తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 25 December 2021

"గోలీ"లు - 49


కందము:
'బొక్కే' నిచ్చుట నదియొక
"బొక్కే" రా మానుమింక బో "వెల్కం"కే
"బుక్కొ"క్కటిమ్ము మంచిది
'మొక్కొ'క్కటి దెచ్చియిమ్ము మురియుచు గోలీ!


Wednesday, 1 December 2021

"సిరి(రా) వెన్నెల"

 నిన్న దివికేగిన "సిరి వెన్నెల" కు నివాళిగా


కందము:
అచ్చులు అయ్యో! యన్నవి
నొచ్చుచు నాహల్లులన్ని "నో" యని యరచెన్
మెచ్చిన "సీతా రాముం"
డచ్చెరువున సాగిపోగ నాకసమునకే.



Thursday, 11 November 2021

"గోలీ"లు - 48


కందము:
బెట్టును వీడుడు క్రిక్కెట్
బెట్టిం"గుల" మానుడింక విజ్ఞత తోడన్
పుట్టిని ముం"చెడు" "ఛీ"టింగ్
సెట్టింగులు చేతురనుచు చెప్పెను గోలీ!


Thursday, 4 November 2021

చెణుకును విసరగ

 మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.


సీసము:
చెణుకును విసరగ సీమటపాకాయ
చిలిపిమాటదియగు చిచ్చుబుడ్డి
వాదనమ్మునుజేయ వంకాయ బాంబౌను
మాట మంచిదియైన మరిమతాబు
ముచ్చట్లు దిరుగగా భూచక్రమును బోలు
పరుషవాక్యమెపుడు పాము బిళ్ళ
హద్దుగనని పల్కు హవ్వాయి చువ్వాయి
విష్ణుచక్రమగును వినయ వాక్కు

ఆటవెలది:
మాటవిలువదెలిసి మహిలోన మెలిగిన
వెలుగు జీవితమ్ము కలిమి నిండు
దీని విలువ దెలియ దీపాల పండుగ
నిలచియుండునెపుడు నిజము నిజము.


Monday, 1 November 2021

"గోలీ"లు - 47

 

కందము:
అతి తిండియు నతి నిద్రయు
నతివాగుడు నతిగనాశ లతివ్యాయామం
బతికోపంబతి శాంతం
బతియెందున బనికిరాదననెరా గోలీ!


Friday, 15 October 2021

విజయ! దుర్గ!

 శ్రీ మాత్రే నమః

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

సీసము.
ధరణిలో జనులకున్ దారిద్ర్యముల బాపి
కలుముల నీయుమా గౌరి! గిరిజ!
మాదక ద్రవ్యముల్ మానని యున్మత్తు
మత్తునే తొలగించుమా భవాని!
వావి వరుసదప్పి వయసునే దలచని
కాముకులను గాల్చు కాళికాంబ!
క్రొత్తరోగములిచ్చు కొమ్ముల పురుగులన్
ఛిద్రమ్ముజేయుమా సింహయాన!
ఆటవెలది.
శాంతి సౌఖ్యములను సమృద్ధిగానిడి
నరుల గావుమమ్మ గిరిజ! చండి!
విజయదశమి నాడు విధిగనిన్ గొల్తుము
విజయమీయుమమ్మ విజయ! దుర్గ!


Friday, 10 September 2021

నేనెనేనెయనుచు నిలుతువీవు

 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 

మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 


సీసము:

వక్రరేఖనొకటి సక్రమంబుగగీయ 

నేనెనేనెయనుచు నిలుతువీవు

భక్తితోడనుజేయ పసుపుముద్దనుగూడ 

నేనెనేనెయనుచు నిలుతువీవు

రావిపత్రములను రమ్యమ్ముగా బేర్చ  

నేనెనేనెయనుచు నిలుతువీవు

ఓంకారమునుబల్క "నోమ్మని"యనగానె

నేనెనేనెయనుచు నిలుతువీవు

ఆటవెలది:

గరికనిడగమెచ్చి వరమెవ్వడిడునన

నేనెనేనెయనుచు నిలుతువీవు

భక్తసులభుడవుగ భజియింతురా నిన్ను

వరములీయ రమ్ము ఫాలచంద్ర!


 

 


Tuesday, 7 September 2021

"గోలీ"లు - 46


కందము:

పొత్తమునొకచేతను మరి

బెత్తమునొకచేత బట్టి ప్రియముగ చదువుల్

మెత్తగ, నవసర మగుతరి

మొత్తుచు నేర్పించి గురువు మురియును గోలీ!  



Wednesday, 11 August 2021

"గోలీ"లు - 45

 

కందము:

న్యాయముగాసాగుట మరి 

సాయమునే చేయుట తగు సంతోషముతో

హేయపు పనులను మానుట 

ధ్యేయముగావలె నరులకు తెలియగ గోలీ! 


Sunday, 8 August 2021

నీరజ్ చోప్రా

 టోక్యో ఒలంపిక్స్ లో "గోల్డ్ మెడల్" సాధించిన సందర్భముగా

నీరజ్ చోప్రాకు అభినందనలు.

కందము:
నీరజ్ చోప్రా జయహో!
వీరా శూలంపు "త్రో" న విజయుడవగుచున్
ధీరుడవై వేసితివహ!
భారత్ మెడలోన కీర్తి బంగరు"మెడలున్"


సమస్య: జమునఁ జూడ విజయ శాంతి దక్కె.

 

చెల్లి విజయతో....

ఆటవెలది:

మనసు నందు "శాంతి" మసకబారినవేళ 

తీర్థయాత్రకొరకు తీరు వెడల

నచట బారుచున్న యందాల నదియగు 

జమునఁ జూడ విజయ! "శాంతి" దక్కె.


Saturday, 7 August 2021

సమస్య:కొట్టెడి భార్యపై మిగుల కూరిమిజూపును భర్త యెప్పుడున్

 


ఉత్పలమాల:

తిట్టిన వేళనేడ్వకనె తిండిని బెట్టుచు మొండిపట్టునే

బట్టక చీరెసారెలని బట్టలకేడ్వక బంధువర్గమున్

గుట్టుగనాదరించి పతి గూడుచు జెప్పినవాటికెల్ల నూ

కొట్టెడి భార్యపై మిగుల కూరిమిజూపును భర్త యెప్పుడున్.


దత్తపది: బండి, రిక్ష, కారు, లారి

 

రామాయణార్థంలో... ఆటవెలది: కారుమబ్బు సౌరు గామించి రాక్షసి చేరి క్షమనువీడ చెవులు ముక్కు పాపమింకబండి పట్టి కోయంగనే ఆశలారి యేడ్చె నతివ యపుడు.

Monday, 12 July 2021

"గోలీ"లు - 44

 

కందము:
ధర్మము తోడను, జీవన
మర్మములను దెలిసి కొనుచు మహిలో నెపుడున్
కర్మలజేయని నరులిక
దుర్మతులై విర్రవీగు దుష్టులు గోలీ!


Tuesday, 15 June 2021

"డెల్టాప్లస్"

 కందము:

"డెల్టాప్లస్" వస్తోందట
"ఉల్టాపల్టాగ" మారుతుందట "లైఫే"
"మెల్టౌక" ధైర్యమందుము
"వెల్టర్నింగ్" వచ్చుగాద వేయగ "టీకాల్".


Friday, 14 May 2021

"గోలీ"లు - 43


కందము:
కోవిడ్ "హారర్" సినిమా
చేవగనా "చైన"వాడు చేయ "రిలీజున్"
ఈ "వర్ల్డు" నన్ని చోటుల
హా!"వన్స్మోర"నగ సాగె హతవిధి! గోలీ!


Tuesday, 11 May 2021

చేతులారంగ

 తేటగీతి: 

చేతులారంగ "హ్యాండ్వాషు" చేయడేని

మూతి ముక్కుల "మాస్కు"తో మూయడేని

తగిన "డిస్టెన్సు" యుండగా దలపడేని

కలుగు వాడికి "కోవిడు" కలుగు చేటు.

Wednesday, 21 April 2021

"కొమ్ముల మారి"

 శ్రీరామచంద్ర పరబ్రహ్మణేనమః

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
కందము:
నీకాంత సీత గాదని
యేకాంతను జేరనీవు హే!హరి! సరియే
ఏకాంత "పెండ్లి వేడ్కలు"
శ్రీకాంతుడ నీకు దగున శ్రీరఘురామా!
కందము:
నీకల్యాణపు వేడ్కలు
మాకన్నులజూడలేని మార్పులు వచ్చెన్
చేకొమ్ము రామ బాణము
నా "కొమ్ముల మారి" జంపి హాయిని గూర్పన్.
కందము:
ఈ కోవిడ్ రక్కసియే
తాకసితో జనులజంప ధరబడె రామా!
నీకున్ దండము బెట్టెద
నీకోదండమ్మునెత్తి నిర్జింపవయా!

Monday, 19 April 2021

"గోలీ"లు - 42

 

కందము: 

"మందు"ను మానండనుచును 

"మందు"ల తోబోర మిగుల, మాన్యుల మాటల్

"విందుర?" మందే వారికి

"విందు"ర! వదలంగలేరు వినరా గోలీ! 


Tuesday, 13 April 2021

ప్లవనామపు వత్సరమా

 మీకు అందరికీ "ప్లవ" నామ తెలుగు వత్సర శుభాకాంక్షలు. 

 

కం: 

ప్లవనామపు వత్సరమా

నవ జీవనమిమ్మునేడు నయముగనీ మా

నవజాతి యరోగపు వి

ప్లవమును సాధించి జగతి బరగెడునట్లున్.

 

సీ:

మాస్కు బెట్టుకొనుట మామిడి వగరౌను 

చింతవదలియుంట చింతపులుసు

భౌతిక దూరమ్ము బాటింపు కారమ్ము    

ప్రీతినింటనెయుంట బెల్లమౌను

చేతులన్ గలుపక జేరుట వేప్పూత 

కరముల శుభ్రమ్ము గనగనుప్పు

శిశిరమంతయునిండె చేటుకాలము వచ్చె 

వత్సరమంతయున్ భయమునిండె   

ఆ.వె:  

ఆరుగాగలనివి యాచారముగ గల్పి  

యనుసరించ శుభములందగలవు  

ఆరుగా కరోన యనెడు రోగపునిప్పు 

ప్రతిదినమునుగాది పండుగగును.





Thursday, 11 March 2021

ఆకసమంత లింగమని

 అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

శివానుగ్రహ ప్రాప్తిరస్తు.

ఉత్పలమాల:
ఆకసమంత లింగమని యచ్చట దేవతలెల్ల గూడుచున్
శ్రీకర పూజసల్పిరట, చిత్రముగా శివరాత్రి వేళనన్
దూకుచు క్షీర, భస్మ, దధి తుంపరలన్నియు వ్యోమవేదికన్
ప్రాకుచు నున్నవౌర ఘనపంక్తులవేయనునట్లు చూడగన్.



Thursday, 11 February 2021

"గోలీ"లు - 41

 

కందము:
పని ముట్టుకొనగవలయును
పనిముట్టును కొనగవలయు పనిలోపనిగా
పని దలపని వారిని మరి
"పని"బట్టని వారి "పనినిబట్టుము" గోలీ!


Friday, 5 February 2021

"గోలీ"లు - 40

 

కందము:
ఎన్నిక వేళల జూడుము
మన్నిక నభ్యర్థిలోన, మాటున నడుగన్
ఎన్ని"కలరు"నోట్ల్లనుచును
మన్నిక నీనోట బడును, మానుము, గోలీ!


Tuesday, 2 February 2021

"గోలీ"లు - 39

 

కందము: 

గోప్యత మృగ్యంబాయెను

ఆప్యాయత జూపు సమయమదిలేదయ్యో

"యాప్" యాయతలే హెచ్చెను

సో ప్యారీ స్మార్టు ఫోను జూడగ, గోలీ!

Saturday, 16 January 2021

"గోలీ"లు - 38

 


కందము:
"సింబాలిక్" దేవతలను
"హంబక్కని" వాగునట్టి యధముడ! నాన్సెన్స్
సోంబేరీ! నీ మెదడుకు
సింబల్ "నీ" జూపెదనని చెప్పె గోలీ!


Thursday, 14 January 2021

చుక్కమ్రుగ్గువల

 మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

ఉత్పలమాల:
కూడిన చుక్కమ్రుగ్గువల "కోవిడు" రక్కసి చిక్కి సొక్కగా
పాడు "కరోన" గొబ్బెమల పాదములంబడి నల్గి నీల్గగా
వీడగ బాధలన్నియును వేగమె "వ్యాక్సిను"వచ్చుచుండగా
వేడుక మీర సంక్రమణ వెల్గులు లోకములందు నిండెగా.


Wednesday, 13 January 2021

చెత్త "నిల్లు"

 మీకు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.


ఆటవెలది:
చెత్త "నిల్లు" నింప చీకాకు ముంచెత్తు
చెత్త "నిల్లు" జేయ సిరులు పండు
చిత్తమందు గూడ చేయరా శుభ్రమ్ము
భోగి పండుగపుడు భువుని నిండు.

Monday, 4 January 2021

టీకా "ఫీల్"

 కందము:

టీ,కాఫీల్లా ప్రాణాల్
పీకుచు బీల్చేవు చీడ పీడ"కరోనా!"
టీకా "ఫీల్" జూపెదమిక
పీకుచు కొమ్ములను, పీక బిసికెదమికపై.


Friday, 1 January 2021

ఎట్మాస్ 'ఫియర్'

 మీకు అందరికీ 2021 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

కందము:
ఇయరది మారగ కోవిడ్
ఫియరది పోవంగ క్రొత్త వింతల వైరస్
క్లియరయి పుడమిని ఎట్మాస్
ఫియరది మారంగవలయు, విష్ ఆల్ హ్యాపీ.