తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 28 April 2025

శ్రీ సరస్వతీ దేవి స్తుతి

 " ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.


అంశం: శ్రీ సరస్వతీ దేవి స్తుతి

కందము:
చదువుల తల్లీ! నీదయ
నొదవును మా జీవనమ్ము నుద్ధతి, శోభల్
వదలనులే సతతము నీ
పదములనే కీర్తిజేతు పదములతోడన్.

కందము:
నీ పదముల నే గొలువగ
నే పదములు రాక నాకు నేడ్పది వచ్చెన్
ఆ పదసంపద నిచ్చుచు
నాపదనే దీర్పవమ్మ హరిసుతురాణీ!

ఉత్పలమాల:
తెల్లని హంస వాహనము తెల్లని పద్మము నీదు వాసమే
తెల్లని వస్త్రధారణము తెల్లని తల్లివి నీవె కావొకో!
తెల్లములాయె నీయునికి, తేలికగాదులె నీదు దీవెనల్
చల్లగ పొందుటన్న, మది చక్కగ గావలె తెల్లతెల్లగా.

కందము:
నా రసన "అల్లిబిల్లిగ"
నూరకనే వాగజూచు "నూరక"ముందే
మీరుచు నణగంద్రొక్కుచు
నారాయణు సుతుని రాణి నాట్యంబిడవే!

కందము:
పొత్తము చేతన్ బట్టితి
చిత్తము "ఫేస్ బుక్కు" పైన చింతన "వాట్సాప్"
చిత్తగుచు నుండె చదువులు
మొత్తము నా మదిని మార్చ మ్రొక్కెద వాణీ!

కందము:
చిన్నప్పుడు బడి చదువుల
నున్నప్పుడు నిద్రలేచి యుదయము చదువన్
కన్నులు మూయుచు భారతి!
నిన్నే దలచుచు మొదలిడ నేర్చితి తల్లీ!

కందము:
ఎయ్యది దోచగలేరో!
ఎయ్యది మరి పరులకీయ నింతయు బోదో!
ఎయ్యది కీర్తికి నెలవో!
అయ్యది నాకీయగొల్తు నబ్జజు రాణీ!

కందము:
మీయత్త యిచ్చు సంపద
యే యావత్తుగ కరగును నరక్షణముననే
దోయిలి యొగ్గెద నీకే
మాయని చదువుల సిరులను మాకిడ వాణీ!


Sunday, 27 April 2025

అనురాగ దాంపత్యం

 " ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.


అంశం: అనురాగ దాంపత్యం

కందము:
బెల్లము జీరా వలెనే
తెల్లని బియ్యమ్ము పసుపు తీరుగ, మరియున్
చల్లని పాలూ తేనెగ
నుల్లములే కలసి జంటలుండగ వలయున్.

కందము:
పలుకుల ములుకులు వదలక
యలకల నలకలను కనుల నటునిటు నిడకన్
కులుకుల నడకలు విడువక
యలయక నిరువురు మనవలె నహ!యొహొ! యనగా.

కందము:
అలసిన వేళల, మరితా
నలగిన వేళల దెలియుచు నటు పైవారే
మెళకువ భాగస్వామికి
తెలివిగ సేవలను జేయ "దెన్ నో వారే".

కందము:
నసుగుట తగ్గించుచు, మరి
విసుగును నదుపుననెయుంచి వేధించుటలన్
కసరుటలు మాని కొంతగ
దొసగులనే యెంచకున్న దొరలును ప్రేమల్.

కందము:
కస్సులు బుస్సులు జూపక
"లెస్సులు మోరు" లనుమాట లేపక, లవ్లీ
నెస్సుగ "డిస్కస్సు"లతో
లెస్సగ జీవింప వలయులే దంపతులే.

కందము:
ప్రేమించి యెంచుకున్నను
ప్రేమగనే పెండ్లిచూపు, లేవేమైనన్
ప్రేమనుగని, పంచగవలె
ప్రేమలనే, పెండ్లియాడి పిదపను గూడన్.

