తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 29 June 2012

కాకులు చేరని గిరిపై


నిన్న కోటప్పకొండ క్షేత్రమున కొలువైయున్న త్రికూటేశ్వరుని దర్శించిన వేళ స్ఫురించిన పద్యము.
ఆ కొండపైకి ఎప్పుడూ కాకులు రాకుండుట ఆ క్షేత్ర మాహాత్మ్యము.

కందము:
కాకులు చేరని గిరిపై 
శ్రీకరముగ వెలసినట్టి చిద్రూపా! చీ
కాకులు చేరని బ్రతుకును 
మాకందీయుము త్రికూట మలయాధీశా!     

Wednesday, 27 June 2012

ప్రాస యతులు లేక పద్యమలరె


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ప్రాస యతులు  లేక పద్యమలరె

ఆటవెలది: 
"ప్రాణ సఖుడు యతులు" పద్యమ్ము వ్రాయుట
నేర్పి నాడు నాకు నేర్పు గాను
నేడు నొంటి వ్రాయ నింకేమి జూడగ 
"ప్రా.స. యతులు" లేక పద్యమలరె.

("ప్రా.స. యతులు"  = ప్రాణ సఖుడు 'యతులు'(భర్త పేరు)  

Tuesday, 26 June 2012

గౌరి ముఖమును చుంబించెఁ గరివరదుఁడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - గౌరి ముఖమును చుంబించెఁ గరివరదుఁడు
తేటగీతి:
చేర కైలాస మొకనాడు శౌరి,యచట
ముద్దులొలికెడు శ్రీ గజ ముఖుని జూచె
ఎత్తు కొమ్మని గణపతి నీయ తల్లి
గౌరి; ముఖమును చుంబించెఁ గరివరదుఁడు.

తేటగీతి:
కరి ముఖమ్మును గలిగిన కంతుడవులె
గుజ్జు రూపివి చదువుల యొజ్జ యనుచు
గౌరి ముఖమును చుంబించెఁ ;గరివరదుఁడు
హరికి సముడని దీవించె గరిక ప్రియుని 



Monday, 25 June 2012

అల్పుఁ డెపుడు పల్కు నాదరమున.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అల్పుఁ డెపుడు పల్కు నాదరమున. 

ఆటవెలది: 
కట్టె విరిచి నట్లు కఠినంపు మాటల  
నల్పుఁ డెపుడు పల్కు; నాదరమున
పల్కు నయము ప్రీతి వాక్కులు చూడగ
సజ్జనుండు మహిని సరస హృదయ. 

Sunday, 24 June 2012

నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్

కందము:
అలకాపురి రాజు సుతుం
డలకను బూనెను ; ఇలదిగి హైదర బాదు
న్నల కూబర లాడ్జి లొదిగె
నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్!

పై పద్యానికి కొనసాగింపు.నలకూబరుడు ఇలకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే .. కొందరు అప్సరసలు చేసిన కొంటె పనులకు కోపించి ఒక ముని నల్లులు గా పుట్టమని శాపమిచ్చాడు. అప్సరసలు పశ్చాత్తాపంతో వేడుకుంటే శాపవిమోచం ఈ విధం గా ఇచ్చాడు. వారి శాప విమోచనం కోసం నలకూబరుడు ఇలకు రా వలసి వచ్చింది. అది 'లింకు'. తరచూ పురాణా లలో కనిపించేదే ...
 
కందము:
నలకూబరు కుట్టినచో
అల శాపము తొలగు ననగ  నచ్చర లపుడే
బిల బిల మని యరు దెంచెను
నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్.
 
కందము:
అల రంభ యైన మాకేం
అలకాపురి నాధు సుతుడె యైనను మాకేం
అల వాటే మాకనుచును
నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్.
 
కందము:
అల రంభ ఇంద్రు పంపున
ఇలజేరెను, తిరిగి వెడల నెక్కెను యెట్లో
అలకాపురి సరి జేరగ
నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్.
 
కందము:
చెలి రంభ యడిగె నప్పుడు
నలకూబరు; 'మంచ మందు నల్లులు జేరెన్
ఇలకేగి తెత్తు మింకను
విలువనకే డబలుకాటు విత్ స్లీప్ వెల్ బెడ్' .
 
కందము:
కలవర మాయెను మదిలో
కలనైనన్ దలచలేదు కారణ మేమో ?
చెలి రంభ కలువ రాదే
నలకూబరు; 'మంచ మందు నల్లులు జేరెన్' .

నల్ల ధనాన్ని పరుపు క్రింద దాచిన నల్ల కూబరుని పరిస్థితి.
కందము:
అల నల్ల ధనము దాచగ
కలవరమున నిద్ర రాదు కలిమియె యున్నన్
నల నల్ల నోట్లె నల్లులు
నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్.
 

Saturday, 23 June 2012

కలికి కంటినీరు కలిమి నొసఁగు


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కలికి కంటినీరు కలిమి నొసఁగు 

ఆటవెలది: 
కలిమి బలిమి విడుచు, నొలుకగా విడువక 
కలికి కంటినీరు; కలిమి నొసఁగు 
ఇంతి యింట నింత చింతలే లేకుండ 
కనగ సంతసమును కలిగి యున్న.

Friday, 22 June 2012

బంజరు భూములు దొరకవు పదికోట్లన్నన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - బంజరు భూములు దొరకవు పదికోట్లన్నన్.

కందము: 
పంజా విప్పెను దందా 
అంజనములు వేసి వెదుక హైదరబాదున్
రంజుగ రియలె స్టేటున
బంజరు భూములు దొరకవు పదికోట్లన్నన్.

Wednesday, 20 June 2012

కంచెయే చేను మేయుట కల్ల గాదు


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కంచెయే చేను మేయుట కల్ల గాదు

తేటగీతి: 
కన్న బిడ్డను కడ తేర్చు కన్నతల్లి
శిష్యు రాండ్రను కామించి చెరచు గురువు 
ప్రజల సొమ్మును గాజేయు ప్రభుత; చూడ 
కంచెయే చేను మేయుట కల్ల గాదు.

Tuesday, 19 June 2012

రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.

తేటగీతి: 
చంద్రు డన నాడు మామయ్య, చక్కనయ్య
సిరికి తమ్ముడు, చూడగా చెలియ వినుము
బూది కుప్పలు గుంటలు బోలెడన్ని 
రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.


తేటగీతి:
రూక లేనట్టి వానిని రోసి జగము
పైకమున్న వానిని తలపైన బెట్టు
కొనును,కలిలోన నేమనుకొన్న "నాల్గు
రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు."

Monday, 18 June 2012

చదువులలో సార మెఱిఁగి చవటగ మాఱెన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - చదువులలో సార మెఱిఁగి చవటగ మాఱెన్.

కందము:
చదువన పఠనమె కాదది 
పదపడి జగతిని చదువక పతనమె జరుగున్ 
పదములు బయటనె పెట్టక 
చదువులలో సార మెఱిఁగి చవటగ మాఱెన్.




హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని గురించి చణ్డామార్కులతో ..


కందము: 
పెదవులు కదిపిన 'హరి' యను 
చదువది చెప్పిన విధమిద చండా మార్కా?
వెదకిన దొరకని 'శ్రీహరి 
చదువులలో' సార మెఱిఁగి చవటగ మాఱెన్.

Sunday, 17 June 2012

అర్ధరాత్రి రవికి నర్ఘ్యము లిడె.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అర్ధరాత్రి రవికి నర్ఘ్యము లిడె.

తేటగీతి :
అర్థ రాతిరి నే ఫోను నన్నగార్కి 
చేయ జెప్పెను యర్చన జేయుచుంటి 
ఇతర దేశము నందలి యన్న జూడ   
అర్ధరాత్రి రవికి నర్ఘ్యము లిడె.  

Saturday, 16 June 2012

మగడెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మగడెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్.

కందము:
తగవుల దీర్చును, గ్రామపు   
మగువలు మగవారు మెచ్చు మాటలు జెప్పున్
తగు పెద్దరికము జేయును 
మగడెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్. 

Thursday, 14 June 2012

కలలు కల్లలైనఁ గలుగు సుఖము.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కలలు కల్లలైనఁ గలుగు సుఖము.

తెలుగుతల్లి స్వగతం 

ఆటవెలది: 
మాతృ భాష వదలి మరి యాంగ్ల మందున 
మాటలాడి యొరుల మన్ననలను
పొంద నెంచు యువత 'పుట్టెడు, తట్టెడు ' 
కలలు కల్లలైనఁ గలుగు సుఖము.

Wednesday, 13 June 2012

పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్.

కందము:
మతిమాలి, మందు మానక
అతి త్రాగుడు వలన బయట అప్పుల పాలై
సతి తాళి నమ్మ బోయిన
పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్.

Tuesday, 12 June 2012

దురితద్యూతమున నోడె దుర్యోధనుఁడే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - దురితద్యూతమున నోడె దుర్యోధనుఁడే

కందము:
సరి ధర్మ రాజు చిత్తుగ
దురితద్యూతమున నోడె; దుర్యోధనుఁడే
మరిమరి మామయె తోడుగ
పరిపరి విధముల బిగించి పందెము లొడ్దన్.

Monday, 11 June 2012

తండ్రి మించిన శత్రువు ధరణి గలఁడె?


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - తండ్రి మించిన శత్రువు ధరణి గలఁడె?

తేటగీతి: 
చదువు నేర్పించి బుద్ధులు చక్క దిద్ది 
మిత్రుడై మెలగును గాదె పుత్రునకును 
వాడి నిస్పృహ దుర్గుణ పాలి తెలియ 
తండ్రి మించిన శత్రువు ధరణి గలఁడె?

Saturday, 9 June 2012

కొడుకునే భర్తగాఁ బొంది పడతి మురిసె.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కొడుకునే భర్తగాఁ బొంది పడతి మురిసె.   

తేటగీతి: 
శివుని విల్లు విరచిన వశిష్ట, విశ్వ 
మిత్ర శిష్యు డైన విశిష్ట మిత్ర కులజు 
భూజ జనకజ దశరథ రాజు పెద్ద 
కొడుకునే భర్తగాఁ బొంది పడతి మురిసె. 

Friday, 8 June 2012

పుట్టినదిన మని విషాదమున విలపింతున్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పుట్టినదిన మని విషాదమున విలపింతున్.

కందము: 
వట్టిగ కాలము నెట్టుచు
గట్టిగ పది మంది మెచ్చు కార్యము నొకటిన్ 
పట్టని నాకెందులకీ
పుట్టినదిన మని విషాదమున విలపింతున్.


కందము:
గట్టిగ అణుబాంబును కని 
పెట్టిన దినమది, కనంగ పెను ముప్పులనే
పుట్టిని ముం 'చెడు ' బుద్ధులు 
పుట్టినదిన మని విషాదమున విలపింతున్.


కందము:
గిట్టిన రోజును 'దినమని' 
గట్టిగ చెప్పుదుము గాదె, గాడ్సే వలెనే 
పుట్టను పట్టిన చెదలన్ 
పుట్టిన, 'దినమని' విషాదమున విలపింతున్.


Tuesday, 5 June 2012

రావణుండు దిక్కు రాఘవునకు


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రావణుండు దిక్కు రాఘవునకు

ఆటవెలది: 
యుద్ధమునకు రాగ సిద్ధమై శివ భక్త
రావణుండు- దిక్కు రాఘవునకు
నదియె ననుచు నిచ్చె నాదిత్య హృదయమ్ము
కవచ రక్ష, రుషి యగస్త్యు డపుడు.

Monday, 4 June 2012

ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్. 

కందము: 
చక్కగ మోక్షము నిచ్చును 
మిక్కిలి భక్తిని గొలిచిన మీదట శివుడే
తిక్కల లౌకిక ములకై 
ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్.


కందము: 
చక్కని కోర్కెలు కోరక 
దిక్కులకే దిక్కు హరుడు దిగిరాగానే 
ప్రక్కన వారిని త్రొక్కగ 
ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్. 

Sunday, 3 June 2012

వ్యాసుని భారతమ్ము విన వ్యాధులు బాధలు వృద్ధి పొందెడిన్


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - వ్యాసుని భారతమ్ము విన వ్యాధులు బాధలు వృద్ధి పొందెడిన్ 

ఉత్పలమాల: 
శ్రీసతి భర్త తోడు, హిమ శైలజ నాధుని తోడు, నాశమౌ 
వ్యాసుని భారతమ్ము విన వ్యాధులు, బాధలు - వృద్ధి పొందెడిన్ 
ధ్యాసయె ధర్మ మందు మరి ధారుణి యందున సౌఖ్య మందగా 
చేసిన పాపముల్ తొలగి చెన్నుగ వెన్నుడు వెంట నుండుగా!

Saturday, 2 June 2012

సరసుఁ డైనట్టి భోగియే జ్ఞాన యోగి.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - సరసుఁ డైనట్టి భోగియే జ్ఞాన యోగి.

తేటగీతి: 
వేల గోపికలను గూడి వెన్ను డాడె
అష్ట భార్యల తాజేరి హాయి నిచ్చె 
గీత బోధించి నరునకు హితము జేసె 
సరసుఁ డైనట్టి భోగియే జ్ఞాన యోగి.

Friday, 1 June 2012

కాముకులను గొలువఁ గలుగు యశము


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కాముకులను గొలువఁ గలుగు యశము

ఆటవెలది: 
దేశమ! వినుమ! నిజ దేశ భక్తుల, యవి
నీతి నెదిరి పోరు నేత, శ్రమను 
రాత్రి పగలు పంచు శ్రామికులను, శాంతి 
కాముకులను, గొలువఁ గలుగు యశము.