తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 31 January 2015

సా " పాట్లు "

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - సా " పాట్లు "




















కందము:
అన్నము కొద్దిగ నున్నది
యెన్నెన్నో స్వీట్లతోడనెంతరిటాకో !
ఇన్నియు తినునాయొక్కడు?
గిన్నిస్ బుక్కెక్కు వారికీ  సా " పాట్లా" !


కందము:
విందొక్కరికేనా యిది
సందిగ్ధము, తినగ నొకరు సాధ్యంబగునే
ఇందలి ఖాద్యములన్నిటి
నందరికిని పంచవలయు నదియే మేలౌ. 

Friday, 30 January 2015

బాట వీడి నడచు వాడె జ్ఞాని

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - బాట వీడి నడచు వాడె జ్ఞాని 



ఆటవెలది:
అనృతము గల బాట, నావేశముల బాట
హితము గాని బాట, హింస బాట
పరులు దిట్టు బాట,పరమార్థములు లేని
బాట వీడి నడచు వాడె జ్ఞాని

Thursday, 29 January 2015

బెత్తము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - బెత్తము


కందము:
బత్తెము గురువది చూచును
పొత్తము మరి చూడరయ్యొ పోకిరి పిల్లల్
బెత్తము చూపిన హత్తెరి
కత్తులనే వారు చూపు, కాలము మారెన్.

Wednesday, 28 January 2015

పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చెఁ బుణ్యఫలముగన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చెఁ బుణ్యఫలముగన్.


కందము:

జరుపగ యజ్ఞము తన ము

గ్గురు భార్యల దశరథుండు గూడుచు నపుడున్

మరి పాయస మిడ యజ్ఞపు

పురుషుఁడు, గర్భమ్ముఁ దాల్చెఁ బుణ్యఫలముగన్.




Tuesday, 27 January 2015

మోదమును గూర్చె ఘోరప్రమాద మౌర

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మోదమును గూర్చె ఘోరప్రమాద మౌర !

తేటగీతి:
చెట్టు గ్రుద్దగ మా ' బస్సు ' చేరలేదు
అమరనాథుని యాత్రకు, నపుడు మాకు
గంగ వరదయె తప్పెను, బెంగ లేదు
మోదమును గూర్చె ఘోరప్రమాద మౌర !

Monday, 26 January 2015

శకునములు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - శకునములు


తేటగీతి:
శకునమన్నను శనిగాదు శకునిగాదు
కన్నులదురుట, పిల్లులు కండ్ల బడుట
తలచి భయమును చెందకు కలత వలదు
హరుని దలచుచు సాగుము హాయి గలుగు.

Sunday, 25 January 2015

ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్


కందము:
కవి వర్ణించెను కథలో
యువరాణిని పట్టి తెచ్చె నొక రాక్షసుడే
జవరాలి కతడు పెట్టగ
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

Friday, 23 January 2015

కన్నె కలలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - కన్నె  కలలు 


కందము:
కన్నెగ కలలను కనుటది
కన్నెను కన్నట్టి వారి కామోదమ్మే
కన్నెగ పిల్లల కనుటది
హన్నన్నా యేరికైన నామోదమ్మే ?

Thursday, 22 January 2015

శివుఁడు దశరథునకు చిన్నకొడుకు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - శివుఁడు దశరథునకు చిన్నకొడుకు.



ఆటవెలది:
గంగ నెత్తిన గల ఘనుడెవ్వడోచెప్పు
రాముడెవరి సుతుడు ప్రేమ మీర
సరిగ నేమగు మరి శత్రుఘ్ను డతనికి
శివుఁడు- దశరథునకు- చిన్నకొడుకు.

Tuesday, 20 January 2015

కుందేలును కోడి పిల్ల గుటుకున మ్రింగెన్

 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుందేలును కోడి పిల్ల గుటుకున మ్రింగెన్


కందము:
సందున కాలువ దేలు ప 
సందగు నొక్కాకుపైన సరి తేలుండన్
సందే బల్ విందని యా 
కుందేలును కోడి పిల్ల గుటుకున మ్రింగెన్ 

Monday, 19 January 2015

అదృష్టము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - అదృష్టము


కందము:
స్పష్టము జేయుచునుంటి న
దృష్టము మరిలేకయున్న తెలివెంతున్నన్
కష్టము మానవునకు సం
తుష్టిగనే బ్రతుకు గడుప తోడెవరున్నన్.

Sunday, 18 January 2015

అవధానమ్మునఁ జేయఁ గూడదు సమస్యాపూరణ మ్మెప్పుడున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - అవధానమ్మునఁ జేయఁ గూడదు సమస్యాపూరణ మ్మెప్పుడున్   


మత్తేభము:
చెవి రిక్కించుచు వేచియుందురుగదా చెల్వొందగా సభ్యులే
యవధానే యిక నేమి చెప్పునొ యనిన్ హాస్యమ్మునే కోరుచున్
కవనారంభము నందు వాణిని మదిన్ కారుణ్యతన్ వేడకే
యవధానమ్మునఁ జేయఁ గూడదు సమస్యాపూరణ మ్మెప్పుడున్

Saturday, 17 January 2015

కుండలోనఁ బెట్టెఁ గువలయమును.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుండలోనఁ బెట్టెఁ గువలయమును.


ఆటవెలది:
విశదముగను చెప్ప విద్యార్థులకు " భూమి "
పాఠమొకటి తాను పంతులయ్య
'గ్లోబు ' ను కొనితెచ్చి గూడు తుడిచి పడ
కుండ, లోనఁ బెట్టెఁ గువలయమును.

Friday, 16 January 2015

కను మావంక

అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.
 
















కందము:
కను మావంకని గోవులు
కనుమను బసవన్న లంత కర్షకు దలచున్
కనుమా నేడే, యెందుల
కనుమానము,  పూజ సేయు  నాతడు ప్రీతిన్.


దిన పత్రికలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - దిన పత్రికలు


కందము:
దినచర్యకు మొదలగు నివి
దినమంతయు జనుల చేత తిరుగుచునుండున్
దినమది గడచిన పిమ్మట
తినుబండారముల గట్టు తీరును బొందున్

Thursday, 15 January 2015

బంగరు సంక్రాంతి శోభ పల్లెల నిండెన్.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

 














కందము: 
రంగుల మ్రుగ్గులు నేల, ప
తంగులు చూడంగ నింగి,ధన ధాన్యములే
హంగుగ గృహముల నిండగ
బంగరు సంక్రాంతి శోభ పల్లెల నిండెన్.    

Wednesday, 14 January 2015

మకర సంక్రాంతి మనకు క్షేమకరము

వీక్షకులు అందరికీ  సంక్రాంతి శుభాకాంక్షలు.
 











సీసము:
పనికిరాని తలపు పట్టి కాలిచి వేయ
మనకు భోగి యనుచు మంట జెప్పు
చిక్కులెన్నొ గలుగ చుక్కలే యనుకొని
ముందుకేగుడనుచు ముగ్గు చెప్పు
బద్ధకమ్ము వదల భగవానుడే మెచ్చు
ననుచును హరిదాసు డరచి చెప్పు
పంటలందిన వారు పరులకష్టముగని
కొద్దిగిమ్మని గంగిరెద్దు చెప్పు  

తేటగీతి:
పుణ్య పథమందు దిరుగగ మాన్యులగుచు  
నుందురనుచును సూర్యుండు  నోర్మి జెప్పు 
మకర సంక్రాంతి మనకు క్షేమకరముగను 
క్రాంతి చూపించు గావుత శాంతి నింపి.  

Tuesday, 13 January 2015

కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే.



కందము:
ఇల నొక లాటరి టిక్కె
ట్టల వోకగ కొంటి నేను, హాయిగ నెలకే
కలవానిగ మారుదునని
కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే.

కందము:
మలయప్ప సామి జూచితి,
సెలయేరును, కొండపైన స్వేచ్ఛగ దిరిగే
పలు రకముల చిలుకలు, జిం
కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే.


Monday, 12 January 2015

లలితకళలు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణన - లలితకళలు.  


కందము:
సంగీతము సాహిత్యము
హంగుగ నాట్యమ్ము శిల్పమాదియు మరియున్
రంగారు చిత్ర కళయును
బంగారీ! యొకటి యున్న భాగ్యమె మనకున్.

Saturday, 10 January 2015

కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్.
కందము:
అమ్మ సుత నెత్తుకొనెనట
యిమ్ముగ తన మెడల మీద , నిటు నటు కాళ్ళన్
కమ్మగ పలుకుచు కదపగ
కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్.

కందము: 
అమ్మడికి పాలనిచ్చుచు
నమ్మయె తా బొట్టమీద నటు నిటు ముద్దుల్
కమ్మగనీయగ బిడ్డకు
కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్.

Friday, 9 January 2015

శవములెన్నొ తేలె శివునిముందె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - గంగోద్ధృతి



శివుని కొరకు వెళ్ళి గంగ పాలైన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ...
ఆటవెలది: 
గంగవెర్రులెత్తి గంగమ్మ యుప్పొంగె
వరద వచ్చె మిగుల వరదు ముందె
మూడు కనుల ముందె మూడెగా జనులకు
శవములెన్నొ తేలె శివునిముందె.

కందము:
కట్టగ లేదా గంగను
గట్టిగ నీ జుట్టునందు, గంగయె తానై
నెట్టుక వచ్చెన చెపుమా
ఇట్టుల జరిగెను హర !హర ! యిల ఘోరంబే.  

Thursday, 8 January 2015

ఆ కుచేలుఁడు హరికిఁ బ్రత్యర్థి యగును.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఆ కుచేలుఁడు హరికిఁ బ్రత్యర్థి యగును. 

తేటగీతి:
ఊరియందున పార్టీలు వేరె యయిన
నాటకమ్మును వేసిరి నయము గాను
పగలు పగలేను రాతిరి పండుగనుచు
ఆ కుచేలుఁడు హరికిఁ బ్రత్యర్థి యగును. 

Wednesday, 7 January 2015

కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్.


కందము:
మలమల మాడెను కడుపా
కలితోడను, వంట గదిని కలియగ జూడన్
కలవా సీసాలో, నటు 
కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్.

Tuesday, 6 January 2015

ఆకాశవాణి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


 వర్ణన - ఆకాశవాణి


సీసము:
దినము మొదలున వందే మాతరమ్మను
భక్తి రంజని తోడ ప్రజల లేపు
ప్రాంతీయ వార్తల ప్రత్యేకముగ జెప్పు
నాటిక వినిపించు పాట నేర్పు
కర్షకులకు మరి కార్మికులకు స్త్రీలు
పిల్లలు యువతకు వేరు వేరు
కార్యక్రమములను కమనీయముగ వేయు
చిత్ర రంజని దోచు చిత్తములను

ఆటవెలది:
నాటి కాలమందు పూటయే గడవదు
ఇదియె చేత లేక నెవరికైన
ఆకసమ్ము జూచె " నాకాశవాణి " యె
నేడు శ్రోత లేక నిజము నిజము.






Monday, 5 January 2015

దుస్ససేనునిఁ గీర్తించె ద్రుపదతనయ.

 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దుస్ససేనునిఁ గీర్తించె ద్రుపదతనయ.


తేటగీతి:
ప్రతిన నెరవేర్చ బూనుచు బలము తోడ
రొమ్ముజీల్చియు మరి రుధిరమ్ము ద్రావ
యుద్ధమందున భీముండు గ్రుద్ది గ్రుద్ది
దుస్ససేనునిఁ - గీర్తించె ద్రుపదతనయ.

Sunday, 4 January 2015

పానకములోని పుడుకలు పాండుసుతులు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పానకములోని పుడుకలు పాండుసుతులు.


తేటగీతి:
పూనకము తోడ రారాజు పూని చెప్పె
వాదమేలయ్య వినవయ్య యాదవయ్య
సంధి సేయము సమరమ్ము సలుప గలము
పానకములోని పుడుకలు పాండుసుతులు.

Saturday, 3 January 2015

తేలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - తేలు




 

















తేలును జూడగ భయమున
తేలునుగా మనసు మనకు,  తెలియుము నిజమున్
తేలును విషమున తేడా
తేలును మరి ఖలుని బుద్ధి తేటగ గనినన్.

Thursday, 1 January 2015

అందరికీ " ఆంగ్ల " సంవత్సర శుభాకాంక్షలు...

 అందరికీ " ఆంగ్ల " సంవత్సర శుభాకాంక్షలు...

కందము:
విష్యూ హ్యాపీ న్యూయ్యర్
పుష్యూ టూరీచ్ టువర్డ్సు ఫుల్ జాయ్ అండ్ పీస్  
విష్యూ ఆల్ దా బెస్ట్, బ్యాడ్
ఇష్యూస్ విల్ నాటు రీచ్ యు, ఎవ్వర్ బీ గ్లాడ్.