తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 20 March 2011

దేవతాస్తుతి

       శ్రీ ఆంజనేయ స్తుతి

శ్రీ రఘురామ నామమను శ్రీకర సాగర మందు మీనమై
వైరుల  గూల్చు వేళగన వన్య మృగంబుల జీల్చు సింగమై
కోరి మనంబునన్ దలచి కొల్చిన వారికి కామధేనువై
కోరినవిచ్చు చుండు కపికుంజరు గొల్తును సర్వ వేళలన్.

           శ్రీ రామ స్తుతి

కోతిని మట్టు బెట్టి యొక కోతికి రాజ్యము కట్టబెట్టియున్
కోతులగూడి రక్కసుల గూలిచి వేసి రణంబు గెల్చియున్
కోతిని బంటు జేసికొని కొల్వును దీరిచి యుండునట్టి ఆ
కోతుల రాయనిన్ గొలిచి కోరిన దీరును కామితార్ధముల్.

           శ్రీ కంఠ స్తుతి 


గిరిజా ప్రియ! శ్రీకంధర!
పురహర! నిశిచర,సుర, నర పూజిత చరణా!
సరినీకెవ్వరు లేరిక!
కరుణారస హృదయ మమ్ము కావగ రారా!

నిలకడ లేని గంగయును నీలపు గొంతున కాలకూటమున్
వలువలు లేని దేహమును ఫాలము నందున అగ్ని నేత్రమున్
కలిగిన నీలకంఠ! లయకార! సదాశివ! ఓ మహేశ! మా
కలతలు బాపి మమ్ములను గాచెడి దైవము నీవె శంకరా!

            శ్రీ మాతా స్తుతి

మహిషాసుర మర్దని!ఓ
మహిమాన్విత లోక జనని! మాధవు జెల్లీ!
మహదేవుని పట్టమహిషి!
మహిజనులను గావుమమ్మ మహిమల తోడన్!

          శ్రీ గణ నాథ స్తుతి

విఘ్న నాధు గొలువ వినయంబు తోడను
విఘ్న బాధ తొలగు విద్య వచ్చు
సిద్ధి బుద్ధి నాథు చిత్తాన పూజింప
బుద్ధి పెరుగు  కార్య సిద్ధి గలుగు.

4 comments:

gs said...

Dear Sastry garu,

konni pages script telugulo kanipinchuta ledu.dayachesi gamaninchandi.

గోలి హనుమచ్చాస్త్రి said...

జీ యస్ గారూ!ధన్యవాదములు.తరచూ బ్లాగును వీక్షిస్తూ మీ విలువైన అభిప్రాయాలను తెలుపవలసినదిగా కోరుచున్నాను.

gs said...

Dear sastry garu,
Thank you for corrections. Now all pages are visible . smasyapuranam apptikiappudu chesedi kanuka akkadi padyalakante ikkda vunchina padyamulu chala grandhikamuga anipinchinavi. i suggest to take one subject and put in 10 15 stanzas in your blog. . like jandhyala venkatappayya sastry. puspavilapam. how is the idea.

గోలి హనుమచ్చాస్త్రి said...

జీ యస్ గారూ! ధన్యవాదములు.మీ సూచన అనుసరణీయమైనది.ప్రయత్నిస్తాను.చిన్న సవరణ.మీరు కవి పేరు పొరబడ్డారు,ఆయన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు.