తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 31 March 2013

పాడు లోకము రాముని ప్రస్తుతించు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పాడు లోకము రాముని ప్రస్తుతించు

తేటగీతి:
రామ భద్రుడు సుగుణాల రాశి  గాన
సూర్య చంద్రులు గిరులు వసుధను ఝరులు
నిలచి యున్నంత కాలమ్ము నిత్య మాడి
పాడు, లోకము రాముని ప్రస్తుతించు

Saturday, 30 March 2013

అర్ధనారీశ్వరుం డయ్యె యాచకుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అర్ధనారీశ్వరుం డయ్యె యాచకుండు.

తేటగీతి:
వేడ్క మీరగ దసరాకు వేషములను
వేసి తిరుగును వీధుల భిక్ష కొరకు
ఆతడానాడు శివునిగా నగుప డగను
అర్ధనారీశ్వరుం డయ్యె యాచకుండు.

Friday, 29 March 2013

భారతంబును బొంకని పలుక దగును.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - భారతంబును బొంకని పలుక దగును.


తేటగీతి: 
తెలుగు సామెత లెన్నగా తేనె లొలుకు
తగిన సమయాన చెప్పగా తప్పు లేదు
రంక ననుచును చూడగా రామ కథను
భారతంబును బొంకని పలుక దగును.

Thursday, 28 March 2013

దివియె భువి పైన గిర గిర తిరుగు చుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - దివియె భువి పైన గిర గిర తిరుగు చుండు.

తేటగీతి:
భూమి పైనున్న మనుజుల పుణ్య మేమొ
నరుల కొన గూర్చు చుండుగా వరము లెన్నొ
స్వర్గ తుల్యము గాదొకో ' శాటి లైటు '
దివియె భువి పైన గిర గిర తిరుగు చుండు.

Wednesday, 27 March 2013

ధార్తరాష్ట్రులు నడచిరి ధర్మ పథము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ధార్తరాష్ట్రులు నడచిరి ధర్మ పథము

తేటగీతి:
ధర్మ సూక్ష్మము తెలియగా ధరణి యంద్రు
ధార్తరాష్ట్రులు నడచి రధర్మ పథము
ధార్తరాష్ట్రుల వారసుల్ తలచు చుంద్రు
ధార్తరాష్ట్రులు నడచిరి ధర్మ పథము

Tuesday, 26 March 2013

రాముడిచ్చెను సీతను రావణునకు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 -03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రాముడిచ్చెను సీతను రావణునకు.

తేటగీతి:
రాముడా యెను గా హరి రమయె సీత
రావణాసురు జంపగా రచన జేసి
తప్పు జేయించి చంపుట యొప్పు గాన
రాముడిచ్చెను సీతను రావణునకు.

Monday, 25 March 2013

హీనునకు నమస్కరింతు నెపుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 -03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - హీనునకు, నమస్కరింతు నెపుడు

ఆటవెలది:
సంపదిచ్చు నడుగ సౌభాగ్య హీనుడు
పరమ శివుని గొల్చి భక్తి తోడ
గుణము నిచ్చు గాదె కోరినచో గుణ
హీనునకు, నమస్కరింతు నెపుడు

Sunday, 24 March 2013

వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 -03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.

కందము:
అనితర సాధ్యం బమ్మయె
కనగలదుగ సృష్టి జేయు కమలజు జనకున్
కనిపింప జేయు హరి గని
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.

Saturday, 23 March 2013

నీతి లేని వారె నేత లైరి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 -03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - నీతి లేని వారె నేత లైరి.

ఆటవెలది:
ఎన్ను కొనెడు వార లెన్నుకో బడు వారు
ఎన్న వలయు నీతి నన్ని విధము
లెన్నొ' కొనగ' వార లన్ని'యమ్మగ' వీరు
నీతి లేని వారె నేత లైరి.

Friday, 22 March 2013

నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 -03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్.

నాట్యము చక్కగా నేర్చుకొని వచ్చిన కొడుకును మెచ్చుకుంటూ భర్త భార్య తో..
కందము:
కడు కోరిక నాట్యముపై
విడువక గురు సేవ జేసి పెద్డై నాడే
కొడుకన వీడే ! చూడవె!
నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్.


కందము:
బుడతడు గంతులు వేసెను
పడి' కొలవరి ' పాటకేమొ పడుతూ లేస్తూ
పడి నవ్వుచు తల్లిటులనె
"నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్"

Thursday, 21 March 2013

కమలబాంధవుఁ డే తేరఁ గలువ విచ్చె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 -03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కమలబాంధవుఁ డే తేరఁ గలువ విచ్చె
తేటగీతి:
స్నాన మైనది వేకువ జాము లోనె
పూజ జేసెద శివునికి పూలు వలయు
పొమ్ము చెరువుకు త్వరపడి  ప్రొద్దు పెరుగు
కమలబాంధవుఁ డే తేర
లువ విచ్చె.