ఆటవెలది:
భార్య భర్త నెపుడు భారమ్మననరాదు
భర్త కూడ నటుల పలుకరాదు
బరువు బాధ్యతలను పరువుగా మోయుచు
సాకవలయు తాము సంతునెపుడు.

కందము:
అనురాగమ్మను రాగ
మ్మనుదినమును బాడుకొనుచు నాలూమగలే
"మనవలె నితరపు జంటలు
మనవలె నాదర్శమిదిగొ మనమే" యనుచున్.

కందము:
మనసున "సీక్రేట్స్" లేకను
ఘన "స్మ్మార్ట్ ఫోన్ పాసు వర్డ్సు" కననీయవలెన్
తనమన "పేరెంట్స"నకను
ధనమందున విడువవలయు దాపరికములన్.

కందము:
అతిజేయని యలుకలతో
శ్రుతిమించని దెప్పిపొడుపు చురకలతోడన్
సతిపతి నెయ్యపు కిన్కల
మతిదలచి విడచి కలసిన మహసరసమహా!


Saturday, 26 April 2025

కర్షకుడి గొప్పతనం

 " ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.


అంశం: కర్షకుడి గొప్పతనం

కందము:
పొలమను కాగితమందున
హలమను కలమును గదుపుచు నవనిని ప్రజకే
ఫలవంతపు పంటల కవి
తలనిడు కర్షకకవి కిదె తల తలపాగా!

కందము:
నీరదమును తా జూచుచు
నీరిమ్మని వేడుకొనుచు నీరిడి కండ్లన్
నీరెండ మాత్రమే కని
నీరెండిన నేత్రములతొ నింగిని గనుగా!


కందము:
పనులకు బోవుటలోనను
ఇనునకు పోటీగ లేచు నెప్పుడుగూడన్
కనులతొ నక్షత్రములను
మిను జూచిన పిదప తాను మేనున్ వాల్చున్.

కందము:
చలి పులికి నులికి పడకను
జలజల వర్షమ్ముకైన సంశయమిడకన్
అలమండుటెండ కదరక
ఫలసాయము కొరకు జేయు వ్యవసాయమ్మున్.

కందము:
తన చెమటను తన రక్తము
తన శ్రమనే ధారబోసి తన సౌఖ్యమ్మున్
తనబాగు నెంచి జూడక
మనకన్నము బెట్టు రైతు మహనీయుండే.

కందము:
వర్షములెన్నియొ మారిన
ఘర్షణలను సైచి తాను ఘనుడై నిలచున్
కర్షకుడు "కాడి వదలడు"
శీర్షముగ సమాజమునకు చేవల నిడుగా.

కందము:
భూమిని తల్లిగ దలచును
భామినిగా దలచు నెడ్ల బండిని, హలముల్
సామాను కాడి సుతులగు
ప్రేమన్ గోవులును యెడ్లు ప్రియబాంధవులౌ.

కందము:
ఎంచక ఫలితము నెదలో
వంచననే యెన్నిమార్లు ప్రకృతియె చేయన్
కించిత్తు పట్టు వదలక
మంచిగ తన కర్మజేయు మాన్యుడతండే.

ఆటవెలది:
పనిని చెమటనోడ్చు పది "సెంట్ల" పొలమైన
చెమట దలచు తాను "సెంటు"గాను
తిండి తిప్పలందు తెలియడే "డీసెంటు"
అన్ని పనులలోన "నిన్నొసెంటు"

ఆటవెలది:
పంట ప్రతిదినమ్ము పరికించి చూచును
కలుపులన్ని దీసి “ఖతము” జేయు
చీడ మందు వేసి వాడులే యెరువులు
"స్ట్రిక్టు" పాలకుండు క్షేత్రమునకు.

ఆటవెలది:
పనుల "హార్డు వేరు" కనగ "రూటే" వేరు
మనసు "సాఫ్టు వేరు" మసలు తీరు
వేరు చేసి చూడ విశ్వమ్ము తార్మారు
అవని వృక్షమునకు నతడు "వేరు"


Thursday, 24 April 2025

స్నేహమాధుర్యం

 " ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు  "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు. 

