" ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.
అంశం : జాతీయ పతాకం
కందము:
రంగులుమూడు నడిమి గుం
డ్రంగానే ధర్మచక్ర రచనయు గలిసెన్
పింగళి వెంకయ కూర్చిన
హంగగు జెండాకు జేతు నభివందనమున్.
కందము:
మూడగు రంగుల, త్యాగము
తోడుగ శాంతియు సహనము తో నడుమనుచున్
జాడను దెలుపు పతాకము
వేడుకగా భారతవిను వీధిని గనుమా!
కందము:
పువ్వుల రేకులు రువ్వుచు
దవ్వున నొక తెల్ల గువ్వ ధాటిగ నెగురన్
చివ్వలు వలదని, నవ్వుచు
మువ్వన్నెల కేతనమ్ము ముదమున నెగిరెన్.
కందము:
రంగులు మూడును మెరయగ
ముంగిలినేదాటు శత్రు మూకలకెపుడున్
"రంగుబడుద్ద"ని జెప్పుచు
నింగిని దాకగ పతాక నిత్యమ్మెగురున్.
No comments:
Post a Comment