తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 31 August 2012

దోఁచుకొన్నవాఁడె తోడునీడ.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - దోఁచుకొన్నవాఁడె తోడునీడ. 

ఆటవెలది:
మావ కొడుకు వాడు, మనువాడ లేనిచో
బ్రతుక లేను, నాదు బ్రతుకు వాడు
మనసు నిచ్చి దొంగ, మనసునే దొరలాగ
దోఁచుకొన్నవాఁడె, తోడునీడ.

Thursday, 30 August 2012

భీమసేనుఁడు గాంధారి పెద్దకొడుకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - భీమసేనుఁడు గాంధారి పెద్దకొడుకు

తేటగీతి:
భీమసేనుఁడు, గాంధారి పెద్దకొడుకు
ఇర్వు రొక్కటె బలమున నెంచి జూడ
ధర్మమొక్కరు దలచును, తక్కిడొకరు
గెలుపు నోటమి తేడాలు గలిగె నిటుల.

Wednesday, 29 August 2012

మణి ముట్టగఁ జేయి గాలె మహిళామణికిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మణి ముట్టగఁ జేయి గాలె మహిళామణికిన్.
కందము:
బెణికిన కాలును, మెడపై
వ్రణమును గనుమా, జ్వరమ్ము వచ్చిన దనుచున్
వణుకుచు వచ్చిన బాలా
మణి, ముట్టగఁ జేయి గాలె మహిళామణికిన్.

Tuesday, 28 August 2012

గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె.
తేటగీతి:
గొడ్డు వోలెను ' కని' తల్లి గోప్య ముగను
పారవేయగ నొక నాడు బాట ప్రక్క
ప్రేమ మీరగ ' కని' తెచ్చి పెద్ద జేయ
గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె.

Monday, 27 August 2012

గరళకంఠుండు పయనించె గరుడు నెక్కి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - గరళకంఠుండు పయనించె గరుడు నెక్కి

తేటగీతి:
వేల వేలుగ వివిధ మౌ విగ్రహములు
వేయ హుస్సేను సాగరు, వెలుగులందు
విఘ్న నాధు నిమజ్జన వేడ్క జూడ
నగరి దరికిని, సతి తోడ నంది నెక్కి
గరళకంఠుండు పయనించె, గరుడు నెక్కి
హరియె పయనించె సిరి తోడ, హంస నెక్కి
వాణి తోడను పయనించె బ్రహ్మ కూడ
భాగ్య నగరపు భాగ్యము బాగు బాగు. 

Sunday, 26 August 2012

వనమును ద్వంసంబు జేసి ప్రఖ్యాతి గనెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - వనమును ద్వంసంబు జేసి ప్రఖ్యాతి గనెన్.
కందము:
గనులను త్రవ్వుచు మ్రెక్కుచు
ఘనముగ వెలుగొందు వారి గర్వము ద్రుంచెన్
మన' సీబీయై' ఖల జీ
వనమును ద్వంసంబు జేసి ప్రఖ్యాతి గనెన్.

Saturday, 25 August 2012

గణమే త్రుంచెను శంభుచాపమును శ్రీరాముండు చేఁబూనఁగా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - గణమే త్రుంచెను శంభుచాపమును శ్రీరాముండు చేఁబూనఁగా

మత్తేభము:
ఘన నీలాంబర దేహుడే నిలచియా గాధేయుకున్ మ్రొక్కియున్
విని దిగ్దంతులు సవ్వడిన్ వణుకగా భీతిల్ల గా భూపతి
ర్గణమే, త్రుంచెను శంభుచాపమును శ్రీరాముండు; చేఁబూనఁగా
వనజాక్షిన్ చెయి పట్టి చేరు కొనగా వైభోగ ముప్పొంగెగా !


Friday, 24 August 2012

పండితుని జూచి నవ్వెను పామరుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పండితుని జూచి నవ్వెను పామరుండు.
తేటగీతి:
పడవ మీదను ప్రశ్నించె పడవ వాని
పద్య మన్నది తెలియునె విద్యలనగ
ఈత వచ్చునె మీకని ఎదురడుగుచు
పండితుని జూచి నవ్వెను పామరుండు.

Thursday, 23 August 2012

కపి మనోజుఁ గాంచి కుపితుఁడయ్యె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కపి మనోజుఁ గాంచి కుపితుఁడయ్యె.

సీత కోసం రావణాసుర మందిరంలో వెదుకుచు అచ్చట వివిధ భంగిమల లో నిద్రిస్తున్న అందగత్తెలను చూసిన హనుమ, అలవాటుగా మీదకు రాబోతున్న మనసిజుని తనను రుద్రావతరంగా తెలుసుకొనమని, కామ భావన లేని వాడననీ చెప్పినట్లు నా భావం.
ఆటవెలది:
వివిధ భంగి మలను విశ్రాంతి గా నున్న
పడతుల తతి  జూచె ప్రక్క మీద
దరికి జేర జూడ తానేమొ గనుమని
కపి మనోజుఁ గాంచి కుపితుఁడయ్యె. 

Wednesday, 22 August 2012

రాముఁ డాతఁడు తమ్ముఁడు రావణునకు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రాముఁ డాతఁడు తమ్ముఁడు  రావణునకు.

తేటగీతి:
శివుని విల్లును విరిచిన జెట్టి యెవడు?
తోడు వనమున కేతెంచె, వాడెవండు?
శత్రు వెవ్వరి కాతడు? సరిగ చెపుమ.
రాముఁ డాతఁడు - తమ్ముఁడు - రావణునకు. 

Tuesday, 21 August 2012

అన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్.

కందము:
ఏ న్యాయము మది నెంచక
అన్యాయము జేసి జనుల నందలమెక్కన్
అన్యాయమునకు చూడగ
నన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్.

కందము:
పుణ్యాత్ములె మరి సేయగ
నే న్యా యమునకు వదలక నెప్పుడు న్యాయం
బన్యాయమునకు నెంతయు
నన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్.

కందము:
కన్యల నిఖ్ఖా పేరున
నన్యపు దేశముల వారలాగము చేయున్
కన్యల నీయక వారల
కన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్.

Monday, 20 August 2012

గాలికబురు లిపుడు గణన కెక్కె.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - గాలికబురు లిపుడు గణన కెక్కె.

ఆటవెలది:
గనుల కొల్ల గొట్టు ఘనులరే 'ఈనాడు'
గాలి దెబ్బ కేమొ సోలి పడిరి
'గాలి' కబ్బిన  సిరి గాలికే, యివి కావు
గాలికబురు, లిపుడు గణన కెక్కె.

Sunday, 19 August 2012

కుజనుల సంగతి హితమని గురువు వచించెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కుజనుల సంగతి హితమని గురువు వచించెన్.

కందము:
భజనలు జేసెడి వారిని
నిజముగ నీ హితులె యనగ నేరము రాజా !
ప్రజలకు హితముగ నిను  చెన
కు, జనుల సంగతి హితమని గురువు వచించెన్.

Saturday, 18 August 2012

మోదక మన్న సుంతయును మోదము లేదు గణాధినాధుకున్


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మోదక  మన్న సుంతయును మోదము లేదు గణాధినాధుకున్.

ఉత్పలమాల:
ఖేదము బోవ భక్తులట , కీర్తన జేయుచు మోద మందగా
మోదక మన్న ప్రేతిగల మూషిక వాహను పూజ జేసి య
మ్మో! దరి నేదొ చెర్వులను ముంచగ, ముక్కులు మూయు నట్టి '
ర్మోదక' మన్న సుంతయును మోదము లేదు గణాధినాధుకున్.

Friday, 17 August 2012

కారు కంటఁ బడిన కంపమెత్తె.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య- కారు కంటఁ బడిన కంపమెత్తె.

ఆటవెలది:
కారు డొక్కు జూడ కారునలుపు కొని 
కారు నడుపు వారు కారు,  వారు
ఎలిజ బెత్తు రాణి ఎక్కినదని చెప్ప
కారు కంటఁ బడిన కంపమెత్తె.

ఆటవెలది:
ఒంటి వెడలు చుంటి నొక్క కాన నడుమ
మృగము లేవొ నాదు మీద కొచ్చు
ననుచు బెదరు చుండ, నక్సలై టుద్యమ
కారు కంటఁ బడిన కంపమెత్తె.

ఆటవెలది:
వారు కలిమి యున్న వారె, యైనను గాని
ఏరికైన నింత నిడగ బోరు
మంచి వారు కారు, మర్యాద కలవారు
కారు; కంటఁ బడిన కంపమెత్తె.

Thursday, 16 August 2012

ఓడ నేల పయిన్ నడయాడఁ దొడఁగె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ఓడ నేల పయిన్ నడయాడఁ దొడఁగె.
తేటగీతి:
కారు లోననె దిరుగును కాలు క్రింద
పెట్ట డాతడు, పరులకు పెట్ట
డెపుడు 
నేడు చూడగ జీవన క్రీడ లోన
నోడ-నేల పయిన్ నడయాడఁ దొడఁగె.

తేటగీతి:
ఊరి లోనికి సర్కసు వారు వచ్చె
వారు త్రిప్పుచు నుండగ వరుసగాను
జనము ముందర పులుల యేనుగు నె డారి
ఓడ - నేల పయిన్ నడయాడఁ దొడఁగె.

Wednesday, 15 August 2012

దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్

కందము:
ఓ పరమేశ్వర! మ్రొక్కెద
దీపము వెలిగించినంత; తిమిరము గ్రమ్మెన్
ఏ పథ మెటకో తెలిపెడు
దీపము వెలిగించి జ్ఞాన తేజము నిమ్మా !

సంధ్యా సమయయము మించి పోతుంటే ఒక అత్తగారు తన కోడలితో ....
కందము:
ఆ పరమేశ్వరు మ్రొక్కుము
దీపము వెలిగించినంత; తిమిరము గ్రమ్మెన్
పాపకు పాలను పట్టుము
పాపడి కన్నంబు పెట్టి బజ్జో మనుమా !

Tuesday, 14 August 2012

గణనాయకసుత! వినాయకా! వందనముల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - గణనాయకసుత! వినాయకా! వందనముల్.

కందము:
గణుతింప సకల దేవత
గణముల కే స్వామివీవు గజముఖ!వరదా !
ప్రణవము నీవే! భూతపు
గణనాయకసుత! వినాయకా! వందనముల్.

Monday, 13 August 2012

రంజానుకు చేయవలయు రాముని భజనల్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రంజానుకు చేయవలయు రాముని భజనల్.

కందము:
అంజనకుమారి, అహ్మద్
రంజని మరి షేక్ సలీము 'లవ్లీ సన్లే'
'ఎంజాయ్' చేయుచు నమాజు
రంజానుకు చేయవలయు రాముని భజనల్.

రంజాన్ అయినా ఏ రోజు  అయినా వారి వారి ఇష్ట దైవాలను పూజించాలని నా భావం ..
కందము:
రంజానుకు జాన్ ' ప్రేయర్'
రంజానుకు మరి నమాజు లాలహ్మద్ లే
అంజన కుమార చౌదరి
రంజానుకు చేయవలయు రాముని భజనల్.

Sunday, 12 August 2012

కరుణామయులన్న వారు కాలాంతకులే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కరుణామయులన్న వారు కాలాంతకులే
కందము:
త్వరపడి మాటను తూలరు
పరిమితి దాటిన నరులను  పరికించుచు, ఛీ !
నరికిన పాపము లేదని
కరుణామయులన్న, వారు కాలాంతకులే !

Saturday, 11 August 2012

చెఱకువిలుకాఁడు చెలికాఁడు శివున కెపుడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - చెఱకువిలుకాఁడు చెలికాఁడు శివున కెపుడు.
తేటగీతి:
చెలి యను పదము చూడగా స్త్రీకి తగును
చెలి భవానియె భవునికి చెప్పగాను
చిచ్చు కంటను గని మసిజేసి నట్టి
చెఱకువిలుకాఁడు చెలి, కాఁడు శివున కెపుడు.

Friday, 10 August 2012

ఎద్దును జేరి పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ఎద్దును జేరి పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్.

ఉత్పలమాల:
ప్రొద్దున లేచి గోష్టమున బోవగ పాలకు, చూడ నడ్డమై
హద్దులు దాటి వచ్చి నట యావును హద్దులు దాటునట్లుగా
రుద్దుచు నున్న, లాగి భళిరో! యని గాటకు కట్టి వైచి యా
ఎద్దును; జేరి పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్.

Thursday, 9 August 2012

చేరె నవరసమ్ములలోన నీరసమ్ము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - చేరె నవరసమ్ములలోన నీరసమ్ము.


తేటగీతి: 
జీవనంబున నరులకు చేవనిచ్చి
నిత్యసత్యము, పోగొట్టు నీరసమ్ము
హాయి గొలుపుచు మురిపించు హాస్య రసము
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.

మదిని కలతల అలలను మరుగు పరచు
చక్క దిద్దును మానవ జీవ సరళి
శాంతమన్నది లేకను సౌఖ్య మేది
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము. 


ప్రేమయన్నది నిత్యము పెంపు నొందు
సకల జీవుల కియ్యది సౌఖ్య దమ్ము
రసము లన్నిట శృంగార రసము మేటి
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.

భయము లేనిచొ మారు ప్ర వర్తనమ్ము
భక్తి యన్నది మది నిల్పి భయము విడుడు
భయమె యవసర మేరికి బాగు పడగ
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.

కఠిన మెప్పుడు చేయును గాయములను
కరుణ వీడిన సృష్టి వికలమె యగును
కదలు చుండును జగమంత కరుణ తోడ
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.

సత్యమన్నది మరచి నిస్సత్తువయిన
కార్య నిర్వహణమ్మది కరగి పోగ
చేర నడపును ముందుకు వీర రసము
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.

హద్దు దాటగ భీభత్స మగును నరుని
జీవితమ్మున, సరిహద్దు చేరి మీర
ఫలిత మిదియని చెప్పు భీభత్సరసము
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము

రౌద్ర మన్నది లేకున్న భద్ర మేది
ఛిద్ర మగునని దేవుడే రుద్రుడాయె
నిద్ర పోగొట్టు మోతాదు రౌద్ర రసము
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము

నవ రసంబులు కావలె నరుని కెపుడు
వాటి మోతాదు సరి జూచి వాడు కొనిన
అద్భుతమ్మని మది నెంచు
ద్భుతమ్మె;
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.

Wednesday, 8 August 2012

వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె.

తేటగీతి:
వానకాలమ్ము జబ్బులు బాగ వచ్చు
హెచ్చు రోగులు ఫీజులు పెచ్చు వచ్చు
మంచమందున పడు రోగ మదియ తనకు
వానకాలమ్ము వచ్చిన, వైద్యుఁ డేడ్చె.

తేటగీతి:
ఏడు రోజులు వదలక ఏరు పొంగె
పట్నమందున ప్రాక్టీసు పడక జేరె
స్వంత గ్రామము జూడగ నింతి తోడ
వాన కాలమ్ము వచ్చిన వైద్యు డేడ్చె.

Tuesday, 7 August 2012

సౌరభము సుంత లేని పుష్పములె మేలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - సౌరభము సుంత లేని పుష్పములె మేలు
తేటగీతి:
పూజ సేయగ పరిమళ పుష్ప చయము
వద్ద లేవని భక్తుడా బాధ పడకు
మంత్ర పుష్పమ్ము భక్తితో  మనసు విరియ
సౌరభము సుంత లేని పుష్పములె మేలు.

Monday, 6 August 2012

పాలు గావలెనని యన్న పట్టుబట్టె.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పాలు గావలెనని యన్న పట్టుబట్టె. 

తేటగీతి:
అన్నదమ్ములు జేరిరి నాన్న వద్ద
పంచ నెంచెను తండ్రియు భాగములను
పెండ్లి యైనను చెల్లికి, వేరనకను 
పాలు గావలెనని యన్న పట్టుబట్టె.

తేటగీతి:
ఆకలనుచును పెద్దగా నరచి యరచి
అన్నదమ్ములు జేరిరి అమ్మ కడకు
బోర్నువీటను కలుపగా ; ' బోరు' వట్టి
పాలు గావలెనని యన్న పట్టుబట్టె.

తేటగీతి:
తనయు లిద్దరి దరిజేరి తండ్రి యపుడు
పలక బలపము లిచ్చెను బడికి పంప,
తనవి చిన్నవి, పెద్దవి తమ్ముని బల
పాలు, గావలెనని యన్న పట్టుబట్టె.

Sunday, 5 August 2012

పంటపండించు రైతులే పాపజనులు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పంటపండించు రైతులే పాపజనులు.

తేటగీతి:
పల్లె పొలమున చేసెడి పని యదేమి ?
అన్న దాతగ పేరొంది యలరు నెవరు ?
వారి శ్రమ దోచు కొనునట్టి భ్రష్టు లెవరు ?
పంటపండించు - రైతులే - పాపజనులు.

కర్షకునికి సానుభూతి తో ...
తేటగీతి:
విత్తనంబులు నాటగా చెత్త వగును
పంట వేయగ కరవగు వర్ష మునకు
పంట పండిన చెప్పక వరద వచ్చు
పంటపండించు రైతులే పాపజనులు.

Saturday, 4 August 2012

హస్తగతుఁడయ్యె సూర్యుఁ డత్యద్భుతముగ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - హస్తగతుఁడయ్యె సూర్యుఁ డత్యద్భుతముగ

తేటగీతి:
దమ్ము గలదని సూర్యుని ధ్వజము నిల్పి
చెప్పినది  ప్రజా రాజ్యమ్ము; ' చిరు' త పార్టి
కాంగ్రెసు చెయిసాఛి పిలువ కలసి పోయె
'హస్తగతుఁడయ్యె సూర్యుఁ డత్యద్భుతముగ'

Friday, 3 August 2012

కృష్ణ జన్మాష్టమికి వచ్చు క్రిస్మసు గద


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

 సమస్య - కృష్ణ జన్మాష్టమికి వచ్చు క్రిస్మసు గద

తేటగీతి :  
నేటి యువకులు చాటింగు నిట్లు జేయు
ముద్దు పేర్లవి క్రిస్, క్రిస్సు , లిద్దరకును
క్రీస్తు పుట్టిన రోజది క్రిస్మ సయిన
కృష్ణ జన్మాష్టమికి వచ్చు క్రిస్మసు గద ! 

తేటగీతి :  
కొట్టుదురు గాదె పల్లెల నుట్టి, నెపుడు ?
ఇరువదైదు డిశెంబరు నేమి వచ్చు ?
ఆయుధంబెద్ది భీముడు, హనుమలకును ?
కృష్ణ జన్మాష్టమికి - వచ్చు క్రిస్మసు - గద.  

Wednesday, 1 August 2012

అమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్.
శార్దూలము:
అమ్మా నాన్నమరుద్వతీ యనుచు నానాడేమొ పేర్వెట్టగా
అమ్మాయిప్పుడు పెండ్లి గాగ నడువ న్నత్తింటి లో భర్తయే
కొమ్మన్ ముద్దుగ బిల్వ తాను పలుకున్ మారమ్మనిన్ ప్రేమతో
'అమ్మారమ్మని' పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్.


ఆ + మారమ్మని = 'అమ్మారమ్మని'