తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 30 September 2014

పిఱికివాఁడు గెల్చె వీరతతిని.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22  - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పిఱికివాఁడు గెల్చె వీరతతిని.


ఆటవెలది:
వీర "తొట్టిగ్యాంగు" విర్రవీగి పొలము
నాక్రమించ గినిసి నాసరయ్య
కోర్టునందు వేయ కొన్ని నాళ్ళకు జూడ
పిఱికివాఁడు గెల్చె వీరతతిని.

Monday, 29 September 2014

లెస్స బొంద డొకటి ' లెస్సే' మరొక్కటి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22  - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రెంటికి చెడ్డ రేవడు .... వర్ణన



ఆటవెలది:
మాతృభాషనేమొ మరికొంత నేర్వడు
పరుల భాష నేర్చు పైన పైన
లెస్స బొంద డొకటి  ' లెస్సే' మరొక్కటి
రేవడాయె జూడ రెంట జెడుచు
.

Sunday, 28 September 2014

సూనుని దీవనలు మనకు శుభకరము లగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సూనుని దీవనలు మనకు శుభకరము లగున్. 


కందము:
నానుచు  నామంబంజన
సూనుని మదిలోన,  దివ్య శక్తినొసంగెన్
నేనున్ బలికెద, దశరథ
సూనుని దీవనలు మనకు శుభకరము లగున్.

Saturday, 27 September 2014

పలుకులమ్మ వంట బ్రహ్మ పంచె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఆంధ్రభారతి ... వర్ణన.


ఆటవెలది:
పలుకులమ్మ వంట బ్రహ్మ తానే బెట్టి
పంపె నరుల కంత పంచి పంచి
పాయసమ్ము దొరకె పరగ నాంధ్రులకేను
పరుల కింతయేని దొరుకలేదు.

కందము:
అందము చందము గలవే
అందరి ప్రియ భాషలెల్ల నాహా చూడన్
అందపు చందపు  పద్యము 
నందించెను వాణి చూడ నాంధ్రులకేగా
.

Friday, 26 September 2014

అడవిగాచిన వెన్నెల ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అడవిగాచిన వెన్నెల ... వర్ణన.


నేటి కాలములో ఫట్టణాలలో కాచిన వెన్నెలే "అడవి గాచిన వెన్నెల"...
నిజానికి పట్టణాలలో కంటే అడవిలో కాచిన వెన్నెలే యెక్కువ ఉపయోగమని నా అభిప్రాయం.

కందము:
ఆడవిని గాచిన వెన్నెల
అడగకనే మూలికలకు నతి శక్తినిడున్
ఆడుగిడ వెన్నెల పురినె
వ్వడు పట్టించు కొనడు " బల్బుల " ద్యుతి లో.

Thursday, 25 September 2014

వెఱ్ఱి వారలు సదసద్వివేక నిధులు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వెఱ్ఱి వారలు సదసద్వివేక నిధులు

తేటగీతి:
ధూర్తు లైనట్టి వారలు తూలనాడ
నోర్పు తోడను సైచి తామూరుకుంద్రు
చేతగానట్టి వారని చేరియనుట
వెఱ్ఱి, వారలు సదసద్వివేక నిధులు.

Wednesday, 24 September 2014

గతజల సేతుబంధనము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - గతజల సేతుబంధనము ..... వర్ణన.

చంపకమాల:
హితములు చెప్పు పెద్దలను హీనముగా గని సేతునెప్డు నా
మతమది నాదె యంచు పలు మారులు తప్పులు జేసి పిమ్మటన్
హతవిధి పట్టుకోగ మరి యాకులు చేతను, జూడ నిట్టిదే
గతజల సేతుబంధనము, కాదది మంచిది మానవాళికిన్.

Tuesday, 23 September 2014

మృత్పిండము స్వర్ణమగుచు మేలొనగూర్చున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మృత్పిండము స్వర్ణమగుచు మేలొనగూర్చున్.

కందము:
మృత్పిండము రైతులకే
మృత్పిండము కుమ్మరులకు, మేదిని "ప్లాట్లే "
సత్పథము నమ్ము వారికి
మృత్పిండము స్వర్ణమగుచు మేలొనగూర్చున్.

Monday, 22 September 2014

పట్టి చోరులుజేరి కొట్టి పట్టుక పోరు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - విద్యాధనము .... వర్ణన. 


సీసము:
    పంచు
తానె గురువు మించు సంతసమున
    తరుగు నంచు మదిని తలచ బోడు
    మందసమ్ములు దాచ వందలక్కర లేదు
    మందహాసము నిండు నొంద వృద్ధి
    పట్టి చోరులుజేరి కొట్టి పట్టుక పోరు
    ప్రభుత బాధ నిడదు పన్ను లడిగి
    పరుల దేశమునైన ప్రక్క గ్రామమునైన
    నొక్క రీతిగ మెప్పు నొంద గలము

ఆటవెలది:
    ధనము చే
వచ్చు, తలలో  చదువున్న
    విద్య మించు ధనము విశ్వమందు
    లేదు సుజను లార, లేత బాలలనెప్డు
    పనిని చేర్చవలదు, బడియె మేలు.

Sunday, 21 September 2014

పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సుధీ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సుధీ
ఉత్సాహము: 
మురికి జేయు వీధులన్ని ముందు బాట "సారులే "
తిరుగు తాము కుంచె బట్టి తీర్చి దిద్ద " రోడ్డులే "
సరిగ జేయ వెన్క వచ్చి "శహరు" నందు చూడ "స్వీ
పరుల " సేవలే యొసంగు భవ్య యోగముల్ సుధీ. 

Saturday, 20 September 2014

సుత వాహను డాజి గూల్చె సురవైరి తతిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సుత వాహను డాజి గూల్చె సురవైరి తతిన్ 

కందము:
క్షితి పలు వెతలను బెట్టెడు
దితిసుతులను గూల్చుమనుచు దేవతలడుగన్
ధృతి నిడి వారికి వినతా
సుత వాహను డాజి గూల్చె సురవైరి తతిన్

Friday, 19 September 2014

మృగమును సేవించు నెడల మేలగు బ్రజకున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.





సమస్య - మృగమును సేవించు నెడల మేలగు బ్రజకున్
 

కందము:
మృగ నర రూపున హరియే
జగమందున జయములీయ  జనియించెనుగా
వగ దొలగ నృసింహుని, నర      
మృగమును సేవించు నెడల మేలగు బ్రజకున్

Thursday, 18 September 2014

వైరులు వైరస్సు వలల వర్తిలు ' నెట్టే.'

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అంర్జాలము ..... వర్ణన.


కందము:
చాలముదంబు నిడును విడ
జాలము వీడిన నిముసము జరుగదు యంత
ర్జాలము గన నిది ఇంద్రుని
జాలము వలె దోచు, దోచు జనుల మనములన్.

కందము:
వేరుగ నుండక ఘన సాఫ్ట్
వేరును ' వేరు ' గను హార్డు వేరుయు కలవన్
వైరుల మరి వైర్లెస్సుల
'వైరులు' వైరస్సు వలల వర్తిలు ' నెట్టే.' 

Wednesday, 17 September 2014

బుద్ధి గలుఁగు జనుల రోయఁదగును.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.






సమస్య - బుద్ధి గలుఁగు జనుల రోయఁదగును. 


ఆటవెలది:
పరుల యెదుగు దలను పరికింపగా బొంది  
కడుపు మంట మరియు కళ్ళ మంట
నాశనమ్ము గోరు నాలిముచ్చులును దు
ర్బుద్ధి గలుఁగు జనుల రోయఁదగును.

Tuesday, 16 September 2014

గోధూళి ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - గోధూళి ... వర్ణన


కందము:
గోవుల దేహమునందున
దేవతలే నిలచియుంద్రు దివ్యములేగా
గోవుల మూత్రము పేడయు
గోవుల క్షీరమ్ము నటులె గోధూళియుగా.

Monday, 15 September 2014

అనిరుద్ధుఁడు నెమలి నెక్కి యంబుధి దాఁటెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అనిరుద్ధుఁడు నెమలి నెక్కి యంబుధి దాఁటెన్.


కందము:
విన కృష్ణుని మనుమడెవడు ?
కన నెయ్యది యెక్కి తిరుగు గంగా సుతుడే ?
ఘన మారుతేమి దాటెను ?
అనిరుద్ధుఁడు, నెమలి నెక్కి, యంబుధి దాఁటెన్.

Sunday, 14 September 2014

ఓడిపోవుట వీరున కొక వరంబు.

 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఓడిపోవుట వీరున కొక వరంబు.


తేటగీతి:
తనదు విద్యలు సుతునకు ధార వోసి
ప్రజ్ఞ జూచుట కొకనాడు పందెమొడ్డి
జూడ తనయుండు గెలిచె,  నాజోదు చేత
నోడిపోవుట వీరున కొక వరంబు.

Saturday, 13 September 2014

శివరాత్రి జాగరణ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


సమస్య - శివరాత్రి జాగరణ ... వర్ణన


కందము:
గరళము మ్రింగిన దేవుని
స్మరణము శివరాత్రి సలిపి సన్మతి తో జా
గరణము జేసిన వారిని
కరుణను తా బ్రోచు గాదె గంగా ధరుడే.

Friday, 12 September 2014

అర్థనారీశ్వరుడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 

వర్ణన చిత్రం - అర్థనారీశ్వరుడు. 


 



















కందము:
నగకన్య సగము దేహము
నగమే నీ యిల్లు, మోయు నందియె ఘన ప
న్నగములు భూషణములు చిరు
నగవుల శివ నిన్ను గొల్తు నమకము తోడన్.

Thursday, 11 September 2014

సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.                                


సమస్య - సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమిన్.

కందము:
మీదట జిలుకగ సంద్రము
గాదా చంద్రుండు, కలిమి కాంతయు బుట్టెన్
మోదంబు తోడ జాబిలి
సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమిన్.

Wednesday, 10 September 2014

వైద్యో నారాయణో హరిః ... వర్ణన.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.                                 


సమస్య - వైద్యో నారాయణో హరిః  ... వర్ణన.

కందము:
వైద్యుడు మందుల నిడ నై
వేద్యము ' నారాయణ ' యని వెన్నుని కిడుచున్
ఖాద్య ప్రసాదమ
ని తిన
నాద్యంతము రోగ మపుడు ' హరి హరి ' యనుగా.

Tuesday, 9 September 2014

బుద్ధి నిడని గురుడె పూజ్యు డగును

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బుద్ధి నిడని గురుడె పూజ్యు డగును


ఆటవెలది:
తల్లి దండ్రి పిదప పిల్లల కే నాడు
మార్గ దర్శి యగుచు  మంచి దెలిపి
సాధనమ్మునందు సాయమ్ముతో, వక్ర
బుద్ధి నిడని గురుడె పూజ్యు డగును

Monday, 8 September 2014

మానవత్వపు విలువలు ... వర్ణన.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మానవత్వపు విలువలు ... వర్ణన. 

కందము:
వలువల వంటివి వొంటికి
విలువలు, మరి వాని వదలి వీధుల దిరిగే
పలు మానవ మృగములకే
పలు రాలగ గొట్ట మనకు పాపము గలదా !

Saturday, 6 September 2014

ధనములు కలవాడె నలగు దారిద్ర్యమునన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ధనములు కలవాడె నలగు దారిద్ర్యమునన్


కందము:
వినకను పెద్దల మాటలు
పనులేవియు చేయబోక బద్ధక మతియై
ఘన దుష్ట మిత్ర తతి బం
ధనములు కలవాడె నలగు దారిద్ర్యమునన్

Friday, 5 September 2014

దశమగ్రహము .. వర్ణన

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య  - దశమగ్రహము .. వర్ణన


కందము:
జపములు లక్షల తోనే
ఉపశాంతినను గ్రహించ హో మరి గ్రహముల్
ఉపచారము తో లక్షలు
తపనతొ గ్రహియించి  వినడు దశమగ్రహమే !

(క్షమించాలి..కొందరికి మిన ' హాయింపు '.)

Thursday, 4 September 2014

స్తనములు గల పూరుషుండు స్తవనీయుడగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - స్తనములు గల పూరుషుండు స్తవనీయుడగున్.

కందము:
వనజభవు రాణి యొడిలో
చిన పాపగ చేర నమ్మ చేత నిమురుచున్
తన యాకటి కిచ్చిన ఘన
స్తనములు గల పూరుషుండు స్తవనీయుడగున్.

Wednesday, 3 September 2014

శ్రీకృష్ణుని మేనమామ సీతాపతియే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శ్రీకృష్ణుని మేనమామ సీతాపతియే.


కందము:
శ్రీకృష్ణ మాకు చుట్టము
మా కృప పిన్నమ్మ కొడుకు మా యూరేలే
తా కృతి నిచ్చెను వాడికి
శ్రీకృష్ణుని మేనమామ సీతాపతియే.  

Tuesday, 2 September 2014

తన బాణము కలత వెట్టె త్ర్యంబకు మదిలో.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తన బాణము కలత వెట్టె త్ర్యంబకు మదిలో.


కందము:
విన మన్మథు మసి జేసెను
కనె పార్వతి కనులముందు, కామేశ్వరియే
కను చూపుల విడ తూపు
ను 
తన బాణము కలత వెట్టె త్ర్యంబకు మదిలో.

Monday, 1 September 2014

మనసు భారమును బాపు ' బాపు '

" చిత్ర " దర్శకులు శ్రీ బాపు గారికి నివాళి.
కందము:
చిత్రముగ  నుండు రాతలు
చిత్రముగా నుండు
బాపు చిత్రపు కార్టూన్
చిత్రము రేఖా చిత్రము 
చిత్రమునే దీయువిధము చిత్రంబటలే !

కందము:
బాపూ గీతలు తీతలు
బాపునుగా మనసులోని భారంబంతన్
మాపులు లేనివి, రేపులు
మాపులు మన తెలుగువారి మనసున నిలుచున్. 


ఆటవెలది: 
భరత జాతి పుడమి బ్రతికుండు  వరకును
బాపు గాంధి నిలచు బాగుగాను
తెలుగు వ్రాత గీత దీపించు వరకును
' బాపు'  వెలుగు, మనల భాగ్యమదియె.