిగ జేరినావు, కన కైవసమైనవి పంచభూతముల్.
Thursday, 20 March 2025
సమయోచిత పద్య రత్నము - 101
చంపకమాల:
బలమిక మెండుగానొదవు, బాగుగ వాక్కులు చేరివచ్చుగా!
నిలబడి పోరుసల్పుటకు నిశ్చల దైర్య, మరోగమందుగా!
కొలతకురాని బుద్ధి, యొనగూడును కీర్తి, ధరాతలమ్మునన్
గొలిచిన జాలు నిన్ మదిని, కోరక గోర్కెలు దీరు మారుతీ!
Wednesday, 19 March 2025
సమయోచిత పద్యరత్నము - 100
ఉత్పలమాల:
కానుర! నేను దేహమును, కద్దుగ మృత్యువదెట్లు వచ్చురా?
కానుర! నేను ప్రాణమును, కల్గవు దప్పిక లాకలెప్పుడున్
కానుర! నేను చిత్తమును, కన్పడ వెన్నడు శోకమోహముల్
కానుర! నేను కర్తనిక, కట్టులు విడ్పులవెట్లు గల్గురా?
Sunday, 16 March 2025
సమయోచిత పద్యరత్నము – 99
చంపకమాల:
ధనికుల యింటి ద్వారముల దానముగోరగ నిల్చియుండి చే
కొనుమని వ్రాసినాడవిక కొంటెగ గూర్చొని పద్మమందునన్
వినుమిక పద్మవాస!నిను వేడెద పాదములంటి, ఫాలమున్
కనబడనీక జేయుమయ, కాదని మార్చుచు నట్టి వ్రాతలన్.
Saturday, 15 March 2025
సమయోచిత పద్యరత్మ్నము – 98
మత్తకోకిల:
సన్మతుల్ భువి జేయుచుందురు జన్మకర్మల కల్పనల్
జన్మమెత్తిన వారుబొందగ సద్గతుల్, పలు స్తోత్రముల్
చిన్మయున్ బొగడంగ జేతురు చేరిజూడగ వేల్పుకున్
జన్మలన్నవి రావురా మరి, సత్యమంటవు కర్మలున్.
Friday, 14 March 2025
సమయోచిత పద్యరత్మ్నము - 97
తూరుపు కొండమీద సరి తూగుచు నూయలలూగు స్వామివే!
మీరుచు పశ్చిమంపు గిరి మీదుగ గ్రుంకెడు భాస్కరుండవే!
తీరుగ వెల్గు గుంపులకు తేజము గల్గిన నాథుడీవెగా!
చేరి దినాధిపుండగుచు జీవులగాచెడి నీకు మ్రొక్కెదన్.
Thursday, 13 March 2025
సమయోచిత పద్య రత్నము - 96
మత్తేభము:
భగవద్గీతను వీడబోకుమెపుడున్ పాఠమ్ముగా నేర్వుమా!
జగతిన్ శ్రీహరి వేయినామములనే సంకీర్తనల్ జేయుమా!
భగవాన్ శ్రీపతి ధ్యానమున్ సలుపుచున్ బాగైన దానమ్ము నిం
తగ నా పేదలకిచ్చి సజ్జనులతో ధర్మమ్ముగా సాగుమా!
Wednesday, 12 March 2025
సమయోచిత పద్య రత్నము - 95
చంపకమాల:
కృతయుగమందు మానవులు కేవల ధ్యానము జేయుచుంటచే
హితమగు యజ్ఞ యాగముల నెంతయు త్రేత నొనర్చుచుంటచే
సతతము దైవమున్ గొలిచి సద్గతి నొందిరి ద్వాపరంబునన్
మితమదిలేని కీర్తనల మించుచు నీ కలి, ముక్తి వచ్చుగా.
Tuesday, 11 March 2025
సమయోచిత పద్య రత్నము - 94
చంపకమాల:
ధర వరుణుండు పేరుగల ధన్యమునీంద్రుని కొక్క పుత్రుడై
వరగుణ శీలవంతుడును బ్రహ్మమహర్షిగ లోకమందునన్
స్థిరముగ నిల్చి రత్నభర శైలము మేరువు జేరి నా గుహన్
సరియెవరేని లేరనగ జక్కగ జేసె తపస్సు నయ్యెడన్.
Monday, 10 March 2025
సమయోచిత పద్యరత్నము – 93
చంపకమాల:
తలగడ యౌచు శ్రీహరికి తల్పముగా నగుచుండు భక్తితో
నిలకడతోడ శ్రీ విభుని నిత్యనివాసమునౌచు, కూర్చొనన్
జిలుగుల రాజపీఠమయి శ్రీధర పాదుకలౌచు, నిత్యమున్
మెలకువతో ననంతుడట మెప్పుగ నచ్యుతు సేవజేయుగా.
Friday, 7 March 2025
సమయోచిత పద్యరత్నము – 92
Thursday, 6 March 2025
సమయోచిత పద్యరత్నము – 91
ఉత్పలమాల:
బంగరుకాంతి మేనుగల పావన మూర్తియు యజ్ఞపూరుషుం
డంగుగనుండు రూపమున యజ్ఞమునందున నుద్భవించెగా
భంగములేని వ్యాపకుడు భాస్కర తేజుడు నాసికంబులన్
హంగుగ శ్వాసవాయువుల నాశ్రుతులందెను శైబ్యకంఠుచే.
Wednesday, 5 March 2025
సమయోచిత పద్యరత్నము – 90
ఉత్పలమాల:
ధర్మము నాచరించుటకు ధైర్యము గావలె ధాత్రిలోపలన్
ధర్మము జూడ లాభమెది తానుగనీయదు ముందునెప్పుడున్
కర్మనుజేయగా విడక గల్గును శాంతియు నున్నతస్థితుల్
ధర్మము రక్షజేయుగద ధర్మమునేమరి రక్షజేయగా.
Tuesday, 4 March 2025
సమయోచిత పద్యరత్నము – 89
చంపకమాల:
నరకపు ద్వారముల్ గదర నాశము జేసెడు త్రోవలవ్విరా
పురుషుడు వీనిబారిబడ పోవును యోగ్యత, పుణ్యవర్తనన్
మరువక కామ లోభముల మైకముజెందక క్రోధమున్ దగన్
నరుడిక వీడగా వలెను నష్టము మూడిటి వీడకుండినన్.
Monday, 3 March 2025
సమయోచిత పద్యరత్నము – 88
చంపకమాల:
అనయము కన్నలోకముల నమ్మగ గాంచుచు గాచుచుందువే
మనసున దల్చబోను గన మాధవుడెవ్వడు లేడటంచు తా
వినయములేక వాగు నరు, వీడును నిన్ మది వానిదల్పగా
ననవరతమ్ము మానసమునందున గొల్చెద నిన్నె కేశవా!
Sunday, 2 March 2025
సమయోచిత పద్యరత్నము – 87
దొంగలు కొట్టి చాటుగను దోచుకపోరులె, చేరి పంచను
ప్పొంగుచు వృద్ధినొందు నది, పోదు నశింప యుగాంతమందునన్
కొంగుననున్న పైడిగద, కూడిన విద్యలుగాద సంపదల్
వంగుచు నుండగాదగును పండితవర్యుల ముందు శ్రీపతుల్.
Saturday, 1 March 2025
సమయోచిత పద్యరత్నము – 86
చంపకమాల:
ముడుతలు నిండి మోమునకు ముద్దుల వన్నెలు తగ్గిపోయినన్
నడుమది వంగినన్, తలను నల్లనిజుట్టది తెల్లనైన, దా
వడలిన పండువోలె తన పట్టునుదప్పుచు దేహముండినన్
గడబిడజేయు కోర్కెలహ! కానగ లోపల కుర్ర చేష్టలన్.
Friday, 28 February 2025
సమయోచిత పద్యరత్నము – 85
ఉత్పలమాల:
కాలము లెవ్వియైన సరి గాచుచు హద్దుల దేశరక్షకై
కాలును దువ్వు శత్రువుల గాలము జిక్కక, దైర్యవంతులై
కాలుని లెక్కజేయకను, కండ్ల కుటుంబము దల్చి, వైరులన్
కాలుచునుండు రక్తమున గాల్చెడి సైనిక! వందనమ్మిదే!
Thursday, 27 February 2025
సమయోచిత పద్యరత్నము – 84
చంపకమాల:
ధనమును గోరి జీవితపు దారిని మిక్కిలి ప్రాకులాడుచున్
అనయము మోక్షసంపదల నాలయమందున జేరి కోరుచున్
వినయములేక సాగెదరు విజ్ఞత గోల్పడి, ప్రీతిగొల్వ సా
ధనమున లోకనాథునిక తగ్గును మోహము, ముక్తిగల్గుగా.
Wednesday, 26 February 2025
తండ్రివోలె మమ్ము దయను గనుమ.
ఓం నమః శివాయ
మీకు అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.సీసము:
ధర్మమనెడి యెద్దు దానిపై నీవుండ
తరచి చూడగ మాకు ధర్మమేది?
దిక్కుల వలువలన్ దివ్యమై నీవుండ
తిక్కనుండెడి మాకు దిక్కదేది?
తెలివికన్ను గలిగి తెల్లమై నీవుండ
తెలిసి కొల్వ దగిన తెలివదేది?
భక్త సులభుడైన పరమాత్మ నీవుండ
పరగ దలచునట్టి భక్తియేది?
ఆటవెలది:
ధర్మము, సరి దిక్కు తలపున తెలియము
కొలుచు తెలివి, లేదు తలచు భక్తి
నీలకంఠ! శూలి! నిత్యమ్ము దరినిల్చి
తండ్రివోలె మమ్ము దయను గనుమ.