తేటగీతి:
స్నాన మైనది వేకువ జాము లోనె
పూజ జేసెద శివునికి పూలు వలయు
పొమ్ము చెరువుకు త్వరపడి  ప్రొద్దు నెక్కె
కమలబాంధవుఁ డే - తేర  కలువ విచ్చె. 


Wednesday, 20 March 2013

కోఁతి కూఁత కూసెఁ గోడి వలెనె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 -03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కోఁతి కూఁత కూసెఁ గోడి వలెనె

ఆటవెలది:
పల్లెటూరి బామ్మ ప్రతిదిన ముదయమ్ము
కోడి కూత వినగ కునుకు వీడు
మనుమ డర్ద రాత్రి మాయ జేయ ' చిలిపి '
' కోఁతి '- కూఁత కూసెఁ గోడి వలెనె.

Tuesday, 19 March 2013

తల్లి మాట వినుట తప్పు గాదె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - తల్లి మాట వినుట తప్పు గాదె


ఆటవెలది:
తల్లి మాట వినక తండ్రి మాట వినక
చీదరించు కొనుచు ' ఛీ' లు కొట్టి
ప్రక్క నున్నచిన్న బాబాయి మరి పిన
తల్లి మాట వినుట తప్పు గాదె

ఆటవెలది:
తల్లి కల్ప తరువు తల్లి మేటి గురువు
తల్లి మించు వారు ధరణి లేరు
తల్లి మాట వినుట తప్పు గాదె న్నడు
మాట నేర్పి నట్టి మాత మనకు.

Monday, 18 March 2013

పార్థసారథి రణమున పరుగు లిడెను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పార్థసారథి రణమున పరుగు లిడెను
తేటగీతి:
ధర్మ మోరిమి శౌర్యమ్ము దరిని నిల్చి
రయము హయముల బూనిచి రథము నెక్క
పార్థసారథి, రణమున పరుగు లిడెను
మోస మన్యాయము నధర్మ ములును నిజము.

Sunday, 17 March 2013

భార్యను విడిచిన కలుగును భాగ్యములెన్నో.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - భార్యను విడిచిన కలుగును భాగ్యములెన్నో.

మండోదరి రావణుని తో...
కందము:
ఆర్యా! యుద్ధము నందున
నిర్వీర్యము నొంద గలవు నిలువగ లేవా
ఆర్యుని ముందర, రాముని
భార్యను విడిచిన కలుగును భాగ్యములెన్నో.

Saturday, 16 March 2013

మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ నన్ను నమ్ముమా!

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 15-02-2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ నన్ను నమ్ముమా!

ఉత్పలమాల:
మామను మామ మామయని మామను పిల్చుట మానలేను నా
మామకు నేను యన్న నభిమానము మానము మేము పల్కుటన్
మామన మేన మామ మరి మానము పోవునె మాటలాడినన్

మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ నన్ను నమ్ముమా!

Friday, 15 March 2013

దత్త పది:-"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి"...భగవంతునికీ భక్తునికీ అనుసంధానం

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 01-02-2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

దత్త పది:-"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి"...భగవంతునికీ భక్తునికీ అనుసంధానం చేస్తూ ...

కందము:
పక్షీంద్ర వాహ శ్రీహరి
రక్షణ నీయంగ వేగ రారా!మా యీ
కుక్షిని నింపెడు సంపద
భిక్షగ మాకిడిన చాలు వేవేలడుగన్!

Thursday, 14 March 2013

తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై.

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 28-01-2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య -తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై.

చంపకమాల:
మెరుపుల తీగ బోలు నటి మేనున నొంపులు సొంపులన్ని న
ల్గురు దిరు గాడు త్రోవలను గొప్పగ చూపుచు రంగు రంగులన్
పరుగులు దీయు చోదకుల వాహనముల్ బడ జేయునట్టి చి
త్తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై.

Wednesday, 13 March 2013

కాముకునకుండు లోకాన గౌరవంబు.

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 27-01-2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కాముకునకుండు లోకాన గౌరవంబు.

తేటగీతి:
కలిమి లేముల నొకటిగా దలచి పెద్ద
చిన్నవారల ప్రేమించి మిన్న యగుచు
రామ నామము వీడని రమ్య సువ్రత
కాముకునకుండు లోకాన గౌరవంబు.

Tuesday, 12 March 2013

హర్మ్యము లోన సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 25-01-2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - హర్మ్యము లోన సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో 

ఇసుకతో పెద్ద పెద్ద సైకత శిల్పములు చేయుట చూస్తున్నాం. అలాగే మంచు తో గణపతి, కుమారస్వామి ఆడుకుంటూ ముచ్చటగా చేసిన హర్మ్యమును చూడటానికి హరి కైలాసానికి వచ్చినట్లు భావించాను.
ఉత్పలమాల:
హర్మ్యము మంచు కొండ మదనారికి  జూడగ వెండి కొండపై
హర్మ్యము జేసి మంచునట నాడుచునుండగ స్కందు డన్నయున్
హర్మ్యము జూడ వచ్చె నుమ కన్నయ, సంతసమంది శంభుడే
హర్మ్యము లోన సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో.

Monday, 11 March 2013

భామకు మీసముల్ మొలిచె బాపురె ! పూరుషుడూనె గర్భమున్

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 24-01-2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - భామకు మీసముల్ మొలిచె బాపురె ! పూరుషుడూనె గర్భమున్.

ఉత్పలమాల:
ఏమని చెప్పుదింక నిల నిద్దరు దొంగలు దంపతుల్ కనన్
క్షేమమునెంచుచున్ కలసి సీమకు నిద్దరు పారిపోవగా
కోమలి నాతడున్ త్వరగ క్రొత్తగ వేషము మార్చినారహో
భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుడూనె గర్భమున్.

Sunday, 10 March 2013

నగవుల శివ నిన్నుగొల్తు

ఓం నమశ్శివాయ...అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.


కందము:
నగకన్య సగము దేహము
నగమే నీ యిల్లు, మోయు నందియె, ఘన ప
న్నగములు భూషణములు, చిరు
నగవుల శివ నిన్నుగొల్తు నమకము తోడన్. 

Saturday, 9 March 2013

దత్తపది - "రాకు - పోకు - తేకు - మేకు"...భారతార్థంలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

దత్తపది - "రాకు - పోకు - తేకు - మేకు"  పదాలను ఉపయోగించి భారతార్థంలో
దుర్యోధనుడు భీష్ముని తో...
కందము:
మేకులు పాండవు లే మరి
తేకుమ మా మధ్య వారి తేజపు మెప్పుల్
రాకుమ తాతా వారికి
పోకుండగ రాజ్య మీయ బోధలు చేయన్.

Friday, 8 March 2013

కలుషములు బాపు గంగయే గరళమయ్యె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కలుషములు బాపు గంగయే గరళమయ్యె

తేటగీతి:
విషపు నాగులు నగలాయె, పెద్ద చిచ్చు
దలప కన్నాయె నెత్తి పోతలగ మారె
కలుషములఁ బాపు గంగయే, గరళమయ్యె
పండు నేరేడు వలె సతీ వల్లభునకు.

తేటగీతి:
కలుష హరుడను నేనంచు గరళ కంఠ
వట్టి గొప్పలు చెప్పకు వసుధ యందు
కలుషములు బాపు గంగయే గరళమయ్యె
పావనమ్ముగ చేయుమో పార్వతీశ.

Thursday, 7 March 2013

వర్ణము లను వదలివేయ వైభవ మగునే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - వర్ణము లను వదలివేయ వైభవ మగునే?

కందము:
వర్ణము లేబది యారు సు
వర్ణములే నేర్వ నీకు భారమ చెపుమా ?
కర్ణము లో నాలింపుమ
వర్ణము లను వదలివేయ వైభవ మగునే?

Wednesday, 6 March 2013

పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26  -02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్.

ఉత్పలమాల:
బూజులు దుల్పకన్ గడప ముంగిట మ్రుగ్గులు తీర్చ బోకనే
పూజకు శ్రద్ధ లేక మరి బుద్దిగ పీఠము వేయ కుండనే
భూజను లార! ఎప్పుడిక భోజన మంచును జేయ లక్ష్మికిన్
పూజలు, నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్. 

Tuesday, 5 March 2013

మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25  -02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.
తేటగీతి:
చాల విధముల ప్రహ్లాదు చంపు టకును
తండ్రి దలపగ పగ నేమి దలప లేదు
హరిని దలచిన తనకేమి హాని యనుచు
మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.

Monday, 4 March 2013

వైరి పాదములకు వందనములు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 -02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - వైరి పాదములకు వందనములు.

ప్రహ్లాదుని గురువుల వద్ద నేర్చిన చదువును చెప్పమని అసుర వైరివైరి హిరణ్య కశిపుడు అడిగిన సందర్భం.

ఆటవెలది:
గురువు వద్ద గడిన గొప్ప విద్యను నాకు
అప్ప జెప్పు మనుచు ననగ తండ్రి
చెప్ప నెంచి మొదట జేసె నసుర వైరి
వైరి పాదములకు వందనములు.

Sunday, 3 March 2013

పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 -02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి.

తేటగీతి:
కట్టు కొన్నట్టి భర్త నాకట్టు కొనుచు
అన్ని వేళల సహకార మంద జేసి
చెడ్డ త్రోవల బోజూడ చేయి జూపి
పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి.