తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 30 June 2019

సినిమాకు "వంద"నం - 20

సినిమాకు "వంద"నం - 20


ఆటవెలది: 
హీరొయిన్ను నడుము జీరొ సైజును కోరు
సిక్సుప్యాకు ఛెస్టు సినిమ హీరొ 
కోరు, ప్రేక్షకుండు కోరునదేదియో 
తెలిసి తీయరయ్య తెలుగు సినిమ.
 • 

Saturday, 29 June 2019

సినిమాకు "వంద"నం - 19

సినిమాకు "వంద"నం - 19

ఆటవెలది: 
నటన రత్నము ,మరి నటనను సామ్రాట్టు 
నటన శేఖరుండు, నటన భూష 
ణుండు వెలిగినారు వెండి తెరను నాడు 
నటుల నేడు జూడ నటన "నటన." 

Friday, 28 June 2019

సినిమాకు "వంద"నం - 18

సినిమాకు "వంద"నం  - 18

ఆటవెలది: 
పుట్టినపుడు మాట పూర్తిగా లేదాయె 
పాలిపోయె రంగు బాగులేక 
హంగు రంగులెన్నొ పొంగి పొరలె నేడు 
'సినిమబాల' జూడ "చిత్ర" మాయె.

Thursday, 27 June 2019

సినిమాకు "వంద"నం - 17

సినిమాకు "వంద"నం - 17

ఆటవెలది: 
మన సుకవుల "వ్రాత" - మనసైన యా"మ్రోత"
నప్పు నటుల "చేత" - గొప్ప "తీత"  
సినిమ లేకయున్న చేరునే మనదాక
తీత,చేత,వ్రాత, మోత - మోత.

Wednesday, 26 June 2019

సినిమాకు "వంద"నం - 16

సినిమాకు "వంద"నం - 16

ఆటవెలది: 
చందమామ జూపి చద్దిముద్దను బెట్టె 
నాటి తల్లి బిడ్డ నోటిలోన 
ముద్ద దినగ నేడు ముందుంచు సినిమాను 
మోజు తీరగను రిమోటు నొక్కి.

Tuesday, 25 June 2019

సినిమాకు "వంద"నం - 15

సినిమాకు "వంద"నం - 15

ఆటవెలది: 
కష్టమందు జూడు కామెడీ సినిమాను 
పండుగపుడు జూడు భక్తి సినిమ 
మంచి కథల సినిమ నెంచుక జూడుము 
చూడబోకు మెపుడు సుత్తి సినిమ.

Monday, 24 June 2019

సినిమాకు "వంద"నం - 14

సినిమాకు "వంద"నం - 14

ఆటవెలది: 
పసితనమ్మునందు ఫైటింగు సినిమాలు 
యవ్వనమ్మునందు లవ్వు సినిమ 
ముసలి వయసునందు ముక్తిభక్తి సినిమ
నచ్చు నెప్పుడైన "నవ్వు" సినిమ.

Sunday, 23 June 2019

సినిమాకు "వంద"నం - 13

సినిమాకు "వంద"నం - 13 

ఆటవెలది: 
వలువ నిండుదనపు విలువనుబెంచిరి 
నాటి సినిమలందు నాయికలును 
వలువ "విడిచి" నేడు "విలువను" బెంచిరి 
అందమంద కొంద రందరకును.  

Saturday, 22 June 2019

సినిమాకు "వంద"నం - 12

సినిమాకు "వంద"నం - 12

ఆటవెలది: 
వెండి తెరను నాడు వెలుగొందె సినిమాలు 
ఒప్పు కొందురంద " రోల్డు గోల్డు " 
సిన్మ జూడ నేడు సిల్వరు స్క్రీనుపై 
వాటికన్న మెరయు " రోల్డు గోల్డు "

Thursday, 20 June 2019

సినిమాకు "వంద"నం - 11

సినిమాకు "వంద"నం - 11

ఆటవెలది: 
"ఆలు టైము" హిట్సు ఆనాటి పాటలు 
దినము దినము నిలచు జనుల మదుల  
"హాలు టైము" హిట్సు 'అదరగా' ఈనాడు 
"దినము" జరుగు కొలది దినములందె.



Wednesday, 19 June 2019

సినిమాకు "వంద"నం - 10

సినిమాకు "వంద"నం - 10

ఆటవెలది: 
సినిమ పాట లేక చెలగదు రేడియో 
సినిమ బిట్లు లేక చితుకు టీవి 
సినిమ లేనినాడు చింతలే జనులకు 
సినిమ గొప్పదనము జెప్పదరమె. 

Tuesday, 18 June 2019

సినిమాకు "వంద"నం - 9

సినిమాకు "వంద"నం - 9 


ఆటవెలది:  
చిన్న వారు జూడ చెంగుచెంగునబోవు
చెంగుదోపి వెడలు చేడియలును 
ముసలివారు గూడ మూల్గుచు తయ్యారు 
మహిని గనుడు సినిమ మహిమ హ!హ!హ!

Monday, 17 June 2019

సినిమాకు "వంద"నం - 8

సినిమాకు "వంద"నం - 8 

ఆటవెలది: 
పాట సుమము నింత పరికింపగా లేము 
భావగంధమింత పైకి రాదు 
ఆంగ్ల బాణిలోన నల్లల్ల లాడగ 
నేటి సినిమపాట నీల్గుచుండె.
 • 

Sunday, 16 June 2019

సినిమాకు "వంద"నం - 7

ఆటవెలది: 
నటన ఘనము నాడు నాట్యమ్ము జూడగా
నయనములకు విందు నాటి సినిమ 
నటన మంత 'నటన' నాట్యమ్ము జఘనపు 
చూపు లూపు లిపుడు 'షో'కులాయె.

Saturday, 15 June 2019

సినిమాకు "వంద"నం - 6

సినిమాకు "వంద"నం - 6 

ఆటవెలది: 
తొలుతబుట్టినపుడు పలుకు లేనేలేదు 
రంగులేక బెరిగె రంగమందు 
సప్త వర్ణములను సరిబొంది శృంగార 
సినిమ "కన్నె" నేడు "సిగ్గు"లొలికె. 

Friday, 14 June 2019

సినిమాకు "వంద"నం - 5

సినిమాకు "వంద"నం - 5

ఆటవెలది:  
తెలుగుపేరు నిడుట,  తేలికగాదల్చి 
తెలుగువాణి, బాణి తేలిపోవ 
ఇంగిలీసులోన నిరికించ సినిమాన 
తెలుగు మూగవోయి తెల్లబోయె.

Thursday, 13 June 2019

సినిమాకు "వంద"నం - 4

సినిమాకు "వంద"నం - 4

ఆటవెలది: 
గీతరచన నాడు గీత దాటగ లేదు 
వాచకమున లేవు వంకరలును 
గోలబెట్ట లేదు గొప్పసంగీతమ్ము 
నాటి సినిమ లెంచ మేటి వేను.

Wednesday, 12 June 2019

సినిమాకు "వంద"నం - 3

సినిమాకు "వంద"నం - 3  

ఆటవెలది:
ఘనపురాణములను కన్నులముందుంచె 
ప్రేమ విలువజెప్పి ప్రియము గూర్చె 
దేశభక్తి బెంచి తేజస్సునే నింపె 
నాటి సినిమ మనకు నయము గూర్చె.       

Tuesday, 11 June 2019

సినిమాకు "వంద"నాలు - 2

సినిమాకు "వంద"నాలు - 2 

ఆటవెలది: 
తెలుగుపేర్లు, వెండితెరమీది పాటలు
మాటలన్ని నాడు మనసు నిలిచె
ఇంగిలీసు పేర్లు,ఎంగిలి పాటలు
యాసమాటలిపుడు "ఫ్యాస" నాయె.

Monday, 10 June 2019

సినిమాకు "వంద"నాలు - 1

సినిమాకు "వంద"నాలు - 1

ఆటవెలది:
శ్రీలు గలుగ వచ్చు సిరుల గోల్పడవచ్చు
'సినిమ' దీయువాడ! చేతు వినతి
పాట,మాటలందు 'ప్రక్క' దారుల బోక
తెలుగుదనము నింపు "తీయ"గాను.

Sunday, 9 June 2019

సినిమాకు "వంద"నాలు

సినిమాకు "వంద"నాలు. ముందుమాట కందము: ఆ సినిమా లా కాలము చూసిన మా యనుభవములు సోయగ మొప్పన్ వ్రాసిన వందగ నైనవి కాసిని మా " పజ్యములను " కనుడీ వేడ్కన్. 2017వ సంవత్సరంలో "ఫేస్ బుక్" లో ప్రముఖ కార్టూనిస్టు, రచయిత శ్రీ భమిడిపల్లి నరసింహమూర్తి (బ్నిం)గారు "సినిమా పజ్యాలు" అనే గ్రూపును ఏర్పాటుచేసి అందులో చేరిన కవులను ఒక్కొక్కరిని కనీసం ఐదు "ఆటవెలది గాని తేటగీతి గాని" సినిమా గురించి "పజ్యాలు" వ్రాయమని కోరారు. ఐదు పద్యాలు అని మొదలు పెట్టిన నేను వందకు పైగా పద్యాలు వ్రాయటం జరిగింది.(గతంలో నేను ఇలాగే "జడ పజ్యాలు " (శతకం) వ్రాయడం జరిగింది.) నా "సినిమా పజ్యాలను" మిత్రులతో పంచుకోవాలని రోజుకొకటి చొప్పున అందించాలనుకొంటున్నాను. ఏవైనా తప్పులు ఉంటే తెలియజేయవలసినదిగా దిద్దుకొనుటకు సహకరించవలసినదిగా కవి పండిత మిత్రులను సవినయంగా కోరుచున్నాను. ఈ శతకం వ్రాయగలగటానికి కారణభూతులైన శ్రీ "బ్నిం" గారికి, నన్ను ప్రోత్సహించిన మిత్రులకు నమస్సులు మరియు ధన్యవాదములు. ---గోలి.😐