తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 31 October 2014

అనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - అనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.


తేటగీతి:
రాము ననుజుడు గా నున్న లక్ష్మణుండు
రాము డను పేర నన్నగా రాయె హరికి
విష్ణు రచనను శేషుండు వేడ్కగాను
అనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.

తేటగీతి:
అన్నదమ్ములు నాటకమ్మందు జేర
పాత్ర లెంపిక జేయగా పాండవులకు
ఒడ్డు పొడుగుల నెంచుచు నుండ కడకు
అనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.

Thursday, 30 October 2014

మాయా సభ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - మయసభ


కందము:
మయ సభయే కాదది చి
న్మయుడే కథ నడుప నిడిన మాయా సభయే
మయసభ లో రభసయె గద
క్షయ మగుగానట్లు జేసె క్షమ భారంబున్.

Wednesday, 29 October 2014

కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే

కందము:
అన్నియు తానై నడుపును
మన్నును తిన్నట్టి వాడె మన్నన బొందెన్
కన్నయ్య, నంద నందను
కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే ?

Tuesday, 28 October 2014

జనన మరణములు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
 

వర్ణన - జనన మరణములు.


తేటగీతి:
కన్ను తెరిచిన జననమ్ము 'కనును' తల్లి
కన్ను మూసిన మరణమ్ము కనెదరొరులు
మనము గనములె రెండును, మధ్య 'లోన'
గనుచు బ్రతుకును దిద్దుకో ఘనము గాను.

Monday, 27 October 2014

కుంతి మగఁడు శూలి కొడుకు వాలి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కుంతి మగఁడు శూలి కొడుకు వాలి


ఆటవెలది:
ఫ్రక్క వీధి లోని పార్థుడు గారికి
కుంతి మగఁడు, శూలి కొడుకు, వాలి
తమ్ము పేర్ల తోడ తనయులు గలరయ్య
వారి పేర్లు జెప్పు వారు గలరె ?

Sunday, 26 October 2014

తృప్తి ... వర్ణన.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తృప్తి ... వర్ణన.

ఆటవెలది:
ఉన్న వాడు కనగ నున్న వాడే కాదు
లేని వాడు తృప్తి లేని నాడు
లేని వాడు నిజము లేని వాడే కాదు
ఉన్న వాడు తృప్తి యున్న నాడు.

Saturday, 25 October 2014

తగినది గాదయ్య వేదధర్మము మనకున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తగినది గాదయ్య వేదధర్మము మనకున్.

కందము:
తెగ మెచ్చి పరుల ధర్మము
తెగబడి పోయెదవదేల తెలియక నిజమున్
అగణిత గుణములు గలదిది
తగినది గాదయ్య వేదధర్మము మనకున్? 

Friday, 24 October 2014

నరకుఁడు సంపెఁ గృష్ణుని సనాతనధర్మము రక్షసేయఁగన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నరకుఁడు సంపెఁ గృష్ణుని సనాతనధర్మము రక్షసేయఁగన్.


చంపకమాల:
నరకుని జంపి నాడు గద నాడట కృష్ణుడు నేడు చూడగా
నరకెను పాత గాథనిటు నామము ' సత్యపు నాటకమ్మనెన్ '
నరకుని ' ఫ్యాన్స్ ' వచ్చి తమ నాయకు స్వప్నము జేర్చిరందులో
నరకుఁడు సంపెఁ గృష్ణుని- స. నా - తనధర్మము రక్షసేయఁగన్.

Thursday, 23 October 2014

వెలిగించు శక్తి నిచ్చెడి జ్యోతిన్





వీక్షకులు అందరికీ దీపావళి పర్వదిన  శుభాకాంక్షలు.  
 













కందము:
యేటికి సరిపడునట్లుగ
నేటికి వెలిగించు శక్తి నిచ్చెడి జ్యోతిన్
యేటికి భయమున్ బడెదవు
మేటిగ చీ'కట్లు' ద్రెంచి మెరుపుగ సాగన్.

Wednesday, 22 October 2014

తేనెపూసినకత్తి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తేనెపూసినకత్తి....వర్ణన.


తేటగీతి:
తీయ తీయని మాటల మాయ జేయు
మెత్త మెత్తగ కుత్తుక నుత్తరించు
' నాక ' మంచును తలపించు పోకడలును
తేనె బూసిన కత్తుల దెలిసి  మెలగు.


Tuesday, 21 October 2014

పాడు పనుల జేయువాడు ఘనుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పాడు పనుల జేయువాడు ఘనుడు

ఆటవెలది:
పనిని జేయు మనుచు పరమాత్ముడే చెప్పె
ఫలిత మతడు జూచు భయము వలదు
పనియు పాట లేక పడి నిద్ర బోవుట
పాడు - పనుల జేయువాడు ఘనుడు

Sunday, 19 October 2014

కలకాలము బతుకువాడు కామాతురుడే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కలకాలము బతుకువాడు కామాతురుడే


కందము:
ఇల కామములను వీడక
బల,మాయువు నీయ మనుచు భగవంతునితో
పలుమార్లు వేడి, కాకిగ
కలకాలము బతుకువాడు కామాతురుడే

Saturday, 18 October 2014

తారకమంత్రము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తారకమంత్రము .... వర్ణన.


కందము:
తారలు సూర్యుడు చంద్రుడు
తీరుగ ఝరి గిరులు నిలచి తీరెడు వరకున్
మీరుచు జగమును బ్రోచెడు
తారక మంత్రమ్ము "రామ" తలపన్ రారే !

Friday, 17 October 2014

కరి సింహమునెక్కి దైత్య గణముల దునిమెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - కరి సింహమునెక్కి దైత్య గణముల దునిమెన్.


కందము:
సుర నర గణములు వేడుచు
పరమేశ్వరి దరికి జేరి పాహీ యనగా
కరుణను నభయమ్మిడి శాం
కరి సింహమునెక్కి దైత్య గణముల దునిమెన్.

Thursday, 16 October 2014

మరుని ముద్దులాడె గిరికుమారి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - మరుని ముద్దులాడె గిరికుమారి.


ఆటవెలది:
తలచి నంత సుతుని నలుగుతో జేసెను
తలను ద్రుంచి వేసె తండ్రి , కడకు
కరి ముఖమ్ము బెట్టి గణనాథు జేయ కొ
మరుని ముద్దులాడె గిరికుమారి.

Wednesday, 15 October 2014

తులసి....వర్ణన.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తులసి....వర్ణన. 


కందము:
తులదూచ లేము విలువను
తులదూచగ గలిగె హరిని తులసీ దళమే
ఇల తులసియున్న యిల్లే
నిలయము సిరి, హరికి నరుడ నిజమే కాదా !

Tuesday, 14 October 2014

తమన్నా - కాజల్ - సమంతా - త్రిష... దత్తపది కి భారతార్థంలో పద్యం.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - తమన్నా - కాజల్ - సమంతా - త్రిష... దత్తపది
 
 
భీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో...



తేటగీతి:
తాతమన్నన బొందిన ధన్యుడీవు
దోసమంతగ నెంచడు - కాశి రాజ
పుత్రి షండునిగా మారి పుట్టిముంచె
గంగ రప్పించు త్రాగుటకా జలమ్ము.

Monday, 13 October 2014

నిఘంటువు....వర్ణన.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నిఘంటువు....వర్ణన.

తేటగీతి:
కోరినంతనె యేదైన చేరి చూపు
నడిగినంతనె ' యర్థమ్ము'  నందజేయు
ఇంద్రజాలికుడాకాదు నిదియ జూడ
కర్ణుడస్సలు కాదు నిఘంటు విదియె.

Sunday, 12 October 2014

ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్


కందము:
వాఙ్మయములు చదివిన ' హరి
సఙ్మా' యను వాడొకండు సరసున దిగి తా
ప్రాఙ్ముఖ వందన మిడ తన
ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్. 

Saturday, 11 October 2014

నిత్యకళ్యాణము - పచ్చతోరణము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - నిత్యకళ్యాణము - పచ్చతోరణము .... వర్ణన.

ఆటవెలది:
నిజముగా జరుగును నిత్య కళ్యాణమ్ము
పచ్చ తోరణమ్ము వాడదెపుడు
భక్త జనుల కొరకు భగవంతుడే నిద్ర
వీడు తిరుమల గన వేడుకగును.

Friday, 10 October 2014

హర నీవే శరణమ్ము నా కనియె బ్రహ్లాదుండు సద్భక్తుడై

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.






సమస్య - హర నీవే శరణమ్ము నా కనియె బ్రహ్లాదుండు సద్భక్తుడై


మత్తేభము:
హరి నీవే "కనలేవు" లేవనుచు నన్నయ్యయ్యొ దూషించునే
స్మరణమ్మున్ మది సేయనీడు, గనుమా మాతండ్రి నే గావుమా
సరిగా నిప్పుడె కంబమందు నిలుమా, సాదృశ్యమై శ్రీ మనో
హర! నీవే శరణమ్ము నా కనియె బ్రహ్లాదుండు సద్భక్తుడై
.

Thursday, 9 October 2014

గగన కుసుమమ్ము విష్ణువున్ గనిరి నరులు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గగన కుసుమము ... వర్ణన.




 తేటగీతి:
గగన కుసుమంబు విష్ణువున్  గనగ నరులు
గగన వర్ణంపు కృష్ణునే కనగ నాడు
దేవకీ దేవి, మెచ్చెగా దేవతలును
గగన కుసుమమ్ము విష్ణువున్ గనిరి  నరులు. 

Wednesday, 8 October 2014

కుత్సితులె చేయుదురు వసంతోత్సవమ్ము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుత్సితులె చేయుదురు వసంతోత్సవమ్ము.


తేటగీతి:
ఎవరు గుణవంతు చెరచునో యెరుక గలదె ?
అచ్చ తెనుగేది యొనరింతు రనగ చెపుమ ?
హోలి పండుగ కొక పేరు నొప్పు నేది ?
కుత్సితులె - చేయుదురు - వసంతోత్సవమ్ము.

Tuesday, 7 October 2014

కలహములే సకలసౌఖ్య కారణము లగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కలహములే సకలసౌఖ్య కారణము లగున్. 


కందము:
పలువురు దనుజుల గూల్చగ
నలువకు కొమరుండగు మన నారద మునియే
యిల బాగు కొరకు బెట్టిన
కలహములే సకలసౌఖ్య కారణము లగున్.

Monday, 6 October 2014

రంగులు " ఘోరంగు" లైన రంగు పడుద్దీ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కామదహనము... వర్ణన.        

కందము:
రంగుల జల్లుచును పలు తె
రంగులనీ పండుగ నలరారుదు రంతా
రంగులు మంచివి వాడుడు
రంగులు  "ఘోరంగు" లైన  ' రంగు పడుద్దీ ' !


ఘోరంగులు = ఘోరమైన , కల్తీ రంగులు ( సరదాగా పెట్టిన పదం )

Sunday, 5 October 2014

అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా


కందము:
అఆల బడికి పోరా ?
అఆలను నేర్వబోర అఆ ' బోరా ' ?
అఆల తోనె పోరా ?
అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా !

Saturday, 4 October 2014

చూస్తే యంగము లొకటే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - హస్తిమశకాంతరము ... వర్ణన. 


కందము:
హస్తిని జూచుచు మశకము
నాస్తియె తేడాలనియెను నాకూ కరికిన్
చూస్తే యంగము లొకటే
జాస్తియె మరి రెక్కలేమొ సైసై నాకే.

Friday, 3 October 2014

జపింతు శాంకరీ - జయమ్ములనీవే


వీక్షకులందరికీ " విజయదశమి " శుభాకాంక్షలు.
భవానీ అనుగ్రహ ప్రాప్తిరస్తు.



















విజయ వృత్తము:

జగాలవన్నియున్ - జనించెను నీకే
జగంబులన్నియున్ - జపించును నిన్నే
జపింతు శాంకరీ - జయమ్ములనీవే
వరమ్ము లీయగా – పరాత్పరి  నీవే

భవాని వృత్తము:

మాటగన నర్థమే - మధురగతిని - మసలినటుల
ఘాటగు సు వాసనల్ - కలసి విరుల - కదలినటుల
తేటగను పండ్లలో - తెలియ రుచులు - దిగిన యటుల
వాటముగ దుర్గయే - భవుని గలసి - పరగు నిటుల


సాగరతనయ వృత్తము: 
మనమున్ దలుతున్ మాహేశ్వరీ మా - మానస మునను దీపింప రావా
అనయమ్ము హృదిన్ స్తోత్రింతు మాతా - యార్తిని మలప దీవింప రావా
వినయమ్ముననే పూజింతు దేవీ - వేధించు నఘము ఖండించ రావా
ఘన పూజలతో సేవింతు తల్లీ - కామిత సుధల నందీయ రావా

Thursday, 2 October 2014

చిలుకు పలుకే మరపించు చిలుక పలుకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



 సమస్య - చిలుక పలుకులు ... వర్ణన.


తేటగీతి:
గోరు ముద్దలనమ్మయే కోరి పెట్టి
మొదటి పలుకులు పలికించు మురిపె మలర
ముద్దు బిడ్డలు మూతినే ముడుచు కొనుచు
చిలుకు పలుకే మరపించు చిలుక పలుకు

Wednesday, 1 October 2014

సమ్మెలు కావవి తలపై...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23  - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సమ్మెలు, జనజీవనము ...వర్ణన. 

కందము:
' అమ్మా' యన ప్రభుత వినదు
' హమ్మా' యని యడుగు సమ్మె లలవాటాయెన్
సమ్మెలు కావవి తలపై
సమ్మెట పోట్లేను సకల జనులకు చూడన్.