"ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.
అంశం:: అమ్మ గొప్ప తనం
కందము:
అమ్మయె వాణియు, శక్తియు
నమ్మయె శ్రీ అన్నపూర్ణ యామెయె సిరిలే
అమ్మయె కాళిక మాతయు
అమ్మో! యెన్నెన్ని రూపులామెవి కనగా!
ఆటవెలది:
"అమ్మనగుచు నున్న నందమ్ము నెంచను
సోకు తగ్గుననుచు సొక్కిపోను
నందనులను గనుటనం దందు ప్రియమని"
అమ్మ నగుచు జెప్పు నందరకును.
కందము:
నలుపును తెలుపును జూడదు
పలుయంగపు లోపమైన పట్టెడు ప్రేమే!
నలిపిన తా నూరుకొనదు
పలుకును "నాబిడ్డ నాకు బంగరుకొండే!"
కందము:
చిచ్చోలుళుళుళు హాయీ!
చిచ్చీ! నాకన్న! బుజ్జి! చిన్నీ! యనుచున్
ఇచ్చుచు పాలను నిద్దుర
బుచ్చును బజ్జుండబెట్టి బుగ్గలు నిమురున్.
కందము:
తనరూపము "చిన్నది"గా
తన నాథుడె "బాబు"రూపు ధరియించెననున్
తన "అమ్మానాన్నాట"యె
ఘనముగ నిజమాయె నంచు కైతలు పాడున్.
కందము:
తన పాటలు తన మాటలు
తనయాటలు తనదు ప్రేమ తన్మయమందన్
తనివార బంచుకొనగను
తన వారసులహహ వచ్చె ధన్యంబనుగా.
కందము:
కొమ్మను నేనై పెరుగగ
నిమ్ముగ చేకొనగ భర్త నెయ్యముతోడన్
అమ్మను నేనవ బుట్టెను
"ముమ్ముమ్మ"ని తేనెపలుకు బుజ్జాయనుగా.
కందము:
ఆ చిన్ని ముక్కు నాన్నది
ఆ చక్కనికళ్ళు జూడ నమ్మవె మరియున్
ఆ చుబుకమేమొ తాతది
ఆ చుక్కయె నుదుట బామ్మదన మురియునుగా.
కందము:
నిద్దురగాచుచు, సేవలు
ముద్దుగ జేయుచును, గోరు ముద్దల నిడుచున్
"దద్దాదద్దా" మాటల
నొద్దిక విని యర్థమరసి యుప్పొంగునుగా.
కందము:
అబ్బాయా! అమ్మాయా!
అబ్బా!తాజూడదెప్పు డా గౌను మరిన్
జుబ్బాలు గూడ వేయును
అబ్బో! కృష్ణమ్మ కృష్ణుడని దీవించున్.
కందము:
అమ్మా, నాన్నా, అక్కా
మామ్మా, తాతయ్య, యత్త, మామా యనుచున్
ముమ్మారు, నాల్గుమార్లని
ఇమ్ముగ మాటలను నేర్పు నిష్టముతోడన్.
కందము:
కుడుపుచు వేళకు, శ్రద్ధగ
గడుపుచు తా రాత్రిపగలు కన్నల నెపుడున్
కడుపును వీడుచు బుట్టిన
గడుపుననే బెట్టి తల్లి కాచును ప్రేమన్.
కందము:
నవ్విన నవ్వును, యేడ్చిన
నొవ్వుచు దానేడ్చు, ముద్దు నోటన్ శిశువే
కవ్వించిన కవ్వించును
బువ్వనుదిను నటన జూపు బువ్వను దినగన్.
కందము:
మొట్టును మట్టిని దిన్నన్
గట్టిగనే కండ్లనురిమి గదుముచు జూచున్
తిట్టును పెరిగిన నల్లరి
కొట్టును చెడుపనులుజేయ కూనల హితయై.
కందము:
కంటికి రెప్పగ జూచును
ఒంటికి చిరుగాయమైన నోర్వక వగచున్
ఇంటికి చుట్టాల్ వచ్చిన
గంటల "సీర్యల్" గ మలచు గద శిశు చేష్టల్.
కందము:
కడుపున బుట్టిన వారల
కడుపును జూచుచును బెట్టు ఖాద్యములెన్నో
కడుపున బెట్టుక జూచును
కడు పుణ్యపురాశి యమ్మ కదరా భువిలో.
