వీక్షకులందరికీ " విజయదశమి " శుభాకాంక్షలు.
భవానీ అనుగ్రహ ప్రాప్తిరస్తు.
విజయ వృత్తము:
జగాలవన్నియున్ - జనించెను నీకే
జగంబులన్నియున్ - జపించును నిన్నే
జపింతు శాంకరీ - జయమ్ములనీవే
వరమ్ము లీయగా – పరాత్పరి నీవే
భవాని వృత్తము:
మాటగన నర్థమే - మధురగతిని - మసలినటుల
ఘాటగు సు వాసనల్ - కలసి విరుల - కదలినటుల
తేటగను పండ్లలో - తెలియ రుచులు - దిగిన యటుల
వాటముగ దుర్గయే - భవుని గలసి - పరగు నిటుల
సాగరతనయ వృత్తము:
మనమున్ దలుతున్ మాహేశ్వరీ మా - మానస మునను దీపింప రావా
అనయమ్ము హృదిన్ స్తోత్రింతు మాతా - యార్తిని మలప దీవింప రావా
వినయమ్ముననే పూజింతు దేవీ - వేధించు నఘము ఖండించ రావా
ఘన పూజలతో సేవింతు తల్లీ - కామిత సుధల నందీయ రావా
No comments:
Post a Comment