తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 31 December 2014

పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె.


తేటగీతి:
నరుల శుద్ధులజేయగా నదిగ దిగెను
మురికి కూపమ్ము జేసెను మూర్ఖ నరుడు
బుద్ధి లేనట్టి నరునికై భువికి వచ్చి
పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె.

Tuesday, 30 December 2014

నననన నాననా ననన నానన నానన నాననా ననా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నననన నాననా ననన నానన నానన నాననా ననా


చంపకమాల:
కనుమిది నాన్నగారు ! మరి కష్టము నాకిది చంపకమ్మనన్
వినుమిక చెప్పుచుంటి నొక వీనులవిందగు మంత్రమొక్కటే
ననుచును తండ్రి జెప్పె కన ' నా '  లను గూడిన నవ్య మంత్రమే 
" నననన నాననా ననన నానన నానన నాననా ననా " ! 

Monday, 29 December 2014

పల్లియ కన్నియ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పల్లియ కన్నియ


















కందము:
పల్లియ కన్నియ జూడుడు
మల్లెలనే కట్టుచుండె మాలగ, నెదుటే
అల్లన మెల్లన తిరిగెడు
తెల్లనిపక్షులనుజూచి తేటగ నవ్వెన్.

Sunday, 28 December 2014

ముగ్గురు పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ముగ్గురు పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే


ఉత్పలమాల:
ఎగ్గులు జేయు సంఘటనల నేమియు ధర్మము దప్పకుంటచే
నుగ్గుగ జేయ కౌరవుల నూతన తేజము లొప్ప దీవెనల్
తగ్గవిధమ్ము కృష్ణుడును తాముగ శూలియు మారుతీయగా
ముగ్గురు, పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే !

Saturday, 27 December 2014

రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్.


కందము:
ప్రేమగ నఖముల బెంచెను
" ప్రేమ " యె తా గోళ్ళరంగు ప్రీతిగ వేసెన్
ప్రేమించి మేన బావగు
రాముఁడు " శూర్పణఖ " నపుడు రహిఁ బెండ్లాడెన్.

Friday, 26 December 2014

వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


సమస్య - వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్


కందము:
జంకక హసీన బట్టెను
మంకుగ కొడుకే యవనుల మతమే మారెన్
ఇంకేమి చెపుదు, చూడగ
వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్, ఖాదర్. 

Wednesday, 24 December 2014

పిడుగుపాటు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 

వర్ణన - పిడుగుపాటు.


కందము:
ఓరీ పిడుగా ! పడెదవె
ఈరీతిగ కూలివార లెటునిలబడినన్
ఘోరంబులు జేసెడి ఘన
చారిత్రుల మీద పడిన చరితార్ధుడవే !

Tuesday, 23 December 2014

రారమ్మని పిల్చె సాధ్వి రంజిల విటులన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


సమస్య - రారమ్మని పిల్చె సాధ్వి  రంజిల విటులన్.


కందము:
పేరేమొ ' సాధ్వి ' యామెది
హీరోయిను మోజు మీద హే ! చెన్నైకే
చేరెను, పస్తులు మాపగ
రారమ్మని పిల్చె' సాధ్వి ' రంజిల విటులన్.

Monday, 22 December 2014

భర్త భామ యయిన భార్య మురిసె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - భర్త భామ యయిన భార్య మురిసె


ఆటవెలది:
సత్యభామ పాత్ర సరసంబుగా వేసి
నాటకంబునందు నలుగురెదుట
మెప్పునంది తేగ 'కప్పు ' నొక్కటి నాడు
భర్త "భామ" యయిన భార్య మురిసె

Sunday, 21 December 2014

పంచముఖ ఆంజనేయుడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పంచముఖ ఆంజనేయుడు.


 





















సీసము:
ఆకాశయానమ్ము నవలీలగా సేయు
పవన పుత్రుడతడు, బాల్యమందు
అగ్నులెగయు రవి నరచేతనే పట్టె
జలనిధినే దాటె శౌర్య ధనుడు
పుడమిపుత్రిక జాడ బుద్ధిబలము జూపి
స్వామికే జెప్పె నసాధ్యుడతడు
రోమరోమమునందు రాముడే కనిపించు
భావి బ్రహ్మ యమిత బాహుబలుడు

తేటగీతి:
పంచభూతములాయన పట్టునుండు
పంచబాణునివైరి యా పరమ శివుడె
పంచవక్తృడు మారుతి భక్త జనుల
పంచనుండును మనకెట్టి భయము వలదు.




Saturday, 20 December 2014

శకుని ధర్మాత్ముఁ డనఘుడు సత్పురుషుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శకుని ధర్మాత్ముఁ డనఘుడు సత్పురుషుడు


శ్రీ ధూళిపాళ్ళ గారి పరంగా...

తేటగీతి:
చలన చిత్రమున నతడు  శకుని మామ
పవన సుతునకు గుడికట్టె భక్తుడతడు
తోటివారికి గుంటూరు ధూళిపాళ్ళ
'శకుని '  ధర్మాత్ముఁ డనఘుడు సత్పురుషుడు !

Friday, 19 December 2014

చల్లగ నయ్యెనీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చి నంతనే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - చల్లగ నయ్యెనీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చి నంతనే

ఉత్పలమాల:
పిల్లలు పెద్దలందరును వేడిని తాళక వేగుచుండగా
నల్లన వాయుగుండమది యంబుధి దాటగ ప్రాకుచుండెగా 
నల్లని మేఘమాలికలు నాట్యముజేయుచు నూగుచుండెగా
చల్లగ నయ్యెనీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చి నంతనే. 

Thursday, 18 December 2014

తమ్ములు పదం నాల్గు పాదాలలో ...భారతార్థం ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

దత్తపది - తమ్ములు పదం నాల్గు పాదాలలో ...భారతార్థం ...


ద్రౌపది ధర్మరాజుతో..

కందము:
తమ్ములు పోవరులే పం
తమ్ములు, తమ మాట వినును, తగ నైదగు భూ
తమ్ములు మీరే, కన నా
తమ్ములు నూరైన గాని తమసరి రారే !

Wednesday, 17 December 2014

కామితార్ధమ్ము లొసఁగదు కనకదుర్గ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కామితార్ధమ్ము లొసఁగదు కనకదుర్గ.

తేటగీతి:
మహిష మర్దని స్తోత్రమ్ము మనసుదలచి
పూజ జేయుచు పదముల పూలు వేసి
నీవె దిక్కని వేడగా నెందు కామె
కామితార్ధమ్ము లొసఁగదు ? కనకదుర్గ.

Tuesday, 16 December 2014

కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.





సమస్య - కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్.



కందము:
స్తపతి విదేశము వెడలెను
నృపులెందరొ కాన్కలీయ నేరుగ దెచ్చెన్
విపులముగా చూప కనుల
కు, పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్.

Monday, 15 December 2014

నశ్యము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - నశ్యము


తేటగీతి:
ధూమ పత్రంబు పొయి మీద దోరగాను
చూచి వేయించి నెయి వేసి చూర్ణముగను
సున్నమింతయు గలుపుచు సొగసుగాను
చేసి పీల్చిన " స్వర్గమ్ము "  చేరువగును.

కందము:
పట్టిన నశ్యపు పట్టును
బట్టలు పాడౌను, చేర భార్యయు తిట్టున్
పట్టును తిత్తుల క్యాన్సరు
పట్టును వీడుచును దాని పడవేయవలెన్.


 

Sunday, 14 December 2014

హనుమత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - హనుమత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై.



మత్తేభము:
ఇనవంశమ్మున బుట్టినాడు భళిరా ! యీ విల్లు తానెత్తెరా !
కనగా పుల్లగ ద్రుంచె  దాని గదరా ! కల్యాణ రాముండురా !
జనకుండేను ముదమ్ము తోడ బనుపగా సాగేను,   వీడున్ విదే
హను, మత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై.

Saturday, 13 December 2014

గోంగూర

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణన - గోంగూర


ఆటవెలది:
పుంటి కూరయంద్రు పుల్లగా నుండును
పుల్లలన్ని దీసి పోసి యాకు
పప్పు, పులుసు కూర, పచ్చడి జేయంగ
నుల్లి గలిపి చూడ నుల్ల మలరు.

Friday, 12 December 2014

గ్రాసవాసమ్ములకు నేడ్చెఁగంసవైరి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గ్రాసవాసమ్ములకు నేడ్చెఁగంసవైరి


తేటగీతిః
కట్ట చేలములే లేక కడుపుకింత
తినగ లేక కుచేలుడు తిరిగి తిరిగి
గ్రాసవాసమ్ములకు నేడ్చె, గంసవైరి
బాల్య మిత్రుడు కద, యేగె భార్య పంప.

Thursday, 11 December 2014

భూత ప్రేత పిశాచ సంఘమును సంపూజించినన్ మేలగున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భూత ప్రేత పిశాచ సంఘమును, సంపూజించినన్ మేలగున్

శార్దూలము:
భీతిన్ వీడుడు మానసంబు నికపై ప్రీతిన్ మదిన్ గొల్వ సా
కేతాధీశుని దాసుడైన హనుమన్,  ఖేదంబులన్ ద్రోలు, నా
సీతాశోక వినాశకుండు గనుచున్ చెండాడుగా  శ్రీఘ్రమే  
భూత ప్రేత పిశాచ సంఘమును, సంపూజించినన్ మేలగున్

Wednesday, 10 December 2014

రాయలు రచియించెనంట రామాయణమున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాయలు రచియించెనంట రామాయణమున్.


కందము:
ఆయన చరితను వ్రాసిన
మాయును పాపమ్మనుచును మరి వేయున్నన్
' వేయిపడగ ' లిచ్చిన ' కవి
రాయలు ' రచియించెనంట రామాయణమున్.


Tuesday, 9 December 2014

వేసవిలో శీతవాయువే వీచుఁ గదా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వేసవిలో శీతవాయువే వీచుఁ గదా 
కందము:
ఏసీ లక్కరలేదులె
వేసిన నేపుగ పెరిగిన వేపయె యున్నన్
వాసపు ముంగిట, జూడగ
వేసవిలో శీతవాయువే వీచుఁ గదా !

Monday, 8 December 2014

తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్.


కందము:
అయ్యా ! నాడట హరినే
తొయ్యలి తులదూచ నిడెను తులసీ దళమున్
అయ్యది దలచుచు హరి ! హరి !
తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్.

Sunday, 7 December 2014

వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే


కందము:
వక్త్రంబొక్కటి చాలనె
వక్త్రంబున ధర్మ బుద్ధి వదలక యున్నన్
వక్త్రముల గూల్చె గద దుర్
వక్త్రంబుల్ పది గలిగిన, వానికి జేజే !



రావణునికి జయము పలుకుతూ నరుడా ' నీ తలకాయ్ ' ఏంచేస్తావ్ ? అని రాక్షసులు పలుకుట...

కందము:
వక్త్రములు నాల్గు వాడును
వక్త్రంబులు నైదు వాడు వరమిడె, నర ! నీ
వక్త్రంబదేమి చేతువు ?
వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే !

Saturday, 6 December 2014

కుందేలు కుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుందేలు కుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే.


కందము:
' కందేల ' వ్రాసినావుర
'కుందేలు ' ను వ్రాయలేవ ? కొమ్ములుదిద్దన్
'మందుడ ' కాకును లాకును
'కుందేలు ' కుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే. 

Friday, 5 December 2014

సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె.


ఆటవెలది:
బొచ్చు కుక్క నొకటి ముచ్చటగా పెంచె
మదగజమును పెంచె మావటీడు
ఏన్గు వీపు పైకి నెక్కుచు దిగు గ్రామ
సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె.

Thursday, 4 December 2014

రణముఁ గాంచి వగచె రామమూర్తి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
 

సమస్య - రణముఁ గాంచి వగచె రామమూర్తి.


ఆటవెలది:
నగలు కొన్ని క్రింద నగముపై బడునట్లు
సీత జార విడిచె భీత యగుచు
కపులు వాని జూప కనుగొని సతియాభ
రణముఁ గాంచి వగచె రామమూర్తి.

Wednesday, 3 December 2014

ఉంగరమ్మున జిరునవ్వు లొల్కె బళిర

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఉంగరమ్మున జిరునవ్వు లొల్కె బళిర

తేటగీతి:
బిందెలోపల చెయి దూర్చి ప్రియము మీర
వరుని చేతిని గిల్లుచు వధువు వెతికె
వేడుకలరగ నీటిలో వ్రేలు దూర
నుంగరమ్మున, జిరునవ్వు లొల్కె బళిర !

Tuesday, 2 December 2014

వదినను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వదినను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్. 


కందము:
మదిలో ప్రేమను చెప్పెను
వదిలేదిక లేదననుచు బాసలు చేసెన్
పదపడి చెల్లెలి నిమ్మని
వదినను, బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్.

Monday, 1 December 2014

పెసర, మినుము, కంది, సెనగ...లతో పార్వతీ కల్యాణము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - పెసర, మినుము, కంది, సెనగ...లతో పార్వతీ కల్యాణము  


తేటగీతి:
చూసె నగ తనయ శివుని, వేసె దండ
వేడ్క మీరగ తనకంది వేల్పు రాగ
చూపె సరసిజ లోచనాల్ సోయగమున
సంబరమ్ములు మినుముట్టె సాంబు జతగ .