కందము:
లాలను కుదురుగ బోయును
లాలీయని పాడి నిద్దురను రావించున్
లాలించు నేడ్చు వేళల
లీలలు కానట్టి పనులు లేవని చెప్పున్.
కందము:
ఆ చలిపులి వణికించదు
ఆ చెంగును గప్పుకొన్న, న”మ్మది” లోనన్
"బూచోని" భయము శిశువుకు
ఆ చంకననెక్క దీరు “నమ్మ"ది యగుచో.
ఆటవెలది:
కడుపు నిండు వరకు కనిపెట్టి వడ్డించు
తాను తినగ దాచ తలపు నిడదు
అమ్మ వండుపాత్ర అక్షయ పాత్రయే
అన్నపూర్ణ సాటి యవని తల్లి.
ఆటవెలది:
మూకుడన్నమంత ముద్దు బిడ్డకు బెట్టి
బడికి బంపి చదువు బాట నడిపి
గ్లాసు నీరు త్రాగి కడుపు నింపుకొనెడు
నిండు మనసు తల్లి నీకు నతులు.
కందము:
పెట్టిన బెట్టక బోయిన
బెట్టుగ తన ముదుమి లోన పిల్లల కెపుడున్
కట్టెగ మారెడి వరకున్
దిట్టకనే మనసులోన దీవెనలిచ్చున్.
(సరదాగా ఒక మణిప్రవాళము)
కందము:
తన స్లిమ్నెస్స్ తన డైటింగ్
తన బ్యూటీ షేపుమారి తన బాడీకిన్
తన లైఫుకు రిస్కైనను
తను మదరవ థింకు జేయు దా ఉమెనే వావ్!
కందము:
వింటిరె బిడ్డన్ గని తా
నొంటరిగా కుప్పతొట్టె నుంచుట మేలా?
కంటేనె అమ్మగాదుర!
కంటికి రెప్పగను వారి గంటేనేరా!
తేటగీతి:
నిండుచూలాలు నింగిని "నీలి మబ్బు"
ప్రసవ వేదన "నురుము"లై బడుచునుండ
"మెరుపు" శస్త్రచికిత్సనే మేలు జేయ
"చినుకు" బిడ్డను గని సంతసించె తల్లి.
చంపకమాల:
తనపతి త్రాగివచ్చి పడి తన్నిన గ్రుద్దిన తానె యోర్చుచున్
ధనమది తిండి తిప్పలకు దమ్మిడినీయక మొండిసేసినన్
తనదగు రెక్క కష్టమున దక్కిన దానితొ ప్రేమ బెంచి తా
గనినటువంటి పిల్లలను గాచెడు తల్లికి వందనమ్మహో!
ఉత్పలమాల:
ఎన్నగ తల్లిప్రేమగన నేమి మహత్యము చేరియున్నదో!
మిన్నుల మన్నులన్నిలచి మిన్నగనేలెడు విశ్వరూపుడే
చిన్నగ మారి భూమిపయి చెన్నుగ "వ్రేలెడు" పాపడౌచు తా
వెన్నునిగా యశోద కడ ప్రేమలుబొందెడు భాగ్యమందెగా!
1 comment:
వయసుడిగిన మేను వార్ధక్యమున జిక్కి
పూని చాకిరి చేయలేని నాడు
బుధ్ధి పటుత్వము పోయి , మతిమరుపు
చేరి సహాయము కోరు నాడు
ముదిమి తోబాటుగా నెదుగు రోగాలకు
వైద్యావసరము కావలయునాడు
మలిసంధ్య చీకట్ల మనుగడ మసకలో
కలగుండు పడు కష్ట మొలుకు నాడు
అమ్మ " నొక బిడ్డ " గా జూడ సమ్మతించి
కాచి కడతేర్చు బిడ్డలు గలర ? అంత
గాక పోయిన బాధ్యతగా దలంచి
జాలి చూపించ గలర ? కాస్తంత యైన
" మాతృపిండం దదామ్యహ " మన్న మాత్ర
ఋణము తీరదు , ముదిమి పైకొనిన నాడు
కాచి కడతేర్చ తీరు _ నీ ఘనత మరచి
ఎన్ని పిండాలు పెట్టిన నేమి ఫలము ?
Post a Comment