తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 26 April 2025

కర్షకుడి గొప్పతనం

 " ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.


అంశం: కర్షకుడి గొప్పతనం

కందము:
పొలమను కాగితమందున
హలమను కలమును గదుపుచు నవనిని ప్రజకే
ఫలవంతపు పంటల కవి
తలనిడు కర్షకకవి కిదె తల తలపాగా!

కందము:
నీరదమును తా జూచుచు
నీరిమ్మని వేడుకొనుచు నీరిడి కండ్లన్
నీరెండ మాత్రమే కని
నీరెండిన నేత్రములతొ నింగిని గనుగా!


కందము:
పనులకు బోవుటలోనను
ఇనునకు పోటీగ లేచు నెప్పుడుగూడన్
కనులతొ నక్షత్రములను
మిను జూచిన పిదప తాను మేనున్ వాల్చున్.

కందము:
చలి పులికి నులికి పడకను
జలజల వర్షమ్ముకైన సంశయమిడకన్
అలమండుటెండ కదరక
ఫలసాయము కొరకు జేయు వ్యవసాయమ్మున్.

కందము:
తన చెమటను తన రక్తము
తన శ్రమనే ధారబోసి తన సౌఖ్యమ్మున్
తనబాగు నెంచి జూడక
మనకన్నము బెట్టు రైతు మహనీయుండే.

కందము:
వర్షములెన్నియొ మారిన
ఘర్షణలను సైచి తాను ఘనుడై నిలచున్
కర్షకుడు "కాడి వదలడు"
శీర్షముగ సమాజమునకు చేవల నిడుగా.

కందము:
భూమిని తల్లిగ దలచును
భామినిగా దలచు నెడ్ల బండిని, హలముల్
సామాను కాడి సుతులగు
ప్రేమన్ గోవులును యెడ్లు ప్రియబాంధవులౌ.

కందము:
ఎంచక ఫలితము నెదలో
వంచననే యెన్నిమార్లు ప్రకృతియె చేయన్
కించిత్తు పట్టు వదలక
మంచిగ తన కర్మజేయు మాన్యుడతండే.

ఆటవెలది:
పనిని చెమటనోడ్చు పది "సెంట్ల" పొలమైన
చెమట దలచు తాను "సెంటు"గాను
తిండి తిప్పలందు తెలియడే "డీసెంటు"
అన్ని పనులలోన "నిన్నొసెంటు"

ఆటవెలది:
పంట ప్రతిదినమ్ము పరికించి చూచును
కలుపులన్ని దీసి “ఖతము” జేయు
చీడ మందు వేసి వాడులే యెరువులు
"స్ట్రిక్టు" పాలకుండు క్షేత్రమునకు.

ఆటవెలది:
పనుల "హార్డు వేరు" కనగ "రూటే" వేరు
మనసు "సాఫ్టు వేరు" మసలు తీరు
వేరు చేసి చూడ విశ్వమ్ము తార్మారు
అవని వృక్షమునకు నతడు "వేరు"


No comments: