"అమరావతి సాహితీ మిత్రులు"
యఫ్.బి. గ్రూప్ నందు ఇచ్చిన అంశమునకు నేను వ్రాసిన పద్యములు."వసంత ఋతు వర్ణన"
కందము:
తడి చలిగాలులు పోయెను
పొడిగా నాహ్లాదమిచ్చు పోడిమి గాలుల్
వడిలేక మంద్రగతి స
వ్వడి లేకను తెల్గునేల బాగుగ సాగెన్.
తేటగీతి:
బోడులైనట్టి మ్రానులే భువిని జూడ
చిగురుబోడుల తలపించె చిగురు వేసి
క్రొత్త పూతల పుప్పొడుల్ మత్తుగొలిపె
పైరగాలుల దిరుగుచు పరవశమున.
కందము:
వనవాసము వీడుచు మరి
తన మాసము వచ్చెనంచు త్వరితముగానే
ఘనమగు "కూకూ" రవముల
వినిపించగ కోయిలమ్మ వేడ్కగ వచ్చెన్.
తేటగీతి:
వేపపూత సువాసన వెల్లివిరిసె
మావి చిగురుల కాంతులు మహిని నిండె
"కుకుకు మేళమ్ము" వాయించె కోకిలములు
స్వాగతించెను జగతి వసంతు రయము.
ఉత్సాహము:
ఆత్రమంది తనను పిలచు నవని జనుల ప్రీతికై
మిత్రుడగుచు వత్సరాది మేలు దినము నందునన్
చైత్ర రథము నెక్కి వచ్చె సంబరాలు నిండగా
చిత్రరథుని పనుపు తోడ శీఘ్రమే వసంతుడే.
No comments:
Post a Comment