తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 30 November 2024

సమయోచిత పద్యరత్నము – 16

 

ఉత్పలమాల:
భానుని గొల్వ రోగముల బారగ జేయును, శ్రద్ధగానిలన్
ధ్యానముజేయ నగ్నినిల ధాన్యము చేకురు, నీశు దల్పగా
జ్ఞానము గల్గు దప్పకను, సన్నుతిజేయ జనార్దనున్ మదిన్
దీనత బాపి మోక్షమును తీరుగనిచ్చును నిక్కమిద్ధరన్.


Friday, 29 November 2024

సమయోచిత పద్యరత్నము – 15

 

చంపకమాల:
పరసతిగోరు బుద్ధియును, వస్త్రము గట్టుట నా పరాయిదిన్
పర గృహమందు భోజనము, బండుట గూడదదెంతవారికిన్
పరు నిజ శయ్యపైన,గన భాగ్యమదంతయు జారిపోవు, నా
పర యిది, లేకయున్న సిరి బారును జూడ కుబేరుకైననున్.


Thursday, 28 November 2024

సమయోచిత పద్యరత్నము – 14

 

ఉత్పలమాల:
తుమ్మెదగుంపు బోలుజడ దోపిన మల్లెలు, చంపకమ్ముగా
నమ్మణి ముక్కు, నేత్రముల నారయ వారిజమట్లు, నెర్రనౌ
కమ్మని మోవి, పల్వరుస, గాత్రము నందున తేనెలూరగా
నిమ్ముగబల్కు, ఫాలమున నింతగు బొట్టు, సుకన్యకందమౌ.


Wednesday, 27 November 2024

సమయోచిత పద్యరత్నము – 13

 

ఉత్పలమాల:
చల్లని చేతులన్ సుతుల సాకుచు పాలన జేయుచుంద్రుగా
తల్లియె దైవమింక భువి తండ్రియె దైవము, మానవాళికిన్
చల్లని చూపులన్ బ్రతుక సాయము జేయును లోకనాధుడే
అల్లన వారిసేవ లిహ మందున నా పరమందు సౌఖ్యమౌ.


Tuesday, 26 November 2024

సమయోచిత పద్యరత్నము – 12

 

ఉత్పలమాల:
ఓమ్మన దైవరూపమది, యోమ్మనగా ప్రణవమ్ము, చూడగా
నోమ్మన నాదిశబ్దమది, యోమ్మన మూలము భాషలన్నిటన్
ఓమ్మన నాదరాజమది,  యోమ్మన మంత్రపు ద్వారమయ్యెడిన్
ఓమ్మది తాక వీనులకహో! మది  నిండును దివ్యభావనల్.

Monday, 25 November 2024

సమయోచిత పద్యరత్నము – 11

 

చంపకమాల:
నిజముగ నెన్ని వాద్యముల నెన్నుచు బట్టుచు మీటుచుండినన్  
ప్రజలమనంబు జూరగొని రంజిల జేయుటకే గదా, సదా
భజనలు లేక నెన్మిదియు పైబది విద్యలు భుక్తి కోసమా?
నిజమగు విద్యలన్న నవి నిక్కము ముక్తిని గూర్చుకోసమే.


Saturday, 23 November 2024

సమయోచిత పద్యరత్నము – 10

 

చంపకమాల:
విషయములెన్నొనేర్పు, మన వేదపు లోతుల దెల్పుచుండు, క
ల్మషములబాపు, లోన ఘనమైన కథామృతమందజేయుచున్
విషమసమస్యలందు భువి వేదనజెందెడు మానవాళికిన్
శషభిషలేని యౌషధము జక్కగనిచ్చును "భారత"మ్మహో!


Friday, 22 November 2024

సమయోచిత పద్యరత్నము – 9

 


చంపకమాల:
పనులవి నూరునున్న విను పట్టెడు బువ్వ భుజించగావలెన్
పనులవి వేయియున్న నొక పట్టున స్నానము జేయగావలెన్
పనులవి లక్ష యున్న గని పాత్రత దానము జేయగావలెన్
పనులవి కోటియున్న హరి భక్తిదలంచి భజించగావలెన్.


Wednesday, 20 November 2024

సమయోచిత పద్యరత్నము – 8

 


ఉత్పలమాల:
పాములగట్టి గుఱ్ఱముల బండికి,  చక్రమదొక్కటైన, నా  
వ్యోమమునందు భాస్కరు డనూరుని తోడనె సాగుచుండుగా
ఏమియు గొప్పదైన "సరి హేతువు" లేక మహాత్ములెప్పుడున్
నీమముతోడనా పనిని నిక్కము జేయుదు రిద్ధరన్ గనన్.


Tuesday, 19 November 2024

సమయోచిత పద్యరత్నము – 7

 


ఉత్పలమాల:
ధ్యానముజేతు నేను శశిధారి, త్రిశూలిని చంద్రమౌళినిన్
గానముజేతు శంకరుని గంగను దాల్చిన వాని, శంభునిన్
దానమునీయమందు ప్రమధాధిపు మోక్షవరమ్ము, చింతనన్
మానను, లేడిబట్టి సతిమన్నన ప్రక్కన దాల్చు వానినిన్.


Friday, 15 November 2024

సమయోచిత పద్యరత్నము – 6

 

చంపకమాల:
క్షితిజనులంత స్వప్నమున శ్రీలను బొందుట, సౌఖ్యమందుటల్
గతజలమౌను జూడ కనికట్టుగ, నిద్రను మేల్కొనంగనే  
అతివలమీది మోహమది యట్టులె మాయయె,మొహమందగా
మతిచెడు గాద, దూరమగు మాధవుపైనను మించు భక్తియున్.


Thursday, 14 November 2024

సమయోచిత పద్యరత్నము – 5

 

చంపకమాల:

గురుచరణమ్ము బట్టి తన గోడును జెప్పుచు సేవజేయగా

బరువును దీర్చి నేను యను  భ్రాంతిని దేహమునందు బోవగా

సరియగు బోధజేయుచును సత్కృపతోడను వెన్ను దట్టుచున్

మరిమరి జ్ఞానజ్యోతులను మానసమందున నింపు, సత్యమే.



పిల్లలు దైవాల రూపు

 

కందము:
కల్లయు కపటమ్మెరుగని
పిల్లలు దైవాల రూపు, పెంచుడు వారిన్
తల్లియు తండ్రియు గురువులు
మల్లెల వలె స్వచ్ఛమైన మనసుల నెదగన్.

కందము:
మొక్కగ నుండగ నప్పుడె
చక్కగ సరియైన విధము సరి వంచవలెన్
దక్కునె మ్రానైన? సుగతి
చక్కని బాలలను మేలు జగతిని నిలుపన్.

కందము:
చెప్పుడు నీతికథలనే
చెప్పుడు మాటలను వినగ చేటగుననుచున్
చొప్పగ జేయక బుద్ధిని
చొప్పడ జేయంగవలయు శోధన ప్రతిభన్.

కందము:
పెద్దలనెడ గౌరవమును
సుద్దుల నోర్మిని, వినయము జూపెడు విధమున్
ముద్దుగ చదువుల నేర్పిన
నద్దియె సరియైన విద్య యగు పిన్నలకున్.

కందము:
గద్దెలనెక్కిన వారలు
పెద్దలు సరిదారి నెరిగి ప్రేమగ నెపుడున్
దిద్దుచు రేపటి పౌరుల
హద్దులలోనుంచి పెంచ హాయగు గదరా!


Wednesday, 13 November 2024

సమయోచిత పద్యరత్నము – 4

 


చంపకమాల:
కమలము ప్రీతి శ్రీహరికి గావున దానిని చేతబట్టుగా
కమలమె శ్రీ సుఖాసనము, గాదిలి బ్రహ్మకు గూడ పీఠమే  
కమలము, మానవా! హరిని గానగవచ్చును  మొగ్గవంటి హృ
త్కమలము భక్తితోడను వికాసము జేయగ యోగదృష్టితోన్.


Tuesday, 12 November 2024

సమయోచిత పద్యరత్నము – 3

 


ఉత్పలమాల:
ఆ గణకోటి నాథుడవె, ఆప్రణవంబున శబ్ద రూపివే!
వేగపు వ్రాతగానివిలె, వేకవులందున శ్రీకవీశువే!
శ్రీగురు, బ్రహ్మలందు సరి జేరిన వాడవె, విఘ్నరాజ, నిన్  
ధ్యానముజేసి మ్రొక్కెదను ధన్యత జెందగ నో గణాధిపా!


Monday, 11 November 2024

సమయోచిత పద్యరత్నము - 2

 సమయోచిత పద్యరత్నము - 2

చంపకమాల:
వలపుల లేడికళ్ళు నెలవంకను బోలిన కన్నుబొమ్మలున్
పులకలురేపు మాటలును ముద్దుగ నల్కల ముచ్చటాటలున్  
కలివిడిగల్గి కోరిననె కౌగిలినిచ్చెడి మోవి తీపిదౌ
చెలియను గల్గినట్టి సఖు జీవితమంతయు పండుగేయగున్.

Sunday, 10 November 2024

సమయోచిత పద్యరత్నము - 1

 గతంలో (2020) శ్రీ చండ్రపాటి రామ్మోహన్ గారు "సాహితీ ప్రియ మిత్ర సంగమము" వాట్సప్ గ్రూప్ నందు నిర్వహించిన "సమయోచిత పద్యరత్నము"ల పోటీలో ఇచ్చిన అంశములకు తగ్గట్లుగా రోజుకొకటి చొప్పున నేను వ్రాసిన పద్యములు. 


సమయోచిత పద్యరత్నము - 1          

ఉత్పలమాల:

శ్రీపరమేశు కంఠమున చెల్వపు మాలను వైచి, పెండ్లిలో

తా పదమంటువేళ నట దాకిన "బుస్సన" పెండెరమ్ములే

చూపుల భీతి,లజ్జయును జొప్పడి కందుచు వెల్గు మోముదౌ  

చేపలకండ్ల "శైలసుత" చెన్నుగ మీకిడుగాక సంపదల్.   


 


Tuesday, 5 November 2024

పోరు

 అమరావతి సాహితీ మిత్రులు  

వారం వారం పద్య కవితల పోటీ - 2 కొరకు వ్రాసిన పద్యములు 

అంశం:యుద్ధం  

శీర్షిక:పోరు 


తేటగీతి:  

మంచి చెడులకు యుద్ధమే యెంచి చూడ 

వెలుగు చీకటి కెప్పుడు కలదు పోరు 

ధర్మ రక్షకు సమరమ్ము తప్పదెపుడు 

వసుధనే నింపగా శాంతి పచ్చదనము. 


తేటగీతి:    

యుద్ధమును జేయ నెప్పుడు సిద్ధమనకు    

సిద్ధమేయైన విడువకు చివరి వరకు  

ధర్మ యుద్దమునకు తోడు దైవమెపుడు 

దుష్ట శిక్షణమే చూడ తుదకు జరుగు.        


తేటగీతి: 

స్వార్ధ మెంచుచు కొందరు వదలబోరు 

పోరు సలుపుచు నుందురీ పుడమిలోన 

వనిని బుట్టిన కార్చిచ్చు వలెనె నదియు

కాల్చి వేయును వారినే కూల్చివేయు.  

  

తేటగీతి:  

మనుగడకు శాంతి దక్కగా మనుజు లిలను 

అనిని సలుపగ వలయుగా ననవరతము      

మనసునందున చాటుగా మసలు యరుల  

నణచగావలె నారింటి నారు వరకు.     


తేటగీతి: 

బ్రతుకు పోరున నెవ్వరు  బ్రతికిపోరు 

పారిపోక నిల బ్రతికి పోరవలయు   

కత్తి సాహసమే యోర్మి కవచమవగ     

ధర్మ నియతిని బూనగా దక్కు జయము.