 అంశం: స్నేహమాధుర్యం 

కందము: 

ఫండును జూడక కనగా

ట్రెండేమియు నెంచబోక రేబవలొకటై

బ్రాండుగ జగతిని నిలిచిన

ఫ్రెండ్సునకే చెప్పవలయు ఫెయిరుగ హ్యేట్సాఫ్. 


కందము:

నెయ్యము గొప్పదిరా! మా

నెయ్యము సరియైన మంచి నేస్తము దొరుకన్

నయ్యనుచు జెప్పకుండగ 

అయ్యారే! స్నేహ హస్తమందింతుముగా.


కందము: 

మస్తుగ సోంచాయిస్తివ

దోస్తానా మంచిగుంటె దొరలెక్కే య 

న్పిస్తది, పరెషాన్లో మన  

కిస్తడులే దోస్తు  జోషు, యినుకోరా బై! 


కందము: 

ప్రెండే టీచర్, ట్యూటర్ 

ప్రెండే బ్రదరండుసిస్టరేయగు వినరా!

ప్రెండుదె హెల్పింగ్ నేచర్

ఫ్రెండ్షిప్ లెస్ లైఫు బోరు ఫ్రెండాల్ రౌండర్. 


సీసము: 

సహవాసి గలుగుచో చాలమనశ్శాంతి

హితుడు మనకు సన్నిహితుగ మెలగు 

మిత్రుడొక్కడు గూడ మితమౌను వెతలెల్ల

సఖుడు మనకు గొప్ప సహచరుండు

సంగడీడు తెలియ సంపదే మనకౌను

పొత్తుకాని చెలిమి పోని సొత్తు 

శ్రేయోభిలాషిచే చేయూత శ్రేయమ్ము

చెలికాడు జోడైన చింత రాదు 

ఆటవెలది:

ఉద్దికాడి సాయ మున్నచో అది మేలు 

దోస్తు తోడు చాలు మస్తు హాయి

నేస్తగాడి మాట వాస్తవమ్ముల మూట 

విహితుడున్న బ్రతుకు ప్రియముగొలుపు. 


కందము:

నేస్తులు హరిహరులు జగతి

నేస్తులు నారాయణుడును నిజముగ నరుడే

నేస్తులు బాపూరమణలు

మస్తుగ పేరొందినారు మనయాంధ్రులలో. 


కందము:

కందము:

ఉప్పునకున్ మరి పాలకు,   

నిప్పుకు గప్పురమునకును నేస్తము తగునా? 

తుప్పిచ్చు నీటి కినుముకు

నొప్పదు, స్నేహమ్మిక వలదోగులతోడన్. 


కందము:

మిత్రుని సుతుడౌ కర్ణుడు

మిత్రుడు రారాజు కయిన, మేలే లేదే?

చిత్రము చెడుపని మెచ్చుచు 

నాత్రమునన్ బడగ వైచె, హతవిధి గనుమా! 


Wednesday, 23 April 2025

జాతీయ పతాకం

 " ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు  "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.  

 

అంశం : జాతీయ పతాకం


కందము:

రంగులుమూడు నడిమి గుం

డ్రంగానే ధర్మచక్ర రచనయు గలిసెన్

పింగళి వెంకయ కూర్చిన

హంగగు జెండాకు జేతు నభివందనమున్. 


కందము:

మూడగు రంగుల, త్యాగము

తోడుగ శాంతియు సహనము తో నడుమనుచున్

జాడను దెలుపు పతాకము  

వేడుకగా భారతవిను వీధిని గనుమా!  


కందము:

పువ్వుల రేకులు రువ్వుచు

దవ్వున నొక తెల్ల గువ్వ ధాటిగ నెగురన్

చివ్వలు వలదని, నవ్వుచు

మువ్వన్నెల కేతనమ్ము ముదమున నెగిరెన్. 


కందము:

రంగులు మూడును మెరయగ

ముంగిలినేదాటు శత్రు మూకలకెపుడున్

"రంగుబడుద్ద"ని జెప్పుచు

నింగిని దాకగ పతాక నిత్యమ్మెగురున్.

Sunday, 20 April 2025

రాఖీ

 " ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.


అంశము: రాఖీ

కందము:
సోదరి కట్టును "రాఖీ"
"సో" దరి జేరుము సతతము శుభమగు నీకున్
సోదర "రక్షయె" నీకన
"సో" "దీ" పూర్ణిమ దినమున "సోదీ"యనకన్.

ఆటవెలది
అమ్మ ప్రేమగాద అక్కయ్య, చెల్లిది
నాన్న రక్ష తమ్ముడన్నదియును
రక్ష బంధనమ్ము రాగాలుపండించు
"రాఖి పున్నమి"కిని రమ్యముగను.

కందము:
బంగారపుదైనన్ మరి
రంగులదారమ్ముదైన రాగమ్మొకటే
హంగులజూడక దెల్పును
చెంగట సోదరునికి "రాఖి" చెల్లెలు కట్టన్.

కందము:
రక్షా బంధన వేళను
అక్షయమగు ప్రేమనీయమనుచును గట్టున్
లక్షలు గోరక సోదరి
లక్షణముగ సోదరులకు రాఖీ లెపుడున్.

కందము:
ప్రేమను తెలుపని ప్రేయసి
"కాము"గ నెటువచ్చి తాను కట్టునొ "రాఖీ"
ఏమో నా గతి యనుచును
"దీమాక్" చెడి "లవరు" జచ్చు దినమిది గదరా!

కందము:
నిన్నా దృష్టిని జూచుట
నెన్నడు నే జేయలేదు "నీతోడ"నుచున్
అన్నా!యని "వన్ సైడ్ లౌ"
సున్నానే జేయగల్గు "సూపర్" దినమే.


Friday, 18 April 2025

మాట - మౌనం

 " ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.


అంశం: మాట - మౌనం

కందము:
నీటుగ నొకటో రెండో
మాటలలో భావములవి మనకే తెలియున్
బాటలు పలువిధములగును
మాటలు లేనట్టివేళ మౌనములోనన్.

కందము:
మాటలు కోటలు దాటుట
మాటలవే యీటెలగుట మంచిద? వినుమా!
మాటకు మాటలననియెడు
మాటల మాట్లాట వదలు, మౌనమె మేలౌ.

కందము:
నరులకు దేవుండిచ్చిన
వరమదిరా చూడ మాట పలుకుట, నాల్కన్
నరమునె యదుపునబెట్టుము
మరి తూలెడువేళ కొంత మౌనమ్మిడుచున్.

కందము:
హీనుడు నీ దరిజేరుచు
నేనేరా గొప్పయనుచు నిందలు వేయన్
మౌనిగ మౌనము దాల్చుము
కోనల కోతుల కెదుటను కుందేలువలెన్.

ఆటవెలది:
కాకి రేపుమాపు "కాకకాకా"యను
కోకిలమ్మ "కూత" కొంత వరకె
సమయమెరుగు పలుకు సరిమెత్తురందరు
కానివేళ మేలు మౌనమెపుడు.

కందము:
మాటున నిలవకు, నిజమును
మాటలలో దెలుప నీకు మౌనమ్మేలా?
మాటాడువారి మౌనము
మాటలలో జెప్పలేము మహికహితమ్మే.

కందము:
మాటలు మనకవి మీటలు
దీటుగనే నొక్క గలుగు తీయని నాదం
ఘాటును పెంచిన వినుటకు
నాటుగనే యుండు మదిని నాటును గుబులే.


Thursday, 17 April 2025

గురువంటే

ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.


అంశం: ఇతడుకదా గురువంటే.


కందము:
గురువగు తల్లికి దొలుతను
గురువగు తండ్రికిని పిదప గొప్పగ జగతిన్
గురువగు హరికిని తప్పక
గురుతెరుగుచు నతులనిడరె కువలయమందున్.

కందము:
బత్తెము గురువది చూచును
పొత్తము మరి చూడరయ్యొ పోకిరి పిల్లల్
బెత్తము చూపిన హత్తెరి
కత్తులనే వారు చూపు, కాలము మారెన్.

కందము:
చురకలు, చెణుకులు, చరితలు
మెరుపులు కథలను గలుపుచు మెచ్చగ చదువుల్
గరపగ వలయును చక్కగ
గురువులు తమపాఠములవి గురుతుగనుండన్.

కందము:
పొత్తమునందలి భావపు
విత్తనముల "పదునెరుగుచు" విద్యార్థుల దౌ
చిత్తపు పొలముల జల్లుచు
మొత్తము "సరి భావ లతల" బూయించవలెన్.

కందము:
చదువది పొత్తములోనిది
మొదలంటుచు చివరి వరకు మొత్తము నేర్పన్
చదువుల జెప్పుటె కానీ!
చదువరులకు గరపవలయు సంస్కారమ్మున్.

కందము:
విద్యార్థి శక్తి నెరుగుచు
నుద్యోగపు చదువుతోడ నొక కళలోనన్
ఉద్యతి నిష్ణాతుండవ
సద్యోగము నీయవలయు సద్గురువెపుడున్.

కందము:
గురువన నెవ్వరు? విను, నలు
గురు కలసినవేళ బిల్చు "గురుగురు" కాడోయ్
గురువన జ్ఞానపు దీపము
గురుతెరుగగ దారిజూపు గోరగ భక్తిన్.

కందము:
పొత్తము నొకచేతను మరి
బెత్తము నొకచేత బట్టి ప్రియముగ చదువుల్
మెత్తగ, నవసర మగుతరి
మొత్తుచు నేర్పించు గురువు పూజ్యుండిలలో.


Wednesday, 16 April 2025

అమ్మ గొప్ప తనం

 



"ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.

అంశం:: అమ్మ గొప్ప తనం

కందము:
అమ్మయె వాణియు, శక్తియు
నమ్మయె శ్రీ అన్నపూర్ణ యామెయె సిరిలే
అమ్మయె కాళిక మాతయు
అమ్మో! యెన్నెన్ని రూపులామెవి కనగా!

ఆటవెలది:
"అమ్మనగుచు నున్న నందమ్ము నెంచను
సోకు తగ్గుననుచు సొక్కిపోను
నందనులను గనుటనం దందు ప్రియమని"
అమ్మ నగుచు జెప్పు నందరకును.

కందము:
నలుపును తెలుపును జూడదు
పలుయంగపు లోపమైన పట్టెడు ప్రేమే!
నలిపిన తా నూరుకొనదు
పలుకును "నాబిడ్డ నాకు బంగరుకొండే!"

కందము:
చిచ్చోలుళుళుళు హాయీ!
చిచ్చీ! నాకన్న! బుజ్జి! చిన్నీ! యనుచున్
ఇచ్చుచు పాలను నిద్దుర
బుచ్చును బజ్జుండబెట్టి బుగ్గలు నిమురున్.

కందము:
తనరూపము "చిన్నది"గా
తన నాథుడె "బాబు"రూపు ధరియించెననున్
తన "అమ్మానాన్నాట"యె
ఘనముగ నిజమాయె నంచు కైతలు పాడున్.

కందము:
తన పాటలు తన మాటలు
తనయాటలు తనదు ప్రేమ తన్మయమందన్
తనివార బంచుకొనగను
తన వారసులహహ వచ్చె ధన్యంబనుగా.

కందము:
కొమ్మను నేనై పెరుగగ
నిమ్ముగ చేకొనగ భర్త నెయ్యముతోడన్
అమ్మను నేనవ బుట్టెను
"ముమ్ముమ్మ"ని తేనెపలుకు బుజ్జాయనుగా.

కందము:
ఆ చిన్ని ముక్కు నాన్నది
ఆ చక్కనికళ్ళు జూడ నమ్మవె మరియున్
ఆ చుబుకమేమొ తాతది
ఆ చుక్కయె నుదుట బామ్మదన మురియునుగా.

కందము:
నిద్దురగాచుచు, సేవలు
ముద్దుగ జేయుచును, గోరు ముద్దల నిడుచున్
"దద్దాదద్దా" మాటల
నొద్దిక విని యర్థమరసి యుప్పొంగునుగా.

కందము:
అబ్బాయా! అమ్మాయా!
అబ్బా!తాజూడదెప్పు డా గౌను మరిన్
జుబ్బాలు గూడ వేయును
అబ్బో! కృష్ణమ్మ కృష్ణుడని దీవించున్.

కందము:
అమ్మా, నాన్నా, అక్కా
మామ్మా, తాతయ్య, యత్త, మామా యనుచున్
ముమ్మారు, నాల్గుమార్లని
ఇమ్ముగ మాటలను నేర్పు నిష్టముతోడన్.

కందము:
కుడుపుచు వేళకు, శ్రద్ధగ
గడుపుచు తా రాత్రిపగలు కన్నల నెపుడున్
కడుపును వీడుచు బుట్టిన
గడుపుననే బెట్టి తల్లి కాచును ప్రేమన్.

కందము:
నవ్విన నవ్వును, యేడ్చిన
నొవ్వుచు దానేడ్చు, ముద్దు నోటన్ శిశువే
కవ్వించిన కవ్వించును
బువ్వనుదిను నటన జూపు బువ్వను దినగన్.

కందము:
మొట్టును మట్టిని దిన్నన్
గట్టిగనే కండ్లనురిమి గదుముచు జూచున్
తిట్టును పెరిగిన నల్లరి
కొట్టును చెడుపనులుజేయ కూనల హితయై.

కందము:
కంటికి రెప్పగ జూచును
ఒంటికి చిరుగాయమైన నోర్వక వగచున్
ఇంటికి చుట్టాల్ వచ్చిన
గంటల "సీర్యల్" గ మలచు గద శిశు చేష్టల్.

కందము:
కడుపున బుట్టిన వారల
కడుపును జూచుచును బెట్టు ఖాద్యములెన్నో
కడుపున బెట్టుక జూచును
కడు పుణ్యపురాశి యమ్మ కదరా భువిలో.

కందము:
లాలను కుదురుగ బోయును
లాలీయని పాడి నిద్దురను రావించున్
లాలించు నేడ్చు వేళల
లీలలు కానట్టి పనులు లేవని చెప్పున్.

కందము:
ఆ చలిపులి వణికించదు
ఆ చెంగును గప్పుకొన్న, న”మ్మది” లోనన్
"బూచోని" భయము శిశువుకు
ఆ చంకననెక్క దీరు “నమ్మ"ది యగుచో.

ఆటవెలది:
కడుపు నిండు వరకు కనిపెట్టి వడ్డించు
తాను తినగ దాచ తలపు నిడదు
అమ్మ వండుపాత్ర అక్షయ పాత్రయే
అన్నపూర్ణ సాటి యవని తల్లి.

ఆటవెలది:
మూకుడన్నమంత ముద్దు బిడ్డకు బెట్టి
బడికి బంపి చదువు బాట నడిపి
గ్లాసు నీరు త్రాగి కడుపు నింపుకొనెడు
నిండు మనసు తల్లి నీకు నతులు.

కందము:
పెట్టిన బెట్టక బోయిన
బెట్టుగ తన ముదుమి లోన పిల్లల కెపుడున్
కట్టెగ మారెడి వరకున్
దిట్టకనే మనసులోన దీవెనలిచ్చున్.


(సరదాగా ఒక మణిప్రవాళము)
కందము:
తన స్లిమ్నెస్స్ తన డైటింగ్
తన బ్యూటీ షేపుమారి తన బాడీకిన్
తన లైఫుకు రిస్కైనను
తను మదరవ థింకు జేయు దా ఉమెనే వావ్!

కందము:
వింటిరె బిడ్డన్ గని తా
నొంటరిగా కుప్పతొట్టె నుంచుట మేలా?
కంటేనె అమ్మగాదుర!
కంటికి రెప్పగను వారి గంటేనేరా!

తేటగీతి:
నిండుచూలాలు నింగిని "నీలి మబ్బు"
ప్రసవ వేదన "నురుము"లై బడుచునుండ
"మెరుపు" శస్త్రచికిత్సనే మేలు జేయ
"చినుకు" బిడ్డను గని సంతసించె తల్లి.

చంపకమాల:
తనపతి త్రాగివచ్చి పడి తన్నిన గ్రుద్దిన తానె యోర్చుచున్
ధనమది తిండి తిప్పలకు దమ్మిడినీయక మొండిసేసినన్
తనదగు రెక్క కష్టమున దక్కిన దానితొ ప్రేమ బెంచి తా
గనినటువంటి పిల్లలను గాచెడు తల్లికి వందనమ్మహో!

ఉత్పలమాల:
ఎన్నగ తల్లిప్రేమగన నేమి మహత్యము చేరియున్నదో!
మిన్నుల మన్నులన్నిలచి మిన్నగనేలెడు విశ్వరూపుడే
చిన్నగ మారి భూమిపయి చెన్నుగ "వ్రేలెడు" పాపడౌచు తా
వెన్నునిగా యశోద కడ ప్రేమలుబొందెడు భాగ్యమందెగా!


Friday, 11 April 2025

మాటనీరె

 ఆటవెలది:

ఉద్యమమ్ము జేయ నుద్యమించగవలె
నాంధ్రభాష కొరకు నందరికను
మాటనీరె మీరు మాట నీరుగ గాక
తెలుగుతల్లి మోము వెలుగునటుల.



Thursday, 10 April 2025

వసంత ఋతు వర్ణన

 "అమరావతి సాహితీ మిత్రులు"

యఫ్.బి. గ్రూప్ నందు ఇచ్చిన అంశమునకు నేను వ్రాసిన పద్యములు.

"వసంత ఋతు వర్ణన"

కందము:
తడి చలిగాలులు పోయెను
పొడిగా నాహ్లాదమిచ్చు పోడిమి గాలుల్
వడిలేక మంద్రగతి స
వ్వడి లేకను తెల్గునేల బాగుగ సాగెన్.

తేటగీతి:
బోడులైనట్టి మ్రానులే భువిని జూడ
చిగురుబోడుల తలపించె చిగురు వేసి
క్రొత్త పూతల పుప్పొడుల్ మత్తుగొలిపె
పైరగాలుల దిరుగుచు పరవశమున.

కందము:
వనవాసము వీడుచు మరి
తన మాసము వచ్చెనంచు త్వరితముగానే
ఘనమగు "కూకూ" రవముల
వినిపించగ కోయిలమ్మ వేడ్కగ వచ్చెన్.

తేటగీతి:
వేపపూత సువాసన వెల్లివిరిసె
మావి చిగురుల కాంతులు మహిని నిండె
"కుకుకు మేళమ్ము" వాయించె కోకిలములు
స్వాగతించెను జగతి వసంతు రయము.

ఉత్సాహము:
ఆత్రమంది తనను పిలచు నవని జనుల ప్రీతికై
మిత్రుడగుచు వత్సరాది మేలు దినము నందునన్
చైత్ర రథము నెక్కి వచ్చె సంబరాలు నిండగా
చిత్రరథుని పనుపు తోడ శీఘ్రమే వసంతుడే.

Sunday, 6 April 2025

శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః

 

మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
కందము:
చూడగ నుదయపు భానుడు
వేడుకగానిల్చె కునుకువిడి లేవయ్యా!
వీడుము రామా! నటనను
మోడిని, మత్తులసలు ముఖమున లేవయ్యా.
కందము:
మాదయ కొలిచే భాగ్యము
మోదముతో నమ్మగ నిడుములు రావయ్యా
నీదయ మా భారమ్మే
నీ దయనేజూపి వరమునిడ రావయ్యా!