తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 31 March 2014

ఉగాది పచ్చడి




















సీసము :

చింతపండు తడిపి కొంత పులుసు జేసి
క్రొత్త బెల్లము తోడు కొసరి వేసి    
వగరు మామిడి పిందె  వ్రక్కలనే జేర్చి 
మిరియాల పొడికొంత మేర గలిపి
గండ్రుప్పు నెక్కువ కాకుండగా రాల్పి
వేపపూతను దెచ్చి వేసి త్రిప్ప  
పచ్చడగును గాద  పండుగేయగు గాద  
నారు రుచుల లేహ్య మారగింప


ఆటవెలది:  

జీవితమ్మునందు చేరు సంఘటనలు
తీపి చేదు పులుపు తీరుగాను
కారముప్పు వగరు కలబోతలని దల్చ  
పండుగగును గాదె ప్రతి దినమ్ము.

జయహే ! హేజయ !

జయ నామ నూతన తెలుగు వత్సర శుభాకాంక్షలు


 
















కందము:
జయ ! రా !  స్వాగతమమ్మా
జయ రావము బల్కుచుండె సరి కోయిలలే
జయహే ! హేజయ ! జయ ! జయ !    
జయమగు నిన్ దల్చు వారి సత్కార్యములే. 

Sunday, 30 March 2014

ఇది ' గో ' మాత

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - ఇది ' గో ' మాత  

































కందము:
గోమాతను కొలవండిది
గో మాతకు సమము సుండి కువలయమందున్
క్షేమంబు పాడి పంటకు
ప్రేమారగ వాటి సంతు పెరుగగ చూడన్



Friday, 28 March 2014

కోతిని పట్టి కట్టుమని కోరెను శంకరునిన్ వినమ్రుడై

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కోతిని పట్టి కట్టుమని కోరెను శంకరునిన్ వినమ్రుడై


ఉత్పలమాల:
కోతియె వచ్చి లంక కిట గూల్చెను చెట్లను వీరులన్ కనన్  
కోతియె శంకరుండనుచు కొంచెము తట్టగ లేదు భృత్యులన్
కోతిని పట్టి కట్టుమని కోరెను, శంకరునిన్ వినమ్రుడై
రీతిగ గొల్చు రావణుడు రెచ్చుచు కాలము దాపురించగా.

Wednesday, 26 March 2014

పరువు నిలిపె రణము వీడి పారి పోయి యయ్యెడన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పరువు నిలిపె రణము వీడి పారి పోయి యయ్యెడన్

ఉత్సాహము:
సరగున నిక నిలుపు తేరు చావు వచ్చె నంచు ను
త్తరుడు పలికె పగిలె గుండె దైర్యమింత లేక ను
త్తరము నిడక విజయు జూచి, తల్చె తండ్రి యిట్లనున్
"పరువు నిలిపె రణము వీడి పారి పోయి యయ్యెడన్" 

Tuesday, 25 March 2014

శకుని "పాచిక" పారింది.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - శకుని "పాచిక" పారింది.


 















కందము:
పాచిక లాడగ నప్పుడు
పాచిక పారెను శకునిది పాండవు లెల్లన్
లేచి కదల వలెనడవికి
పూచిక పుల్లైన గొనక పుణ్యస్త్రీ తో.

Monday, 24 March 2014

కాకి నృత్యమాడె కేకి వొగడె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కాకి నృత్యమాడె కేకి వొగడె.


ఆటవెలది:
అడవిని మృగరాజు హాయిగా కొలువును
దీర్చి పాట పాడె తీయగాను
నక్క డోలు కొట్టె కుక్క సన్నాయూదె
కాకి నృత్యమాడె కేకి వొగడె.

Sunday, 23 March 2014

బలే జిలేబి ముందు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - బలే జిలేబి ముందు


 
















కందము:
బంగారు రంగు, చూడ గ
రంగా నుండగను వచ్చు ' రస ' మాధురితో
సింగారించిన కన్నె వ
రంగా
నబడి జిలేబి రమ్మని పిలిచెన్.

Saturday, 22 March 2014

కమ్మని వరమొసఁగ మిగుల కళవళమొందెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కమ్మని వరమొసఁగ మిగుల కళవళమొందెన్.


కందము:
ఇమ్మని మోక్షము నడుగగ
నమ్మహదేవుని యొకండు యార్తిని  గొల్వన్ 
ఇమ్మహిలో రాజువుగా
కమ్మని వరమొసఁగ మిగుల కళవళమొందెన్.

Friday, 21 March 2014

అ ఆ ఇ ఈ ముగ్గు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - అ ఆ ఇ ఈ ముగ్గు. 


 





















కందము: 
బాపూ గీసిన మ్రుగ్గిది
ఆ పుణ్య పురుషు డమర్చి 'అ ఆ ఇ ఈ'
ఓపికగా కలిపెనుగా
దీపించును తెనుగు తేట తేనియ మ్రుగ్గై.

Thursday, 20 March 2014

యముఁ గన పెన్నిధులు పెక్కు లలరుచు నుండున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - యముఁ గన పెన్నిధులు పెక్కు లలరుచు నుండున్

కందము:
క్షమలో గనగా వేంకట
రమణుడు కొలువైన మలయ రాజము నందున్
విమల యశుడు వెలసిన నిల
యముఁ గన పెన్నిధులు పెక్కు లలరుచు నుండున్

Wednesday, 19 March 2014

స్వర్గారోహణము


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - స్వర్గారోహణము





















కందము:
ఒక్కొక్కరు పాండవులే
త్రొక్కగ స్వర్గంపు త్రోవ తొలగెను ప్రాణం
బొక్కడు ధర్మజుడు మిగిలె
కుక్కొక్కటియును, తెలిసి కొన కాలుండే.

Tuesday, 18 March 2014

దిన ఫలముల వలన మనకు దృప్తి కలుగునే?

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య -  దిన ఫలముల వలన మనకు దృప్తి కలుగునే?


కందము:
జనులను మోసము జేయుచు
ఘన నాయకు లేమొ పెంచు గంపెడు కాంక్షల్ 
కన నరకొరగా మనకం
దిన ఫలముల వలన మనకు దృప్తి కలుగునే?

Monday, 17 March 2014

అమెరికాలో "పెసరట్టు"

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - అమెరికాలో "పెసరట్టు" 




















ఆటవెలది:
తెలుగు భాష నిటుల వెలుగు "నట్టు"ల జేసి
పరుల దేశ మందు పాటు బడెడి
తెలుగు వారి జూచి తెలివి దెచ్చుకొనుచు
తెలుగు వెలుగ నిమ్ము తెనుగు నేల.

Sunday, 16 March 2014

శివ శివ యంచు విష్ణు పద సీమను జేరెను భక్తు డొప్పుగా.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - శివ శివ యంచు విష్ణు పద సీమను జేరెను భక్తు డొప్పుగా.

చంపకమాల:
భవహరు డైన శ్రీహరిని పావన మూర్తిని తాను నమ్ముచున్
స్తవముల జేయుచున్ హరిని తన్మయ మందుచు మిత్తి పిల్వగా
శివహరినాథ పేరుగల చిన్న కుమారుని చేరి పిల్చుచున్
శివ శివ యంచు, విష్ణు పద సీమను జేరెను భక్తు డొప్పుగా.

Saturday, 15 March 2014

అల్ల ' రి ' కన్నయ్య

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - అల్ల ' రి ' కన్నయ్య

 
















కందము:
పిల్లన గ్రోవిని యూదే
అల్లరి కన్నయ్య చేతి 'నల్లా ' పట్టెన్
చెల్లని వారలు చూడుడు
అల్లన మత సామరస్య మనగా నిదియే.

Friday, 14 March 2014

తమ్ము గోరి మరుడు సాహసమ్ము జేసె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తమ్ము గోరి మరుడు సాహసమ్ము జేసె 

తేటగీతి:
హరుని గిరిరాట్సుతా మనోహరుని జేరి
మరులను మదిలోన నిలుపు మనగ సురలు
మనగ లేనని తెలిసియు జనె జగద్ధి
తమ్ము గోరి మరుడు సాహసమ్ము జేసె

Thursday, 13 March 2014

భూ ' కైలాసం '

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - భూ ' కైలాసం '


 













కందము:
ఆకైలాసము జూడగ
నాకాశమ్మున వెలుంగు, నదియే దిగెనా
మాకై ! భువిపై స్వర్గపు
మ్రాకై ! హిమమున నిలబడి మహిమను జూపన్ !

Wednesday, 12 March 2014

మచ్చా! అది కాదు కాదు మణిభూషణమే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మచ్చా! అది కాదు కాదు మణిభూషణమే.



కందము:
స్వేచ్ఛా వాయువు లే మన
కిచ్చుటకై చెఱను బడుట నిడుముల బడుటల్
మెచ్చని విషయమ ? చెఱయన
మచ్చా! అది కాదు కాదు మణిభూషణమే.

Tuesday, 11 March 2014

అర్థనారీశ్వరం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - అర్థనారీశ్వరం 

 





















కందము:
మగనా యాడన చూడగ
సగసగమై నిలచినాడు శంభుడు నిజమే
జగమెల్ల తామె నిండుచు
సగములు గలసొక్కటైన సాగును సరిగా.

Monday, 10 March 2014

బలిపాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బలిపాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్.

కందము:
తెలియగ పాడ్యమి నేడే
యిల వత్సరమే  మొదలగు నిదిగో వినుడీ !
వలదనకుండిద్దము మరి
బలి, పాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్.

Sunday, 9 March 2014

' అన్న ' పాత్ర

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - ' అన్న '   పాత్ర


 


















కందము:
అన్నా ! వచ్చే నతిథులె
యన్నము పెట్టంగ లేదు అక్షయ పాత్రన్
అన్నది ద్రౌపది, కృష్ణుం
డన్నియు  నే జూతుననుచు నభయమ్మిచ్చెన్. 

Saturday, 8 March 2014

మమ్మీ సంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మమ్మీసంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా


శార్దూలము:
మమ్మీభారత మందు బుట్టునటులన్ మాయమ్మ భాగ్యంబిడెన్
మమ్మీ సంస్కృతి డమ్మి సంస్కృతులకున్ మాయంగ బోదిద్ది, హే
మమ్మీసంస్కృతి భోగ బంధములకున్ మార్గమ్ము తెంపేను, సే
మమ్మీసంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా!

Friday, 7 March 2014

నరకుని నరకిన నరహరి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - నరకుని నరకిన నరహరి

 
 


















కందము:
గరుడారూఢుడు హరియే
నరకాసురు జంపె నాడు నాతియె జతగా
ధరలో దానికి గురుతుగ
నరులందరు వెలుగు నింపి నాటిని తలచున్.

Thursday, 6 March 2014

కారాగారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కారాగారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్.

కందము:
ఆ రామదాసు చూడగ
శ్రీ రాముని నమ్మి పడెను చెరసాలటుపై
చేరెను రాముని ధామము
కారాగారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్.

Wednesday, 5 March 2014

తిరు నామము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - తిరు నామము

 













 
కందము:
నామము శంఖము చక్రము
నామమునే చెప్పకుండ నామము తెలుపున్
నీమముతో గొల్చినచో
క్షేమంబుల గూర్చు, వాడు శ్రీవాసుండే.

Tuesday, 4 March 2014

తనయునకును దండ్రి కొకతె దారగ నయ్యెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తనయునకును దండ్రి కొకతె దారగ నయ్యెన్. 

కందము:
తన నటనను చూపించగ
జనులందరు మెచ్చు నట్లు శహభాషనగా
కన నొక చిత్రము నందున
తనయునకును దండ్రి కొకతె దారగ నయ్యెన్.

Monday, 3 March 2014

సిగరెట్టులఁ గాల్చఁదగును సేమము కొఱకున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సిగరెట్టులఁ గాల్చఁదగును సేమము కొఱకున్.

కందము: 
సిగ పట్టులు సిగరెట్టులు
తెగ మనిషిని పాడు చేయు దేహము చెడురా
వెగటు పడి పోసి గుట్టగ
సిగరెట్టులఁ గాల్చఁదగును సేమము కొఱకున్.

Sunday, 2 March 2014

ఓరుగంటి భద్రకాళి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - ఓరుగంటి భద్రకాళి.

 





















తేటగీతి:
కరుణ జిలికెడి మోముతో కమల నయన
భద్ర మిచ్చెద నంచు తా భక్తులకును
భద్ర కాళిగ నిలచెగా, భక్తి మీర
నోరుగంటికి రండయా కోరి కోరి.  

Saturday, 1 March 2014

జగ్గు, మగ్గు, పెగ్గు, సిగ్గు

మిత్రులు ఇచ్చిన సమస్యకు నాపూరణ


దత్తపది: జగ్గు, మగ్గు, పెగ్గు, సిగ్గు - ఏదేని విషయముపై స్వేచ్ఛాఛందము.   

కందము:
పెగ్గొక్కటి వేసిన శ్రీ 
జగ్గారావనెడి వాడు సతికడకేగన్  
సిగ్గే లేదా నీకని   
మగ్గెడు త్రాగింప  నోట మజ్జిగ వోసెన్.