తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 6 August 2012

పాలు గావలెనని యన్న పట్టుబట్టె.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పాలు గావలెనని యన్న పట్టుబట్టె. 

తేటగీతి:
అన్నదమ్ములు జేరిరి నాన్న వద్ద
పంచ నెంచెను తండ్రియు భాగములను
పెండ్లి యైనను చెల్లికి, వేరనకను 
పాలు గావలెనని యన్న పట్టుబట్టె.

తేటగీతి:
ఆకలనుచును పెద్దగా నరచి యరచి
అన్నదమ్ములు జేరిరి అమ్మ కడకు
బోర్నువీటను కలుపగా ; ' బోరు' వట్టి
పాలు గావలెనని యన్న పట్టుబట్టె.

తేటగీతి:
తనయు లిద్దరి దరిజేరి తండ్రి యపుడు
పలక బలపము లిచ్చెను బడికి పంప,
తనవి చిన్నవి, పెద్దవి తమ్ముని బల
పాలు, గావలెనని యన్న పట్టుబట్టె.

No comments: