తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 19 February 2018

రంభకు మూతిపై మొలిచె రమ్య నవాంకురమైన మీసముల్.




సమస్య - రంభకు మూతిపై మొలిచె రమ్య నవాంకురమైన మీసముల్.




జృంభణమైన పల్కులను చేరుచు మాటలనాడు, వాడహో 


గుంభనమైన చర్యలను కోర్కెలదాచక జేయు నిష్టతన్

డింభకుడేమిగాదు, కన డిగ్గున రమ్మని కన్నుగొట్టులే     

రంభకు, మూతిపై మొలిచె రమ్య నవాంకురమైన మీసముల్.

Tuesday, 13 February 2018

ఎన్ని యీయమందు "సున్న" వాని

అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
ఓం నమశ్శివాయ.


సీ: 
పట్టు వస్త్రమ్ముల పట్టియడుగలేను
గజచర్మ ధారివే గదరనీవు
పంచభక్ష్యమ్ముల నెంచికోరుదమన్న
విషమె నీ బువ్వని వింటి నేను
బంగారు నగలనే వరమీయ మందునా
నాగులే మెడలోన నగలు నీకు
ఒక్క వాహనముకై మ్రొక్కుకుందమటన్న
కదలని యాంబోతు గలదు నీకు
ఆ.వె:
శక్తి గోర నీకు సగములేనే లేదు
ఎన్ని యీయమందు "సున్న" వాని
వినుము నేనె యిత్తు మన"సున్న" వానిగా
నాదు మదిని నీకు నయముగ హర!

Saturday, 10 February 2018

ధనలక్ష్మీ వ్రతమొసంగు దారిద్ర్యమునే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 10 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - ధనలక్ష్మీ వ్రతమొసంగు దారిద్ర్యమునే.



కందము: 
వినకను నీమము నిష్టల
గొనకొని చెప్పంగ బుధులు క్రొత్తగ వేడ్కన్ 
గుణములనెంచక చేసిన 
ధనలక్ష్మీ! వ్రతమొసంగు దారిద్ర్యమునే.

Monday, 5 February 2018

బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 10 1- 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ




సమస్య - బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.



ఆ.వె: 
గౌరవించబోను కన్నవారి, బుధుల 
ధర్మ మింత సేయ ధరణినేను 
నాదిదేవు మదిని యసలు గొల్వననుచు 
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.

Thursday, 1 February 2018

గాంధి స్వాతంత్ర్య యోధుఁడు గాడు నిజము

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 10 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - గాంధి స్వాతంత్ర్య యోధుఁడు గాడు నిజము



తే.గీ: 
శాంత్యహింసల బోధించి సత్య శీల 
మును ప్రజలకు తెలుపుచు ముఖ్యమనెను 
గీత బోధల నమ్మెను కేవలముగ 
గాంధి స్వాతంత్ర్య యోధుఁడు గాడు నిజము